చిరిగిన బనీను - venu gopal maddu

Chirigina baneenu

ఉదయాన్నే లేచే అలవాటు రామ చంద్ర కి, లేచాక పెద్దగా ఉపయోగ పడే పనో, ఉద్దరించే పనో చెయ్యడు కానీ , అది పుట్టుక బుద్ది. కొన్ని అలవాట్లు అంతే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం లా పుట్టుక తొనో, మనం పెరిగిన పరిస్థితుల ప్రభావం వల్లనో మనకి బంకల్లా అంటుకుంటాయి. ఒక ఆంగ్ల కవి అన్నట్టు 'ఓల్ద్ హాబిట్స్ డై హార్డ్' అంటే పోను పోను కొన్ని హాబిట్స్ మనకి అలవాటు అయిపోయి, వాటికే మనం 'డై హార్డ్' ఫాన్స్ అంటే చచ్చేదాకా అభిమానులం అయిపొతాం అని కాబోలు. అలా లేచి , వీలుంటే వాకింగ్ కో లేదంటే ఇంట్లొనే అలా స్ట్రెచింగ్ చెస్తూ వుంటాడు టి.వి చుస్తూ. ఎంత త్వరగా లేచాం అన్నది కాదు ఎంత ఫాస్ట్ గా తయారు అయ్యాం అన్నది ముఖ్యం అన్నాడట వడి గా ఎదిగిన పెద్ద మనిషి . పెద్ద మనిషే అయ్యి ఉండాలి , అంత ఫాస్ట్ గా రెడీ అయ్యాడు కాబట్టే ఎదిగి వుంటాడు "పెద్ద" గా. ఎంత ఉదయాన్న లేచినా ఆఫీసు కి వెళ్ళే హడావిడి మాత్రం తప్పదు మన రా.చ కి (ఎవరో కాదండి మన కధానాయకుడు రామ చంద్ర నే) పెద్ద గా రాచ కార్యాలు వెలగ బెట్టక పొయినా , కాలాయాపన చెయ్యటం లొ మన రా.చ వారు రాజా నే.

కాఫీ లు అవీ ముగిసాక , యసు కి కాఫీ ఇచ్చి తను బాత్ రూం లొకి వెళ్ళాడు. స్నానం చేసి గబ గబా ( మన రా.చ కి స్నానం చేసి గబ గబా అనే కన్నా, గబ గబా స్నానం చేసి అనటం కరక్ట్ , ఎందుకంటే అతనిది కాకి స్నానం) ఒళ్ళు తుడుచుకొని , మాయిస్చరైజర్ రాసుకుందామని చూసాడు . ఎంత వెతికినా కనపడలేదు. అతను ఏదన్నా వెతుకు తుంటే ఇంట్లొ అందరికీ తెలుస్తుంది. అందరికీ అంటే వున్నది ఇద్దరే , రా.చ మరియు భార్య యసు అంతే , పిల్ల పీచు ఎటూ లేరు. (అన్నట్టు మరచాను పీచు వుందండొయి , అది వంట ఇంట్లొ అతనికి బాగా అవసరం). ఇల్లంతా గత్తర బిత్తర చేస్తుంటే "అక్కడే వుంటుంది సరిగ్గా చుడండి , మీకు కళ్ళ ముందు వున్న కళ్ళ జొడే ఒక్కొసారి కనపడదు " అంది యసు విసుగ్గా తను కూడా ఆఫీసు కి వెళ్ళే తొందరలో. సీతాకాలం అవ్వటం వల్ల చిన్న ఇబ్బందే, ఎండి పోయిన ఎంగిలి ప్లేటు లా తయారవుతుంది చర్మం , సాయం కాలం ఎవరి సాయం లేకపొయినా పురాతన వస్తు శాఖ అధికారి లలా తవ్వకాలు జరిపి కని పెట్టాలి మర్మం అనుకుంటూ ఆఫీసు కెళ్ళాడు.

