సినిమా వదిలే సరికి రాత్రి పది గంటలయ్యింది. అది కొత్త సినిమా కావటంతో జనం ఎక్కువగానే ఉన్నారు.
“అబ్బబ్బా ఏం రద్దీ బాబూ చస్తే మొదటి వారం లో సినిమాలకు రాకూడదు” అన్నది జ్యోతి తన స్నేహితురాళ్ళతో.
“నీకు తెలీదోయ్ సినిమా మొదటి వారం లో చూడకపోతే ఎట్లాగోయ్ మొదటి వారంలో థ్రిల్ తర్వాత వారాల్లో దొరకదు” అంటూ మొదటి వారంలోనే సినిమా చూడవలసిన అవసరాన్ని ప్రచారం చేస్తోంది ఆమె స్నేహితురాలు కమల.
జనం మధ్యలోంచి తప్పించుకుని అందరూ హాలు బయటకు వచ్చారు.
“అన్నట్టు జ్యోతిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వెళదామర్రా పాపం ఒక్కతే ఏం వెళుతుంది? ప్రతిపాదించింది, కమల
“వద్దబ్బా మనం వెళ్ళి పోదామ్.ఇప్పటికే బాగా ఆలస్యమయిందని మా నాన్న క్లాస్ తీసుకుంటారు. అయినా నాకు నిద్దరొస్తోంది” అంటూ మాటల్ని సగం ఆవలింతలో మింగేస్తూ వీటో చేసింది ఒక ఊర్మిళ.
“అబ్బే ఎందుకర్రా మీరేం రావక్కర్లేదు. నాకేం భయమా . మీరు వెళ్లిపోండి నా పార్టీకి వచ్చినందుకు థాంక్స”ని తన స్నేహితురాళ్లను సాగనంపింది జ్యోతి.
వాళ్ళు ఆటోలు మాట్లాడుకుని వెళ్ళిపోయారు.తను కూడా ఆటో కోసం చూసింది కానీ దొరకలేదు.
ఇక తప్పదనుకుంటూ నడక ప్రారంభించింది. ఆమెకు తొలిసారి భయం వేసింది. ఎందుకంటే ఎక్కడా కనుచూపు మేరలో జనసంచారం లేదు.వీధి దీపాలు కూడా అక్కడక్కడ వెలుగుతున్నాయి.
నిజానికి ఈ సినిమాహాలునుంచి తన ఇంటికి పగలయితే పది నిమిషాల నడకలో వెళ్లిపోవచ్చు.కానీ భయంగా ఉండటంతో అడుగు ముందుకు పడక దూరం తరగటం లేదు.
తన వెనకాలే ఎవరివో అడుగుల శబ్దం వినబడేసరికి వెనక్కి తిరిగి చూసింది.నలుగురు కుర్రాళ్ళు తన వెనకే వస్తున్నారు.వీధి దీపం వెలుతురులో చూసిన ఆమె,వాళ్ళ వాలకాల్ని బట్టి కాలేజీ కుర్రాళ్ళని అనుకుంది.ఆమెకు భయం ఇంకా ఎక్కుయవయ్యింది.అక్కడికీ అమ్మ అంటూనే ఉంది ఇంత రాత్రిపూట సినిమాలెందుకే అని.కానీ తనే వినిపించుకోలేదు..తనకు పెళ్లి సంబంధం కుదిరిందని స్నేహితురాళ్లకు చెప్పటంతో ‘ మన ఫైనల్ ఇయర్ బాచ్లో నీకే ముందు పెళ్లి కుదిరింది. పెళ్లి మే లో అంటున్నావు, అప్పడిదాకా ఆగటం కష్టం. అడ్వాన్స్ పార్టీ ఇవ్వాలి’ అని కమల పట్టు పట్టటంతో హోటల్లో పార్టీ, తర్వాత సినిమాకు తీసుకువెళ్లింది.
ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఉన్న తనను వాళ్లేమైన చేస్తే అనే ఆలోచన రావటంతో ఆమెకు అడుగులు తడబడుతున్నాయి వళ్ళంతా చమటలు పట్టేశాయి. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా గుర్తుకు వచ్చారు. తను వాళ్ళను మళ్ళీ చూడగలనా అని అనుకున్నది.నడకలో వేగం ఎక్కువ చేసింది, అడుగులు తడబడుతున్నా.
