ఆ వీధిలో రాజేశ్వరరావు గారికే రెండతస్తుల మేడ ఉంది.కింది పోర్షన్ అద్దెకు ఇచ్చి,పై పోర్షన్ లో తను ఉంటున్నాడు.బాగా సంపాదించాడు.కానీ పిల్లలు లేరు.భార్య సరోజ కు నగల పిచ్చి ఎక్కువ. "పిల్లలను దత్తత తీసుకుందాం " అని రాజేశ్వరరావు అంటే, " ఏమి అక్కరలేదు ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం నీకు నేను,నాకు నీవు అంతే "అంది. ఆ మాటకు
"సరే ని ఇష్టం " అన్నాడు రాజేశ్వరరావు. ఇంతలో పనిమనిషి కృష్ణవేణి తలుపు తట్టింది.వెంటనే తలుపు తీసింది సరోజ.రాజేశ్వరరావు షేవ్ చేసుకునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు. తన పనిలో నిమగ్నమైంది కృష్ణవేణి.సరోజ బీరువా తీసి వారం కింద తను కొన్న కొత్త నగ ను తీసి సరదాగా మెడలో అలంకరించుకుని అద్దం ముందు అటు ఇటు చూస్తూ సంతోషిస్తుంది.అప్పుడే ఆ గది లోకి వచ్చిన కృష్ణవేణి నవ్వుతూ "నగ మీ మెడకు భలే అందాన్ని ఇస్తుంది అమ్మగారు " అంది. "బాగుందా "! అంది హొయలు పోతూ. " చాలా బాగుందమ్మ ,నేను మా ఆయనకు చెబుతున్న ఒక్క నగ చేయించు చిన్న పిల్లకు,బంగారం కొండెక్కి కూర్చుంది అంటే వింటేనా,పెద్దదానికి ఎలాగో పెళ్ళి చేశాను.లక్షణంగా చిత్తూరు లో ఓ పెద్ద కాన్వెంట్ లో పని దొరికింది ఇద్దరికి. ఇక చిన్న దానికే ఏం బంగారం లేదు "అంటూ బీరువా దగ్గర కసువు ఊడ్చుకుని వెళ్ళింది. సరోజ నగ ను బెడ్ పై పెట్టి రాజేశ్వరరావు పిలిస్తే వెళ్ళింది. " వేడి నీళ్ళు పెట్టవోయ్ " అన్నాడు.
" వేడి నీళ్ళు పెట్టడమేమిటి బాత్ రూమ్ లో గిజెర్ ఆన్ చేసుకోండి " అంది చీకాకుగా. ఆ మాటకు " అది నాకు తెలియకనా!కరెంట్ పోయింది " అన్నాడు నవ్వుతూ. " వస్తుంది లేండి,ఏం తొందర " అంటూ బెడ్ రూమ్ లోకి వచ్చి నగ ను పరిశీలిస్తుంది.కృష్ణవేణి బెడ్ రూమ్ లో బండలు తుడుస్తూ ఉంది.సరోజ నగ ను అటు ఇటు తిప్పుతూ ఉంటే గమనిస్తుంది. ఇంతలో కింది పోర్షన్ విమల వచ్చి "ఏమండీ ఈరోజు స్కూల్ నుంచి నేను మా వారు కాస్త ఆలస్యంగా వస్తాం.ఐదు గంటలకు మా ఆడ బిడ్డ వస్తుంది.ఆవిడ వస్తే 'కీ' ఇవ్వండి " అని ఇచ్చింది.ఆ నగ ను చూడగానే "కొత్తది కొన్నారా ఏమిటి ,చాలా బాగుంది మళ్ళీ వచ్చి చూస్తాను". అని వెళ్ళింది. "అలా నగ తోనే కాలక్షేపం చేస్తావా ఏమిటి?" అన్నాడు రాజేశ్వరరావు తల తుడుచుకుంటూ. " అవును నేను ఎంతో ఇష్టంతో అన్ని వజ్రాల రాళ్ళతో పెట్టి ముచ్చటగా చేయించుకున్న" అని నగ ను పెట్టెలో సర్ది బీరువాలో ఉంచింది.
****** ****** ******** *******
సాయంత్రం ఐదు గంటలకు విమల ఆడబిడ్డ నిర్మల,ఆమె భర్త బైక్ పై వచ్చారు.నిర్మల చేతిలో చంటి బిడ్డ ఉంది. నిర్మల పైకి వెళ్ళి సరోజ తో ఇంటి తాళాలు ఇప్పించుకుంది.
నిర్మల తాళం తీయగానే ఇద్దరూ లోపలికి నడిచారు.కాసేపటికి విమల ,విమల భర్త వచ్చారు.నిర్మల కూతురును చూడగానే "చిట్టిది బాగుందే"అని బుగ్గ గిల్లింది. "బాగున్నారా బావ" అన్నాడు విమల భర్త ప్రశాంత్. "ఆ బాగున్నాం బావ మీ చెల్లి అన్నయ్య ఇంటికి వెళదాం అంటే రోజూ అనుకుంటూ ఈరోజుకు కుదిరింది మాకు బ్యాంకులో విపరీతమైన పని ఉంది, వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది అవుతోందిఒకే ఊర్లో ఉండి కలువలేక పోవడం బాధగా
ఉంది" అన్నాడు నిర్మల భర్త కృష్ణ.
ఆ రోజు ఆదివారం. విమల ఇంట్లో గుమ గుమ లు.ఎదో పనిమీద కిందకు వచ్చింది సరోజ.ఆ వాసనకు " ఏమండీ గుమ గుమ లు దంచేస్తున్నారు " అంది నవ్వుతూ.
" ఆడబిడ్డ వచ్చింది కదండీ మర్యాద చేస్తున్న " నవ్వుతూ అంది విమల. "రండి కూర్చోండి కాఫీ తాగుదురు " అంది విమల.పక్కగది లో ఉన్న నిర్మల వచ్చి "బాగున్నారా"అంది.
"ఆ బాగున్నా,పాపేది"? అంది. "నిద్దుర పోతుంది" చెప్పింది నిర్మల.విమల కాఫి తీసుకుని వచ్చి "మీ నగ ఆ రోజు చూశాను.తొందరలో సరిగ్గ చూడలేదు,తీసుకు రండి మా ఆడబిడ్డ కూడా చూస్తుంది "అంది.
"సరే" అంటూ కాఫి తాగి వెంటనే సరోజ పైకి వెళ్ళి బెడ్ రూమ్ లో ఉన్న బీరువా తీస్తుండగా రాజేశ్వరరావు చూసి "ఈ మధ్య అస్తమానం ఆ నగనే చూస్తున్నావు ఏంది కథ"
అన్నాడు.
"ఇది నాకు నచ్చింది అందరికీ నచ్చింది.నేను చెప్పిన డిజైన్ చేసిన ఆ షాప్ వాడికి థాంక్స్ చెప్పాలి "అంది. "వాడికేనా! థాంక్స్ నాకు కదా!"అన్నాడు.
"మీరు ఎప్పుడు పెట్టి కొన్నారు?నేను మా అమ్మ ఇచ్చిన డబ్బు తో కొన్నాను".అంది గర్వాంగ. "సరే అందరికీ చూపించకు దిష్టి తగులుతుంది, అది సరే ఈ సారి ఇంటి బాడుగ అడుగు " అన్నాడు.
"ఇంకా నెల కాలేదు.అప్పుడే బాడుగ ఎలా ఇస్తారు.మీ పిచ్చి గాని,అయినా వాళ్ళు ఎప్పుడు ఆలస్యం చేయరు. కరెక్టుగా ఇస్తున్నారుగా అయినా డబ్బు తో ఎం అవసరం " అంది.
"అది అది అని నసిగి నాపింఛన్ డబ్బు అంత ఖర్చఐపోయింది.అందుకని " నసి గాడు.
"ఇంకా నెల రాలేదు,అప్పుడే కార్చుఅయిందా!పైగా మనకు పిల్లా,జెల్ల లేరు.మీరు ఏం చేస్తున్నారు డబ్బంతా" అంది .
