నదీతీరంలో ఉన్న వటవృక్షం కింద ఒక మునీశ్వరుడు నడుముకు గావంచా చుట్టుకుని తపస్సుకు కూర్చున్నాడు. ఆ చెట్టు మీద అనేక రకాల పక్షులు నివాశ ముంటున్నాయి. వాటిలో కాకి కూడా ఉంది. పక్షి జాతులన్నిటిలో కాకికి ఉన్న వక్రబుద్ధి మరే పక్షికీ లేదు.పరి శుభ్రంగా ఉన్న ప్రదేశాల్ని మలినం చెయ్యడం మఖ్యంగా తెల్లని వస్తువుల్ని కలుషితం చెయ్యడం దాని నైజం. చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి చూసి తన దుష్టబుద్ధి అమలు చెయ్యాలనుకుంది.సరిగ్గా ముని నెత్తి మీద పడేలా రెట్ట వేసింది. పైకిచూస్తాడనుకుంది.ఎటువంటి చలనం లేదు.కాకికి ఉక్రోషం వచ్చింది. కాకికి పట్టుదల పెరిగి ఎలాగైనా రుషి తపస్సు భంగం చెయ్యాలనుకుంది. మళ్లీ రెట్ట వేసింది. ముని మౌనంగా ఉన్నాడు.తన పక్క కోపంగా చూసి చెయ్యి విసురుతాడనుకుంది కాకి. ఏమీ జరగ లేదు. కాకి కావాలని రోజూ ముని శిరస్సు మీద దుర్ఘంధ పూరిత మలిన రెట్టలు వేస్తూనే ఉంది. ముని శరీరం మీద రెట్టలన్నీ కుప్పలుగా మారి క్రిములు పుట్టి పెరుగుతున్నాయి.వాటిని తినడానికి అనేక పక్షులు ముని చుట్టూ సంచరిస్తున్నాయి. ఆయన ఏకాగ్రత చెదర లేదు. కాకిలో మునీశ్వరుని మీద కక్ష పెరిగింది. ముని ముఖం , భుజాలు , వీపు అలా శరీరం అంతా రెట్టలతో నింపేసింది. ముని మాత్రం ప్రశాంతంగా తపస్సు కొనసాగిస్తున్నాడు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న రుషిని చూసి చెట్టు పైన ఉన్న మిగతా పక్షి సముదాయంలో రామచిలుకలు వంటివి ఆహారంగా రకరకాల ఫలాలు తెచ్చి పెట్టి సాయం చేస్తే దుర్భుద్ది కాకి మాత్రం ఆయన తపోభంగానికి భుజాల మీద వాలి చెవుల దగ్గర బిగ్గరగా అరిచి గోల చేసేది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తపస్సును ఆటంక పరచ లేకపోయింది కాకి. రోజులు గడుస్తున్నాయి.కాకి ముసలిదై ఆరోగ్యం క్షీణించి ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితి కొచ్చింది. ఒకరోజు మునీశ్వరుడు తపస్సు ముగించి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలో తల నుంచి పాదాల వరకు శరీరమంతా కాకి వేసిన మలిన రెట్టల్ని నీటీతో శుభ్ర పరచుకుని ప్రకాశ వంతమైన శరీర కాంతితో చెట్టు దగ్గరకు వచ్చాడు. ముసలితనంతో నీరసించి ఉన్న కాకి పశ్చాత్తాపంతో ముని దగ్గరకు వచ్చి చెట్టు మీదున్న ఇతర పక్షులు పళ్లు ఫలాలు తెచ్చి తపస్సుకి సహకరిస్తే, తను మాత్రం దుర్భుద్ధి దుశ్చేష్టలతో బాధ కల్గించానని వాపోయింది. తన తప్పుల్ని మన్నించమని వేడుకుంది. ముసలి కాకి దీనావస్థను చూసి ముని ఓదారుస్తూ " నీ సహజ నైజంతో వ్యవహరించి నాకు మేలే చేసావు. రోజూ నువ్వు నా శిరస్సు, శరీరంపై వేసిన మలిన రెట్టలు కుప్పలుగా మారి కీటకాలు పుట్టి కొన్ని పక్షుల ఆకలి తీరింది. దాని వల్ల నాకు పుణ్య ఫలం దక్కింది. నా శరీరానికి లేపనంగా మారి చలి వేడి నంచి రక్షణ కల్గింది. అందువల్ల నీ చేస్టల వల్ల నాకు మంచే జరిగింది. నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నీకొక వర మిస్తున్నాను. భూమండలం మీద మనుషులు జరిపే పితృ కర్మల్లో పిండ ప్రధానాలు తినడానికి మీ కాకి జాతినే ఆహ్వానిస్తారని ఆశీర్వదించి వెళిపోయాడు. చూసారా, బాలలూ! అపకారం చేసిన కాకికి మునీశ్వరుడు కోపగించుకోకుండా ఉపకారం చేసాడు. కాబట్టి తప్పు చేసిన వార్ని క్షమించి వారిలో మార్పు తేవాలి. * * *