*****

జీవితం లొ చాలా చాలా అనునుంటాం , కొన్ని జరగవు , కొన్ని స్తాన భ్రంసం వల్ల పక్కకి "జరుగుతాయి" , కొన్ని అనుకున్నట్టు మనకే గుర్తు వుండవు. పెద్ద గా ఏం కష్ట పడకుండానే ఆఫీసు నుంచి తిరిగి వఛ్చిన రా.చ సొఫా లొ వాలిపోయి , టి.వి స్విచ్ ఆన్ చెసాడు, ఉదయ్యన్నే అనుకున్న "వెతకటం" గుర్తు లేక. అప్పటికే తన ఆఫీసు పని ముగించుకొని ఇల్లు చేరిన శ్రీమతి పైన పోర్షన్ లో యుట్యూబ్ లొ పెట్టిన , పెట్టని, పెట్టబొయ్యే వీడియో లు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతుంది. బుచ్చక పొతే కాలం వెళ్ళదని కాదు , సాయం కాలం అలా బుచ్చటం తనకి ఒక సరదా. రా.చ , యసు లది రెండు పోర్షన్ల ఇల్లు. వున్నది ఇద్దరే అయినా బంధాలు బంధువులు ఎక్కువే , వచ్చి పొయ్యే బంధు మిత్రులు , అందుకే సదుపాయం గా వుంటుందనే కాస్త పెద్ద ఇల్లే తీసుకున్నారు. కింద భాగం లో లివింగ్ రూం వంట గది డైనింగ్ రూం, ఒక బాత్ రూం , ఇంట్లొంచే మెట్లు, ఫైన మూడు బెడ్ రూంలు రెండు బాత్ రూంలు. ఇద్దరు ఉద్యొగాల వల్ల "ఉన్నత మద్య తరగతి" . ఇద్దరూ సర్దుకు పొయ్యే మనస్తత్వం వున్న వాళ్ళే కానీ, ఇల్లు సర్దుకొవటం లో మాత్రం కొంచెం ప్రావీణ్యం తక్కువే. ఉద్యొగాల వల్ల తీరిక లేక , ఇల్లు శుభ్రం చెయ్యటానికి పని వాళ్ళు రావటం ఇప్పుడు సర్వ సాధారణం.

యసు తన లాప్ టాప్ తో టిప్ టాప్ గా, పై పోర్షన్ నుంచి కింద కి దిగుతూ "ఎదో దొంగలు పడి మనకున్న సామాను అంతా వొదిలేసి మన మాయిస్చరైజర్ మాత్రం పట్టుకు పొయ్యారు అన్నారు" అంది. "అమ్మనీ" బలే గుర్తు చెసావ్ అని ఒక్కసారిగా లేచి, "పద పద్మ" అన్నాడు, పై మెట్లు వైపు చూపిస్తూ. ఈద్దరికీ సినేమా పిచ్చ కొంచెం ఎక్కువే. "బాబూ డిటెక్టివ్ హరనాదా ఆ గుండమ్మ కథ నువ్వే చూసుకో, నాకు పని వుంది" అంది యసు . "సర్లే ఒక్కడినే వెళ్తా తవ్వకాలకి" అంటూ పైకి మెట్లు ఎక్కాడు. రాత్రి బోజనాలకు ఏం తయారు చెయ్యాలో అనే పని లో పడింది యసు.

పని వాళ్ళు వచ్చి సర్దినా అది పైన పటారం లొన లొటారం లా నే వుంటుంది. పై పై న డస్ట్ దులిపి వెళ్తారు. తీసినవి తీసిన చోట పెట్టుకొడం ప్రతీ వస్తువి కీ ఒక నిర్దిస్ట మైన చోటు కేటాయించటం లో రా.చ తల్లి నిష్నాతురాలు. అందుకే రా.చ. తండ్రి ఆమెకి "వంటింటి కుందేలు" మరియు "క్లీన్ ఆండ్ గ్రీన్ " అని బిరుదులు తో సన్మానించాడు కూడ. ఆ సర్దుడు అలవాటు మాత్రం రా.చ కి రాలేదు తల్లి నుంచి.

మరీ అంత పెద్ద ఇల్లేం కాదు కూడా , మంచం కింద , క్లాసెట్ లో , సూట్ కేస్ ల్లొ , అన్నీ వెతికాడు. ఎదో ప్రపంచ యుద్ధం జరుగుతునట్లు శబ్ధాలు చెస్తున్నాడు. కింద నుంచి "మరీ చాదస్తం కాకపొతే ఇంకో కొత్త బాటిల్ ఓపెన్ చేద్దురు" అంది యసు , ఆ శబ్దాలు భరించలేక. ఈ మాయిస్చరైజర్ లు మరీ అంత కరీదయిన వస్తువు ఎమీ కాదు అందులొనూ అవి కాస్ట్ కో లో కొన్నవే. మాగాణి ముండకి ఏగాణి క్షవరం లా మద్య తరగతి అంతా ఈ కాస్ట్ కో లోనే షాపింగ్ చేస్తారు. ఒక అంగ్ల కవి అన్నట్టు (ఇతను మొదటి పేరా లొ చెప్పిన ఆంగ్ల కవి కాకపొవచ్చు) 'పెన్ని వైస్ పౌండ్ ఫూలిష్'. మన రా.చ దంపతులకు కూడా తగలేసే పౌండ్లు డాలర్లు చాలా వున్నాయి. వీళ్ళకి సినేమాలు, ఫూడ్, ట్రావల్ తో పౌండ్ లు షేవ్ అవుతుంటే , కాస్ట్ కో లో పెన్ని లు సేవ్ చెస్తూ వుంటారు. ముఖ్యం గా ఇలా ఎక్స్ పయర్ కాని పేపర్ టవల్ , మౌత్ వాష్ , టూత్ బ్రష్ లు, టూత్ పేస్ట్ లు, మాయిస్చరైజర్ లు ఈ షాప్ లొనే కొని ఇంట్లొ స్టోర్ రూం లొ పడేస్తారు. అయనా సరే వాడుతున్న బాటిల్ కనిపెట్టనిదే నిద్ర పొయ్యే లా లేడు మనవాడు. సమయం ఆసన్నమయింది మన డిటెక్టివ్ బాత్ రూం సింక్ లో ఎదో మరక కనిపిస్తే టిస్యు పేపర్ తో అది తుడిచి " ఈ క్లీనెర్స్ సరిగ్గా చేస్తున్నట్టు లేదు" అంటూ ఆ పేపర్ డస్ట్ బిన్ లో వేసాడు. అప్పుడు బ్రద్ధలయింది బ్రహ్మాండం 'యురేకా' అని అరుద్దాం అనుకున్నాడు ఆ సకమిక లు తిమమికలు ఎందుకులే అని అరవలేదు. ఆ వాడేసిన మాయిస్చరైజర్ డబ్బా డస్ట్ బిన్ లొ తటస్తించింది. దొరికినందుకు సంతోషం ఎవరు పడేసి వుంటారా అని కోపం ఒకేసారి. హమ్మయ్య అని మనసులోనే నిట్టూర్చి ఏ మొహమాటం లేకుండా మద్య తరగతి చేతులతో ఆ డబ్బా తీసుకొని కిందకి వెళ్ళాడు.

ఎదో ఒలింపిక్ లో బంగారు పతకం గెల్చుకున్న వాడిల్లే ఆనందం తో ఆ డబ్బా ని చేత్తో పైకి ఎత్తి పట్టుకొని ఊపుతూ మెట్లు దిగుతూ నవ్వుతూ పలకరిచాడు శ్రీమతి ని. ఇప్పుడు శవం దొరికింది సరే , మర్దర్ చేసింది ఎవరు అది కనిపెట్టాలి. ఇద్దరూ గిల్లికజ్జాలు ఆడుకున్నారు. వాదోప ప్రతి వాదనలు జరిగాయి. "మతిమరుపులో మీరే వేసేసి వుంటారు ఎన్ని సార్లు మీ కళ్ళజొడు ఫ్రిజ్ లో దొరకలేదు " అని శ్రీమతి " కాదు దాదాపు అయిపొయింది కదా అని నువ్వే పారేసావ్ , అసలు నీకు ఊర్చుకోవటం రాదు" అన్నాడు రా.చ ఆ డస్ట్ బిన్ లొంచి తీసిన డబ్బా లో మిగిలిపొయిన మాయిస్చరైజర్ వంక ఆశ గా చుస్తూ. అతను తగ్గేడు, ఆమే నెగ్గింది. ఆ మాయిస్చరైజర్ డబ్బా వంట గదిలో వున్న డస్ట్ బిన్ లొకి వెళ్ళిపొయింది. అంటే పై బాత్ రూం డస్ట్ బిన్ లో నుంచి వంట గది డస్ట్ బిన్ లోకి స్తానభ్రంసం అయింది, జరిగింది. ఇద్దరూ కలిసి ఇది క్లీనెర్స్ చెసిన నిర్వాకం అని తెల్చేసారు. కేస్ క్లొస్డ్. న్యాయ దేవత కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి ఈ మాయిస్చరైజర్ ఎపిసొడ్ కి. ఇందులో క్లీనెర్స్ తప్పేమి లేదు, అసలు చెప్పాలంటే అందులో మద్య తరగతి వాడే కాదు కదా, కటిక పేద వాడు ఊర్చుకొడానికి కూడ ఏం మాయిస్చరైజర్ మిగల లేదు. ఇద్దరూ బోజనం చెస్తూ టి.వి చూసారు.. కాదు కాదు టి.వి చూస్తూ బోజనం చేసారు. ఎదో క్రమం లో రెండు పనులు ముగించి నిద్ర కి ఉపక్రమించటానికి పైకి వెళ్ళారు.

