చంద్రుడి సలహా విజయపురి రాజ్యానికి రాజు చక్రసేనుడు. ఆ రాజ్యప్రజలు పొరుగురాజ్యానికి వెళ్ళాలంటే అడవిమార్గం చాలా దగ్గరగా ఉంటుంది.ప్రజలు ఆదారివెంట కాలినడకన వెళ్ళేవారు. ఒకరోజు ఆదారిన వెడుతున్న కొందరు కనిపించకుండా పోయారు. ఆరోజునుండి ఆదారిన వెళ్ళేవారు మాయమవుతున్నారు. రాజుకు పిర్యాదులు అందాయి. ఈరహస్యం తెలుసుకోవడానికి రాజు కొందరు భటులను పంపాడు.భటులుకూడ కనిపించకుండా పోయారు.ఈరహస్యం ఛేదించిన వారికి ఐదు లక్షల వరహాలు బహూకరిస్తానని రాజు ప్రకటించాడు. కొందరు మెరికల్లాంటి యువకులు రాజు అనుమతి తీసుకుని అడవిమార్గంలో వెళ్ళారు.నాలుగురోజులైనా వారి ఆచూకీలేదు. ఈసంఘటన రాజుకు అవమానంగా ఉంది. ఈపరిస్థితిలో సేనాధిపతి కుమారుడు చంద్రుడు రాజును కలిశాడు. చంద్రుడి తెలివితేటలు,శక్తిసామర్థ్యాలు సేనాధిపతి ద్వారా విన్న రాజు అతను అడవిలోకెళ్ళటానికి అంగీకరించాడు. చంద్రుడు ప్రయాణమై అడవి మధ్యకు చేరుకున్నాడు.అక్కడ ఓకోయగుంపు చుట్టుముట్టారు.వారికి లొంగిపోతే రహస్యం తెలుస్తుందని లొంగిపోయాడు. చంద్రుడిని బంధించి ఒక గుహలోకి తీసుకెళ్ళారు. అక్కడ నలుగురు యువకులు బంధీలుగా ఉన్నారు. చంద్రుడు కోయలనాయకుడితో "మేము మీకు శత్రువులం కాదు. మరి మీరు మమ్మల్ని ఎందుకుబంధించారు?" అన్నాడు. అందుకు కోయనాయకుడు "కొంతకాలం వరకూ అడవిలో మేము సంతోషంగా ఉండేవారం.ఈమధ్య ఒక రాక్షసుడు అడవిలో ప్రవేశించాడు. దొరికినవారిని దొరికినట్లు చంపసాగాడు. మేము వాడి వద్దకెళ్ళి,రాక్షసుడికి శ్రమలేకుండా రోజూ ఇద్దరిని ఆహారంగా గుహకు పంపుతామని ఒప్పందం చేసుకున్నాము. అడవిదారిన వెళ్తున్న వారిని బంధించి తెచ్చి, వాడికి ఆహారంగా అప్పగిస్తున్నాము"అన్నాడు. చంద్రుడు ఫక్కుననవ్వి "మీరు ఇలా ఎంతకాలమని వాడి ఆకలి తీరుస్తారు. ఇకముందు మా రాజ్యప్రజలు ఎవ్వరూ ఇటువైపు రారు. అప్పుడు బంధించడానికి మీకు ఎవరూ దొరకరు. అప్పుడు మీరే వాడి కి ఆహారంగా పోవలసి వస్తుంది. కొంతకాలానికి మీరెవరూ మిగలరు" అన్నాడు. "నీవు చెప్పింది నిజమే !మరి మేము ఏంచేయాలి?"అన్నాడు భయంగా కోయనాయకుడు. "వాడి ఆకారానికి, అరుపులకూ భయపడకుండా మీరందరూ కలిసికట్టుగా దాడిచేసి,వాడిని చంపాలి. ఐక్యమత్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని,ధైర్యాన్నిమించినది ఏదీలేదు. ఇవిఉంటే సాధ్యంకానిది లేదు" అన్నాడు చంద్రుడు. కోయనాయకుడు చంద్రుడి సలహా ప్రకారం విషాన్నితెప్పించి,బాణాలకు పూయించాడు.చంద్రుడి సారధ్యంలో కోయలు కలిసికట్టుగా ముందుకు కదిలారు. గుహలోని రాక్షసుడిని చుట్టుముట్టారు. కన్నుమూసి తెరిచేలోగా వందలసంఖ్యలో విషపుబాణాలు రాక్షసుడి శరీరాన్ని తూట్లుచేశాయి.రాక్షసుడు మరణించాడు. కోయలు తమ తెలివితక్కువతనానికి సిగ్గుపడ్డారు.చంద్రుడు తెలివైన సలహాతో రాక్షసుడి పీడ వదిలించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. చంద్రుడు నలుగురు యువకులనూ తీసుకుని రాజ్యానికొచ్చాడు. జరిగినవిషయాలు రాజుకు చెప్పాడు. చక్రసేనుడు చంద్రుడి నేర్పును, ధైర్యసాహసాలను అభినందించాడు. ఐదులక్షలవరహాలతోపాటు తన ఆస్థానంలో పదవినిచ్చి సత్కరించాడు.