ఆమె ఆతృత గమనించిన వాళ్ళు గొడవ ప్రారంభించారు.
“ఫిగర్ బానే ఉందిరోయ్” అని మొదలుపెట్టాడు ఒకడు.
“బాస్ ఒకే చేశాడ్రా” ఇంకొకడు.
“ఇంత అర్ధరాత్రివేళ ఎక్కడికో పరుగు?” మరొకడు డిటెక్టివ్ లా
“ఎక్కడయినా బుక్ అయిందేమో ఆలస్యమయిందని పరుగు” అన్నాడు మిగిలిన ఒకడు.
అందరూ అదో జోకయినట్లు ఫెల్లున నవ్వారు
జ్యోతికి గొంతు తడారిపోతోంది.
వాళ్ళ గొంతుల్ని పట్టి నిర్ధారించుకుంది,. వాళ్ళు సినిమా హాల్లో తమ వెనక సీట్లల్లో కూర్చున్నవాళ్లే నని. అంటే తాము మాట్లాడుకున్నవన్నీ వాళ్ళు వినే ఉంటారు అని తలపుకు రాగానే ఆమె తడబాటుకు గురయ్యింది.అందుకు తగినట్లుగానే,
“అవును పాప పార్టీ ఎందుకు చేసినట్టు?” అన్నాడు ఒకడు.
“పెళ్లి కుదిరిందేమో” అన్నాడు మరొకడు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ.
“అయితే గర్భాదానం అన్నమాట” అన్నాడు పెద్దగా ఇంకొకడు..
అందరు ఈలలు వేసుకుంటూ నవ్వుకున్నారు.
వీళ్ళ వెనకే ఒక నడి వయసు వ్యక్తి వస్తున్నాడు. వీళ్ళెవరూ గమనించలేదు.
“అవును పాపా మమ్మల్ని పార్టీకి పిలవలేదేం?”అన్నారొకరు డబాయింపుగా అదేదో క్షమించరాని నేరమయినట్లు.
‘పాపట పాప వీళ్ళు పెద్ద ముసలాళ్ళయినట్లు’ అని అంత గాభరాలోను నవ్వుకుంది జ్యోతి.
“ పాప ఇవ్వకపోతేనేం.మనమే తీసుకుందాము పార్టీ” అన్నాడు.
“ మరి ముందెవరూ?”
“ అచ్చూ బొమ్మా వేసుకుందామా?”
“ కుదరదు నాలుగురం ఉన్నాము కదా ఆ పాపనే అడిగేద్దామ్ ఎవరిని ముందు రమ్మంటుందో.”
అందరు రైటోఅనుకున్నారు.. ఆమెకు దగ్గరవుతున్నారు.
ఇక తన జీవితం ఆయిపోయిందనుకుంది జ్యోతి.శరీరం లో నిస్సత్తువ.ఊపిరి బిగబట్టుకుని నడుస్తోంది.ఇంటికి చేరే ప్రాప్తం లేదనుకుంది. పెద్దగా అరుదామన్నా గొంతు అస్సలు పెగలటం లేదు.
ఇంతలో
“ ఏమిటే నీనొచ్చేదాకా ఆగకుండా బయలుదేరావు నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నాను” అంటూ ఆ నడి వయసు వ్యక్తి జ్యోతి పక్కకు వచ్చాడు.
జ్యోతి అయోమయంగా చూసింది ‘ఈయనెవరా’అనుకుంటూ.
“ ఏమిటి అట్లా చూస్తావు. పద. అయినా ఆటో ఎక్కకుండా నడిచొస్తున్నావేం అన్నీ బుర్ర లేని పన్లు. ” అన్నాడు చెయ్యి పట్టుకుని.
జ్యోతికి ఏడుపొక్కటే తక్కువ. ఈ ఆగంతకుడెవరో ఆమెకు అంతు పట్టటం లేదు. ఆ కుర్రాళ్ళే నయం. ఇంతవరకూ తనను తాకలేదు.
