జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామేశ్వరంలో చదివిన వారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళు ఆ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి, 20 సంవత్సరాలు దాటింది. కొంతమంది ఉద్యోగాలు కొంతమంది వ్యాపారం కొంతమంది కులవృత్తులు కొంతమంది వ్యవసాయం కొందరు కూలీపని చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు వివిధ పాఠశాలల్లో వివిధ తరగతులు చదువుతున్నారు. అయితే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వినూత్నంగా 5 రోజులు నిర్వహించాలని మహేంద్ర అనే అతనికి ఆలోచన వచ్చింది. ఆనాటి విద్యార్థులు అంతా తప్పనిసరిగా తమ పిల్లలతో రావాలని నిబంధన విధించాడు మహేంద్ర. అంతకు ముందే రెండు సమావేశాలు ఏర్పాటు చేసి, తన ప్రణాళికను వివరించాడు. రాలేని వారికి ఫోన్ ద్వారా వివరించాడు. సంతోషించారు అందరూ. ఆనాటి బ్యాచులో 60 మంది విద్యార్థులు ఉండేవారు. వారిలో 40 మంది వారి పిల్లలతో కలిసి వచ్చారు. అక్కడ వసతి ఏర్పాటు చేసుకున్నారు. ప్రణాళిక ప్రకారం పల్లెటూరి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అంతరించి పోయిన గ్రామీణ క్రీడలను వెలుగులోకి తేవాలి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టి.వి.లే ప్రపంచంగా బతుకుతూ మానవ సంబంధాలను వదులుకుంటున్న ఈ తరానికి కనువిప్పు కలిగించాలి. ఇది మహేంద్ర ప్రణాళిక. ఆ 5 రోజులూ తాము పెద్దవాళ్ళము అన్న సంగతి మర్చిపోయి, తమ పిల్లలకు నేర్పుతూ తమ పిల్లలతో కలిసి గోళీలాట, చిర్రగోనె (గిల్లిదండ), దాగుడు మూతలు, ఇంటి పైకప్పుల పెంక ముక్కలను పేర్చి వాటిని కొట్టే ఆట, బొంగరాలు తిప్పడం, వామనగుంటలు, అష్టా చెమ్మా,, పచ్చీసు, కోతికొమ్మచ్చి, తొక్కుడు బిళ్ళ తదితర ఆటలను ఆడినారు. మొబైల్ ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టారు. ఆటలలోని ఆనందాన్ని ఆస్వాదించారు. అప్పటికే ఆ గ్రామంలో ఆయా క్రీడలు అంతరించాయి. సెల్ ఫోన్ల వ్యామోహం, క్రికెట్ ఆట ఈ రెండే లోకం అయ్యాయి. ఇప్పుడు ఆ గ్రామ వాసులకూ ఈ ఆటలలోని ఆనందం తెలిసి వచ్చింది. తాము తప్పనిసరిగా ఆనాటి గ్రామీణ క్రీడలనే ఆడాలని నిశ్చయించారు. ఫూర్వ విద్యార్థులే కాదు, వాళ్ళ పిల్లలకూ ఆనాటి గ్రామీణ క్రీడలపై మక్కువ పెరిగింది. ఇకపై తాము ఆ ఆటలనే ఆడటం కాకుండా తమ స్నేహితులకూ నేర్పి, ఆ ఆటలను వ్యాప్తి చేయాలని అనుకున్నారు. అందరూ మహేంద్రను అభినందించారు.