చెదిరిన గతం - B.Rajyalakshmi

Chedirina gatam

" ఏమండీ , యీ కథ చాలా బాగుంది ," అంటూ వారపత్రిక ప్రసాద్ చేతికిచ్చింది చంద్రకళ .

"ఏం కథ !!! ఓహో నువ్వు వ్రాసావా "అంటూ కొంటెగా చూసాడు ప్రసాద్ .
" ఏం రాయకూడదా !! అంత లా మొహం పెట్టారు "అంటూ చంద్రకళ బుంగమూతి పెట్టింది . .
" అదికాదు కళా నువ్వుకూడా "సగం లో ఆగిపోయాడు ప్రసాద్ .
"అదిగో మీ మగవాళ్లు మా ఆడవాళ్ల యెందుకూ పనికిరారు అనుకుంటారు . స్వార్ధానికి మరో పేరే పురుషుడు " అన్నది చంద్రకళ .
" అబ్బో మీ ఆడవాళ్లు మహా నిస్వార్ధపరులైనట్టు !!ఆ యింతకీ నువ్వేదో చెప్పబోతున్నావు " అడిగాడు ప్రసాద్ .
"ఈ కథ లో ఒక ప్రత్యేకత వుంది . నా ఫ్రెండ్ రాసిన కథ . మీరు చదవండి " చంద్రకళ మాటల్లో వుత్సాహం కనిపించింది .
" అదీసంగతి !!! నీ ఫ్రెండ్ కథ ! నేను చదవాలి ! అంతే కదా " వుడికించాడు .
" అదేం కాదులేండీ !!! ముందు మీరు చదవండీ ,తర్వాత నేను చెప్తాను >"అన్నది
" సరే ఒక కప్పు కాఫీ యిస్తే చదువుతాను "తమాషాగా అన్నాడు .
" కథకూ కాఫీకీ లింకేమిటండీ !!!యిప్పుడేగా తాగారు !"అన్నది చంద్రకళ .
" నీకు తెలియదు కళా ,
"కొన్ని కథలు చదువుతుంటే బుర్ర బాగా బద్దలైపోతుంది . అందుకే వేడి వేడి కాఫీ కావాలి " అన్నాడు ప్రసాద్ .
" సరే " అంటూ వంటింట్లోకి పరుగెత్తింది చంద్రకళ .
ప్రసాద్ కథ మీదికి దృష్టి మళ్లించాడు . రచయిత్రి పేరు రాధిక ! పేరు చూడగానే వులిక్కిపడ్డాడు !! యీ పేరు తన గతం యెక్కడో పరిచయం లా అనిపించింది . యెప్పుడు !!!!!!! యెక్కడ !!!!!ఆ అదే తన కాలేజీ రోజులు ! గుండెలోతుల్లో యేదో బాధాతప్త మెలిక >..
ఆసక్తి తో కథ చదవడం మొదలు పెట్టాడు . మొదటి వాక్యంచదువుతుంటే యెవరో తన చెంప చ్చెళ్లుమనిపించినట్టుగా అనిపించింది . మనసులో యేదో కలవరం .
కథ ప్రసాద్ కి చదువుతున్నట్టుగా అనిపించడం లేదు , తన వాస్తవ గతాన్ని యథాతథంగా శోధించుకున్నట్టుగా అనిపించింది . . కథలోని వేదన , వ్యథ రెండు జీవితాల సడలిపోయిన బంధాలను ప్రసాద్ కు గతాన్ని గుర్తు చేసింది .
"ఏమండోయ్ కథ చదివారా ? "అంటూ కాఫీ తీసుకుని చంద్రకళ వచ్చింది .
"చదివాను ,కథ ముగింపు బాధ పెట్టింది . వెలుతురును వెతుక్కుంటూ చీకట్లో కలిసిపోయిన అభాగిని !" ప్రసాద్
మాటల్లో వేదన !!
"అవునండీ ,ఆత్మ సమానం గా ప్రేమించిన ప్రేయసిని నట్టేట ముంచిన పిరికివాడు . " అన్నది చంద్రకళ .
"అవును కళా ద్రోహం చేసాడు " ప్రసాద్ ప్రసాద్ కన్నీటి పర్యంతం అయ్యాడు .
చంద్రకళ విస్తుపోయింది .
" అదేమిటండీ యీ కన్నీళ్లేమిటి ??"అంటూ లాలనగా అతని కళ్ళల్లోకి చూసింది .
" ఏం లేదు కళా !!!!!యేవో జ్ఞాపకాలు " అన్నాడు
" మీ వేదన నాకు చెప్పరా " అడిగింది .
""విన్న తర్వాత నన్ను క్షమిస్తావుగా "తలవంచుకుని సిగ్గుతో అన్నాడు ప్రసాద్ .
"ఛ అదేమిటండీ ఆలా అంటారు !!మనలో మనకు క్షమాపణలు ఏమిటండి !!"అన్నది చంద్రకళ .
"కళా !!!!ఆ పిరికివాడిని నేనే ! యిది నా యదార్థ గతం !" ప్రసాద్ మనిషి మనిషి గా లేడు .
" అంటే మీరు ఎప్పుడయినా ఒక ఆడపిల్లను " ఆగిపోయింది చంద్రకళ .
" కళా నా గతం యీ కథ !నువ్వు మన్నించగలవని భావిస్తాను "అన్నాడు ప్రసాద్ .
"చెప్పండీ !! నేను మీ మనసును ! మిమ్మల్ని అర్ధం చేసుకోగలను " అన్నది చంద్రకళ !
ప్రసాద్ గతం మొదలయ్యింది !
--------------------------------------------------------------------------------------------------------------------------------------
నేను డిగ్రీ చదవడానికి ఇంకో వూరికి వెళ్లాను . కాలేజీకి దగ్గర్లో ఒకగది అద్దెకు తీసుకున్నాను . ఒంటరిగా వుండేవాణ్ణి . అంతా కొత్త !నాకు చొరవ తక్కువ పైగా ఫ్రెండ్స్ కూడా లేరు . వూరు కొత్త . కాలేజీ వదిలితే అద్దెగది ,అద్దెగది వదిలితే కాలేజీ !!1 అదే నా ప్రపంచం !! యెప్పుడైనా విసుగు పుడితే పార్కుకు !1 ఆ యింటి యజమాని ., భార్యా కూడా నన్నుఅభిమానం గా చూసేవాళ్లు . వాళ్లకు పిల్లలు లేరు , మేన కోడలు రాధికను చిన్నప్పుడే తెచ్చుకుని పెంచారు . సీతయ్యగారు ,జానకమ్మగారు మంచి వ్యక్తులు !నాకు కూడా గౌరవం వుండేది . నన్ను వంట చేసుకోవద్దన్నారు . రెండుపూటలా భోజనం పెట్టేవారు . ఇప్పుడైతే కాఫీ అలవాటైంది కానీ అప్ప్పట్లో కాఫీ అలవాటు కూడా లేదు నాకు .
రాధిక అందమైన 18 యేళ్ల అమ్మాయి ! ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండేది . నాలాగే ఆ అమ్మాయి కూడా కాలేజీ తప్ప మరో లోకం లేదు . ఇంట్లో పనులూ ,చదువూ అంతే !!
ఉదయం నేను నిద్రలేచి బయట నించుని కాసేపు ఆలా వుండేవాణ్ణి . రాధిక ముగ్గు వేస్తూ , పూలు కోస్తూ కనిపించేది . నాకు కూడా రోజూ రాధిక వికసిత ముఖం చూస్తే చాలా తృప్తిగా వుండేది . అయితే మేము యిద్దరం యెప్పుడూ మాట్లాడుకోలేదు . ఆ అమ్మాయి కనీసం తలెత్తి కూడా చూసేదే కాదు !!
ఆ అమ్మాయిని చూస్తే యేదో తెలియని వుత్సాహం ,నూతన శక్తి కలిగేవి . క్రమం గా నేను ఆ అమ్మాయిని అప్పుడప్పుడూ చూడడం నవ్వడం అలవాటయ్యింది . కానీ రాధిక నేను నవ్వగానే తుర్రున లోపలికి పారిపోయేది మాదొక మూగ భాష .
. పరీక్షల సమయం లో నేను రాత్రి 11 దాక చదువుకునేవాణ్ణి ,రాధిక కూడా నాతో పాటు సమానం గా తన గదిలో చదివేది . నేను లైట్ తీసెయ్యంగానే తనూ తీసేసేది . నాకు నవ్వొచ్చేది . క్రమం గా నాకు రాధిక తో మాట్లాడాలన్న కోరిక పెరిగింది . . కానీ రాధిక మాత్రం అవకాశం యిచ్చేది కాదు . నేను సీతయ్యగారు పిలిస్తే వెళ్లి కాసేపు కబుర్లు చెప్పేవాడిని . అప్పుడు కూడా రాధిక నన్ను చూడగానే లోపలికి వెళ్లిపోయేది . ఎందుకో ఆ అమ్మాయి తో స్నేహం చెయ్యాలన్న కోరిక పలకరించాలన్న పట్టుదల మరింత పెరిగింది .
.
ఒకరోజు మంచినీళ్లు లేవు . నాకు బాగా దాహం వేసింది . ఓనరుగారి గడప దగ్గర నించుని " జానకమ్మగారూ "" అని పిలిచాను .
ఎవరూ మాట్లాడలేదు . మళ్లీ పిలిచాను .
లోపలినుంచే రాధిక "అత్తయ్యా ,మావయ్యా బయటకెళ్లారండీ " అన్నది .
" మంచినీళ్లు లేవు . యిస్తారా రాధికా " మొదటిసారి ధైర్యం గా రాధికను అడిగాను .
వెంటనే గబగబా పెద్ద చెంబు నిండా మంచినీళ్లు తెచ్చి గడప దగ్గర పెట్టింది . నాకు యింకా మాట్లాడాలనిపించింది . కానీ ఏం మాట్లాడను !! ఒకవేళ మాట్లాడినా బదులివ్వకుండా వెళ్లిపోతే !!!!
నెమ్మదిగా అక్కడినించి వచ్చేసాను . కానీ రాధికతో పరిచయం పెంచుకోవాలీ సరదాగా గడపాలి అన్న కోరిక మాత్రం మరింత పెరిగింది .
రోజులు గడిచి పోతున్నాయి . రాధిక లో మార్పు రాలేదు . నేను యేదో కారణం గా పలకరించినా ముక్తసరిగా బదులు చెప్పి తప్పుకునేది .
ఒకరోజు జానకమ్మ గారు నా గదికి వచ్చారు .
"ప్రసాద్ నీతో కొద్దిగా మాట్లాడాలి . యిప్పుడు కుదురుతుందా !!" అన్నారు .
నేను భయపడ్డాను. రాధిక యేమైనా చెప్పిందా ?? వణికి పోయాను .
" మరేం లేదు బాబూ .మా రాధిక వొట్టి పిచ్చిది , అమాయకురాలు . దానికి నీతో మాట్లాడం భయం . దానికి లెక్కలు అర్ధం కావట్లేదుట !! కాస్త నువ్వు రాధికకు చెప్తావా ప్రసాద్ !!దానిని ఒప్పించాను . " అడిగారు జానకమ్మగారు .
" దానిదేముందండీ తప్పక చెప్తాను . పంపించండి " అన్నాను .
ఆ రోజు నించీ రాధిక రోజు సాయంకాలం లెక్కలు చెప్పించుకోవడానికి వచ్చేది . నాకు కూడా తనతో మాట్లాడడం చాలా ఆనందం గా తృప్తిగా వుండేది . మరీ అంత మొద్దు కాదు . మొదట్లో నన్ను అడగడానికి భయపడేది . నేనూ భయం పోగొట్టడానికి ప్రయత్నించేవాణ్ణి .
మొదట్లో నన్ను " అండీ " పిలిచేది చిరాకు వేసేది . పేరు పెట్టి పిలవకపోతే పలకన్నాను . క్రమం గా "ప్రసాద్ " అని పిలుస్తుంటే నాకు చాలా హయిగా వుండేది . కానీ మా మధ్య చనువు ఏర్పడటానికి చాలా సమయం పట్టింది .
రాధిక మరీ అంత అమాయకురాలు కాదని అర్ధం అయ్యింది . చలాకీగా మాట్లాడేది . లెక్కలు . చెప్పగానే అర్ధం చేసుకునేది . నాకు ఒకటి అర్ధం అయ్యింది . భయం తొలగితేరాధిక చాలా చురుకు అని .
ఇద్దరికీ పరీక్షలు ముగిసాయి . నేనూ రాధికా యిద్దరం బాగా రాసాము . వేసవి సెలవులు వచ్చాయి . నాకు యింటికి వెళ్లాలంటే యెందుకో మనసు రాలేదు . కానీ అమ్మా నాన్నా చెల్లాయి వెయ్యికళ్లతో యెదురు చూస్తుంటారు .
ఒకరోజు "రాధికా సెలవుల్లో మా వూరెళ్తున్నాను " అని చెప్పాను . రాధిక బాధ పడింది. మా యిద్దరికీ తెలియని మానసిక బంధం యేర్పడుతున్నది . అది మాకు తెలుస్తున్నది . రాధికను నచ్చచెప్పి మా వూరికి సెలవుల్లో వచ్చేసాను .
సెలవులు భారం గా గడిచాయి . తిరిగి వచ్చాను . సీతయ్యగారూ ,జానకమ్మగారూ చాలా సంతోషించారు . రాధిక మొహం వెలిగిపోయింది . నాకు రాధికలో కొత్త కొత్త అందాలు కనిపించాయి . ఇద్దరం ఫైనల్ యియర్ కాబట్టి చదువు మీద సీరియస్ దృష్టి పెట్టాం . కానీ రాధిక కొంటెనవ్వు నన్ను అప్పుడప్పుడూ కవ్వించేది !
నాకుతెలియకుండానే నాకళ్లు రాధికను పరిశీలించడం మొదలుపెట్టాయి .
ఒక పండగ రోజున జానకమ్మగారు గారెలూ పాయసం పంపించారు . రాధిక అవి తెచ్చి బల్ల మీద పెట్టింది . రాధిక మరింత అందం గా కనిపించింది . ఆవేశం యేదో తన్మయం లో రాధిక చెయ్యి పట్టుకున్నాను . బిత్తరపోయింది . ఒక్కక్షణం యిద్దరం అలాగే వుండిపోయాం . అరచేయిని ముద్దు పెట్టుకున్నాను . అంతే చటుక్కున రాధిక తేరుకుని బుగ్గలన్నీ యెరుపెక్కి గబాగబా వెళ్లిపోయింది . నేను కూడా అదోలా ఫీలయ్యాను . భయపడ్డాను . తప్పుగా చేసానా అనుకున్నాను .
.తర్వాత వారం రోజులవరకు వాళ్లింటి వైపు తొంగి చూడాలన్నా యేదో గీల్టీ గా వుండేది . రాధిక కూడా కనిపించేది కాదు . ఒక సాయంకాలం పూలు కోస్తూ నన్ను చూడగానే లోపలికి వెళ్ళబోయింది .
" ఆగు రాధికా యెలా చదువుతున్నావు ??" అని అడిగాను . బదులు చెప్పలేదు . తల వంచుకుంది ,కానీ పారిపోలేదు . నాకు నవ్వొచ్చింది .
ఇంతలో జానకమ్మగారు అక్కడికి వచ్చారు .
"ప్రసాద్ యీ మధ్య యిది సరిగా చదవడం లేదు . నీ దగ్గరకి వెళ్లమంటే వినడం లేదు . నేనే లాక్కొచ్చి కూచోబెడతాను "అంటూ కోపంగా రాధికను ను చూసారు . అప్పుడుఁ రాధికా యింట్లో యేమి చెప్ప్పలేదని అర్ధం అయ్యింది .
మళ్లీ లెక్కలు చెప్పించుకోడానికి వచ్చేది నా దగ్గర బెదురు తగ్గింది .
" రాధికా నా డిగ్రీ చేతికి వస్తుంది . ఏదో ఒక వుద్యోగం వస్తుంది . నువ్వంటే నాకు యెదోతెలియని ప్రేమ ,అనురాగం . నిన్ను పెళ్లిచేసుకుంటాను ,పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను . నీ అభిప్రాయం చెప్పు "అని అడిగాను ..
"ప్రసాద్ నువ్వంటే నాకూ యిష్టమే ! మన పెద్దవాళ్లు ఒప్పుకోవాలి . మా అత్తయ్యా ,మావయ్యా నన్నుపెంచి చదువు నేర్పించి కంటిపాపలా నన్ను చూసుకుంటున్నారు . వాళ్లని అడుగు . "అన్నది ,.
రాధిక మాటలకు సంతోషించాను . స్థిరమైన భావాలను గౌరవించాను . ఆలోచనా సరళి నాకు నచ్చింది .
రాధికకు నేనంటే యిష్టం కానీ సాంప్రదాయాలను పెద్దల భావాలకు విలువ యిస్తుందని అర్ధం అయ్యింది .

నిజమే !పెద్దవాళ్లు నన్ను నమ్మి పంపారు . వాళ్లకు నేనంటే అభిమానం . రాధిక చెప్పినట్టు పెద్దవాళ్లని అడగాలి అనుకున్నాను .
ఒకరోజు సీతయ్యగారు అనుకోకుండా పిలిచారు . నాకు ఒకపక్క సందేహం !ఒకపక్క మొండి ధైర్యం !!1
"రావయ్యా ప్రసాద్ చదువైపోతోంది ,మీ ఊరెళ్లిపోతావు . మళ్లీ రావుగా !!! యేదో వెలితిగా వుంది . ఎప్పుడయినా యిటువైపు వస్తే నా దగ్గరికి రావయ్యా "అంటూ ఆప్యాయంగా పలకరించారు . ఆయన మాటల్లో నాకు యేదో ధైర్యం వచ్చింది .
"మీరు పెద్దవారు . మంచివారు . నేను రాధికకు యిష్టపడుతున్నాను . పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను . "అంటూ సూటిగా అడిగేసాను .
ఆయన కొద్దిసేపు మౌనం గా వున్నారు . జనకమ్మగారిని పిలిచారు .
"రాధిక మేనకోడలు . చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకుంది . పిల్లలు లేని మాకు అది యిప్పుడు మా
కంటివెలుగు . నువ్వు మంచివాడివి ,బుద్ధిమంతుడివి . నీమీద మాకు నమ్మకం వుంది . కానీ బాబూ మీరు అగ్రవర్ణం . కట్టుబాట్లు వుంటాయికదా !! మీ తల్లితండ్రులకు చెప్పి వారిని అడుగు అప్పుడు నేను మీవాళ్లను కలిసి మాట్లాడుతాను పెద్దవాళ్లను నొప్పించి నేను యేపనీ చెయ్యను బాబూ " అన్నారు
ఒకరోజు యింటికి వెళ్ళడానికి అన్నీ సద్దుకుంటున్నాను . సుడిగాలిలాగా రాధిక లోపలికి వచ్చింది . వస్తూనే నన్ను వాటేసుకుని ఏడ్చేసింది . నాకు కళ్లు చెమర్చాయి . మనసు కరిగి ముద్దయ్యింది . రాధిక నన్ను గాఢంగా ప్రేమిస్తున్నదని అర్ధం అయ్యింది .
" ప్రసాద్ నన్ను మర్చిపోవుగా ! మీ వాళ్లను ఒప్పిస్తావుగా !!నువ్వంటే అత్తయ్యా మావయ్యలకు యెంతో అభిమానం ! నీ మంచితనం వాళ్లకు తెలుసు !అంటూ కన్నీళ్లతో నన్ను చుట్టేసింది .
"రాధికా ధైర్యంగా వుండు . మావాళ్లను ఒప్ప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను " అన్నాను .
ఆలా రాధికను వదిలి వచ్చేసాను . నాన్న ఒప్పుకోలేదు . అమ్మ ఒప్పుకోలేదు . చెల్లి పెళ్లి ఆగిపోతుందని అన్నారు . అమ్మ నిద్రమాత్రలు మింగింది . చుట్టుపక్కలవాళ్లు నన్నే నిందించారు . ఆ విధం గా రాధిక నా జీవితం లో తొలిగిపోయింది . నిన్ను చేసుకున్నాను . తర్వాత రాధికను గురించి నేను ప్రయత్నం కూడా చెయ్యలేదు . ఈ కథ చదువుతుంటే నా గతం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది కళా " అంటూ ప్రసాద్ సుదీర్ఘంగా ముగించాడు .
చంద్రకళ మౌనం గా వుండిపోయింది .
"మీరు చెప్పిన రాధిక ,నా ఫ్రెండ్ రాధిక ఒకరే !! యిద్దరం ఒకే బళ్లో చదువుకున్నాం అమ్మానాన్నా ప్రమాదం లో చనిపోయిన తర్వాత మేనమామ దగ్గరికి వెళ్లిపోయింది . నాకు అప్పుడప్పుడూ వుత్తరాలు వ్రాసేది . అప్పుడే మిమ్మల్ని గురించి చెప్పేది . పేరూ ,వూరు మాత్రం చెప్పేదికాదు . తను అతనిని యిష్టపడుతున్నట్టు అతనుకూడా యిష్టపడుతున్నట్టు చెప్పేది . మన పెళ్లికి వచ్చింది . కానీ యెందుకో వెంటనే వెళ్లిపోయింది . బహుశా మిమ్మల్ని చూసివుంటుంది . ఇన్నాళ్ల్లు నాకుతెలియని యీ విషయం యిప్పుడర్ధమయ్యింది . "అన్నది చంద్రకళ . .
ప్రసాద్ సిగ్గుతో తలదించుకున్నాడు .
"రాధిక మేనమామ అత్తయ్యా చనిపోయారు . వాళ్లు పెళ్ళిచేస్తామంటే ఒప్పుకోలేదు . అవివాహితగా వుండిపోయింది . కారణం అడిగితె నవ్వుతుంది . అంతే " అన్నది చంద్రకళ .
ముగింపు లేని రాధిక జీవితానికి విధి కారణమా !!! తాను కారకుండా ????? అనుకున్నాడు ప్రసాద్ .
"కళా యిప్పుడు రాధిక యెలావుంది ?యెక్కడుంది " అడిగాడు ప్రసాద్ .
"మనం రేపు బయల్దేరుదాం . "నవ్వింది చంద్రకళ .
బస్ యెక్కేవరకు ప్రసాద్ తెలుసుకోలేకపోయాడు . తను కాలేజీ రోజుల్లో అద్దెకున్న వూరికేనని . అతను ఆ యింటిని ఆశ్యర్యంగా చూసాడు . అది యిప్పుడు ఆశ్రమం . ముందుకు ఆకుపచ్చని లతలతో పొదరిల్లు . చాలా ప్రశాంతం గా వుంది . చిన్నకుటీరం . చంద్రకళ మెల్లిగా తలుపు తట్టింది .
రాధిక చల్లని చిరునవ్వుతో నీలి ఖద్దరు చీరెతో గుండ్రని అందమైన కుంకుమతో యెదురుగా నిలిచింది ..
రాధికను చూడగానే ప్రసాద్ కళ్లల్లో తడి .
"ప్రసాద్ బాగున్నారా ??మిమ్మల్ని చూడాలనుకున్నాను ,చూసాను . గతం ఒక తియ్యని కల . వర్తమానం శాంతినిలయం . నాకు ఇంతకన్నా ఏం కావాలి ? "అంటూ ప్రసాదుకి నమస్కరించింది . రెండురోజులు అక్కడ గడిపి వెనుతిరిగారు .
ప్రసాద్ తప్పుచేసినవాడిలాగా ఫీలవుతున్నాడు .
"వివాహాలు దైవనిర్ణయాలు . రాధిక ప్రశాంతంగా వుంది . మీరుకూడా హాయిగా వుండండి "అంటూ చంద్రకళ ప్రసాద్ చేతిని లాలనగా నిమిరింది .
.
,

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు