"వెన్నముద్దల కళ్యాణం" - కొత్తపల్లి ఉదయబాబు

Vennamuddala kalyanam

హైదరాబాద్ లో వర్షాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల లో మిగతా ప్రాంతాలకన్నా ఋతుపవనాల రాకతో పది పదిహేను రోజుల ముందుగానే వర్షాలు ప్రారంభం అవడం పరిపాటి. తెల్లవారకుండానే పెద్ద వర్షం కురిసి తగ్గి దాని తాలూకు విపరీత చల్లని వాతావరణం రాజ్యమేలుతోంది. మబ్బులు ఎపుడు అనుమతిస్తాయా...ఎపుడు బయటకి వద్దామా అన్నట్లు తూర్పున ఉదయభానుడు దోబూచులాడుతున్నాడు.గాలి విసురు తగ్గడంతో చేతిలోని వార్తా పత్రికతో బాల్కనీలో కి వచ్చారు చక్రధరం గారు. అక్కడ సిద్దం గా ఉన్న కేన్ క్రాడిల్ లో మెత్తని దిండుపై కూర్చుని యధాలాపంగా గోడ అవతల తమకు పక్కగా ఉన్న అపార్ట్ మెంట్ కేసి చూసారు ఆత్రుతగా. చందన ఇంకా బయటకు రాలేదు.కానీ లోపలనుంచి ఏవేవో వస్తువులు విసిరేస్తున్నట్టు చప్పుడు వినిపిస్తోంది.అంతలో బాల్కనీ తలుపు విసురుగా తెరుచుకుని చేతిలోని గ్లాస్ ను బలంగా విసిరికొట్టింది చందన.స్టీల్ గ్లాస్ బాల్కనీ గ్రిల్స్ కి తగిలి శబ్దం చేస్తూ పడిపోయింది...చందన తల్లి చూపుడు వేలు చూపిస్తూ చందన ని హెచ్చరిస్తోంది...”నువ్విలాగే అల్లరి చేస్తే స్కూల్ కి పంపిచేస్తాను.అక్కడ అపర్ణ టీచర్ నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి ఇచ్చేస్తారు..అన్నం పెట్టరు...తప్పు...అల్లరి చెయ్యకూడదు.” అని కిందపడిన స్టీల్ గ్లాస్ తీసుకుని లోనికి వెళ్ళబోతూ ఎదురుగా బాల్కనీలోంచి ఆత్రుతగా చందనని చూస్తోన్న చక్రధరం గారిని పలకరించింది “ హలో అంకుల్ గుడ్ మార్నింగ్ ” అని... “శుభోదయం . ఏమిటమ్మా ...ఈవేళ పొద్దునే మారాం చేస్తోందా....” అడిగారాయన క్రాడిల్ దిగి బాల్కనీ గ్రిల్స్ దగ్గరగా వచ్చి. “ అవునంకుల్ ..ఈవేళ బాగా హైపర్ గా వుంది.. రాత్రి సరిగా నిద్రపోలేదు.దానితో తిక్క పెడుతోంది.నేను ఆఫీస్ కి తయారవుతున్నాను...మీరు కొంచం గమనిస్తూ ఉండండి అంకుల్..ప్లీజ్...” “తప్పకుండా అమ్మా...హాయ్ చందు గాడూ...గుడ్ మార్నింగ్” అని పలకరించారు చందనని ఆయన....సాల్యూట్ చేసినట్టు చేయి పైకెత్తి ఆయనకేసి చూసి నవ్వింది చందన .చందన తల్లి లోపలి వెళ్ళిపోయిన వైపు చూపిస్తూ “అమ్మ...వూ..వూ..” అని తల్లి తనని బెదిరించిందన్న విషయాన్ని నేరంగా చెప్పినట్టుగా... “అమ్మకు నేను చెబుతాగా...నువ్వు ఆడుకో తల్లి యు ఆర్ గుడ్ గర్ల్ ......” అన్నారాయన అనునయంగా.. చందన బాల్కానీ లో ఆటలో ములిగిపోయింది ...ఒక పక్కన వార్తాపత్రిక చదువుతూనే ఆయన అపుడపుడు ఒక చూపు చందన వైపు వేస్తూనే ఉన్నారు. అయితే ఈ సారి ఆ చూపు చూసేసరికి ఎపుడు ఎలా తీసేసిందో...బాల్కనీ కి ఉన్న చిన్న గేటు తేసేసి అందులోంచి సరిగ్గా ఆ గేటు కిందనున్న ఏ.సి. కంప్రేషెర్ ఫ్యాన్ మీదొక కాలు వేసి హి..హి...అని నవ్వుతూ ఆయన్ని రెచ్చగొడుతోంది. చక్రధరం గారికి ఒక్కసారి చమటలు పట్టేసాయి.అక్కడనుంచి 30 అడుగుల లోతున గల నేల మీద పడిందంటే ఇంకేమైనా ఉందా.. చందన తల్లిని పిలిచేతంట సమయం లేదు.వెంటనే కర్తవ్యమ్ గుర్తుకు వచ్చిన వాడిలా “అపర్ణా టీచర్” అని అరిచారు... చందన వెంటనే గబగబా బాల్కనీ లోకి దిగిపోయి విసురుగా చిన్న గేటు వేసేసి...పిట్టగోడ కిందకు దాక్కోంది. ఆయన అరచిన అరుపుకు చందన తల్లి బాల్కనీ లోకి వచ్చి “ ఏమైంది అంకుల్ అంత అరుపు అరిచారు?” అంది కూల్ గా. “అమ్మా.. హరితా..ఒక్క క్షణం లేటైతే చందన మనకి దక్కేది కాదు” అని జరిగింది చెప్పారు. “అయ్యో..నామతి మండా...నిన్న రాత్రి ఏ.సి. రిపేర్ వచ్చి ఈ చిన్న గేటు తాళం తీసానంకుల్.వెయ్యడం మర్చిపోయాను..చాలా థాంక్స్ అంకుల్.ఈవేళ దానిని మీరే కాపాడారు.మీ ఋణం ఎలా తీర్చుకోను అంకుల్?” హరిత కళ్ళు చమర్చాయి.. “తప్పమ్మా..ఉదయమే పండంటి పిల్లలున్న తల్లి అలా కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు.జాగ్రత్త అమ్మ...నాకు ఇంకా చమటలు ఆరలేదనుకో..జాగ్రత్తమ్మా..ఉంటాను”అని ఆయన న్యూస్ పేపర్ తో లోపలి వెళ్ళిపోయారు. హరిత నిట్టూర్చి చందనను తీసుకుని లోపలి నడిచింది. హరిత రైల్వే లో పనిచేస్తోంది.ఆమె భర్త వినోద్ ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తున్నాడు.ఇద్దరు పిల్లలు.అమ్మాయి చందన అబ్బాయి రుషి.చందన చిన్నతనంలో ఏడాది లోగా నడక నేర్చి ‘తాతా’ ‘అత్తా’లాంటి మాటలు మాట్లాడేది.చంటి పాపతో రెండంతస్తుల డాబా లో పైన ఉండేవారు.పాప పుట్టకా తన సంరక్షణ కోసం పన్నెండేళ్ళ పని పిల్లని పెట్టుకున్నారు.ఒక రోజు ఆఫీసు లో ఉండగా పనిపిల్ల పాప పడిపోయిందని మాట్లాడటం లేదని కంగారుగా ఇంటివాళ్ళ సాయంతో హరితకు వినోద్ కు ఫోన్ చెయ్యడం...డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడం...పాప కు మాట రాకపోవడం..చివరకు 80 శాతం డిజేబుల్ చైల్డ్ గా మిగిలిపోవడం జరిగింది.చందన కోసం ఆ దంపతులు మొక్కని దేవుడు లేడు...చేయించని వైద్యమూ లేదు. చందనకి 5 సంవత్సరాలు వచ్చాయి. మరో బిడ్డకోసం ప్రయత్నం చేద్దాం అన్నాడు వినోద్...ఆ పుట్టే బిడ్డ కూడా ఇలాగే పుడితే భరించే శక్తి తనకు లేదని...కళ్ళ నీళ్ళు పెట్టుకుంది హరిత. ‘ అలాగే ఎందుకనుకోవాలి? పాప మనకి సవ్యంగా అందరి పిల్లల్లాగే పుట్టింది.మన గతజన్మ పాపమే దానిని అలా చేసింది..చెడు ఎండుకు ఆలోచించడం? మంచిగా జరుగుతుందనే అనుకుందాం.ఒక వేళ అలా జరిగితే పాపకి ఆ బిడ్డ తోడుగానూ ఉంటుంది...మనకు ఆబిడ్డ వలన కాస్త మనస్సాంతి లభిస్తుంది..’ అని ఓదార్చిన మీదట హరిత రెండవ కాన్పుకు ఒప్పుకుంది.రుషి మామాలుగా పుట్టాడు...చలాకీగా పెరుగుతున్నాడు...’అక్కకు నువ్వే భరోసా నాన్నా’ అని చిన్నప్పటినుంచి చెవిని ఇల్లు కట్టుకుని పోరడం తో అక్కను ఏంతో ప్రేమగా చూసుకుంటాడు. చందనకు కూడా రుషి అంటే పంచ ప్రాణాలు. తండ్రి, తమ్ముడు తప్ప మరో మరెవరైనా మగవాడు ఆమెను ముట్టుకోవాడానికి ప్రయత్నిస్తే వెర్రి అరుపులు అరిచేసి కొట్టేస్తుంది...ఆమెకు బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, కమ్యునికేషన్ స్కిల్ల్స్ చెప్పే బధిరుల పాటశాలలో చేర్పించాకా కొంతవరకు నయం. రుషి పుట్టాక ఇపుడు ఉంటున్న అపార్ట్ మెంట్ కొనుక్కుని అందులోకి వచ్చేసారు. అపార్ట్ మెంట్ లో ఎందఱో విసుక్కున్నా... చక్రధరంగారు విషయం అర్ధం చేసుకుని చందన పట్ల ఏంతో సానుభూతి గా ఉంటారు.ఇంట్లోకి వచ్చిన నెలరోజులకే చందన విషయం తెలిసి చూడటానికి వచ్చి ఎన్నో సలహాలు సూచనలు చేసారాయన. తల్లిదండ్రుల విరక్తి భావాన్ని అర్ధం చేసుకుని ‘ మీకు ఎలాంటి సహాయం కావలసినా నన్ను అడగండి బాబు.ఇక నుంచి చందన నా మనవరాలు’ అంటూ వెంట తెచ్చిన ఎన్నెన్నో బొమ్మలు స్వీట్లు అందించి వెళ్లారు. వెళ్ళబోతూ ఆయన చందన తలనిమిరి ఎదో గొణుక్కుంటూ వెళ్ళిపోవడం హరిత చూపును దాటిపోలేదు. ఇపుడు చందన వయసు 16 సంవత్సరాలు...మానసిక పరిపక్వత లేని ఆమెకు శారీరక పరిపక్వత మాత్రం ప్రకృతి ధర్మమా అని పుష్కలంగా వచ్చేసింది...ఆమెను మానసిక రోగుల పాఠశాలలో ఉపాద్యాయుల బోధన వల్ల, ఆకలి వేస్తె సైగలతో చెప్పడం, శుచి, శుభ్రత లు పాటించడం వంటి చర్యలతో పాటు కంప్యూటర్ లో కొన్ని బొమ్మలు గీయడం వరకు పరిపూర్ణత సాధించిందనే చెప్పాలి. హరితకు చెప్పేసిగదిలోకి వచ్చిన చక్రధరంగారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు...అభం శుభం ఎరుగని చిన్నపిల్ల...తల్లి తండ్రులు ఉన్నంతకాలం అపురూపం గా చూసుకుంటారు...తర్వాత వాళ్ళ జీవితం........??? ఆయనకు కృతి గుర్తుకు వచ్చింది..క్రుతి ఆయనకు ఒక్కగానొక్క కూతురు.తర్వాత అనిరుద్ కొడుకు...అనిరుద్ అమెరికాలో చదువుకోసం వెళ్లి హైదరాబాద్ లోని పారిశ్రామిక వేత్త గారి అమ్మాయిని అక్కడే ప్రేమించి తమ అందరి అనుమతి తో వివాహం చేసుకున్నాడు.ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకి తెలుగు నేర్పించి సంగీతం ఒకరికి, నాట్యం మరొకరికి నేర్పించి ‘నాటా’ అసోసియేషన్ కార్యక్రమాలలో అపుడపుడు ప్రదర్సన ఇప్పిస్తుంటాడు. ఆ ఫోటో లు పంపినప్పుడల్లా ఆయనకు ఎంతో ఆనందంగాను గర్వంగాను ఉంటుంది. భారతదేశంలో పుట్టి విదేశీ గడ్డమీద మన సంస్కృతీ సంప్రదాయాలు నిలబెడుతూ మాతృ భాషా వారు చేస్తున్నకృషికి పన్నెండేళ్ళ పిల్లల విభాగం లో ఎన్నో గౌరవ సత్కారాలు పొందిన ఆ మనుమరాల్లను ఇద్దరినీ చూస్తున్నప్పుడల్లా చాతీ రెండంగుళాలు ముందుకు వచ్చి...ఆయన కోరమీసాన్ని సగర్వంగా మేలితిప్పుతుంది కుడిచెయ్యి. అలాగే గారాబంగా పెంచుకున్న కృతి కూడా తన నడవడికలోనే పెరిగిందనుకున్నాడు గాని... ఎవరో వూరు పేరు లేని అనాధ ‘వికాస్’ అనే అతన్ని ప్రేమించి తాను అన్ని విషయాలు తెలుసుకునే లోపలే ఇంట్లోంచి లేచిపోతుందని ఊహించలేదు. ఆనాడే తనమనసులో కూతురికి సమాధి కట్టేసినా...ఏ ఆడపిల్లని చూసినా ‘ఈపాటికి ఇద్దరు మనవల్ని కని ఉంటుంది...ఎక్కడుందో ఎలా ఉందొ నా పిచ్చితల్లి...’అని ఈ మధ్య బాధపడకుండా ఉండలేకపోతున్నాడు.ఇంట్లో ఎవరైనా ఆమె పేరెత్తితే వారి పాలిట చండశాసనుడైన తనకు ఈ వృద్దాప్యం లో ఆమె దగ్గరుంటే ఏంటో ఓదార్పుగా ఉండేది అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది..అలా ఆమె తలపుకి వచ్చినప్పుడల్లా ఆయన గుండెల్లో అగ్నిపర్వతం పేలి దుఖం లావాలా చిమ్ముతూనే ఉంటోంది. అలా మనసులో బాధ కలిగినప్పుడల్లా ఆయన దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్తుంటారు.ఎలాంటి కలత ఉన్నా శ్రీరాముని దర్శనం చేసుకుంటే మనస్సాంతి లభిస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆరోజు చందన ఎ.సి. కంప్రేషర్ ఫ్యాన్ మీద కూర్చున్న దృశ్యం ఆయనకు మరీ మరీ గుర్తుకు వచ్చి మనసు తల్లడిల్లిపోసాగింది. ఆ ఎత్తునుండి ఆ పాప పడిపోయి ఉంటె...? అన్న ప్రశ్నే ఆయన కళ్ళు , మాటిమాటికీ చమర్చేలా చేస్తోంది. సాయంత్రం నెమ్మదిగా రామాలయం వైపు బయల్దేరారు. దారిలో ఎవరైనా గృహిణి కనిపిస్తే కృతి, ఆడపిల్లలు కనిపిస్తే చందన గుర్తురాసాగారు.తెలిసిన వాళ్ళ పలకరింపుల మధ్య ఆయన రామాలయం చేసుకున్నారు. పూజారి ఆచార్యులవారు దగ్గరకు రాగానే “గోత్రాలు తెలీదు గురువుగారూ...కృతి, చందన వీరిద్దరి పేర అష్టోత్తర పూజ చేయండి “ అన్నారు...