"ఈ నెలలో నీకు తెలియకుండా ఓ నగ చేయుద్దామని ఖర్చు చేశాను "అన్నాడు.
నగ అనగానే సరోజ సంతోషించింది "అలాగా "అంది."నేను కిందకు వెళుతున్న టేబుల్ పై టీ పెట్టాను తాగండి "అంది.
విమల,నిర్మల మాట్లాడు కుంటుండగా సరోజ వచ్చి తన నగ చూపించింది.నిర్మల చూసి చాలా వెరైటీగా ఉంది,డిజైన్ బాగుంది కదా వదిన,మామిడి పిందెలు చాలా అందంగా ఉన్నాయి "అంది నిర్మల.
"ఇలా ఉండాలి అని షాప్ వాడికి నేనే చెప్పి చేయించుకున్న " అంది గర్వాంగ. "మీరు మాట్లాడుతూ ఉండండి టీ తెస్తాను' అని విమల లేవబోతుండగా "వద్దండి ఇప్పుడే తాగి
వచ్చాను కూర్చోండి "అంటూ చేయి పట్టి లాగింది సరోజ.
"పాపకు ఏమి పేరు పెట్టారు" అంది .నిద్రపోతున్న పాప బుగ్గ గిల్లి.
"వింధ్య"అని పెట్టామండి అంది.అప్పుడు సమయం నాలుగు అయింది. "వస్తానండి పనిమనిషి వచ్చే వేళ అయింది " అని వెళ్ళింది సరోజ.
****** ****** ****** ****** *****
ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు రాజేశ్వరరావు "సరే ,తెస్తాను,ఇస్తాను.ఇంటి దగ్గరే వుంటావా "అన్నాడు.
"ఎవరండీ"అంది సరోజ.
రాజేశ్వరరావు కంగారుపడుతూ "ఆ..మా మిత్రుడు లే అన్నాడు."సరే అందరికి నీ నగ భలే చూపిస్తున్నావు,దిష్టి తగులుతుందేమో "అన్నాడు నవ్వుతూ.
సరోజ నవ్వుతూ"మీ దిష్టి తగిలేలా ఉంది "అని బెడ్ పై కూర్చుంది.నగ బాక్స్ అక్కడే ఉంది. అప్పుడే కృష్ణవేణి అంట్లు తోమి రూమ్ తుడవటానికి వచ్చింది.అప్పుడే నగ బీరువాలో దాచి,తాళం దానికే ఉంచి,ఫోన్ వస్తే వేయడం మరచింది సరోజ.అది గమనించారు కృష్ణవేణి,రాజేశ్వరరావు.పాప ఫారెక్సు తినక మారాం చేస్తుంటే ,పాప ను ఎత్తుకుని సరోజ ఇంటికి వెళ్ళింది నిర్మల.నిర్మల రావడం చూసి " రండి నిర్మల " అంది.పాప గుక్క పెడుతుంటే "ఊరుకో..అదిగో ఆంటని చూడు"అంది బుజ్జగిస్తూ.."అలా బాల్కనీ లోకి వెళదాం రా ఏడుపు మానుతుంది ".అంది సరోజ.కృష్ణవేణి పనిలో నిమగ్నమైంది. "నేను అలా బైటకు వెళ్ళొస్తాను" అని వెళ్ళాడు రాజేశ్వరరావు.
బాల్కనీ లోంచి వాహనాలు చూస్తుంటే ఏడుపు ఆగింది. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక "వస్తానండి,ఇప్పుడు మా వారు వస్తే మా ఇంటికి వెళ్ళాలి"అంది.
"అప్పుడే వెళతారా వదినే ఇంటికి వచ్చి "అంది సరోజ.
"ఎదో బోర్ కొడుతుంటే వదినే కు ఫోన్ చేశా,వస్తున్నాం అంటే సరే రండి అనింది .ఈసారి మీరు మా వదినే మా ఇంటికి రండి "అంటూ మాట్లాడుకుంటూ బెడ్ రూమ్ లో కూర్చున్నారు ఇద్దరూ. ఇంతలో ఫోన్ మోగితే "హలో "అంది. అది విని "ఛా "అని పెట్టేసింది. "ఎవరండి "అంది నిర్మల. "ఎవరో కంపెనీ వారు" అంది.
"ఇంక వస్తానండి పాప కూడా నిద్రపోయింది "
అంది."ఉండండి బొట్టు తీసుకుని వెళ్ళుదురు గాని " అంటూ పూజా గదిలోకి వెళ్ళింది సరోజ.ఆ గదిలో ఒంటరిగా ఉంది నిర్మల.బొట్టు తేవడం ఆలస్యం కావడంతో "వస్తాను సరోజ గారు "అంటూ లేచింది.
"ఉండండి కుంకుమ అయిపోయింది, ప్యాకెట్ లో ఉన్న కుంకుమ బరిణి లోకి వంపుకుని ఇవతలకు వచ్చి నిర్మల నుదుటిపై బొట్టుపెట్టింది.ఈ లోగా పని ముగించుకుని
"అమ్మగారు వస్తాను"అని కృష్ణవేణి కూడా వెళ్ళింది.
****** ****** ****** ****** ******
బైటకు వెళ్ళిన రాజేశ్వరరావు రాత్రి పదకొండు గంటలకు వచ్చాడు. "సరోజా నేను మా ఫ్రెండ్ ఇంటిలో భోజనం చేశా ,నాకేమి వద్దు అని వెళ్ళి పడుకున్నాడు.ఉదయమే కృష్ణవేణి "అమ్మా ఒంట్లో నలతగావుంది నాలుగు రోజులు పనికి రాలేను " అని ఫోన్ చేసింది.
"సరే "అనుకుంటూ అంట్లు అన్ని తోమి,ఇల్లు తుడుస్తూవుంటే బెడ్ రూమ్ లోని బీరువా కు తాళం గుత్తులు దానికే ఉండటం చూసి,అయ్యో బీరువా తాళం వేయడం మరిచాను అనుకుని తాళం వేసి గుత్తులు బొడ్లో దోపుకుంది.
మరుసటి రోజు ఎదురింట్లో నీరజ వచ్చి "ఈరోజు మా అమ్మాయి శ్రీమంతం రావాలి " అని పిలిచి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం చక్కగా ముస్తాబై పసుపు వర్ణం చీరె కట్టుకుని
నగ అలంకరించుకోవడానికి బీరువా తీసి పెట్టె తెరచి చూసి హతవశు రాలైంది.నగ లేదు.ఖాళీ పెట్టె దర్శనం ఇచ్చింది.కంగారుగా బీరువా అంతా వెతికింది.గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎక్కడ పెట్టాను.చీరెలు అన్ని తీసి చూసింది.ఎక్కడా కనపడ లేదు.
"ఏమండీ!" అని పిలిచింది గట్టిగా.రాజేశ్వరరావు " అలాగే అంటూ ఫోనులో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
"ఏమండీ"అని మళ్ళీ పిలిచింది.
"ఆ వస్తున్నా" అన్నాడు.వెక్కి వెక్కి ఏడుస్తుంది సరోజ. "ఏమైంది?" అన్నాడు.
"బీరువాలో నగ లేదండి"అంది కంగారుగా .
"లేకపోవడమేమిటి?తాళాలు నీ దగ్గరే ఉన్నాయి.ఎవరు వస్తారు, నువ్వే బీరువాలో ఎక్కడ పారేశావో ,జాగ్రత్తగా చూశావా "అన్నాడు.
"చూశానండీ లేదు,నా చేతులతో నేనే బాక్స్ లో పెట్టి బీరువాలో ఉంచాను " అంది.
"మరి ఎక్కడకు పోతుంది.ఎవరొస్తారు"అన్నాడు.
"ఎవరూ రాలేదండి.ఇందాక మన కృష్ణవేణి వచ్చింది,నిర్మల వచ్చింది అంతే. తరువాత ఎవరు రాలేదు "అంది.
"వాళ్ళల్లో ఎవరో ఒకరు తీసే ఉంటారు అనుమానమే లేదు" అన్నాడు.
"ఛా.. అవేమి మాటలు కృష్ణవేణి అలాంటిది కాదు.నిర్మల అలా చేయదు " అంది.