‘ ఛీఛీ ఏం మగాళ్ళు. ఎంత వయసు వచ్చినా సరే ఆడది కనిపిస్తే చాలు అల్లరి పెట్టటమే.ఈయన వయసుకి నా అంత కూతురు ఉండి ఉంటుంది. అయినా బుద్ది లేదు. అమ్మో ఈయన నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళేట్లున్నాడు’ అనుకుంది.
ఆ వ్యక్తి కూడా జ్యోతితో పాటు వేగంగా నడుస్తున్నాడు.
ఆయన వాలకం చూసిన కుర్రాళ్ళు బిత్తరపోయారు. “వీడెవడ్రా పానకంలో పుడకలా వచ్చాడు.పిట్ట జారిపోతోందిi “అన్నాడు ఒకడు బాధనంతా అనుభవిస్తూ
ఆ మాట వినటంతోనే ఆయన వెనక్కి తిరిగి చూశాడు. కుర్రాళ్ళు కూడా ఆగిపోయారు.జ్యోతికి ఇదంతా అర్థం కావటం లేదు. ఒక ఆపద నుంచి ఇంకొక ఆపదలో అడుగు పెడుతున్నానేమోననుకుంటోంది.
“పద అంత నిదానంగా నడుస్తావేం?” గదమాయించాడు.
ఇంతలో జ్యోతి వాళ్ళ ఇంటి సందు వచ్చేసింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆ కుర్రాళ్ళు ఎప్పుడు జారుకున్నారో తెలీదు. ఆయన ఒక్కడే వస్తున్నాడు.
జ్యోతిలో ధైర్యం ప్రవేశించింది. రెండుమూడు ఇళ్ళు దాటితే తమ ఇల్లు వస్తుంది.ఈ లోపల ఈయనేమైనా పిచ్చి వేషాలు మొదలు పెడితే తను గట్టిగా అరుస్తుంది. అందరు లేచివచ్చి భరతం పడతారు.
తన ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోయింది.
“ఇదేనా మీ ఇల్లు?” అన్నాడాయన.
అవునన్నట్లు తలాడించి తలుపు తట్టబోయింది.
”చూడమ్మాయ్.”
ఆయన వైపు చూసింది,విసుగ్గా.
“పెళ్లీడుకొచ్చిన అమ్మాయివి. ఇట్లా అర్ధరాత్రి దాకా బయట తిరుగుతూ ఉండవచ్చా. ఆ కుర్రాళ్ళ వెనకే వస్తున్నాను.నీ అవస్థ చూశాను. అందుకే చొరవగా నీ దగ్గరకొచ్చాను.దానితో వాళ్ళు వెనక్కు తగ్గారు. నేను లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు. చదువుకున్నదాని లాగా కనిపిస్తున్నావు. ఆ మాత్రం ముందు చూపు లేకపోతే ఎలా. ఇక ముందు ఇట్లా అర్ధరాత్రి దాకా బయట తిరగకు. తెలిసిందా. మా అమ్మాయి లాంటి దానివని కేకలేస్తున్నాను.చెయ్యి పట్టుకున్నానని ఏమనుకోకు. సర్లే లోపలికి వెళ్ళు. ఇక ముందు ఇలా చేయకు. సరేనా” అంటూ చీకట్లో కలిసిపోయాడాయన.
‘ఛ పెద్ద మనసున్న మనిషిని అపార్థం ఛేసుకున్నాను. కనీసం థాంక్స్ అయినా చెప్పలేదు. అసలు మనిషిని సరిగా కూడా చూడలేద’నుకుంటూ ఆయన వెళ్ళిన వైపు అప్రయత్నంగా చేతులు జోడించింది.తర్వాత తలుపు తట్టింది.
తల్లి తలుపు తీసింది.
“అదేమిటే చెమటలు కక్కుకుంటూ వస్తున్నావ్. ఏమయినా గొడవ జరిగిందా?”.
“అబ్బే అదేం లేదు. ఆటో లో కరంటు పోయింది. గాలి లేదు”.
“ఆటో ఏమిటి కరంట్ పోవటమేమిటి” అని విస్తుపోయింది, కూతురి ధోరణి అర్థం కాక.
** ** **