పూజ జరుగుతున్నంతసేపూ ఎదో మూగ బాధ ఆయన మనసును మేలి పెడుతూనే ఉంది. మాటిమాటికీ కళ్ళు కండువాతో తుడుచుకుంటూనే ఉన్నారు. మనస్పూర్తిగా స్వామీ దర్శనం ముగించుకున్నాక తెలిసున్నాయన పలకరించడంతో ఆయనతోపాటు ఆలయానికి రెండో వైపుకు వచ్చారాయన.ఆయన మాట్లాడి వెళ్ళిపోయినా తర్వాత పార్క్ కనబడింది ఆయనకు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. నెమ్మదిగా పార్క్ లోకి దారితీసి తనకిష్టమైన తురాయి చెట్టు కింద బెంచీమీద కూర్చున్నారు.సాధారణం గా అక్కడ బెంచీమీద ఎవరూ కూర్చోరు. లోపలగా ఉండటం తో అక్కడ కూర్చున్నవారికి అందరూ కనిపిస్తారు గానీ ప్రత్యేకించి చూస్తె తప్ప అక్కడ ఎవరున్నారో కనిపించరు. అలా కూర్చుని అక్కడకు వస్తున్నా పెద్ద చిన్న వాళ్ళందరినీ గమనించడం ఆయనకు ఇష్టం. ఎన్ని వేల రౌండ్లు ఆ ట్రాక్ చుట్టూ మార్నింగ్ వాక్ టైం లో తిరిగాడో లెక్కే లేదు. చీకటి పడుతోంది..పార్క్ లో జనాలు ఈవెనింగ్ వాక్ పూర్తిచేసుకుని వెళ్ళిపోతున్నారు. పార్క్ పలచబడ సాగింది. అప్పటివరకు దూరంగా బెంచి మీద కూర్చున్న ఒక జంట నెమ్మదిగా దగరకు జరిగింది.వాళ్ళ ముఖాలు దగ్గరవ్వడం ఆ మసక వెలుతురులో అస్పష్టంగా కనిపిస్తోంది.. లోకం మారిపోయింది.జనాలకి భయం భక్తీ...పెద్దంతరం, చిన్నంతరం...లేదు.వావి వరుస లేదు. మానవీయ విలువలు క్రమేపీ నశిస్తున్నాయి. ఆపిల్లలిద్దరినీ వాళ్ళ తల్లి దండ్రులు ఈ క్షణంలో చూస్తె ఎలా ఉంటుంది పరిస్తితి? అంత తీరిక ఆ తల్లికేక్కడిది...ఈ టైం లో ఉత్కంటగా సాగే టీ.వీ. సీరియల్స్ లో మునిగి ఉంటుంది.తండ్రి మరో పది తరాల సంపాదనకోసం అది దొరికే చోట లావాదేవీలు సాగిస్తూనే ఉంటాడు. ఆడపిల్ల టైం ప్రకారం ఇంటికి వస్తోందా లేదా.. ఏం చదువుతోంది..ఎలా చదువుతోంది...ఆమె స్నేహితులేవరు? ఎలాంటివాళ్ళు? ఇవన్ని తెలుసుకునే తీరిక కన్న తల్లి దండ్రులకే లేవు. అసలు పెళ్లి విదివిదానాలే మారిపోయాయి. ఆ రోజుల్లో తను స్కూల్ పైనల్ పాసయ్యాడు.ఇంకా ఉద్యోగం రాలేదు.సెలవలకు అమ్మమ్మగారింటికి ఎలమంచిలి వెళ్ళాడు. పక్కింట్లో పాతసినిమాలో 8 సంవత్సరాల పిల్లలా తలకు నూనె పెట్టి నొక్కి దువ్వి ఒంటి జడవేసి జడగంటలు పెట్టి పట్టు పరికిణీ జాకేట్టుతో బాలా త్రిపుర సుందరి లా మెరిసిపోతున్న అమ్మాయిని వీలైనప్పుడల్లా ఆట పట్టించేవాడు. ఆఅమ్మాయి ఇంట్లో పిర్యాదు చేసేది.వాళ్ళ పెద్దవాళ్ళు తన అమ్మమ్మతో చెప్పేవారు. ‘ అలా ఆడపిల్లని ఏడిపించడం తప్పురా వెధవన్నా..’ అని అమ్మమ్మ మండలించేది. ఒకరోజు ఆ అమ్మాయి దోర జామకాయ తింటోంది. ‘ నాకు పెట్టావా... ‘ అని అడిగాడు... ‘నన్ను ఎడిపిస్తావ్ గా..నీకు పెట్టను పో..’ అని ముఖం తిప్పుకుంది బింకంగా..తనకి దొరజామకాయాలంటే చచ్చెంత ఇష్టం. ఆ ఆమ్మాయి చేతుల్లోనించి బలవంతంగా లాక్కుని కొరికేసి ‘ఇపుడు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో పో’ అని ఎంగిలి కాయని ఆ అమ్మాయి చేతి లో పెట్టాడు తను. ఆ అమ్మాయి కాయని తనమీదకి విసిరేసి..’నీపని చెబుతానుండు.’ అని ఏడుస్తూ వెళిపోయింది. ఏమ్జరుగుతుందో చూద్దామని తను అక్కడే ఆసక్తి గా నిలబడ్డాడు...పైకి పంచె ఎగ కట్టి వచ్చిన పాలేరు ‘అయ్యగారు రమ్మంటున్నారు.అమ్మయిగోర్ని ఏడిపించావంట కదా..రా’ అని తీసుకెళ్ళాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి ఒక బుర్ర మీసాల ఆయన వొళ్ళో కూర్చుని ఉంది.ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఆయన తనని చూస్తూనే ‘ఎవరి అబ్బాయివి రా?మా అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్నావట.