"వారు తీయక పోతే ఎవరు తీస్తారు, ఎక్కడకు పోతుంది.ఈరోజు లలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు"అన్నాడు.
"ఎంతో ఇష్టంగా చేయించుకున్న నగ ఎక్కడ పోయిందో ఏమో "అంది బాధగా కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉన్నాయి.
"బాధపడకు కృష్ణవేణి వస్తే అడుగుదాం "అన్నాడు.
"అది రాను,ఒంట్లో నలతగా ఉంది." అని చెప్పిందండి.ఆ మాటకు రాజేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు.నగ పోయింది,కృష్ణవేణి రాలేదు.సందేహమే లేదు.కృష్ణవేణి తీసిందా!
ఆలోచిస్తున్నాడు.సరోజ ఏడుపు ఆగ లేదు.వెక్కి వెక్కి ఏడుస్తుంటే "సరోజా ! ఏడవకు ,ఇది చాలా సున్నితమైన విషయం నగ దొరుకుతుంది,నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి వస్తాను .ఎవరిని అనుమానించటం భావ్యం కాదు.నిజానిజాలు పోలీసులే తేలుస్తారు "అని భార్యను ఓదార్చి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.జరిగిన విషయం అంతా ఇన్స్పెక్టర్ వినోద్ కు చెప్పాడు.వాళ్ళింటికి ఎవరెవరు వచ్చింది విడమర్చి చెప్పాడు.
"కృష్ణవేణి ఎంతకాలం నుంచి మీ ఇంట్లో పని చేస్తుంది?"ప్రశ్నించాడు వినోద్.
"దాదాపు ఆరు సంవత్సరాలు నుంచి".
"నగ ఎప్పుడు పోయింది".
"నిన్న సాయంత్రం".
"కృష్ణవేణి పనికి వస్తోందా!"
"రాలేదు నలతగా ఉందని ఫోన్ చేసింది".
"ఐసీ" అన్నాడు వినోద్.
"నిర్మల ఎవరు?"
మా కింది ఇంటిలో అద్దెకు వుండే ఆయనకు స్వయానా చెల్లెలు. ఆయన స్టేట్ బ్యాంకులో ఉద్యోగి."
"వాళ్ళు ఎక్కడ వుంటారు".
"శాస్త్రి నగర్ లో"
"ఓ.కే" అన్నాడు వినోద్.
కంప్లెయింట్ విన్నాక"రాజేశ్వరరావు గారు మీ ఆవిడ నగ విషయంలో మేము పరిశోధన సాగిస్తాం.నమ్మకంగా పనిచేసే వాళ్ళని మనం అనుమానించలేం.కానీ మా పరిశోధన అన్నీ కోణాలలో కొనసాగుతుంది " అన్నాడు వినోద్.
"సరే సర్ ఎలాగైనా నగ దొరికేటట్లు చేయండి.మా ఆవిడ చాలా ఇష్టపడి చేయించుకుంది".అని చెప్పి వెళ్ళాడు.
"లక్ష్మయ్య గారు "అని పిలిచాడు హెడ్ కానిస్టేబుల్ ను.
"సార్" అంటూ వచ్చాడు లక్ష్మయ్య.
విషయం అంతా వివరించాడు లక్ష్మయ్య కు.
"ఒకే సార్ నేను కూడా తగిన వివరాలు సేకరిస్తాను" అన్నాడు.
****** ****** ****** ******
లక్ష్మయ్య కృష్ణవేణి ఇంటి దగ్గర కాపు కాచాడు.కృష్ణవేణి,ఆమె భర్త ఆటోలో వెళ్ళారు. ఆటోను వెంబడించాడు లక్ష్మయ్య.
ఓ బంగారం షాప్ ముందు ఆటో ఆగింది.ఓ అర గంటలో ఎదో తీసుకుని వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళారు. వారినే అనుసరిస్తున్నాడు లక్ష్మయ్య.ఓ మెడికల్ షాప్ లో మందులు తీసుకుని మళ్ళీ ఆటో లో వెళ్ళారు. లక్ష్మయ్య ఆలోచనలో పడ్డాడు.ఈ విషయం ఎస్సైకి చెబుదామని వెళుతుండగా ఓ ఇంటిలో నుంచి రాజేశ్వరరావు రావడం చూశాడు. దగ్గరకు వెళ్ళి ఆ ఇల్లు చూశాడు.మాలిని బ్యూటీ క్లినిక్ అని బోర్డ్ ఉంది. ఆయనకు ఇక్కడ ఏమి పని అనుకుని ఎస్సై ఇంటికి వెళ్ళాడు.
"సార్ కొన్ని విషయాలు తెలిశాయి. కృష్ణవేణి బంగారం షాప్ కు,మెడికల్ షాప్ కు వెళ్ళడం, రాజేశ్వరరావు ఓ ఇంటి నుంచి బైటకు రావడం చెప్పాడు.
"మరి ఆ నిర్మల విషయం ఏమిటి?"
"వాళ్ళ పాప కు ఆరోగ్యం బాగలేక వాళ్ళు ఆసుపత్రి గొడవ లో ఉన్నారు."చెప్పాడు లక్ష్మయ్య.
"అయితే ఎవరు నగ కాజేసి ఉంటారు "ఆలోచనలు పలు విధాలుగా తోస్తున్నాయి వినోద్ కి. సిగరేట్ ముట్టించి "లక్ష్మయ్యగారు "అని పిలిచాడు.
"సార్ చెప్పండి "అన్నాడు.
"కృష్ణవేణి వెళ్ళిన బంగారం షాప్ కు వెళదాం " అన్నాడు.
"ఒకే సార్ "అన్నాడు లక్ష్మయ్య.
ఇద్దరూ కృష్ణవేణి వెళ్ళిన బంగారం షాప్ కు వెళ్ళారు. షాప్ సేట్ కు పరిచయం చేసుకుని
బంగారం రేట్ ఎలావుంది ?అని మాట్లాడి,ఇందాక ఆటోలో వచ్చిన వారి గురించి వాకబు చేశాడు.
"ఆమె మా కస్టమర్ ,చాలా నిజాయితీ పరు రాలు,వాళ్ళ పాప కు ఎదో చైన్ కావాలి అనుకుని,ఎందుకో వద్దని కాలి పట్టీలు మాత్రం తీసుకుంది.నెల నెలా డబ్బు కడుతుంది.మాకు నమ్మకం "అన్నాడు సేట్.
సరే అనుకుని అక్కడ నుంచి వెళ్ళారు ఇద్దరూ.
వినోద్ ఆలోచనలు మెదడును తొలుస్తున్నాయి. "ఐడియా" అన్నాడు ఒక్కసారి. లక్ష్మయ్య ను పిలిచి ,"రాజేశ్వరరావు వెళ్ళిన అఇంటికి రహస్యంగా వెళ్ళి చూడాలి ".అన్నాడు.
లక్ష్మయ్య నవ్వుతూ "ఆ ఇల్లు బ్యూటీ క్లినిక్ సార్ "అన్నాడు.
"అక్కడే పని ఉంది " అని ఆరోజు రాత్రి పదకొండు గంటలకు వెనుకవైపు నుంచి చప్పుడు కాకుండ వెళ్ళి కిటికీ లోకి తొంగి చూశాడు వినోద్.లోపల ఏవో మాటలు వినిపిస్తున్నాయి. చెవులు రిక్కించాడు వినోద్.
"మనం ఇక్కడ ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు.తెల్లవారుజామునే మూడు గంటలకు ఇది ఖాళీ చేయాలి.ఆ గదిలోని మగవాళ్ళని వెళ్ళమని చెప్పండి.మన విషయం పోలీసులకు తెలిసినట్లు ఉంది.వెంటనే డబ్బు,నగలు ప్యాక్ చేయండి " అన్నాడు ఆ వ్యక్తి ఆమెను ఉద్దేశించి.