******

వాతావరణం కొంచెం చల్ల బడింది. బయట, ఇంట్లొ, ఒంట్లొ కూడ. ఇద్దరూ ఆ రోజు జరిగిన డ్రామా కి నవ్వుకున్నారు. పని వాళ్ళు కూడా పడేసే వరకు మనం వాడుతాం వస్తువులు అని . ఈ మాయిస్చరైజర్ వృతాంతం లో పడి ఆఫీస్ నుంచి వచ్చాక బట్టలు కూడ మార్చుకోలేదు రా.చ. షర్ట్ తీసి బాత్ రూం లొకి వెళ్తూ అప్పుడు గమనించాడు బాత్ రూం నిలువుటద్దం లో, తన బనీను కి చిరుగులు. అప్పటి దాకా గమనించనే లేదు. బనీను చిరిగే దాకా వాడాల్సిన అవసం లేదు. అయినా అది అలవాటు. ఇప్పుడు కచ్చితంగా ఉన్నత మద్య తరగతి లో సౌకర్యం గా జీవనం వెళ్ళిపొతున్నా, చంటి పిల్లాడి లా అన్ని తరగతులూ దాటుతూ రావటం వల్ల కొన్ని అలవాట్లు అలానే వుండిపొతాయి. అవి ఇంక అలవాటు కాదు పరిపాటి. తన బీరువా లో చిరుగులు వున్న బనీనులు అన్నీ పారేసే అఘాయిత్యం చెయ్యాలని అనిపించలేదు కానీ, వాటిని వంట గదికో , బాత్ రూం క్లీనింగ్ కో మసి గుడ్డ గా మారుద్దాం అని నిర్యయం తీసుకున్నాడు. బనీను చిరుగులు బయట వాడికి అస్సల కనపడవు కదా, వాటిని షర్ట్ తో కప్పేస్తాం. మనలో లొపాలు కూడా అంతే , ఒక ముసుగు తో కప్పేసాం అనుకుంటాం, కానీ మన అంతరాత్మ కి తెలుసు. అంతరాత్మ అద్దం లాంటిదే, మన లోని లొపాలని ఎత్తి చూపుతుంది ఈ నిలువుటద్దం లాగే, ఎత్తి చూపి ఎక్కిరిస్తుంది .రా.చ కి ఇది కేవలం అలవాటు మాత్రమే అసలు అతనికి ఆ చిరుగులు కనపడ లేదు, ఎప్పుడూ చుసే కళ్ళకి కూడ అవి అలవాటు అయిపొతాయి, అవి పొరపాటు గా అనిపించవు. కూర అయిపొయిన గిన్నె లో కొంత అన్నం వేసి ఊర్చుకునే అలవాటు, అది కక్కుర్తి కాదు ఆ మిగిలిన యుగురు లోనే రుచి బావుంటుంది, కూర ఊరుతుంది , అని చెప్పే మద్య తరగతి సమర్దింపు. అతని చూపు మెల్లగా టూత్ బ్రష్ వైపు మళ్ళింది. తొమ్మిది నెలలకు పైగా వాడి ,దాన్ని రాచి రంపాన పెట్టిన తీరు తేటతెల్లమయింది. చిట్ట చివర గా ఒక్క సారి దానితో పళ్ళు తోమి, అది డస్ట్ బిన్ లో పడేసి, కాస్ట్ కొ లో తెచ్చిన 12 బ్రష్ ప్యాకెట్ నుంచి ఒక కొత్త బ్రష్ తీసి స్తాండ్ లో పెట్టాడు.

పెద్ద గా అలోచిస్తూ నిద్ర పాడు చేసుకొనే మనస్తత్వం కాదు అతనిది. అలా ఆ బనీను చిరుగుల 'మద్య ' లో వేళ్ళు పెట్టి ఆడిస్తూ గురక సహాయం తో నిద్ర 'తరగతి ' లోకి 'ఉన్నతం' గా జారిపొయాడు రా.చ.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు