‘ప్రిన్సిపాల్’ పదోన్నతి పొంది ములుగు జూనియర్ కాలేజీలో చేరడానికి బస్సులో బయలుదేరాడు పద్మాకర్. లోగడ అదే కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పని చేశాడు. అలాంటి అవకాశం రావడం చాలా అరుదు. అతని మనసు దూది పింజంలా తేలిపోతోంది.. దానికి మరో కారణమూ ఉంది .. దీపిక.
అతని ఆలోచనలన్నీ దీపిక చుట్టే తిరుగుతున్నాయి. దీపిక వివాహమయ్యిందో! లేదో! ఒకవేళ ఏ మహానుభావుడైనా దీపికకు చెయ్యి అందిస్తే అత్తారింటికి వెళ్లి పోయి ఉండవచ్చు. ఆమె ఎక్కడ ఉన్నా.. ఒక సారి వెళ్లి చూడాలని పద్మాకర్ మనసు తహ, తహలాడుతోంది.
దీపికను మొదటి సారిగా చూసిన దృశ్యాలు ఇంకా అతని మదిలో కదలాడసాగాయి.
***
“సర్.. ఆ అమ్మాయి ఎవరు” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు పద్మాకర్.
చూడ్డానికి చాలా చక్కగా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. తోటి పిల్లలతో ఆడుకుంటుంటే ఆమె మేఘాలలో మెరుపు తీగలా కదలాడసాగింది.
పద్మాకర్ గత సంవత్సరం ములుగు జూనియర్ కాలేజీలో జాయినయ్యాడు. పిల్లల చదువు దృష్ట్యా.. కుటుంబాన్ని విద్యాలయాలకు నిలయమైన హన్మకొండలో ఉంచాడు. తను రోజూ వచ్చి వెళ్ళేవాడు. కాని ఆరోగ్యం అందుకు సహకరించక పోవడంతో.. ఈ మధ్యనే ములుగులో గది అద్దెకు తీసుకున్నాడు. వారాంతంలో వెళ్లి వస్తున్నాడు.
ఒకే భవనంలో.. ఉదయం పూట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల, మధ్యాహ్నం కాలేజీ నడిచేవి. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు శంకరయ్య, పద్మాకర్ అభిరుచులు కలిశాయి.. స్నేహబంధం చిగురించింది. ఇద్దరు కలిసి సాయంత్రం అలా.. అలా.. నడిచి తిరిగి వచ్చి కాసేపు జూనియర్ కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికపై కూర్చుని ముచ్చటించుకోవడం పరిపాటి.
“నా కూతురే సర్..” అన్నాడు శంకరయ్య. అతని గొంతు జీరపోయింది. “దీపికా.. ఇలా రామ్మా” అంటూ పిలిచాడు గొంతు సవరించుకుంటూ. ఆ పిలుపులో ఆవేదన ప్రస్ఫుట మవుతోంది.
మయూరంలా వస్తున్న దీపికను చూసి నిర్ఘాంత పోయాడు పద్మాకర్. చంద్రబింబంలోని మచ్చలా దీపిక ఎడమ కన్ను చూసి చలించి పోయాడు.
“సర్.. పాప కన్ను..” ఆదుర్దాగా అడిగాడు.
“అంతా విధి రాత సర్..” అంటూ లిప్తకాలం నోట మాటరాక మౌనం వహించాడు శంకరయ్య. “ఇదే గ్రౌండులో ఇద్దరు పిల్లలు చిర్రగోనె ఆడుతుంటే.. దీపిక కంటికి చిర్ర తగిలింది. గాయం మానినా మచ్చ పోలేదు. నేత్ర దానం దొరికితే ఆపరేషన్ చేసి కన్ను సరిచేయవచ్చని డాక్టర్లు అన్నారు. ఆపరేషన్ అంటే మాటలా..! ఈ మధ్యనే పెద్దమ్మాయి నీరజ పెళ్లి చేశాను. వరకట్నం తాలూకు బాకీ తీరలేదని అమ్మాయిని కాపురానికి తీసుకు పోవడం లేదు.. నా ఎద మీద కుంపటై కూర్చుంది. దీపిక సమస్య మన చేతిలో ఏముంది..? అంతా దాని తల రాత. అప్పో, సప్పో చేసి కన్ను పెట్టిస్తాను సర్” అంటూ నిట్టూర్పు విడిచాడు శంకరయ్య.
“పెద్దమ్మాయిని ఏ ఊరికిచ్చారు సార్” అంటూ ఆరా తీసి వివరాలు కనుక్కున్నాడు పద్మాకర్.
పాప వారి మాటలు వింటోందని పసిగట్టి, మాట మారుస్తూ.. “దీపికా ఏం చదువుతున్నావమ్మా..” అడిగాడు.
“ఐదో తరగతి” అంది.. కోయిల రాగంలా.
అందమైన అమ్మాయి.. కోకిల కంఠం.. ఒక కన్ను లేక వడం.. పద్మాకర్ కళ్ళు చెమర్చాయి.
“వెళ్ళమ్మా.. ఆడుకో.. జాగ్రత్త” అంటూ దీపికకు కనబడకుండా ప్రక్కకు తల తిప్పి కర్చీఫ్ తో కళ్ళు ఒత్తుకున్నాడు పద్మాకర్.
“చదువులో ఎలా వుంది సర్”
“క్లాసులో ఫస్టు ర్యాంక్ సర్. చాలా బాగా చదువుతుంది” అన్నాడు శంకరయ్య.
“దేవుడు నిర్దయుడు సర్..” అంటూ సుతారంగా నుదురు కొట్టుకున్నాడు పద్మాకర్.
ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఆవహించింది.
దూరంగా పిల్లల కేరింతలు కొడుతూ.. వారి, వారి ఇండ్లళ్ళకు పరుగులు తీస్తున్నారు. పద్మాకర్ దృష్టి దీపిక వెనుకాలే వెళ్ళింది. మరలి రాలేక పోతోంది. అతని మనసు మూగబోయింది.
“సర్.. మనం గూడా వెళ్దాం” అని దీపికను ఆగమన్నట్టు పిల్చుకుంటూ.. ఇంటి దారి పట్టాడు శంకరయ్య. పద్మాకర్ భారంగా తన గదికి బయలుదేరాడు.
***
బస్సులో మ్రోగిన బెల్లు శబ్ధానికి ఉలిక్కి పడ్డాడు పద్మాకర్. కండక్టర్ బస్ స్టాప్ పేర్లు చెబుతున్నాడు.. బస్సు ఆగింది. ములుగు మొదట్లోనే హాస్పిటల్.. జూనియర్ కాలేజీకి ఒకటే బస్ స్టాప్. రెండూ రోడ్డుకు ఇరుప్రక్కలా ఉంటాయి. మినీ సూట్ కేసు తీసుకుని దిగాడు పద్మాకర్.
జూనియర్ కాలేజీ ఇప్పుడు స్వంత బిల్డింగులోకి మారింది. ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదు గంటలవరకు కాలేజీ సమయం. పద్మాకర్ కాలేజీలో జాయినయ్యాడు. చార్జ్ తీసుకున్నాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాడు. అంతా కొత్త స్టాఫ్. సంప్రదాయం ప్రకారం స్టాఫ్ మీటింగ్ లో తను పరిచయం చేసుకుని.. స్టాఫ్ నూ పరిచయం చేసుకున్నాడు. కాలేజీ ఫలితాల వివరాలు, కాలేజీ నిర్వహణ విషయాలు చర్చించాడు. తాను చేయబోయే సంస్కరణలు వివరించి తనకు సహకరించాల్సిందని అభ్యర్థిస్తూ.. మీటింగ్ ముగించాడు.
అతని మనసంతా శంకరయ్యను కలుసుకోవాలని తహ, తహ లాడుతోంది. స్టాఫంతా బయటకు వెళ్ళగానే..
“నమస్కారం సర్..” అంటూ శంకరయ్య లోనికి రావడం ఆశ్చర్యపోయాడు పద్మాకర్.
ప్రతి నమస్కారం చేస్తూ.. ఆత్మీయంగా ఆలింగనంనం చేసుకున్నాడు. ఇరువురి కళ్ళల్లోనూ ఆనంద భాష్పాలు నిండుకున్నాయి. మీటింగ్ హాల్లో నుండి శంకరయ్యను తన ఛాంబర్ కు తీసుకు వెళ్ళాడు పద్మాకర్.
“సర్.. మీరు ప్రిన్సిపాల్ గా వస్తున్నట్టు తెలిసింది. అభినందనలు సర్..
నేనూ రెండు పాఠశాలలు మారాను. ప్రస్తుతం ఇక్కడికి చాలా దగ్గర.. పాల్సాబ్ పల్లెలో పనిచేస్తున్నాను. మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కలలో గూడా అనుకో లేదు సర్” అంటూ తన సంతోషాన్ని వ్యక్తపర్చాడు శంకరయ్య.
“మీ అభిమానానికి ధన్యవాదాలు సర్.. దీపిక ఎలా ఉంది? కన్ను పెట్టించారా!” అంటూ ఆతురతగా అడిగాడు పద్మాకర్.
“సర్.. మీరు సమయానికి వచ్చారు. మిమ్మల్ని తీసుకుని వెళ్దామనే వచ్చాను. నా బాల్య స్నేహితుడు వీరయ్య నేను బావా, బావా .. పిలిచుకునే వాళ్ళం. ఇప్పుడు అదే పిలుపును కరారు చేసుకో బోతున్నాం. అతని ఒక్కగానొక్క కొడుకు ధీరజ్. నేడు దీపిక, ధీరజ్ ల వివాహం యాదాద్రిలో చెయ్యాలని పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నాం. ఈ సంతోష సమయంలో మీరు రావడం నా అదృష్టం సర్” అంటుంటే మరొక సారి శంకరయ్య కళ్ళు ఆనంద భాష్పాలతో నిండి పోయాయి. “వాస్తవానికి దీపిక పుట్టగానే మా ఇంటి కోడలని మురిసి పోయారు.. దీపిక కన్ను లోపం వల్ల ఆ మాట నేను కదిలించ లేక పోయాను. కాని వాళ్ళు అదే మాట మీద నిలబడ్డారు సర్” అంటూ కర్చీఫ్ తో కళ్ళు తుడ్చుకున్నాడు.
“గొప్ప శుభవార్త చెప్పారు సర్.. కంగ్రాట్స్” అంటూ లేచి కరచాలనం చేశాడు పద్మాకర్.
ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ శంకరయ్య ఇంటికి బయలుదేరారు.
“సర్.. మా వీరేశం బావ ముందుగా ఒప్పుకోలేదట. కాని ధీరజ్, వరమ్మలు పట్టుబట్టి .. మొండికేసి ఒప్పించారట. అక్కయ్యకూ దీపిక అంటే చాలా ఇష్టం. ఒక కన్ను తప్ప అమ్మాయిలో మరే లోపమూ లేదు. మంచి గుణవంతురాలు.. పనిమంతురాలు. ఈ కాలంలో తెలియని సంబంధాన్ని కుదుర్చుకుంటే.. శంకరన్న గుండెల మీద కుంపటి పెట్టిన విషయం మనకు తెలియంది కాదు.
మనం మొదటి నుండీ అనుకున్న సంబంధమేనాయే.. ఖాయపర్చుకోవడం మంచిదని నచ్చచెప్పిందట. మొత్తానికి దీపిక అదృష్టవంతురాలు” అంటూ దీపిక డిగ్రీ పాసైన విషయం.. ధీరజ్ ప్రస్తుతం ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న విషయాలన్నీ వివరించాడు శంకరయ్య.
పద్మాకర్ మనసు పొంగి పోయింది.
“స్నేహితుల మధ్య కట్న కానుకలు అనే ప్రసక్తి రావద్దని వీరేశం బావ షరతు పెట్టాడు. సంప్రదాయ ప్రకారం యాదాద్రిలో పెళ్లి ఖర్చు మమ్మల్ని పెట్టుకోమన్నాడు. ఇక్కడి నుండి యాదాద్రికి మినీ బస్సులో వెళ్తున్నాం. దాని ఖర్చు వీరేశం బావ పెట్టుకుంటాడట. నన్ను మరో మాట మాటాడనివ్వ లేదు”
“అంత మంచి స్నేహుతుడు ఉండడం.. చాలా గొప్ప విషయం సర్. మొత్తానికి మన దీపిక అదృష్టవంతురాలు” అంటూ వీరయ్య మీద ప్రశంసల ఝల్లు కురిపించాడు పద్మాకర్.
“అవునూ.. మీ పెద్దమ్మాయి కాపురం..” అంటూ సందేహంగా అడిగాడు పద్మాకర్.
“చక్కబడింది సర్.. అదేమి విచిత్రమో! గాని మీరు బదిలీ మీద వెళ్ళిన మరునాడే వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళారు.. కట్నం బాకీ విషయమే తీయలేదు. ఇప్పుడు వాళ్ళంతా పెళ్ళికి వస్తున్నారు” ఎంతో ఉత్సాహంగా చెప్పాడు.
శంకరయ్య ఇల్లు చేరుకునే సరికి.. మినీ బస్సు బయలు దేరడానికి సిద్ధంగా ఉంది. అంతా శంకరయ్య రాక కోసమే ఎదురి చూస్తున్నారు.
దీపిక పెళ్ళికూతురు వేషధారణలో చూసి ముచ్చట పడ్డాడు పద్మాకర్. ధీరజ్, దీపికలను ఆశీర్వదించాడు.
ఇంతలో నీరజ, నిరంజన్ లు వచ్చి పద్మాకర్ పాదాలనంటి మొక్కుతూ ఉంటే శంకరయ్య ఆశ్చర్య పోయాడు.
“మామయ్యా.. ఈ సారు మా ఇంటికి వచ్చి మా కాపురాన్ని నిలబెట్టిన మహానుభావుడు” అంటూ ఆ రోజు పద్మాకర్ వారి ఇంటికి వచ్చి అతని నాన్నను ఒప్పించడం చెప్పాడు. కాస్తా దూరంగా నిలబడి.. పద్మాకర్ నుండి శంకరయ్య కట్నం బాకీ తాలూకు డబ్బు దండుకున్న నిరంజన్ నాన్న గారు దొంగ చూపులు చూస్తున్నాడు.
పద్మాకర్ పక్కనే నిలబడ్డ శంకరయ్య, వరమ్మ. సుశీలమ్మలు కృతజ్ఞతాపూర్వకంగా చూడసాగారు. అప్రయత్నంగా వారి చేతులు జోడించుకున్నాయి. స్నేహితుల మధ్య ఇలాంటివి తగవు అన్నట్టుగా వారించాడు పద్మాకర్.
ఆ వెసులు బాటుతో దీపిక కన్ను సరిద్దుతారని అనుకున్న పద్మాకర్ ప్రయత్నం ఫలించక పోయే సరికి శంకరయ్య ఆర్ధిక పరిస్థితిపై మరింత జాలి వేసింది. శంకరయ్యది చాలా పెద్ద కుటుంబం. అంతా అతని మీదనే ఆధారపడి ఉన్నారనీ తెలుసు. ఈ సారి ‘ఐ బ్యాంకులో’ లో ఆరాతీసి దీపిక కన్నుకయ్యే ఖర్చు భరించాలని మనసులో దృఢనిశ్చయం చేసుకున్నాడు.
బంధు మిత్రులతో.. మినీ బస్సు యాదాద్రికి బయలు దేరింది.
***
అంతా సవ్యంగా జరిగితే దేవుణ్ణి స్మరించుకోరని కాబోలు.. భగవంతుడు మనకు రకరకాల పరీక్షలు పెడ్తూనే ఉంటాడు.
దీపిక, ధీరజ్ ల వివాహం అనంతరం తెల్లవారు ఝామున మినీ బస్సు తిరుగు ప్రయాణమయ్యింది.
కొందరు నిద్ర మత్తులో తూగుతున్నారు. మరి కొందరు నిరాడంబరమైన పెళ్ళి విశేషాలు మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల కాజీపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీ కొని మినీ బస్సు బోల్తా కొట్టింది. హా.. హా.. కారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లి పోయింది. కాలనీ వాసులంతా పరుగెత్తుకు వచ్చి బస్సు అద్దాలు పగలకొట్టి అందరినీ బయటికి లాగారు.
పద్మాకర్ వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశాడు. శంకరయ్య.. నిరంజన్ , వీరయ్యలతో కలిసి సహాయ కార్యక్రమలో మునిగాడు. కొద్ది మందికి చిన్నా, చితక గాయాలయ్యాయి. కొందరి గాయాల రక్త స్రావాలతో హృదయ విదారకంగా ఉంది. దీపిక, ధీరజ్ క్షేమంగా బయట పడ్డారు. సుశీలమ్మ చేతికి గాయాలయ్యాయి. వీరమ్మ గాయాలు బయటికి కనబడ్డం లేవు గాని స్పృహ కోల్పోయింది. వీరయ్య గుండెలు బాదుకోసాగాడు.
