మాడికాయల లోడ్ వచ్చిందని… ముద్దనూరు పెద్దమ్మ ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. ముద్దనూరు పెద్దమ్మ నుండి ఫోన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాసుకొని కూర్చుంటాను. ముద్దనూరుకు పోయి… పచ్చి మాడికాయల మూటను పులివెందులకు తెస్తే… ఎంత లేదన్న యాభై రూపాయలు వస్తుంది. ఆర్. టి. సి బస్సులో అయితే పది రూపాయలు ఛార్జి. అదే మినీ బస్సులో పోతే… ఐదు రూపాయలే. అది కూడా ఒక్కోసారి కండక్టర్ తీసుకోడు. ఎందుకంటే…? బస్సు ఎక్కిన వెంటనే… ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చుంటాను. మెల్లగా మాటలు కలుపుతాను. ముద్దనూరుకు ఎందుకు వెళ్తున్నానో చెప్తాను.
నేను… మీ పిల్లోడినే అని చెప్పండి… నాకు పది రూపాయలు మిగులుతాయని అడుగుతాడు, బుజ్జగిస్తాడు, బతిమిలాడతాడు, నంగి మాటలు మాట్లాడతాడు. పోనీలే పాపం చిన్న పిల్లోడని కొందరు ఒప్పుకుంటారు, ఛార్జి ఐదు రూపాయలు కదా…! రెండు రూపాయలు ఇస్తే… అలాగే చేస్తామని… పిల్లోడి దగ్గర కొందరు వ్యాపారం మొదలు పెడతారు, పొట్టి నా కొడకా… యాడా నుండి వచ్చినాయిరా ఇన్ని తెలివితేటలని కొందరు మెచ్చుకుంటారు, దొంగ నా కొడకా… ఇప్పటి నుండి మోసం చేయడం నేర్చుకుంటున్నావా..? అని కొందరు కసురుకుంటారు. దొరికితే… ఇద్దరికీ ఫైన్ పడుతుందని కొందరు భయపడతారు. దాదాపు మూడేళ్ల నుండి మాడికాయల కోసమని, చీనికాయల కోసమని, కలింగర కాయల కోసమని, కరబూజ కాయల కోసమని… ముద్దనూరుకు, పులివెందులకు తిరుగుతూనే ఉన్నాడు పదేళ్ల శంకర్. పదేళ్ల వయసు ఉంది కానీ… చూడటానికేమి అలా కనపడడు. ముద్దనూరు పెద్దనాయన... పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఏ పండ్ల వ్యాపారం చేస్తే… ఆ పండ్లను పులివెందులలో ఉండే... చెల్లెలి బిడ్డలకు పంపడం ఆయప్పకు అలవాటు.
ఏ రోజే కానీ… ఏ నా కొడుకు… అలా చేయకూడదు… అది తప్పుడు పని అని బుద్ధి చెప్పలేదు, మంచి మార్గాన్ని చూపలేదు, పిల్లోనికి మంచి-చెడు చెప్పడానికి కాస్త సమయం కేటాయించలేదు. ఎవరి ప్రయాణం వాళ్లది, ఎవరి భయం వాళ్లది, ఎవరి మోసం వాళ్లది… సమాజంలో నిజాయితీ మనుషులు దొరకడమే కష్టమైపోయింది.
నా…టైం… బాగుంటే…! పొయ్యేటప్పుడు, వచ్చేటప్పుడు… బస్సులో ఛార్జి ఉండదు. పులివెందులలో బస్సు ఎక్కించి… మా అమ్మ చార్జీల కోసం ఇరవై రూపాయలు ఇచ్చి… బస్సు తొండూరులో ఆగినప్పుడు… మజ్జిగ నీళ్లో, బూందో కొనుక్కోమని… ఇంకో ఐదు రూపాయలు ఇస్తుంది. ముద్దనూరులో పెద్దనాయన కూడా ఇరవై చేతికిచ్చి… షరబత్ తాపించి… ముద్దనూరు బస్టాండ్ లో వేడి వేడి పకోడా కట్టిస్తాడు. పెద్దమ్మ ఒక్కోసారి మూడు రూపాయలు, ఒక్కోసారి నాలుగు రూపాయలు… అలా తన దగ్గర ఎంత ఉంటే… అంత ఇస్తుంది. అలా… ఒక యాభై లోపు… ఎంతైనా రావచ్చు.
మనుషులను ఎలా మోసం చేయాలో? ఛార్జి లేకుండా ప్రయాణం చేయడానికి… తాను చేసే మోసంలో ఇతరులను ఎలా వాడుకోవాలో? బాగా నేర్చుకున్నాడు, అలవాటు పడ్డాడు. వచ్చిన డబ్బుతో ఎల్లమ్మ అక్క దగ్గర పొద్దునే దోశలు తింటాడు, సాయంత్రం పంచాయితీ ఆఫీస్ దగ్గర పానిపూరి లాగిస్తాడు. తిండి కోసమే ఇదంతా చేస్తాడు. అది పిల్లవాడి తప్పు కావచ్చు, పొరపాటు కావచ్చు, బుద్ధి లేకపోవడం వల్ల కావచ్చు, ఎవరూ చెప్పకపోవడం వల్ల కావచ్చు. ఇవన్నీ న్యాయమైన కారణాలు, ఉన్నతమైన కారణాలు. ఈ కారణాలు మార్చవచ్చు…, పిల్లవాడిని ఆపవచ్చు, తప్పు చేయకూడదని, పొరపాటుకు, మోసానికి మధ్య తేడాను వివరించవచ్చు.
శంకర్ ఎందుకు తప్పు చేస్తున్నాడు? ఎందుకు మోసం చేస్తున్నాడు? శంకర్ మోసం వ్యక్తి నుండి వ్యవస్థ దాక మారడానికి తోటి మనుషులు కారణం కాదా? తన బీదరికం కారణం కాదా? తనకు కావాల్సింది తినడానికి సరైన తిండి పెట్టని తల్లిదండ్రులను దోషులుగా తేల్చుదామా? తల్లిదండ్రులను బీదరికపు కూపంలో వేసిన సమాజాన్ని నిందించుదామా?
“బీదరికం శాపం కాదు. శాపాలు, పాపలు ఉన్నాయా? ఉత్త మాటలు, దొంగ మాటలు, దోపిడీ మాటలు, కుల ఆధిపత్యాన్ని చాటుకునే మాటలు.”
ఈసారి… ఎలాగైనా యాభై సంపాదించాలని కంకణం కట్టుకున్నాను. పులివెందుల పాత బస్టాండులో మా అమ్మ మినీ వ్యాను ఎక్కించింది. వ్యాన్ ఎక్కి... కిటికీ పక్కన కూర్చున్నాను. బస్సు మొత్తం ఖాళీగా ఉంది. డ్రైవర్, కండక్టర్ బయట కాపి నీళ్లు తాగుతున్నారు. ఎవరూ బస్సు ఎక్కడం లేదు… ఈసారి డబ్బు చేతికి అందేలా లేవు. ఎలా చేయాలని...? అనుకునే లోపే… ఒక అక్క బస్సు ఎక్కింది. నా పక్కన కూర్చుంటుందో… లేదో అని గాబరాపడ్డాను. నా పక్కన కాకుండా… నాకు ఎదురుగా ఉన్న… ముగ్గురు కూర్చుండే సీట్లో కూర్చింది.
“అక్కా… యాడికి పోతున్నావని పలకరించాను?”
“ముద్దనూరు పల్లెకు పిల్లగా… ఏ…? ఎందుకు…?”
“ఏం లేదు… నాకు నిద్ర వస్తోంది… నీ పక్కన కూర్చుంటా… నా సంచి చూస్తూ ఉంటావా…?!”
“అట్టేగానిలే… ఈడికి రా… ఆ పక్క మొగుళ్లు కూర్చుకొంటారు… బీడీలు తాగి చస్తారు."
“సరే అని… అక్క పక్కన కూర్చున్నాను. కళ్ళు మూసుకున్నాను. నిద్ర పోయినట్టు నటించాడు. అలా కాసేపు నటిస్తే డబ్బులు మిగలుతాయి.” పెద్దవాళ్ల పక్కన కూర్చొని నిద్రపోతే… నేను వాళ్ల పిల్లోన్నే అని కండక్టర్ నా వైపు చూడడు.
ముద్దనూరు వచ్చింది… అందరూ బస్సు దిగుతున్నారు. చివరిగా నేను బస్సు దిగినాను. పది రూపాయలు మిగిలిందని సంబరపడ్డాను, ఎల్లమ్మక్క… దోశలు గుర్తు చేసుకున్నాను, పీరమ్మక్క… ఉంటలలో వేసే ఎర్ర కారం జ్ఞాపకం చేసుకున్నాను, బంగారు బజారులో శెట్టి వేసే మిరపబజ్జీల రుచిని అద్దుకున్నాను, రాజారెడ్డి ఆసుపత్రి దగ్గర ముస్కిన్ వేసే ‘టీ’ నీళ్లు చప్పరించాను. పైజోబిలో పెట్టుకున్న పది రూపాయల కాగితం కోసం చేతిని జోబిలో పెట్టాను. నోటు లేదు.
ఎల్లమ్మక్క… దోశలు మాడిపోయాయి, పీరమ్మక్క… ఎర్ర కారం నశలానికి ఎక్కింది, శెట్టి వేసే మిరప బజ్జీల నూనె ఎగిరి వచ్చి… కంట్లో పడింది, ముస్కిన్ ‘టీ’ నీళ్లు ఆవిరైపోయాయి. పరిగెత్తుకుంటూ పోయి… నా పక్కన కూర్చున్న అక్కను…
“నా పైజోబిలో ఉన్న పది రూపాయలను చూశావా? అని అడిగాను”
“ఏం రా…? దొంగ నా కొడకా…,! నీ పది రూపాయలు… నేను ఎందుకు తీసుకుంటాను?. గర్జించింది. కళ్ళు ఉరిమింది, పళ్ళు కొరికింది, నెత్తిపై మొట్టికాయ వేసింది.”
చూశావా...! అని అడిగితే…? నేను ఎందుకు తీసుకుంటాను అనింది. భయపడింది, భయాన్ని కప్పిపుచ్చుకోడానికి గట్టిగా అరిచింది, తన దొంగతనం బయట పడకుండా ఉరిమింది, ఎక్కువ మాట్లాడకుండా జారుకుంది, పారిపోయింది.
మోసం ఎలా ఉంటుందో…? రుచి చూశాడు శంకర్. మోసం చేయడం తేలిక అనుకున్న శంకర్… మోసపోతే ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. తనను మోసం చేసింది ఒక వ్యక్తి మాత్రమే… శంకర్ ఇన్ని రోజులు వ్యవస్థను మోసం చేస్తున్నాడు.
ఏడ్చుకుంటూ ఇంటికి నడిచాను. మధ్యలో ఏడ్పు ఆపాను… లేదంటే పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నవని? అడుగుతుంది. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఒకవేళ మోసపోయానని తెలిస్తే… ఇక నుండి ఊరికి పంపరు. పంపకపోతే… కాస్తో, కూస్తో… వచ్చే డబ్బు కూడా మిగలదు. పెద్ద నాయన కొనిచ్చే పకోడా, షరబత్ కూడా ఉండదు.
మాడికాయలను తీసుకున్నాను. పెద్దనాయన వ్యాను ఎక్కించాడు. పులివెందులకు వ్యాను బయలు చేరింది. నా పది రూపాయలు ఎందుకు తీసుకుంది? ఎలా తీసుకోవాలా అనిపించింది? ఇంతటి మోసమా? పిల్లోని దగ్గర దొంగతనం చేస్తుందా? దొంగముండా… అదేం బాగుపడుతుంది. సర్వనాశనమై పోతుంది. దిగులు ఎక్కువైంది… పోయేటప్పుడు ఛార్జి కూడా తీసుకున్నాను. పెద్దమ్మ, పెద్దనాయన కూడా డబ్బులేం ఇవ్వలేదు. పది రూపాయలు ఇచ్చి పంపించారు. వ్యాపారాలు సరిగా జరగడం లేదని, ఇంట్లో ఇబ్బందిగా ఉందని మాట్లాడుకున్నారు. దప్పిక అయితాంటే… తొండూరులో బస్సు ఆపిన తర్వాత కిటికీ నుండి ఒక సోడా ఇవ్వమని అడిగాను. సోడా తాగి… ఐదు రూపాయల బిల్లను ఇచ్చాను.
“బస్సు స్టార్ట్ అయ్యింది.”
“అన్నా… నా చిల్లర ఇయ్యలేదు.”
“సోడా దుకాణంలో గోల గోలగా ఉంది. నా మాటలు వినపడలేదేమోనని… అన్నా నా చిల్లర అని గట్టిగా అరిచాను. నా వైపు చూడలేదు… బస్సు కదిలింది.”
“వెక్కి వెక్కి ఏడ్చాను… కిటికీ నుండి తల బయట పెట్టి… గట్టి గట్టిగా అరిచాను. బస్సు కాస్త దూరం వెళ్ళిన తర్వాత… సోడా కొట్టు అన్న నవ్వడం చూసి… సీటులో కూలబడ్డాను.”
మోసం… మొత్తం మోసం… అందరూ మోసం చేస్తున్నారు. మనుషులంతా మోసపరులు. బతకడానికి మోసం, తినడానికి మోసం, ఎదగడానికి మోసం, పొట్టలు కొట్టి, భుజాలు తొక్కి ఎదగాలి. నువ్వు మోసం చేయి… నేనూ చేస్తాను. నీ మోసంతో… నా మోసం మాఫీ అవుతుంది, చెల్లుకు చెల్లు అవుతుంది. సమాజం మోసపు దుకాణం.
మోసం… మనుషులు…
మనుషులు… మోసం…
మోసం… మనుషులు….
మనుషులు… మోసం…
రెండు పదాలకు పెద్ద తేడ కనిపించలేదు శంకర్ కి.
మోసపు మనుషులు పదాలు కలిసి ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి…. నేను అందులో ఉండకూడదు…
నేను మోసాన్ని కాదు… మనిషిని…
మోసం వద్దు… మనుషులు కావాలి… మనుషుల్లో బతకాలి, మెలగాలి, పొర్లాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, భయపడకుండా, దాక్కోకుండా, నటించకుండా…
మనిషి… మనిషి… మనిషి…
కావాలి… కావాలి… కావాలి…
మోసం… మోసం… మోసం
పోవాలి… పోవాలి… పోవాలి
***