ఆమె పాన్ నములుతూ "అలాగా "అంటూ తన మెడలోని నగ ను తీసి ఓ పెట్టె లోపెట్టింది.ఆ నగ ను చూశాడు వినోద్.ఆవిడ వయసు నలభై లోపు ఉంటుంది.ఆ నగ ను చూడగానే ఎదో స్ఫురించి బైటకు వచ్చారు ఇద్దరూ. తీగ లాగితే డొంక కదిలింది.ఇది బ్యూటీ క్లినిక్ కాదు.బ్రోతల్ హౌస్.దొంగ ఎవరో దొరికాడు లక్ష్మయ్య కుచెప్పాడు .
సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటలకు బ్రోతల్ హౌస్ నుంచి బైటకు వచ్చారు ఓ ఆడ, మగ వారి చేతులలో సూట్ కేసులు ఉన్నాయి.వాళ్ళ వెనకాలే కొందరు ఆడవాళ్ళు
కార్ కదులుతుండగా కార్ ను చుట్టు ముట్టాడు ఎస్సై వినోద్ తన కొనిస్టేబుల్స్ తో.
******* ****** ****** ******
ఉదయం ఏడు గంటలకే నగ తో రాజేశ్వరరావు ఇంటికి వచ్చాడు వినోద్.అతని చేతిలో నగ ను చూడగానే "సార్ ఇది నాదే ఎలా దొరికింది "అని ఆశ్చర్య పోయింది.
"ఏమండీ నా నగ దొరికింది ఇటు రండి "అని కేక వేసింది సరోజ.రాజేశ్వరరావు వినోద్ ను, ఆ నగ ను చూసి ఆశ్చర్యపోయాడు.భార్య వైపు బిత్తర చూపులు చూస్తున్నాడు.
"నగ ఎవరు దొంగిలించారు సార్ " అడిగింది సరోజ.
"అమ్మ మీ నగ దొంగిలించింది మీ వారే " అనగానే, ఆ ..అంటూ నోరు వెళ్ళబెట్టి,హతశు రాలైంది సరోజ.ఆ మాట నమ్మలేక పోతోంది.
"మీ వారు ఆ నగ ను ఓ బ్రోతల్ హౌస్ నడిపే ఆమెకు ఇచ్చారు. మొదట్లో అది బ్రోతల్ హౌస్ అని మేము నమ్మలేదు.విచారిస్తే ఆ నగ తోపాటు డబ్బులు,అన్యాయంగ ఇరుక్కున్న కొంతమంది అమ్మాయిలు దొరికారు" చెప్పాడు వినోద్.
సరోజ కు అర్థమైంది. పింఛన్ డబ్బులు ఎందుకు ఖర్చు అయి పోతున్నాయో,ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి చీ.. చీ అనుకుని" వినోద్ చేతులు పట్టుకుని "మాది గౌరవ కుటుంబం, ఆయన్ను మన్నించండి.ఇలా చేస్తాడని ఊహించలేదు.అనుమానాలు ఎక్కడెక్కడికో దారి తీశాయి,ఈ విషయం పేపర్ లో రాకుండా చూడండి "అంది బతిమలుతూ.
"మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ మీ ఆయన,మీ నగ వలన అమాయకులైన అమ్మాయిలు బతికి పోయారు.వారి జీవితం
నిలిచింది.ఆయన చేసింది మన్నించరాని నేరం,అయిన ఇది మిగతవారికి గుణపాఠం."
ఎస్సై చెబుతుంటే తల దించుకున్నాడు రాజేశ్వరరావు.
"మిస్టర్ రాజేశ్వరరావు! ఇంకేప్పుడు ఇలాంటి
పనులు చేయకండి "అని గట్టిగా హెచ్చరించి వెళ్ళాడు వినోద్ నగ ను రాజేశ్వరరావు కుఅందిస్తూ.
"నన్ను మన్నించు " అంటూ చేతులు కట్టుకుని కట్టుకుని నిలబడ్డాడు . మౌనం వహించింది సరోజ వెనక్కి తిరిగి.
రాజేశ్వరరావు "సారి అంటూ నగను ఆమె మెడకు అలంకరించాడు.తన నగ దొరికి నందుకు సంతోషించ లేదు.భర్తతో మార్పు వచ్చినందుకు సంతోషించి చేయితో నగ ను తడుముకుంది.