కాలువ నీటిలో ఈదుతున్న తెల్లని బాతు గట్టు మీద రంగురంగు ఈకలతో నెత్తి మీద ఎర్రని కిరీటంతో ఠీవిగా పరుగులు పెడుతున్న పందెం కోడిపుంజును చూసి ముచ్చట పడింది. అలాగే కాలువగట్టంట అనేక రంగుల కోడి పుంజులు విన్యాసాలు కావిస్తున్నాయి. యజమాని అప్పుడప్పుడు నీటిలో ఈత చేయిస్తున్నాడు. మద్యలో పైకెత్తి శరీరమంతా చేత్తో మాలిష్ చేసి కాలువలో విసురుతున్నాడు.ఈ సేవలన్నీ చూసిన బాతు కోడిపుంజు జీవితమే హాయని ఈర్ష పడసాగింది. ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో పందెం కోడిపుంజును కొబ్బరి చెట్టు నీడలో గట్టు మీద తాడుతో కట్టి ఉంచారు. అప్పుడు బాతు పందెంకోడి దగ్గరకెళ్ళి "మిత్రమా,నీ జీవితమే హాయి. ఉదయాన్నే రన్నింగు స్విమ్మింగు చేయిస్తారు.శరీరమంతా మాలిష్ చేస్తారు. రోజూ బాదం పిస్తా కాజు మొక్కజొన్న రొయ్యపొట్టుతో మస్తుగా తినిపిస్తారట.డాక్టర్ చేత పరీక్ష చేయించి బలానికి టానిక్కులు రోగాలు రాకుండా యాంటీ బయోటిక్ మందులు తిని పించి రోజూ బరువు చూస్తారట. రాత్రి సమయంలో మద్యం కూడా తాగిస్తారట. మీ జీవిత జాతక ఫలితాలు లెక్క కడతారని విన్నాను. బంగారు జీవితమంటే మీదే. మా బాతులం తెల్లగా బొద్దుగా అందంగా ఉన్నా మమ్మల్నెవరూ పట్టించుకోరు " అని తన మనసులోని అక్కసు వెళ్ళగక్కింది. బాతు గోడు విన్న పందెంకోడి నిర్లిప్తంగా ఒక వేడి నిట్టూర్పు వదిలి " ఔను మిత్రమా! దూరపుకొండలు అందంగానే కనబడతాయి. దగ్గరకెళ్ళి చూస్తేనే ఎత్తు పల్లాలు లోయలూ తెలిసేది. అలాగే తెల్లని వన్నీ పాలను కోవడం భ్రమే అవుతుంది. మేము అనుభవిస్తున్న ఈ భోగాలన్నీ తాత్కాలికమే. ఇలా రోజూ సంక్రాంతి పండుగ రోజుల వరకు బాగా మేపి తర్వాత బలిపీఠం ఎక్కిస్తారు. సంక్రాంతి దగ్గర పడే కొద్దీ మా మీద శ్రద్ద ఎక్కువై బరువు కాలివేళ్ళూ ముక్కు రెక్కలు ఒంటి మీదుండే సుడులూ కుక్కుట జాతకం ప్రకారం పందేలకి తయారు చేస్తారు. పండగ వచ్చిందంటే మాకు చావు మూడినట్టే. ఆ మూడురోజులూ మా కాళ్ళకు పదునైన చురకత్తులు కట్టి మందు బాగా తాగించి ఆ మత్తులో మాలోమాకు కొట్లాట పెట్టి వాడి కత్తులతో శరీర భాగాలు తెగి రక్తం కారుతూంటే వేలరూపాయల పందాలు కాసి ఆనందించి చివరకు కొన ఊపిరితో ఉన్న మమ్మల్ని ఎక్కువ డబ్బుకి అమ్ముకుని మసాల ఫ్రై చేసుకుని పట్నాలనుంచి వచ్చిన పెదబాబులు మందుపార్టీలతో జల్షా చేస్తారు . ఇదీ నువ్వు చూస్తున్న మా భోగాల బంగారు బ్రతుకు తీరు."అని దుఃఖంతో బాధ వెళ్ళబోసుకుంది పందెంకోడి. " ఔనా నేస్తమా! నేను ఊహించిన మీ బంగారు జీవితం ఇంత దుర్భరమా ! మీకు జరిపే సేవలన్నీ మనుషుల స్వార్దానికా?అపోహతో నిన్ను బాధ పెట్టి నందుకు మన్నించు. పరులను చూసి పొంగిపోకుండా మనకి ఉన్న దానితో సంతృప్తి పడాలని నిన్ను చూసి నేర్చుకున్నాను" అంది బాతు. *** *** ***