ఆడపిల్లని అలా ఏడిపించవచ్చా? తప్పు కదూ’ అన్నారాయన. ‘మరి జామకాయ అడిగితె మీ అమ్మాయి ఇవ్వలేదు. అందుకే బలవంతంగా తీసుకున్నా. నాకిష్టమైనది సాధించడం నాకు అలవాటు.’ ధైర్యంగా సమాధానం చెప్పాడు తను. ‘ఓహో ..అలాగా ఎవరబ్బయివి.?’ ‘నరసింహ మూర్తిగారి అబ్బాయిని.స్కూల్ ఫైనల్స్ పాసయ్యాను.’ పాలేరు ఆయన చెవిలో ఎదో చెప్పాడు....అది విని ఆయన పక పకా నవ్వుతూ ‘నువ్ మా నర్సి గాడి కొడుకువా..మీ నాన్నను తీసుకురా...మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను.’అన్నాడు. ఆమాట వింటూనే ఆ అమ్మాయి చటుక్కున తండ్రి ఒళ్లోంచి దూకి సిగ్గు పడుతూ లోపలికి పారిపోయింది . ‘నాకేమన్న భయమా..తీసుకొస్తా.’ రోషం గా అనేసి వెళ్లి అమ్మమ్మకు చెప్పాడు తను. తరువాత పెద్దవాళ్ళు ఎం మాట్లాడుకున్నారో ఏమో నెల రోజుల్లోనే ఆ అమ్మాయి ‘బాలాత్రిపురసుందరి’ తో తన పెళ్లి అయిపొయింది. ఆ తర్వాత తనకు పట్నం లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తాగా ఉద్యోగం వచ్చింది. అలా ఆరోజుల్లో పెద్దల మాట శాసనంగా ఉండేది.ఉద్యోగం ఉందొ, లేదో..పిల్లను పోషించ గలడో లేడో...అనే ఆలోచన కూడా ఉండేది కాదు.సత్సాంప్రదాయాల కుటుంబాల విలువలు, నమ్మకాలు అలా ఉండేవి. తన కొడుకు కూతురు తరం వచ్చే నాటికి ప్రేమ పెళ్ళిళ్ళు మొదలయాయి...ఆ ఒరవడి లోనే కృతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది.. ఇక ఇప్పటి తరానికొస్తే అవగాహన పేరుతొ పెళ్ళికి ముందే అన్నీ...తర్వాత ఇష్టమైతే పెళ్లి..లేదా సహజీవనం...నవ్వుకున్నారాయన. అంతలో ఒక ఫుట్ బాల్ వచ్చి చక్రధరం గారికి తగిలింది. దానిని చేతిలోకి తీసుకుని ట్రాక్ మీదకు వచ్చారాయన. ‘ప్రద్యు...చీకటిలో వెళ్ళకూడదు..బూచులుంటాయి.ఆగు నేను వస్తున్నా.’అన్న మాటలు విన్నంతలోనే ఒక 18 సంవత్సరాల కుర్రాడు ఆయన దగ్గరగా వచ్చి ‘నాదీ బాలు ఇచ్చేయ్’ అన్నాడు...అయితే ఆ మాట చాలా ముద్దగా వుండటం వల్ల ఆయనకు అర్ధం కాలేదు..ఆ అబ్బాయి ఆయన చేతుల్లోంచి బాల్ లాక్కోబోయాడు.అంతలో ఒకామె పరుగెత్తుకుంటూ వచ్చి ‘తప్పు నాన్న.తాతగారు పెద్దవారు కదా.గుడ్ ఈవెనింగ్ చెప్పు...ప్రద్యుమ్న ఈజ్ ఎ గుడ్ బోయ్.చెప్పు నాన్నా.’ అంది. ‘ఎస్ .పెద్దుమ్న ఈజ్ ఎ గుద్ బాయ్.గుడ్ ఈవెనింగ్ తాత గాలు.’ అన్నాడు ఆ అబ్బాయి. ‘ ఏమీ అనుకోకండి తాతగారు.బాబు మానసిక వికలాంగుడు.అయితేనేమి 60 శాతం అన్నివిషయాల్లో బాగుంటాడు.మిగతా 40 శాతం కష్టం అని డాక్టర్స్ చెప్పేశారు..చిన్నప్పటినుంచి ఆయాగా పెంచుతున్నాను.వయసు వచ్చేసింది పాపం.అతని బలం తట్టుకోలేక నాకు సాకడం ఇబ్బంది గా ఉంటోంది.’ ‘అలాగా...పేరెంట్స్ ఎం చేస్తారమ్మా.?’ ‘మేడం, బాబు చదువుతున్న కాన్వెంట్ ప్రిన్సిపాల్ సర్.. అయ్యగారు నర్సరీ ఓనర్.’ ‘మా ఇంటి పక్కన కూడా ఇలాంటి పాపే ఉందమ్మా.ఆ పాప అంటే నాకెంతో ఇష్టం.ఈవేళ బాల్కనీలోంచి పడిపోతున్దనుకున్నాను.భగవంతుడే కాపాడాడు.నీ పేరు?’ ‘సుశీల’ ‘రోజూ ఇలా తీసుకోస్తారామ్మా..?’ ‘నేను మెట్టు గూడా నుంచి రోజూ వస్తాను సార్ డ్యూటీ కి.బాబు వాళ్ళు సైనిక పూరి పోస్టాఫీసు దగ్గర సాయిబాబా ఆలయం సందులో ఉంటారు.ఇది చిన్న పార్క్ సర్.ఇక్కడైతే ఎక్కువ జనం ఉండరు. నేను బాబుని కంట్రోల్ చెయ్యడానికి కూడా వుంటుంది.వస్తాను సర్.చీకటి పడింది.మేడమ్ వచ్చే టైం అయింది. ఏమీ అనుకోకండి సర్.చిన్నపిల్లాడు.తెలియక లాక్కున్నాడు .ప్రద్యు..తాతగారికి బై చెప్పు’ అంది సుశీల . అంతవరకూ బాలుతో బుద్దిగ కబుర్లు చెప్పుకుంటు ఆడుతున్న ప్రద్యుమ్న ‘తాతగాలు.బై’ అన్నాడు ముద్దగా. చక్రధరం గారు ‘బై’ చెప్పారు దిగులు మనసుతో. సుశీల కంగారుగా అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అసలు దేవుడు వీళ్ళని ఎందుకిలా పుట్టిస్తాడు...ఎం పాపం చేసారని? పూర్వకాలంలో ఎక్కడో ఒక శాతం మాత్రమే ఉండేవారు. వీరి శాతం ఎందుకు పెరుగుతోంది? వీళ్ళ జీవితాలకి భరోసా ఎవరు? గాయం మరింత రేగిన మనసుతో ఆయన ఇంటిదారి పట్టారు. *************** దాదాపు నెల రోజుల తర్వాత --- మధ్యాహ్నం ౩ గంటల సమయం. ఇంట్లో పనివాళ్లందరూ ‘ జాతర’ పేరుతొ సెలవు పెట్టి వెళ్ళిపోయారు.అందుబాటులో ఎవరూ లేకపోవడం వల్ల ‘మెడ్-ప్లస్ ‘ లో నెలవారీ వాడుకునే బి.పి, షుగర్ ..మొదలైన మందులు తెచ్చుకోవడానికి స్కూటర్ మీద బయల్దేరారు చక్రధరం గారు. మెడ్-ప్లస్ లో మందులు కొన్నతర్వాత అలవాటైన పళ్ళ షాపుదగ్గరఆగి రోడ్డు పక్కన స్కూటర్ స్టాండ్ వేసి ఆపిల్స్, దానిమ్మ పళ్ళు కొంటున్నారు...అంతలో ఆ షాపును ఆనుకుని ఉన్న పెద్ద భవనంలోంచి బడి గంట వినిపించిది. ఆయన అటు చూసారు. హరిత భర్త చందనను స్కూటర్ వెనకాల ఎక్కించుకుని పళ్ళ షాపు వద్ద చక్రధరం గారిని చూసి నమస్కరించి స్కూటర్ ను ఆపాడు. ‘హాయ్ బంగారు...స్కూల్ అయిపోయిందా...’అడిగారాయన చందనను ఉద్దేశించి. చందన ఆకలి అన్నట్టు పొట్ట చూపించింది. ‘నీకు ఇవ్వకుండా నామ్మా?’అని కొన్ని పళ్ళు ఉన్న కారీబాగ్ చందనకి ఇవ్వబోయారాయన. ‘నేను కొంటాను అంకుల్...మీకెందుకు శ్రమ..’ అన్నాడు వినోద్. ‘భలేవాడివి బాబు.చందన నా మనవరాలు.ఇంకోసారి అలా అనకు.నాకు బాధ కలుగుతుంది.’అన్నారాయన.వినోద్ కారీబాగ్ తీసుకున్నాడు.’రోడ్డు మీద తినకూడదు.ఇంటికి వెళ్ళాక తినాలి.’అని చందనతో చెప్పి...’వస్తానంకుల్’ అని వినోద్ వెళ్ళిపోయాడు చందనతో. చక్రధరం గారు పళ్ళు తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేసి రోడ్డుమీదకు వచ్చారు.ముందు వేగంగా చిన్నకారు వస్తోంది.ఎడమపక్కకు బైక్ ను తిప్పబోవడంతో వెనకనుంచి రాష్ గా వచ్చిన స్కూటర్ చక్రధరం గారి స్కూటర్ ని రాసుకుంటూ వేగంగా వెళ్ళిపోయి పక్కగల్లీలోకి అందరూ చూస్తుండగానే మాయమైపోయింది. స్కూటర్ ఒక పక్కకి ఒరిగిపోవడం,స్కూల్ గేటు లోంచి బాగ్ తో వస్తున్న సుశీల చేయిపట్టుకుని నడుస్తున్న ప్రద్యుమ్న’తాతగాలు...తాతగాలు.’అంటూ అడ్డతిడ్డపు నడకతో పరుగెత్తి తూలిపడబోతున్న చక్రధరంగారిని ‘బలంగా పట్టుకోవడం.,కారీబాగ్ లో ఉన్న ఆపిల్స్ దోర్లిపోవడమూ ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. ప్రద్యుమ్న గట్టిగా పట్టుకోకపోయి ఉంటె కాలు మడతపడిన చక్రధరంగారి తల తార్రోడ్డు అంచుకు గట్టిగా తగిలేసేదే. చుట్టూ పక్కల షాపుల వాళ్ళు గబగబా వచ్చి స్కూటర్ పైకి లేపి స్టాండ్ వేశారు. ఇంతలో పళ్ళ బండి అతను చక్రధరంగారిని పట్టుకుని ఎవరో తెచ్చిన ఫైబర్ కుర్చీలో కూర్చోబెట్టి, ‘దేబ్బతగిలిందా సర్ ఏమైనా..హాస్పిటల్ కి వెళ్దామా సర్?’ అని అడిగాడు. ‘కాలు మడత బడ్డట్టు అనిపిస్తోందయ్యా...హోమియో పతి మందు వేసుకుంటాలే.ఏమీ అనుకోకపోతే నన్ను కొంచం ఇంటి దగ్గర దిగబెట్ట గలవా?’ అని అడిగారు. ‘తప్పకుండా బాబు గారు.మతి లేకపోతేనేం..ఆ బాబెవరో మిమ్మల్ని కాపాడాడయ్యా.మీపాలిట దేవుడు.” అప్రయత్నంగా చేతులు జోడించాడు అతను ‘తాతగాలు...తాతగాలు..పందు...పందు నాదీ..’ తన కాళ్ళదగ్గర ఉన్న ఆపిల్స్ తీసుకుని చక్రధరం గారి దగ్గరగా వచ్చాడు ప్రద్యుమ్న. ‘ అన్నీ నికే నాన్న..అన్నీ నీకే.నా ప్రాణ దాతవి నువ్వు.’ అని ప్రద్యుమ్న నుదుట గాఢంగా ముద్దుపెట్టుకున్నారాయన. సుశీల ఆయన్ని చూస్తూనే ‘బాబుగారూ..మీరా? మిమ్మల్నా ప్రద్యు కాపాడింది?’ ఆశ్చర్యంగా అడిగింది. ‘అవునమ్మా. నేలమీద పడి ఉంటె నా తల పగిలిపోయి ఉండేది. ప్రద్యుమ్న ఈజ్ ఎ గుడ్ బాయ్.నో. ’గాడ్’ బాయ్.” అన్నారాయన కళ్ళు తుడుచుకుంటూ. ‘పద్దు ఈజ్ గుడ్ బాయ్ ‘ రిపీట్ చేసాడు ప్రద్యుమ్న. “ఆ దేవుడే ప్రద్యుమ్న రూపం లో మిమ్మల్ని కాపాడాడు బాబు...జాగ్రత్తబాబు.ముందు ఈ విషయం అమ్మగారికి చెప్పాలి.వస్తాను బాబు.”ప్రద్యుమ్న ని తీసుకుని సుశీల వెళ్ళిపోయింది. పండ్ల షాపు అతని సాయంతో చక్రధరంగారు ఇల్లు చేరారు. **** “ రండి రండి...ఏమిటి విశేషం? మీ దంపతులు మా ఇంటికి తొలిసారి రావడం. ఎదో గొప్ప విశేషమే అయి ఉంటుంది.” సాదరంగా ఆహ్వానించారు చక్రధరంగారు వినోద్, హరిత దంపతులని. “నిజం గా గొప్ప విశేషమే అంకుల్.మా జీవిఒతం లో అత్యంత ఆనంద దాయకమైన పండుగ రోజు...త్వరలో...చందన వివాహం” శుభలేఖ ఆయన చేతులకు అందించి పాదాలకు నమస్కరించారు ఆ దంపతులు. తన జీవితం లో ఒక అద్భుత దృశ్యాన్ని తొలిసారి చూస్తున్న వానిలా శుభలేఖ తెరిచారు చక్రధరం గారు వారిని ఆశీర్వదించి. “చందన వెడ్స్ ప్రద్యుమ్న” అని ఉంది. ఆయన ఆహ్చార్యానికి అవధులు లేవు. అయోమయంగా అడిగారు. “ఇది ఎలా సంభవం బాబు?” “ చందన చదువుతున్న పాటశాల ప్రిన్సిపాల్ మేడం గారి అబ్బాయే ప్రద్యుమ్న సర్.మిమ్మల్ని ఆరోజు కాపాడాడట కదా.ఆమె తన బిడ్డ పరిస్తితి చూసి ఈ చుట్టుపక్కల ప్రాంతం లో ఇలాంటి పిల్లలున్న తల్లి తండ్రుల చిరునామాలు సేకరించి వారి ప్రోత్సాహంతో, తన మిత్రురాళ్ళ సహకారం తో ఈ పాటశాల 15 సంవత్సరాల క్రితం స్థాపించి సేవలు అందిస్తున్నారు.తమా పిల్లల క్షేమాన్ని తాము దగ్గరుండి చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఆమే స్నేహితులలో కొందరు అందులో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా చాలా విచిత్రంగా ప్రద్యుమ్న, చందన ల మానసికస్థితులు దగ్గరై వారి హైపర్ తగ్గి తమ ప్రవర్తనలో మార్పు చూపించసాగారు. వారి ఇంటెలిజెంట్ కోషంట్ దగ్గరగా వచ్చి వారిద్దరి మధ్య తెలియని అనుబంధం ఏర్పడింది.మరోకళ్లతో పొరపాటున కూడా సరిపడని మానసిక స్థితి ఉన్న వారిద్దరూ ఇలా దగ్గరవ్వడం మాకు చాలా ఆనందం అనిపించింది.ఒకరికి ఒకరు మానసికమైన తోడూ కన్నా కావాల్సింది మనిషి జీవితం లో మరొకటి లేదు. అందుకే బాగా ఆలోచించి అబ్బాయి తల్లిదండ్రులు మేము ఈ నిర్ణయానికి వచ్చాము.కాదు కాదు దైవ నిర్ణయం. మీ ఆశీర్వచనాలు మీ మనవరాలికి సదా ఉండాలి సర్.” అన్నాడు వినోద్. “ఎంతటి శుభవార్త చెప్పారయ్యా.నా జీవితం లో ఇది ఒక అద్భుతమైన రోజు బాబు.అంటా మీకడుపు చలువ. ఆ అమాయకపు దంపతులను సర్వదా ఆ దేవుడే కాపాడుతాడు.ఆపైన మనం అందరమూ ఉండనే ఉన్నాము.” అన్నారాయన సంతోషాతిరేకంతో . “ఈ పెళ్ళికి బంధువులెవరూ ఉండరు సర్.ఆ పాటశాలలో చదువుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులే అందరి తరపునా బంధువులూ చుట్టాలూ.