కమల, విమల ఒకే పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నారు.తరగతి లో ఎపుడూ ఫస్ట్ మార్క్ కమలకు వస్తే, సెకండ్ మార్క్ తరచుగా విమలకు వస్తుంది. కమల ప్రదానోపాద్యాయుని కూతురు కాబట్టి అందరూ ఆమెకు ఎక్కువ మార్కులు వేస్తారని, తను గుమాస్తా కూతురు కాబట్టి తనకు మార్కులు తక్కువ వేస్తున్నారని ఇంటికి వచ్చి రోజూ ఏడుస్తూ ఉండేది.
అది చూసి విమల తండ్రి ఆమెను ఓదారుస్తూ ఉపాద్యాయులకి అలాంటి పక్షపాతం ఉండదు అని, అయినా తానూ పాఠశాలకు వచ్చి కనుక్కుంటానని చెప్పాడు.కుమార్తె కోరిక మీద ప్రదానోపాధ్యాయునికి పిర్యాదు చేసాడు.తానూ విషయం పూర్తిగా తెలుసుకుని విమలకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చి పంపేశాడు.
ప్రధానోపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులనందరిని పిలిచి సమావేశం నిర్వహించాడు.
ఉపాధ్యాయులకు విమల తండ్రి చేసిన పిర్యాదు గురించి చెప్పి తన కుమార్తెను అక్కడనుంచి టీ.సి.తీసేసుకుని వేరే పాఠశాలలో చేర్పించదలచుకున్నానని చెప్పాడు. అది తప్పు పని అని, కమల మీ అమ్మాయని మేము మార్కులు వేయాదం లేదని, కమల విమల కన్నా చాలా చాలా బాగా చదువుతుందని, విమల అసూయతో అది భరించలేక పిర్యాదు చేయించిందని, ఆ అమ్మాయికి క్లాస్-టీచర్ గా తానూ నచ్చ చెబుతానని గణితం బోధించే శంకరరావు మాస్టారు హామీ ఇవ్వడంతో తన ప్రయత్నాన్ని ప్రదానోపాధ్యాయుడు విరమించుకున్నారు.
మరునాడు శంకర రావుగారు అంత క్రితం వారం జరిగిన రెండవ యూనిట్ జవాబు పత్రాలు దిద్ది తప్పులు సరిచూసుకోమని క్లాసులో ఇచ్చారు. కమలకు విమలకు కేవలం ఒక మార్క్ మాత్రమె తేడా వచ్చింది.కమలకు 25/25 వస్తే, విమలకు 24/25వచ్చాయి.
వెంటనే కమల జావాబు పత్రాన్ని తీసుకుని తను చేసిన లెక్కలకు కమల చేసిన లెక్కలకు తేడా ఎక్కడుందో చూసింది విమల. శంకరరావు గారి దగ్గరకు తీసుకు వెళ్లి ‘ఒకేలా చేసినా ఇద్దరకూ ఒక మార్కు తేడా ఎందుకు వేసారు సర్...’అని అడిగింది.
తానూ చేసిన జవాబు పత్రాన్ని చూపిస్తూ ‘’ ఇది మీరు రాసిన ప్రస్నా పత్రం లో ఉన్న ప్రతీ ప్రశ్నకు సోపానాలప్రకారం నేను రాసిన సమాధాన పత్రం. ప్రతీ సోపానానికి పద్దతి ప్రకారం మార్కులను కేటాయించి దీనిని ప్రదానోపాద్యాయులవారి చేత ఆమోద ముద్ర వేయించుకున తరువాతనే మేము మీ జవాబు పత్రాలను దిద్దుతాము. దీనిని మూల్యాంకన పత్రం అంటారు. ఆవిధం గా ఒక్క తప్పు చేయని కమలకు ఇరవై అయిదుకు ఇరవై అయిదూ వచ్చాయి. రెండు సమస్యలలో తప్పులు చేసినందుకు విమలకు ఇరవై అయిదుకు ఇరవై నాలుగు మార్కులే వచ్చాయి.
తప్పులు లేకుండా చేయడానికి ప్రతీ విద్యార్దీ ప్రయత్నించాలి. అయిదు మార్కుల ప్రశ్నకు నాలుగు మార్కులే నీకు వచ్చాయీ అంటే నీ సమాధానంలో ఒక మార్కు లోపం ఉందన్నమాట. అదేమిటో సరిచూసుకుని తరువాతి పరీక్షలో అయిదుకు అయిదు మార్కులు పొందేలా మీ తప్పులు మీరు సరిదిద్దుకుంటారని మీకు జవాబు ప్రత్రాలు ఇస్తామే గానీ..వాడికి ఎక్కువ ఎందుకేసారు? నాకు తక్కువ ఎందుకు వేసారు? అనే భావంతో జవాబు ప్రతాలు దిద్దబడవు.అది మీరు గ్రహించాలి. అమ్మా విమలా...ఈ క్లాస్ అయిపోయాకా మా స్టాఫ్ రూమ్ లోకి రామ్మా.’’ అన్నారు శంకరరావు గారు. అనంతరం గంట మోగడంతో విద్యార్ధుల జవాబు పత్రాలు సేకరించుకుని ఆయన వెళ్ళిపోయారు.
ఆయన వెనుకనే విమల స్టాఫ్ రూమ్ కు వెళ్ళింది. ఆయన ఒక చిన్న సంచీలో కొన్ని వంకాయలు ఇచ్చి ఇవి సరిగ్గా ఏడో రోజున నాకు పట్టుకొచ్చి ఇవ్వమ్మా...’’ అన్నారు. ‘’సరే మాస్టారు’’ అని విమల ఆ సంచీ తీసుకుని వెళ్ళిపోయింది.
ఏడవరోజునే ఆమె మాస్టారికి సంచి తెచ్చి ఇచ్చింది. ఆయన దానిని విప్పి వంకాయలను బయటకు తీసి చూపిస్తూ అన్నారు.
‘’చూసారా పిల్లలూ.నేను అన్ని మంచి వంకాయల మధ్య రెండు పుచ్చు వంకాయలు పెట్టి ఈ సంచీని విమలకు ఇచ్చాను. ఇపుడు ఆ రెండు వకాయలు కుల్లిపోవడమే కాక ఆ కుళ్ళు ఇతర వంకాయలకు కూడా వ్యాపించి అన్ని పాడైపోయాయి.
దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక్క ఉప్పరాయి వేస్తె పాలు అన్ని విరిగిపోయినట్టే, మనలో వంకాయ పుచ్చులాంటి అసూయా గుణం ఉంటే అది మననే కాకుండా మన పక్క వాళ్ళను కూడా పాడు చేస్తుంది.
నిజానికి కమల చాలా బాగా చదువుతుంది.మీ అందరకూ ఆ విషయం తెలుసు. చదవడం లో ఆమెను మీరు ఆదర్శం గా తీసుకోవాలి గానీ...ఆమెకు మార్కులు వచ్చాయని మనం అసూయ పడకూడదు. అలాఆలోచించే శక్తిని యుక్తిగా మలుచుకుని మీరు అంతబాగా చేయడానికి ప్రయత్నించాలి. అర్ధమైంది కదా?’’ అన్నారు శంకరరావు గారు.
‘’నా తప్పు నేను తెలుసు కున్నాను మాస్టారు. నేనొక్కదాన్నే కాదు మీరు చెప్పిన ఉదాహరణతో మేమందరమూ ఇకనుంచి బాగా చదవడానికి తప్పక మావంతు కృషి చేస్తాము.’’అంది విమల.
‘’విమలను అందరమూ అభినందిద్దాం,’’అని మాస్టారు చప్పట్లతో అభినందించారు.పిల్లలందరూ కొట్టిన చప్పట్లతో ఆ తరగతి గది ప్రతిధ్వనించింది.
సమాప్తం