ఇంతలో అంబులెన్సులు రెండు వచ్చాయి. ఒక దానిలో క్షతగాత్రులనెక్కించాడు పద్మాకర్. మరొక దానిలో వరమ్మను, వీరయ్యను, దీపిక, ధీరజలను ఎక్కించాడు.
సైరన్ మోతలతో అంబులెన్స్ లు మహాత్మాగాంధీ దవాఖానకు బయలుదేరాయి. పద్మాకర్, శంకరయ్యలు కలిసి ఆటోలో వానిని అనుసరించారు.
శంకరయ్య ఆలోచనలన్నీ దీపిక చుట్టూ తిరుగ సాగాయి.. లోకం ఏమని ఆడిపోసుకుంటుందోననే భయంతో వణకి పోతున్నాడు.
పద్మాకర్ , శంకరయ్యలు హాస్పిటల్ వెళ్లేసరికి నర్స్ పరుగెత్తుకుంటూ వచ్చి..
“వీరమ్మకు కాస్తామెళకువ వచ్చింది. పద్మాకర్ సార్ కావాలని అడుగుతోంది” అంటూ ఇద్దరినీ ఎగాదిగా చూడసాగింది మీలో ఎవరు అన్నట్టుగా.
“సార్.. మీరు మన వాళ్ళను చూసుకోండి. నేను వెళ్ళి వీరమ్మ దగ్గరికి వెళ్తాను” అంటూ శంకరయ్యకు జాగ్రత్తలు చెప్పి నర్స్ తో ఐ.సి.యూ. గదిలోకి వెళ్ళాడు పద్మాకర్.
పద్మాకర్ ను చూస్తూనే.. రెండు చేతులు జోడించింది వరమ్మ. పద్మాకర్ ఆవేదనతో ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు.
“సార్.. నేను డాక్టర్ గారికి, మా ఆయనకు చెప్పాను. నేను బతుకుతాననే ఆశ లేదు. నా కళ్ళు దానం చేశాను. దీపికకు పెట్టించండి. ఈ పని మీకు అప్పగిస్తున్నాను. మీరైతేనే దీనికి సమర్థులని పిలిచాను” అంటూ మరొక సారి మొక్కింది ఆయాస పడుతూ. ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని గ్రహించాడు పద్మాకర్.
“వీరమ్మా.. మీకు ఏమీ కాదు. భయపడకండి.. ఒకవేళ జరుగ గూడనిది జరిగితే మీ మాట తప్పక పాటిస్తానమ్మా. ఖర్చుకూ వెనుకాడను” అంటూ భరోసా ఇస్తూ.. వరమ్మ చేతిలో చెయ్యి వేశాడు. తనను వారి కుటుంబ సభ్యునిగా వరమ్మ తలచడం.. పద్మాకర్ హృదయం ద్రవించింది. ఆపత్కాలం లోనే ఆత్మీయతలు బయటపడ్తాయి.. ఎంతైనా ‘అమ్మ మనసు అమృతం’ అనుకున్నాడు.
వీరమ్మ సంతృప్తిగా పద్మాకర్ ను చూసింది. కాని అసలు విషయం చెప్పలేదు.
తన మూలాన దీపిక కన్ను పోయిందని.. ధీరజ్ కు మాత్రమే తెలుసు. ఆ సంధ్యా సమయంలో.. వరమ్మ చూసినట్టు ధీరజ్ కు తెలియదు. దీపికనే పెళ్లి చేసుకుంటానని ధీరజ్ పట్టుబడితే సమర్థించి వీరయ్యను ఒప్పించింది. తన కొడుకు విశాల హృదయానికి పొంగి పోయింది. కాని కన్ను పోగొట్టినందుకే దీపికను చేసుకున్నాడు. లేకుంటే చేసుకొనునా..! అని లోకం దృష్టిలో తన కొడుకు ఎక్కడ లోకువై పోతాడోననే భయంతో ఆ రహస్యం తనతోనే తీసుకు పోయింది వరమ్మ.
వరమ్మ చెయ్యి చల్లపడడంతో ఉలిక్కి పడి.. “డాక్టర్..” అంటూ కేక పెట్టాడు పద్మాకర్. *