అందుకే వివాహం కూడా ఆ దేవాలయం లోనే. మీరు, ఆంటీ తప్పక ఆశీర్వదించాలి సర్.” పదేపదే చెప్పి వెళ్ళిపోయారు వినోద్ దంపతులు. **** మనసున్న దేవుళ్ళ మధ్య, మానవత్వం ఉన్న దేవతల సమక్షం లో జరిగినట్టుగా చందన , ప్రద్యుమ్న ల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ప్రేమ తత్వమే వేదికగా...ఆనందాశ్రువులే అక్షతలుగా ఆశీర్వదించిన పెద్దలందరి మనసులనిండా ఎదో తెలియని అద్వితీయ అనుభూతి.ఇలాంటి వివాహం ఎపుడైనా ఎక్కడైనా జరుగుతుందా అన్నంత అద్వైతానంద స్థితి. వేదిక ముందు ఆసీనులైన సోఫాలలోని పెద్దల దగ్గరకి నూతన దంపతులను నమస్కరింప చేయడం కోసం తీసుకు వచ్చారు ముత్తైదువలు. తల్లి తండ్రులఆశీర్వాదాలు అయ్యాక చక్రధరం గారి దంపతులకు నమస్కరింప చేసారు.మనస్పూర్తిగా ఆశీర్వదించి ప్రద్యుమ్నాను ముద్దాడి...చందన తల నిమిరారు చక్రధరంగారు. “మమ్మల్ని కూడా ఆశీర్వదించండి” మరో జంట పాదాలకు నమస్కరించడం తో “ దీర్ఘ సుమంగళీ భవ.ఇష్టకామ్య ఫల సిద్ది రస్తూ.” అంటూ పైకి లేవనెత్తి ఎవరా అని దంపతులను చూసారు చక్రధరం గారు. ఎన్నో ఏళ్ళుగా గుండెల్లో దాచుకున్న బాధనంతా కళ్ళ నిండా నీళ్ళతో అపరాధభావంతో తననే చూస్తున్న ఆమె ...ఆమె...కృతి...తన కూతురు కృతే కదూ. ఆశ్చర్యంతో, దుఃఖంతో ఆయన గొంతు పూడుకు పోయి వణుకుతున్న కంఠంతో “అమ్మా...కృతీ...” అనగలిగారాయన. “ అవును నాన్న...మీ కడుపున చెడబుట్టిన దాన్ని.మీకు కడుపుశోకం కలిగించిన దౌర్భాగ్యురాలిని నేనే నాన్నా.ప్రద్యుమ్న ఎవరో కాదు మీ మనవడు.మీకు నేను కలిగించిన మానసిక క్షోభకి ఆ దేవుడు నాకు సరి అయిన శిక్షే విధించాడు నాన్నా.సరి అయిన శిక్షే విధించాడు.” తండ్రి గుండెలమీద వాలి వెక్కి వెక్కి ఏడ్వసాగింది కృతి. “ నో మేడం..మీరు మా పిల్లల పాలిట దేవత. మా కుటుంబాలకు జీవన జ్యోతి.” అన్నారు వెనుక ఉన్న ముత్తైదువులు ముక్త కంఠం తో. “జిందాబాద్...జిందాబాద్..కృతీ మేడం జిందాబాద్” అన్న నినాదంతో ఆ వేదిక ప్రతిధ్వనించింది. హరిత అంది” అవును అంకుల్. మేడం ఈ పాటశాల పెట్టబట్టి. మా పిల్లలు ఈ దేవాలయం లో దేవతల్లా వెలుగుతున్నారు. ఇదంతా ఆమె చలువ.” “కాదు నాన్న.వీరు మీ అల్లుడు పార్ధసారధి.” భర్తని తండ్రికి పరిచయం చేసింది కృతి. అల్లుడుని గాఢము గా కౌగలించుకుని తలనిమిరారు చక్రధరం గారు.కృతి కొనసాగించింది. “ ఇదంతా ఆయన చలువ.నా ప్రతీ అభిప్రాయానికి విలువ ఇచ్చి ఆచరణలో సహకరించి ఈవేళ ఇంత మంది జీవితాలకు వెలుగు నిచ్చిన మహాను భావుడు. ఈ ‘వెన్నముద్దల కల్యాణం’ జరిగేలా చేసిన ఉన్నతమైన వ్యక్తీ.ఇపుడు చెప్పండి నాన్న. నా సెలక్షన్ తప్పా ...నేను తప్పు పని చేసానా నాన్న?” అడిగింది కృతి “అమ్మ కృతీ...నీ జీవితం ధన్యం. నిన్ను కన్నా నాజీవితం ధన్యాతి ధన్యం.ఈ నాన్నను మనస్పూర్తిగా క్షమిస్తావామ్మా...” “ మీరు ఇలాంటి శుభ సందర్భం లో అలాంటి మాటలు అనకూడదు మామయ్యా.ఇక నుంచి ఇక్కడున్న ఈ అభం శుభం తెలియని వెన్నముద్దలకి మనమందరం ఆలంబన..ఆధారం.వీరి జీవితాలలో చేతనైనంత వెలుగు అందించే ప్రయత్నం లో నిమగ్నమవుదాం సర్.” అక్కడున్న అందరి కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది. “పెద్దు ఈజ్ ఎ గూద్ బాయ్...” అన్నాడు ప్రద్యుమ్న. “మరి చందన?” వెనకాల అరిచారు ఒక టీచర్. “చందన ఈజ్ వెరీ వెరీ గుడ్ గర్ల్..” ఇంకా గట్టిగా అరిచాడు ప్రద్యుమ్న. చందనకి ఏమి అర్ధమైందో ఏమో కుడి చేత్తో కళ్ళు మూసుకుంటూ సిగ్గుపడింది.!!! *********సమాప్తం*******

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు