జీవితం.. ఒక గణితశాస్త్రం ! - చెన్నూరి సుదర్శన్

Jeevitam oka ganithasastram

శోభనం రాత్రి..

సినిమాల్లో మాదిరిగా.. పూలతో అత్యంత సుందరంగా అలంకరించిన పట్టెమంచం.. ప్రక్కనే స్టూలు మీద పళ్ళెంలో అమర్చిన రక, రకాల పండ్లు.. సువాసనలు వెదజల్లే అగరవత్తులు.. అలాంటి హంగామాలేవీ లేవు. తలలో నిండుగా మల్లెల పూదండలు.. చేతిలో పాలగ్లాసు తోనూ నా శ్రీమతీ రాలేదు. అంతా సీదా సాదా..

గదిలోకి అడుగు పెట్టింది అర్చన. చెయ్యి అందుకోగానే ఇద్దరకీ కరెంటు షాక్ తగిలినట్టు ఝల్లుమన్నాం. పెళ్ళిలో చెయ్యి తగిలినా ఇలాంటి అనుభూతి పొందలేదు. ఇది మొదటి రాత్రి ప్రభావమని.. మనసులోకి రాగానే నాపెదాలు విచ్చుకున్నాయి.

ఇద్దరం మంచంమ్మీద కూర్చున్నాం. అన్నింటా లేడీస్ ఫస్ట్.. అంటారేమో ! గాని ఇక్కడ మాత్రం జెంట్స్ ఫస్ట్ కాబోలనుకుని.. గొంతు విప్పాను.

“చూడు అనితా.. మనం మొదటి రోజు మాట్లాడుకునే మాటలు జీవితాంతం గుర్తుండి పోతాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను” అంటూ మొదలు పెట్టాను. చెప్పండి అన్నట్టుగా కాస్త తలెత్తి అరమోడ్పు కన్నులతో చూసింది అనిత. నాకు ధైర్యం వచ్చింది. గొంతు సవరించుకుని తిరిగి చెప్పడం కొనసాగించాను.

“జీవితం ఒక గణితశాస్త్రం లాంటిది. అందులో అనేక సమస్యలు.. ప్రతి సమస్యకూ పలురకాల సాధనలు ఉంటాయి. సమస్య సాధన ఒక్కో సారి చాలా సులభమవుతుంది.. మరో సారి కఠినతర మవుతుంది. అది మనం పాటించే సోపానాలు, ఉపయోగించే సరియైన సూత్రాల మీద ఆధార పడి ఉంటుంది. అలాగే మన జీవితసమస్యల సాధన కూడా మన చేతుల్లోనే ఉంది” చెప్పడం ఆపాను.

అనిత చూపుల్లో తేడా కనబడింది. వాటిని అర్థ చేసుకున్నాను. “నీ చూపులోని ఆతర్యం అర్థమయ్యింది. అనితా.. శోభనం నాటి మాటలా ఇవి.. అని అనుకుంటున్నావు కదూ..!” అంటూ చిన్నగా నవ్వాను.

“ఇది మన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయమని.. చెప్పాల్సి వస్తోంది. ఇది ఆ మధ్య జరిగిన ఒక సంఘటన.. మన కాలనీలో కాశీనాథం అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఉండే వాడు. కొడుకు కావాలనే కాంక్ష.. కాని ఇద్దరమ్మాయిల తరువాత అబ్బాయి పుట్టాడు. మరో అబ్బాయి కావాలనుకున్నాడు. కాని అమ్మాయి పుట్టింది. అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నాడు. పెద్దమ్మాయి నిర్మల పదవ తరగతిలో ఉండగా కాశీనాథం సార్ హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో పోయారు. ఇప్పుడు ఆ కుటుంబం ఏం కావాలి? “ అంటూ ప్రశ్నార్థకంగా అనితను చూశాను.

“ఈ సమయంలో చావు కబుర్లు వద్దు” అంది దీనంగా..

“ఏదైనా కీడెంచి మేలెంచాలి అంటారు. కాశీనాథం సార్ తన జీవిత సమస్యను సరిగ్గా సాధించుకోలేక పోయారు”

“ఇందులో సార్ తప్పేముంది?” ఠక్కున అంది అనిత. “అంతా ఆ భగవంతుని లీల”

“ అలా అనుకోకుండా నేను నా మిత్ర బృదంతో కలిసి ఆ సమస్యను సాధించాను”

నా వంక ఆశ్చర్యంగా చూసింది అనిత ఎలా? అన్నట్టుగా...

“అప్పటికి కాశీనాథం సార్ సతీమణి సావిత్రమ్మ గారు పదవ తరగతి తప్పారు. ‘కారుణ్య నియామకం’ తో ఆమెకు అటెండర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాని అది ఆమె జీవన సమరానికి సరిపోదు. దాని కంటే పైమెట్టు ఉద్యోగం రావాలంటే కనీసం పదవ తరగతి పాస్ కావాలి. ఎలాగైనా సావిత్రమ్మను పదవ తరగతి గట్టెక్కించాలని నిర్మలతో జత కట్టించి పాఠాలు చెప్పాను. కష్టపడి చదివారు. నిర్మల మొదటి శ్రేణిలో జిల్లాలోనే ఫస్టుగా వచ్చింది. సావిత్రమ్మ మామూలుగా ఉత్తీర్ణురాలయ్యింది. ఆఫీసుల చుట్టూ తిరిగాం. సావిత్రమ్మకు రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. జీవిత సోపానంలో సమస్య సాధనకు మార్గం సులువయ్యింది.

అలా కాశీనాథం సార్ చేసిన తప్పిదం నేను చేయను” అంటూ అనిత వంక చూశాను.

నామాటలు అర్థమయ్యాయి.. అన్నట్టు ఆమె ముఖ కవళికలలో కనపడింది. ఇక చివరగా నా అభ్యర్ధన చెప్పాలనుకున్నాను.

“చూడు అనితా.. ఇప్పుడు మనం ఇద్దరం. మున్ముందు ముగ్గురం, నలుగురం కావచ్చు. కాశీనాథం సార్ మాదిరిగా నాకేమన్నా అయితే మన పిల్లలకు నువ్వే దిక్కు కదా..! నువ్వు కారుణ్య నియామకం కోసం ఎదురి చూడకుండా ముందే స్వశక్తితో ఇంకా పై చదువులు చదివి నా అంత స్థానానికి ఎదుగాలన్నదే నా కోరిక” అంటూండగానే అనిత చటుక్కున తన అరచేయి నా నోటికి అడ్డుపెట్టింది. ఆమె కళ్ళు జలపాతాలయ్యాయి.

“ఏమండీ.. అశుభం మాటలు వద్దు. నేను మీరు కోరినట్టే బాగా చదువుకుంటాను” అంటూ తన ఎడం చెయ్యి తల మీద పెట్టుకుని ప్రమాణం చేసింది.

అమితానందంగా అనితను నా హృదయానికి హత్తుకున్నాను. *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు