సాయంత్రమైతాంది ఇంకెప్పుడు శవాన్ని ఎత్తేది? రాత్రి చచ్చిపోతే యాడ బూడ్సలో ఇప్పటికీ తెలియడం లేదు. పెద్డోలు ఊరకే అన్నారా? చేసుకున్నోలకు చేసుకునంతని. పాపం సచ్చిపోయిందని బాధపడుతుందా? తల్లిని బుడ్సడానికి ఇంత మట్టి దొరకడం లేదని బాధపడుతుందా? ఆ పాపా ముఖం చుస్తాంటే కడుపు తరక్కపోతాంది.
అల్లుడు గుట్ట మీద ఉండే మజీద్ వాళ్లను అడిగితే… ఒప్పుకోలేదంటేనే? నిజమేనా? అంటూ పక్కనే ఉన్న గౌసియాను అడిగింది ముంతాజ్.
‘అవునంట ఒప్పుకోలేదంటక్క.’ గుట్ట మీద ఉండే మజీద్ మాత్రమే కాదు జెండామాను మజీద్, ఇస్లంపూరం మజీద్, బజార్లో ఉన్న పెద్ద మజీద్ వాళ్లు కూడా ఒప్పుకోవడం లేదంటా. సొంత భూమి కూడా లేకపాయ యాడ బూడ్సు కుంటారో ఏమో?
పెద్ద బీబీ చాలా మంచి మనిషి. గతిలేక ఆమె ఈసరయ్య దగ్గరికి చేరుకుంది కానీ లేదంటే అలాంటి పని చేసేది కాదు. పాపం… ఉన్న ఒక్క బిడ్డ యాడికని పోరాడుతుంది అంటూ గుంపులో నుండి మరోకామే గొణిగింది.
***
నా పేరు నసీమా మా అమ్మ పేరు పెద్ద బీబీ. మాయమ్మ చాలా కష్టాలు పడి నన్ను పెంచింది. నా పిల్లప్పుడు మా నాయన అమ్మను వదిలేసి సుగాలామేను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఆమె పేరు కూడా నాకు తెలియదు. మా నాయన పోయిన తర్వాతే మాకు కష్టాలొచ్చినాయి. మా తురకోళ్ళు మీ నాయన సుగాల్ దాన్ని తీసుకుపోయినాడంట అని చులకన చేసి మమ్మల్ని ఎలేసినారు.
“నాయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బెల్దారి పనికి, కూలి పనికి, చెన్నిక్కాయ వలచడానికి, సున్నం కొట్టడానికి, బోకులు, కసువు ఊడ్చడానికి పోతూండేది. శక్తి ఉన్నంతకాలం ఏదో ఒక పని చేసి నన్ను పెద్ద చదువులు చదివించింది. గవర్నమెంటు టీచర్ కిచ్చి పెళ్లి కూడా చేసింది.”
నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఒంటరిదైపోయింది. ఒంట్లో శక్తి తగ్గిపోయిన తర్వాత నాగలకట్ట కింద చిన్న చిల్లర బొంకు పెట్టుకొని రోజుకు ముప్పై, నలభై సంపాదించుకునేది. మా వీధిలో గాజులు అమ్ముకునే ఈసరయ్య మా అమ్మకు జత అయినాడు. ఇద్దరూ కలిసే ఉండేవారు.
మొదట అందరూ… మొగుడేమో సుగాల్ దాన్ని తీసుకుపోతే ఇదేమో బలిజోన్ని పెట్టుకుంది. తురకోల్ల పరువు తీసి సచ్చినారు అంటూ… అమ్మను నానా మాటలు అనేవారు. “మా ఆయన కూడా ఇప్పుడు మీ అమ్మకు మొగోడు కావాల్సి వచ్చిందా అంటూ… ఇంత లావు మాటలు మాట్లాడినాడు.” ఇక మా అత్తా, మామ అన్న మాటలు చెప్పలేను.
వీళ్ళందరూ ఇన్నిన్ని మాటలు అంటున్నారే కాని మా అమ్మ పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోలేదు. అమ్మ వయసు…, దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు దాటినాయి. ఆ వయసులో ఎవరో ఒకరు తోడుండాలి. “ఒంటరిగా ఎన్ని రోజులని ఉంటుంది. ఏ రాత్రో…, నీళ్లో పాడో కావాలంటే ఏం చేస్తుంది.? అమ్మకు అలాంటి చెడు బుద్దే ఉంటే నేను పిల్లదానిగా ఉన్నప్పుడే వేరే పెళ్లి చేసుకునేది కదా!” ఈ పాడు లోకానికి అవన్నీ పట్టవు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది.
***
అమ్మకు ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. అయినోళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు తలా ఒక మాట అనీ…, అనీ తట్టుకోలేకపోయింది. మా నాయన వెళ్ళిపోవడం, తర్వాత నన్ను చదివించడానికి పడిన కష్టాలు, నా పెళ్లికి చేసిన అప్పులు తీర్చడం, ఆ తర్వాత ఈసరయ్య జత కావడం ఇలా ఒకటి పోతే మరొకటి మా అమ్మ జీవితాన్ని అతలాకుతలం చేశాయి. అయినోళ్ళు దగ్గరికి తీసుకోలేదు, ఈసరయ్య మా అమ్మను బాగా చూసుకునేటోడు. బాగానే ఉంది అనుకునేలోపు కుల పీడ చుట్టుకుంది. మనిషికి మనిషి తోడుండటానికి కులాలతో, మతాలతో ఏం పని ఉందో అర్థమే కాదు.? ఇవన్నీ అమ్మను కుంగిపోయేలా చేశాయి. అందుకే నిన్న రాత్రి అమ్మ సచ్చిపోయింది.
నాయన సుగాల్ దాన్ని తీసుకుపోయాడని, అమ్మ ఈసరయ్యను పెట్టుకుందని చెప్పి శవాన్ని మజీద్ లో బూడ్సడానికి ఒప్పుకో లేదు. ఇప్పుడు మా అమ్మను ఎక్కడ బూడ్సలో అర్థం కావడం లేదు. సచ్చిపోయిన తర్వాత బూడ్సడానికి ఇంత మట్టి దొరకడం లేదు.
మా ఆయన…, అన్ని మజీద్ లకు వెళ్లి అడిగినాడు. అందరూ ఒకటే తీర్మానం చేసుకున్నారంట. అందుకే ఎవరూ బూడ్సడానికి ఒప్పుకో లేదు. ఇక చేసేది లేక నేను, మా నాయన ఈసరయ్య కలిసి బలిజోల్ల స్మశానం దగ్గరికి వెళ్లి అమ్మను అక్కడ బూడ్సుకుంటామని అడగడానికి వెల్లినాము.
అప్పటికే విషయం తెలుసుకున్న అక్కడ ఉండే సాయి అన్న… “మేము…, ఇంకాస్త దూరంలో ఉండగానే ‘లేదు లేదు రావదండి తురకామేను మా స్మశానంలో బూడ్సుకునేది లేదంటూ గట్టిగా అరిచాడు.”
నేను పోవడం పోవడమే ఆయన కాళ్ల మీద పడి మొత్తుకున్నా “అన్నా…,నీ చిన్నప్పటి నుండి మా అమ్మను, నన్ను చూస్తున్నావు. మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలియదా?” మజీద్ వాళ్లు వద్దు అన్నారు. మీరూ వద్దంటే “అమ్మ శవాన్ని కుక్కలకు వేయమంటావా నువ్వే చెప్పు? నా తల్లి నీకు మాత్రం తల్లి కాదా?” “దయచేసి మీ శ్మశానంలో ఒక మూలన ఆరు అడుగులు కూడా వద్దు కాస్త స్థలం ఇస్తే అక్కడే బూడ్సుకుంటానని అడుక్కున్నాను.”
‘చూడుమ్మా… దీంట్లో నాదేమిలేదు.’ మా కుల పోల్లు ఒప్పుకోవడం లేదు. “మన కుల పోల్లు ఎవరైనా సచ్చిపోతే మజీద్ లో బూడ్సడానికి వాళ్లు ఒప్పుకుంటారా?” కనీసం మజీద్ లోపలికి మనల్ని రానీయ్యారు కూడా… అలాంటిది వాళ్ల శవాన్ని మన స్మశానంలోకి ఎందుకు బూడ్సనియ్యాల అంటున్నారు.
‘అన్నా… మీరంతా పంతాలకు పోయే సమయం ఇదేనా? కాస్త కనికరించండని ఎంత మొత్తుకున్నా ఒప్పుకోలేదు.’ ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఒక మనిషి చనిపోతే బూడ్సడానికి కులాలు, మతాలు అడ్డు వస్తున్నాయి. ఈ పాడు కులాలు, మతాలు ఏ విధంగానూ ఉపయోగపడవు. అయినా మనుషులు వాటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో?
“అమ్మ శవం బూడ్సడం కాదు. ఆ శవంతో పాటు కులాన్ని, మతాన్ని కూడా బూడ్సిపెట్టాలి.” ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు గంటలపాటు సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత టక్కున లేచి నా స్నేహితురాలు అనూషకు ఫోన్ చేసి… నేను అనుకున్నది చెప్పాను.
మంచి నిర్ణయం తీసుకున్నావు. నేను ఒక గంటలో ఏర్పాట్లు చేసి నీ దగ్గరకి వస్తాను. నువ్వేమి బాధపడకు అంటూ ఫోన్ పెట్టేసింది.
ఒక గంటలో అంబులెన్స్ వచ్చేసింది. అమ్మ శవాన్ని తీసుకెళ్ళిపోయారు. “అవును మా అమ్మ శవాన్ని కడప రిమ్స్ ఆసుపత్రిలో చదువుకునే పిల్లలకు ఇచ్చేశాను.”
నేను కులాన్ని, మతాన్ని జయించాను.
అమ్మ శవం వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా ఏడ్చాను
ఏడుపు…ఏడుపు…ఏడుపు
ఏడుపు నుండి
నవ్వులు నవ్వులు నవ్వులు
నేను గెలిచాను. కులాన్ని, మతాన్ని పాతి పెట్టేశాను.
***