వీధి అరుగులు - రాముకోలా.దెందుకూరు.

Veedhi arugulu

నా పల్లెలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ నిండు ముత్తైదువులా ఆహ్వానం పలికేది రంగనాయకమ్మ గారి వీధి అరుగులదే . గ్రామం ముంగిట నిలిచి చూడగనే మొదటి ఆతిథ్యం తనదే అన్నట్లుగా సుదూర ప్రాంతాలనుండి వచ్చే ఎవ్వరైనా సేద తీరేందుకు అనువుగా ,అవసరమైతే విశ్రమించేందుకు వీలుగా "దయ చేయండిలా "అంటు సాధరంగా ఆహ్వానం పలికేలా నిర్మించబడిన వీధి అరుగులు. పట్నం యాంత్రిక జీవితంలోని అలసట తీర్చుకోవాలనే ఆలోచన రాగానే నా పల్లెటూరికి పరుగులు తీయాలనే ఆలోచనలకు శ్రీకారంగా నిలిచేది ,అక్కడ కొంత సమయం సేదతీరితే చాలు అనిపిస్తుంది నాకు. , ఇది నాకు మాత్రమే కాదు,నా పల్లెలోనికి వచ్చి వెళ్ళినా ప్రతిఒక్కరి మాట. చుట్టూ చక్కటి ఆహ్లాదకరమైన ప్రకృతి మా ఉరుకు అదనపు ఆకర్షణ.పచ్చని పంటపోలాలు,గలగలమని పాలే సెలయేటి సవ్వడులు,సేదతీరేందుకు మామిడి తోటలు. ఒక్కమాటలో చెప్పాలంటే బాపు మనసుపెట్టి గీసిన చిత్రంలా ఉంటుంది మా ఊరు. కాలువ ఒడ్డున వరుసగా ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లు ,తాటి చెట్లు స్వాగతం అన్నట్లుగా తలలు ఊపుతూ ఉంటాయి గాలికి ఊగుతూ అతిథి దేవోభవః అనేలా... ఊరు ప్రధమ భాగంలోనే కోదండరామ ఆంజనేయ స్వామి ఆలయ, ధ్వజస్తంభం మువ్వల సవ్వడి హారతిచ్చి ఆహ్వానం పలికినట్లు ఉంటుంది.ఏ ఆ రోజుల్లో కాఫీ హోటల్స్ లేవు కానీ,మంగమ్మత్త వేసే పుల్లట్లు ఉండేవి,పది పైసలకు ఒకటి.ఎంత రుచిగా ఉండేవో. అది ఆమె వంట రుచి కాదు కాదు ,తను చూపించే అనురాగములోని కమ్మదనం అంటారు కొందరు. పిల్లలు నుండి పెద్దల వరకు మంగమ్మత్త అట్టు కోసం ఉదయమే తాటిపాక దగ్గరకు చేరుకునేలా చేస్తుంది.తనం అట్టు మీద వేసే వెన్న కరిగి నెయ్యి గా మారి గుభాలింపు ఆకలిని గుర్తు చేసేది. ఊర్లోకి బట్టల మూటలు వచ్చేవి , పట్నం నుండి రంగు రంగుల చీరలు తెచ్చేవారు , ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు వారికి సైతం మంగమ్మత్త పుల్లట్లేఆకలి తీర్చేది. తెచ్చిన బట్టల మూటలు రంగమ్మ గారి వీధి అరుగులు దగ్గర దించుకుని.తృప్తిగా టిఫన్ చేసి రంగన్నతో డప్పు వేయించే వారు,కావలసిన వారు వచ్చి కొనుక్కోవచ్చంటూ... రంగురంగుల దుప్పట్లు. రూపాయి ఎక్కువైనా సంవత్సరం తరువాత తీర్చెపద్దతి వలన అందరూ తీసుకునేవారు.మన్నిక గూడా ఎక్కువే. దేవస్థానం భూములు మా గ్రామంలో దాదాపుగా 500ఎకరాలవరకు ఉండవచ్చు. ఆ భూములను గ్రామం ప్రజలు సాగు చేసుకున్నందుకు ప్రతి సంవత్సరం కొంత శిస్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చెల్లించేవారు. అలా చెలించేశిస్తు వసూల్ కోసం వచ్చేవారు,తిరుపతి నుండి కొందరు దేవస్థానం అధికారులు . వారికి కూడా రంగమ్మ గారి వీధి అరుగులే అనువైనవిగా మారిపోయేది.వారు ఉన్నన్ని రోజులు అరుగులు దగ్గర మహా సందడిగా ఉండేది... సాయంత్రం పూట పిల్లలు పెద్దలు అందరూ అక్కడకు చేరుకునే వారు. బలరామయ్య మాస్టర్ రేడియోలో ఆరోజు విన్న వార్తలు గురించి, వాతావరణం గురించి,వివరించే వారు. ప్రతి సంవత్సరం ఉగాదికి పంచాంగ శ్రవణం కూడా అవే అరుగులు వేదికగా నిలిచేవి.. అందరూ కొత్త సంవత్సరంలో వ్యవసాయం ఎలా సాగుతుంది, ఎటువంటి పంటలు వేయాలి,వర్షం ఎంత మోతాదులో పడుతుందో ,రాబడి వ్యయం,అడిగిన ప్రతి ఒక్కరికి వివరంగా వివరించేవారు మా ఊరు కోదండ రామాంజనేయ స్వామి ఆలయం అర్చకులు.వేణుగోపాలాచారి గారు. మహా పండితుడిని సహస్ర ఆవథానులని వీరికి పేరు ఆ రోజుల్లో. గ్రామంలో జరిగిన చిన్నచిన్న గొడవలు,చిల్లర దొంగతనాలు,అక్కడే పరిష్కరించే వారు గ్రామం మునసూబుగారు ..ఎంతటి వాడైనా నిజం ఒప్పుకునేవారు అక్కడ.అదేనేమో ఆ అరుగులకు ఉన్న మహత్తు. ఒక విధంగా చెప్పాలి అంటే గ్రామంలోని ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే వెదికి మా రంగమ్మ గారి ఇంటి ముంగిట అరుగులు. ***** అంత చరిత్ర కలిగిన మావూరు రంగనాయకమ్మ గారి వీధి అరుగు మారుతున్న మార్పులకు అనుగుణంగా తన రూపం కోల్పోయింది. ఊర్లో సిమ్మెంట్ రోడ్లు, విస్తరణలో తన ఉనికి కోల్పోయింది. ఊరు కూడా తన రూపు మార్చుకుంది. నేడు పెద్దపెద్ద హోటల్స్,బట్టలు షాపులు,ప్రతి ఇంటి ముందు కారు , బస్సుల ఆటోల హారన్స్..దుమ్ము రేపుకుంటూ దూసుకుపోతున్న బైకులు,వాడిగా వేడిగా సాగుతున్న రాజకీయ చర్చలు, కుల మత రాజకీయాలతో వర్గాలుగా గ్రామం లోని జనం.కలుషితమౌతుంటే....ఏమీ చేయలేక మౌనంగా చూస్తుంది రంగనాయకమ్మ గారి వీధి అరుగు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు