జీవితం మనకు విజయాలను అందించదు...కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఒకోసారి జీవితం పరీక్ష పెడుతూ ఉంటుంది. సవాళ్లకు వెరచి... నిరాశ చెంది జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకోవడం సరైంది కాదు..ఒకసారి కోల్పోతే తిరిగి పొంద లేనిది జీవితం! ............................... “అమ్మగారూ..తొందరగా ఇలాగ రండి..వికాస బాబుగారు నోట్లోంచి నురగొస్తున్నాదమ్మా..పెద్దగా గురక కూడా వస్తన్నాదమ్మా నాకేదో భయంగా ఉందమ్మా..బేగిరండి!అంది ఆ ఇంట్లో పని చేస్తున్న లక్ష్మి. ఆమాట వినడంతోనే అతడి తల్లి మీనాక్షి చెల్లెలు దివ్యా తమ్ముడు నిషాంత్ పరుగు పరుగున వచ్చారక్కడికి ముగ్గురూ వికాస్ ని ఆ స్థితిలో చూడడంతో నేభయభ్రాంతులై పెద్దపెట్టున అతడిని పట్టుకొని ఏడవసాగారు. ఈలోగా లక్ష్మి వెళ్లి కారు డ్రైవరు శంకరాన్ని తోటమాలి ఎల్లయ్యనూ పిలుచుకు వచ్చింది. చలనం లేకుండా పడిఉన్న వికాస్ ని హృదయవిదారకంగా ఏడుస్తున్న వారి ముగ్గురినీ చూడడం తోనే శంకరం,ఎల్లయ్య మనసులు ద్రవించిపోయాయి.ఈ పరిస్థితిలో అతడిని అలా వదిలేస్తే ప్రమాదమని గ్రహించి "అమ్మా మీరలా ఏడవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు..లేవండి ముందు .. బాబు ని హాస్పిటల్ కి తీసుకు వెళదాము"అన్నాడు శంకరం ఆదూర్ధాగా. "సరే శంకరం.వెటనే కారుతీయి వెళదాము" "అంది. హాస్పటల్లో వెంటనే వికాస్ ని ఎడ్మిట్ చేసుకొని ట్రీట్ మెంటు ప్రారంభించారు. మీనాక్షి మనసాగక..జరిగిందంతా వికాస్ ఫ్రెండ్ రవికి చెప్పింది.చెెప్పడమేకాదు.."నాయనా రవీ నీ స్నేహితుడిని చూస్తూంటే చాలా భయంగా ఉంది బాబూ..వీలైతే వెంటనే హాస్పిటల్ కి రా..నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది."అంది మీనాక్షీ దీనంగా. "ఆంటీ ,కంగారు పడకండి నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను'అన్నాడు రవి స్నేహితుడు హాస్పిటల్లో ఉన్నాడని వినడంతోనే అతడికీ కంగారుగానే అనిపించింది. పరుగు పరుగున చేతిలో పని వదలి హాస్పిటల్ కి వచ్చేశాడు రవి. అతడిని చూడడంతోనే మీనాక్షి "వచ్చావా రవీ?"అంటూ ఏడుస్తూ రవి రెండు చేతులూ పట్టుకుంది.భర్తపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు ఇదొక విఘాతం! "ఎలా ఉందాంటీ ఇప్పుడు వాడికి?"అనడిగాడు రవి ఆదుర్దాగా. " ప్రమాదం తప్పిందన్నారు రవీ..కానీ నాకు ధైర్యం చాలడం లేదు. అందుకే నిన్ను ఇబ్బంది పెడుతున్నాను!" అంది మీనాక్షి. "అదేంటాంటీ అలా అంటారు, వాడికి ఏదైనా అయితే నేను మాత్రం తట్టుకోగలనా.. చిన్నప్పటి నుండి దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటిలా పెరిగాము, మెలిగాము"అంటూ వికాస్ మంచం దగ్గరకు వెళ్లి "వికాస్..వికాస్!"అంటూ మెల్లగాతట్టి పిలిచాడు రవి . అతడి గొంతు విని మెల్లగా కళ్లు తెరిచి స్నేహితుడి వంక చూసి "అమ్మ అనవసరంగా నిన్ను పిలిచి ఇబ్బంది పెట్టిందిరా రవీ..ఈ మొండి ప్రాణం అంత తొందరగా పోదులేరా!" అన్నాడు వికాస్ నిస్తేజంగా చూస్తూ. " ఛ,ఏంమాటలురా అవి?నీకేమైనా అయితే మేమంతా ఏం కావాలిరా?చూడు అమ్మ ఎలా అయిపోయిందో,ఎందుకురా ఇలాంటి పని చేశావు?"అన్నాడు రవి అతడి చేయి ఆప్యాయంగా నిమురుతూ . "ఏం చేయనురా, బ్రతుకు భయ పెడుతోంది.. నిన్నటిదాకా రాజకుమారుడిలా తిరిగిన నేను ఇపుడు ఏమీలేని బికారిని అని తెలిసి తట్టుకోలేక పోతున్నానురా!"అన్నాడు వికాస్ నీరసంగా. "అందుకని నిన్ను నమ్ముకున్న వారందరినీ గాలికి వదలి నీ దారి నీవు చూసుకున్నావా! ఇలా చెయ్యడం సరైందనే అనుకుంటున్నావా! జీవితంలో ఎదురైన సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమ్మీద ఎవరూ మిగలరు తెలుసా..నీ ఆలోచన సరైంది కాదు, ఐ విల్ నాట్ ఎగ్రీ విత్ యూ! ఇది పిరికివాళ్లు చేసే పని!" అన్నాడు మందలిస్తున్నట్లుగా. " ఏం చేయనురా, అంతకంటే మార్గం తోచలేదు నాకు.. నాన్నగారు నీతోపాటు నన్నూ ఇంజనీరింగ్ చదవమన్నారు..కాని నాకది ఇష్టం లేకపోయింది.ఎంతో ఇష్టంగా కష్టపడి మెడిసిన్ లో సీటు సంపాదించుకున్నాను. ఇంకో ఏడాదిలో నా కలలను సాకారం చేసుకోవచ్చని ఎంతో ఆశ పడ్డాను..ఇప్పుడు అనుకోని విధంగా నాన్నగారు పోయారు..నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాన్నగారి కి చిన్నమెత్తు జ్వరం కూడా రావడం తెలియదు నాకు . అలాంటిది ఏకంగా గుండె పోటు కబళించింది..ఈ బాధ నుండి మేము కోలుకోకముందే నిన్న మా మేనేజర్ పరాంకుశం గారు వచ్చి మా బిజినెస్ అంతా దెబ్బ తిన్నదని...చివరికి వర్కర్స్ కి జీతాలివ్వలేని స్థితి కి కంపెనీ చేరుకుందని చెప్పారు . దాంతో నాకు మతిపోయింది .. నాన్నగారు మా కంపెనీ ఇబ్బందుల్లో ఉంది అని నాకు గాని అమ్మకి గాని చూచాయగా నైనా చెప్పలేదు ఎప్పుడూ. ఇది చాలదన్నట్లుగా ఈరోజు ఉదయం షేర్ హొల్డర్స్ అందరూ కంపెనీ నుండి విత్ డ్రా అవుతున్నామని తమకి రావలసింది సెటిల్ చేయమని వచ్చి అడిగారు.. సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో నాకేం చేయాలో తోచ లేదు. అందుకే ఇలా..నేను చేసింది తప్పే..కాని నాకు మరో మార్గం తోచలేదు!" అన్నాడు వికాస్ దీనంగా. రవి సానుభూతి గా వికాస్ చేతి మీద చేయి వేసి" నిజమే, కష్టమేరా..కాదనను, కాని ఈపని చేసే ముందు నేను గుర్తుకు రాలేదా? నీవు లేకుండా నేనుండలేనని నీకు తెలియదా?"అంటూ రవి ఏడ్చేశాడు. మిత్రుడి కన్నీరు చూడడం తోనే వికాస్ కదిలిపోయాడు."ఊరుకోరా.నాకేం కాలేదు కద" అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. "ఊరుకోవాలా..ఎంత తేలికగా చెప్పావురా ఆ మాట..చూడరా మీ అమ్మగారి ముఖం ... ఎలా అయిపోయారో చూడు! ఒరే వికాస్, భయం అనేది ఒక వ్యాధి లాంటిదిరా..అది మనిషి ఆలోచనను చంపేస్తుంది. దానికి ధైర్యం అనే మందువేసి పరుగెత్తించాలి వీడి జోలికి వెళ్లడం వృధా అనేలా ఉండి ఆభయాన్ని తోకముడిచేలా చేయాలి. అంతేగాని మనమే జీవితం నుండి క్విట్ అయితే ఎలా?"అన్నాడు రవి. "నిజమేరా,నేను చేసింది తప్పే, ఇంకెప్పుడూ ఇలా చేయను"అంటూ తల్లివైపు తిరిగి "సారీ అమ్మా ..నన్ను మన్నించు!" అన్నాడు వికాస్ రెండు చేతులూ జోడించి. వెంటనే మీనాక్షి అతడి రెండు చేతులూ పట్టుకొని "నాన్నా,పెద్ద గండం గడిచి నీవు మాకు దక్కావు..అంతే చాలు, నీవిలా చేయడం చూసి నీ చెల్లెలూ తమ్ముడూ భయభ్రాంతులయ్యారు. ఇంకెప్పుడూ ఇలా చేయకు. మనకి ఆస్థులు లేకపోయినా పరవాలేదు..మీరు ముగ్గురూ చల్లగా ఉంటే చాలు!"అంది నీళ్లు నిండిన కళ్లతో. "లేదమ్మా నేనింకెప్పుడూ ఇలాంటి పని చేయను!"అంటూ తల్లి చేతిలో చేయి వేశాడు వాగ్ధానం చేస్తున్నట్లుగా. మరునాడు వికాస్ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన వికాస్ ని పట్టుకొని"అన్నయ్యా!" అంటూ అతడి చెల్లెలు కావ్యా తమ్ముడు నిషాంత్ ఏడుస్తూ అల్లుకుపోయారు. "వికాస్ భోజనం చేసి విశ్రాంతి తీసుకో..నేను రేపు వస్తాను..ఏం చేయాలో ఎలా చెయ్యాలో ఆలోచిద్దాము..వర్రీకాకు!"అని చెప్పి వెళ్లిపోయాడు రవి. వికాస్ స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి గా పడుకున్నాడు. అయితే ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టి స్థిమితంగా ఉండనివ్వలేదు అతడిని. వికాస్ ఆత్మహత్యా యత్నాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచాలనుకుంది మీనాక్షి..కాని కంపెనీ పెట్టిన దగ్గర నుండి ఉన్న సీనియర్ ఎకౌంటెంట్ సత్యమూర్తికి ఎలా తెలిసిందో.. ఆదుర్దాగా వచ్చేశాడింటికి. అతడికి గుమ్మంలోనే ఎదురైంది మీనాక్షి. అతడిని చూసి "రండి సత్యమూర్తి గారూ అప్పుడే విషయం మీదాకా వచ్చిందా?" అనడిగింది ఆశ్చర్యంగా. "తెలిసినవారు మిమ్మల్ని హాస్పటల్లో చూశారట, నాకు చెప్పారు .. వెంటనే మనసాగక ఇలా వచ్చేశాను.ఎలా ఉన్నారమ్మా వికాస్ బాబు?"అనడిగాడాయన సానుభూతిగా చూస్తూ. "బాగానే ఉన్నాడు అదిగో ఆ గదిలో ఉన్నాడు వెళ్లండి"అంటూ చూపించింది మీనాక్షి. ఏదో ఆలోచనలో ఉన్న వికాస్ అలికిడికి తల తిప్పి ద్వారం వంక చూశాడు. ఎదురుగా సత్యమూర్తి కనిపించడంతోనే లేచి కూర్చుంటూ" రండి సత్యమూర్తి గారూ.. కూర్చోండి..ఎలా ఉన్నారు?" అంటూ పలకరించాడు. "నాకేం బాబూ బాగానే ఉన్నాను..మీరెలా ఉన్నారు? జరిగిందానికి నేను చాలా బాధ పడుతున్నాను..చదువుకున్నవారు,అన్నీ తెలిసిన వారు మీరే ఇలా చేస్తే ఎలా బాబూ?..మీ కంటే చిన్నవాళ్లు చెల్లీ తమ్ముడూ ఏమైపోతారో ఆలోచించారా?అన్నాడు మందలిస్తున్నట్లుగా. "ఏదో అలా జరిగిపోయింది లెండి.. మూర్తిగారూ మీరీ కంపెనీ పెట్టిన దగ్గర నుండీ ఉన్నారు కదా..నాకు తెలిసి మన కంపెనీ ఎప్పుడూ నష్టాల బారిన పడిందని నేను వినలేదు , మరి అకస్మాత్తుగా ఇలా ఎలా జరిగిందండీ? నాన్నగారికి గుండెపోటు రావడానికి కంపెనీ దివాలాకు ఏదైనా సంబంధం ఉందంటారా!" అనడిగాడు వికాస్ సందేహంగా చూస్తూ. "మీ అనుమానం నిజమే బాబూ, సమయం చూసుకొని ఈ విషయాలన్నీ నేనే మీకు చెప్పాలనుకున్నాను. ఇంతలో వెంట వెంటనే అన్నీ ఇలా జరిగిపోయాయి. మీ నాన్నగారూ ధనుంజయగారూ కాలేజీలో కలిసి చదువుకున్నారు మంచి స్నేహితులు కూడా.. ఉద్యోగాల జోలికి పోకుండా ఈ కంపెనీ పెట్టారు.కంపెనీ అంచెలంచెలుగా పెరిగి బాగా విస్తరించింది.దాంతో షేర్ హొల్డర్స్ ని కూడా చేర్చుకొని మరింత అభివృద్ధి చేశారు. రెండుకుటుంబాల మధ్యా మంచి స్నేహం ఉండేది. రాకపోకలు విందు వినోదాలు జరిగేవి. వాళ్లమ్మాయి సువర్చలమ్మను మీకు ఇచ్చి చేద్దామనుకున్నాడు ఆయన. మీరిద్దరూ చిన్నప్పటి నుండీ కలిసిమెలసి పెరిగారని..మీ అమ్మా నాన్నగారు సరేనన్నారు. కానీ మీరు కాదనడంతో సమస్య మొదలైంది.అడిగి లేదనిపించుకోవడంతో ధనుంజయ గారి అహం దెబ్బ తిన్నది...దానిఫలితమే చాపకింద నీరులా మన కంపెనీలో లేని సంక్షోభం సృష్టించి నాన్నగారిని భయభ్రాంతులను చేసారు. మొదటినుంచీ ఈ కంపెనీ లావాదేవీలు చూస్తున్న నన్ను తొలంగించి, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదంటూ పరాంకుశం గారిని నియమించారు నా స్థానంలో..నేనీ విషయం నాన్నగారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయనకు ధనుంజయగారి ఆలోచనలేమీ తెలియవు కనుక పెరుగుతున్న టెక్నాలజీ ని ఉపయోగించుకుంటే పని సులువై కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు ఆమాటే నాతో అన్నారు..నేనూ నిజమే అనుకున్నాను.. నెమ్మదిగా ఒక పధకం ప్రకారం రికార్డ్ లన్నీ తారుమారు చేసి కంపెనీ దివాలా తీస్తోంది అని చెప్పారు. అతడిని సంపూర్ణ గా నమ్మిన నాన్నగారు ఇది తట్టుకోలేక మనని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయారు. ఇంతలో కాఫీలు పట్టుకొని వచ్చింది మీనాక్షి. "ఇపుడీ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకమ్మా!"అని నొచ్చుకుంటూ కాఫీ తీసుకున్నాడు సత్యమూర్తి. "ఏముంది లెండి కొంచెం కాఫీయే కద,మూర్తిగారూ ఈ ఆపద సమయంలో మీరే బాబుని కనిపెట్టి చూసుకోవాలి..వాడికి లోకం పోకడలు ఏమీ తెలియవు!"అంది మీనాక్షి. "ఎంత మాటమ్మా.అదిమీరు విడిగా నాకు చెప్పాలా..బాబుని నాకంటి పాపలా చూసుకుంటాను..మీరేమీ దిగులు పడకండి"అన్నాడు హామీ ఇస్తున్నట్లుగా "చాలండి,మీరున్నారన్న ధైర్యంతోనే ఇలా ఉన్నాము మేము!"అంది మీనాక్షి . "సత్యమూర్తి గారూ ఈ కుతంత్రానికి విరుగుడుగా మనం ఏమీ చేయలేమా?" అనడిగాడు వికాస్ ఆదుర్దాగా. అది వింటూనే "కుతంత్రమా?ఏం జరిగింది?"అని అడిగింది మీనాక్షి ఆదుర్దాగా. "తర్వాత చెప్తానమ్మా..."అంటూ సత్యమూర్తివైపు తిరిగి " మీరు చెప్పండి!"అన్నాడు వికాస్. "ఎందుకు చేయలేము బాబూ..కంపెనీ లావాదేవీలు ఉన్న ఫైల్స్ అన్నీ కంప్యూటర్ లో భద్రపరచి ఉంటారు కద.. ముందు మీరు వాటినన్నిటినీ పరిశీలిస్తే మొత్తం అంతా బైట పడుతుంది...లెక్కలు ఎక్కడ తారుమారయ్యాయో బోధపడుతుంది. నాన్నగారంటే ప్రాణం పెట్టేవాళ్ళు మన ఆఫీసు లో చాలామంది ఉన్నారు. వాళ్లంతా తప్పక మీకు సహకరిస్తారు. నాన్నగారు పోయినదగ్గరనుండీ ఈ విషయాలన్నీ మీ దృష్టికి తేవాలనుకున్నాను ఇప్పటికి సాధ్యమైంది." అన్నాడు సత్యమూర్తి. "థేంక్సండీ..ఇదంతా ఎలా జరిగిందో తెలియక గిజగిజలాడిపోయాను ఇప్పటిదాకా. మీరు చెప్పింది వినడంతోనే నా సందేహాలన్నీ మంచు విడిచినట్లు గా విడిపోయాయి. మీరంతా సహకరిస్తే సమస్యను సులువుగా పరిష్కరిస్తాను"అన్నాడు వికాస్ ధైర్యంగా. అతడి గొంతులో ధ్వనించిన ఆత్మవిశ్వాసం సత్యమూర్తికి ఎంతో సంతృప్తి ని ఇచ్చింది. "మంచిది బాబూ వెళ్లి వస్తాను " అని ఇద్దరికీ చెప్పి వెళ్లిపోయాడు. అతడు వెళ్లాక వికాస్ జరిగిందంతా తల్లికి చెప్పాడు. అదివిని "దుర్మార్గుడు ఎంతపని చేశాడు..చెల్లీ అని ప్రేమగా పిలుస్తూనే నా పసుపు కుంకుమలు తుడిచేశాడు!"అంది బాధగా. "బాధపడకమ్మా..పోయిన నాన్నగారిని తిరిగి తేలేను కాని మన పూర్వ వైభవాన్ని చెక్కు చెదరకుండా కాపాడతాను" అన్నాడు వికాస్ ధృఢంగా. "పసివాడివి ఇదంతా నీవేం చేయగలవురా?ఈ గొడవలో పడి ఇక్కడే ఉంటే నీ చదువేం కావాలి?"అంది మీనాక్షి బాధగా. "ఇంకే చదువులేమ్మా..దానికంటే ఇదేముఖ్యం మనకు, ఎందుకంటే ఇది మనందరి జీవితాలకూ సంబంధించినది..తక్షణం మనం దీన్ని పరిష్కరించుకోవాలి..నా బదులు నిషాంత్,కావ్యలను బాగా చదివిద్దాం లేమ్మా!"అన్నాడు నిబ్బరంగా. ............................. మరునాడు రవి వచ్చేసరికి వికాస్ తేరుకున్నాడు... స్నేహితుడి ముఖంలో తేటదనం చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రవి. తాను విన్నదంతా రవికి చెప్పాడు వికాస్. "అయితే ఇదంతా ఆయన కూతుర్ని నువ్వు కాదన్నందుకు తీర్చుకున్న రివేంజా?అన్ బిలీవబుల్! ఇన్నాళ్ల స్నేహాన్ని అంత సులువుగా ఎలా మర్చిపోయాడు ఆయన ?"అన్నాడు రవి. "అదంతా అవసరార్ధం స్నేహం లేరా..నిజమైన స్నేహితుడు ఎప్పుడూ అలా చేయడు..సరే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటావు?"అనడిగాడు. "సత్యమూర్తి గారు చెప్పినట్లు ఆఫీస్ రికార్డ్ అంతా వెరిఫై చేయడమే..కానీ ఇంత చేసినవాడు మనకి అనుమతిస్తాడా అవన్నీ చూసేందుకు?" అన్నాడు రవి సందేహం గా? "ఎందుకివ్వడు? ఇది ఉమ్మడి బిజినెస్..అతడికెంత హక్కుఉందో మనకీ అంతే ఉంటుంది కదా!"అన్నాడు వికాస్ కోపంగా. "అసలలాంటి న్యాయం ధర్మం ఉంటే ఇలాంటి దురన్యాయం ఎందుకు తలపెడతాడు?ఇంకేదైనా మార్గం ఆలోచించాలి.పోనీ ఈ ప్రయత్నంలో మనం సువర్చల సాయం తీసుకుంటే ఎలా ఉంటుందంటావు?"అనడిగాడు రవి. "సువర్చలనా..వాళ్ల నాన్నగారికి వ్యతిరేకంగా మనకు సాయం చేస్తుందంటావా?అందులోనూ నేను తనని రిజెక్ట్ చేశాను కద..ఆ కోపం మనసులో ఉండదా?"అన్నాడు సందేహంగా. మిత్రుని మాటలు విని ఒక్క నిమిషం అతడి వంక చూసి "అరే వికాస్,నిరాశా బాధలు కష్లాలు అనేవి ఆకాశం లో ఎగిరే పక్షులు లాంటివిరా..అవి నీమీద వాలినా పరవాలేదు.. గూడు మాత్రం కట్టుకోకుండా చూసుకో..లేకుంటే నిరాశ అనే ఆ గూటిలో నీవు బందీవై పోతావు..సువర్చలని నువ్వు ఎందుకు రిజెక్ట్ చేశావో నాకు తెలియదు కానీ తను చాలా మంచి అమ్మాయి. చిన్నప్పటి నుండి మనం ముగ్గురం కలిసి ఆడిపాడి పెరిగాము..తను ఎలాంటిదో ఆమాత్రం గ్రహించలేవా?"అన్నాడు రవి ఆలోచనగా. "సరేరా..ఫోన్ చెయ్యి!"అన్నాడువికాస్. ఫోన్ ఎత్తిన సువర్చల"హలో రవీ!ఎలాఉన్నావు?చాన్నాళ్లకి గుర్తొచ్చానే నేను.." అంది నిష్టూరంగా. "అదేం లేదులేమ్మా, నీతో చిన్నపని బడింది. ఒకసారి వికాస్ ఇంటికి రాగలవా?"అనడిగాడు రవి. "వికాస్ ఇంటికా?"అనడిగింది సువర్చల సందేహంగా. "అవును, నేనిప్పుడు వాళ్లింట్లోనే ఉన్నాను..నీకు తెలుసా, మొన్న వికాస్ సూసైడ్ ఎటెంప్ట్ చేశాడు!" అన్నాడు రవి బాధగా. అది వింటూనే "వాట్?సూసైడా...అంతకష్టమేమొచ్చింది వాడికి?సరే అవన్నీ తరువాత,నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను" అంటూ ఫోన్ ఆఫ్ చేసి పరుగులాంటి నడకతో బైటకు నడిచింది. రావడంతోనే."ఏంట్రా ఇలా చేశావు...అసలలాంటి పని ఎదైనా చేస్తే నేను కదా చేసుకోవాలి..నేను బాగానే ఉన్నాను..ఎందుకిలా చేశావురా నువ్వు? మావయ్య తోపాటు మేమంతా పోయామనుకున్నావా?"అంటూ వికాస్ చేతులను తన చేతిలోకి తీసుకుని ఏడ్చేసింది . సువర్చల అలా ఏడవడంతో అపరాధిలా తలవంచుకున్నాడు వికాస్.ఏ కల్మషమూ లేని ఈ అమ్మాయినా నేను శంకించాను?అనుకున్నాడు కొంచె సిగ్గుగా. "ఏంలేదు సువర్చలా.."అంటూ జరిగిందంతా టూకీగా చెప్పాడు రవి. అంతా విన్న సువర్చల నమ్మలేనట్లుగా చూస్తూ "నాన్న ఇలా చేశారా? నమ్మలేకపోతున్నాను.. ఎందుకంటే మావయ్య పోయిన దగ్గరి నుండి ఆయన సరిగా తిండి తినడం లేదు..నిద్ర పోవడంలేదు.దిగులుతో సగమయ్యారు" అంది " అవునా...కానీ నవ్వు నమ్మినా మానినా ఇది నిజం సువర్చలా..అసలే అంకుల్ పోయిన బాధ నుండి ఆంటీ తేరుకోక ముందే వాడిలా చేశాడు. జరిగిందేదో జరిగింది, దాన్ని మనం వెనక్కి తీయలేము. మనిద్దరం వీడి స్నేహితులుగా ఏదైనా చేసి ఈ సమస్య నుండి వాడిని బైట పడేయాలి!" అన్నాడు రవి. "అరే రవీ వాడికి ఏదైనా అయితే మనకి అయినట్లే కదరా..బంగారం కరిగిపోవచ్చు,డబ్ఫు తరిగి పోవచ్చు పూలు వాడిపోవచ్చు..కానీ ఒకసారి కలిసిన స్నేహం చితినైనా మాసిపోదని నువ్వే కదరా చెప్పేవాడివి..చెప్పరా నన్నేం చేయమంటావు?"అంది సువర్చల ఉద్వేగంగా. "గత నాలుగేళ్లుగా మన కంపెనీ ఇతరులతో చేసిన కరెస్పాండెన్స్.వ్యాపార లావాదేవీల వివరాలన్నీ కావాలి.ఆఫిసులో కంప్యూటరైజ్ చేసిన సమాచారాన్ని అంతటినీ పెన్ డ్రైవ్లో ఎక్కించి తీసుకురా..అవి మన దగ్గర ఉంటే ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు.!"అన్నాడు రవి. "ఓ ష్యూర్ తప్పక తెస్తాను"అంది సువర్చల. తరువాత వారిద్దరితో కాసేపు మాట్లాడి.. మీనాక్షి తో కాఫీ చేయించుకొని తాగి వెళ్లిపోయింది. అరమరికలు లేని ఆమె ప్రవర్తనకు ముగ్ధుడవుతూ "దటీజ్ సువర్చల వికాస్, అనవసరంగా లేనిపోని అపోహలతో తనని పిలవొద్దు అన్నావు కానీ..విషయం వినగానే తనెంత పాజిటివ్ గా రియాక్ట్ అయిందో చూశావా!"అన్నాడు రవి. "నిజమేరా నేను నాబాధలో ఉండి సరిగా ఎనలైజ్ చేయలేకపోయాను..తను నా కోసం ఏడుస్తూంటే చూసి నేనే తట్టుకోలేక పోయాను"అన్నాడు వికాస్ దిగులుగా "అరే వికాస్ సమస్యంతా కొద్ది రోజుల్లో పరిష్కారం అయిపోతుంది కదరా ఇంకా ఎందుకురా అలా డల్ గా ఉంటావు?ఈ బిజినెస్ ఈ చికాకులూ అన్నీ జీవితంలో ఒక పార్ట్ రా.. మొత్తం జీవితం అదికాదు.. ముందు నీ ఆలోచనలనుండి బైటపడి రిలాక్స్ అవ్వరా. అప్పుడే కొత్త శక్తి వస్తుంది"అన్నాడు రవి. " నీ లాంటి స్నేసితుడు నా చెంత నుంటే నాకు దిగులేంట్రా? నేను మెడికల్ స్టూడెంట్ని నాకీ లెక్కలవీ చూడడం రాదంటే నేనున్నాను కదరా అన్నావు...ఇప్పుడు ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఎలా అంటే సువర్చలను రప్పించి చిటికెలో పరిష్కారం చూపావు...ఈ కష్ట సమయంలో నేనున్నానని భరోసా ఇచ్చావు..నీకేంకాదని భుజం తట్టావు...నేను భయపడితే నా అండగా నా పక్కనే నిలిచావు..ఇలాంటి అదృష్టం అపురూపమైన స్నేహం ఎవరికి దక్కుతుంది?నీవు నా పక్కనుండగా నాకు దిగులెందుకుంటుంది?"అంటూ రవిని హత్తుకున్నాడు వికాస్. ”చాల్లేరా బాబూ మరీ మునగ చెట్టు ఎక్కించకు నీవు మునుపటిలా నవ్వుతూ తుళ్లుతూ ఉంటే చాలు నాకు!"అన్నాడు రవి ఆనందంగా. అన్నట్లుగానే మరునాడు సువర్చల వారడిగిన సమాచారం అంతా పెన్ డ్రైవ్ లో పెట్టి తీసుకువచ్చింది.ముగ్గరు మిత్రులూ కలసి క్షుణ్ణంగా పరిశీలించారు రెండు రోజులపాటు.లెక్కలు ఎక్కడ ఎప్పుడు తారుమారు చేయబడ్డాయో అర్ధమైపోయింది వారికి. "మీ నాన్నగారిని అకాల మరణానికి. గురి చేసి నీకింత మానసిక క్షోభను కలిగించిన మా నాన్నగారికి తగిన శిక్ష పడేలా చెయ్యి వికాస్?" అంది సువర్చల ఉద్రేకంగా. "మీ నాన్నగారు కావాలనే ఇదంతా చేసినా.. నేను ఆయన్ని పదిమంది ముందు దోషిగా నిలబెట్టలేను..మనకి ఎలాంటి నష్టమూ జరగలేదని తేలింది కదా, అదిచాలు.నేను మావయ్యతో పర్సనల్గా మాట్లాడతాను..దానికి ఆయన అంగీకరించని పక్షంలో నీవన్నట్లు చేద్దాం! ఏం రవీ నేనన్నది కరెక్టేనా?"అనడిగాడు వికాస్ ఏమీ తెలియని అమాయకుడిలా ఉండే వికాస్ లో ఇంత వివేచన పరిణతి దాగి ఉందా? అపకారికి కూడా ఉపకారం చేయాలి అనేంత దొడ్డమనసా వీడిది? అని ఆశ్చర్యపోతూనే.. "బాగుంది వికాస్ అలాగే చెయ్యి. కాని దానికి ఆయన సమ్మతిస్తారా?"అన్నాడు రవి సందేహంగా. "ప్రయత్నిద్దాము..ప్రయత్నించడంలో తప్పులేదు కద!" అన్నాడు వికాస్. "మానాన్న నిన్ను బెదిరించి తన దారికి తెచ్చుకునేందుకు ఇదంతా చేశారే గాని ఇంకేమీ లేదు..నీతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోతే అప్పుడు మనం ఇవన్నీ బైటపెట్టవచ్చు నిరభ్యంతరంగా" అంది సువర్చల. వెంటనే ధనుంజయ కి ఫోన్ చేసి "మావయ్యా ..నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.. ఎప్పుడు వీలవుతుంది మీకు?"అనడిగాడు నమ్రతగా. వేళగాని వేళ వికాస్ అలా ఫోన్ చేసి అడగడంతో కొంచెం తికమకగా అనిపించింది ధనుంజయకు. "ఏం మాట్లాడాలి?" అన్నాడు గొంతు పెగుల్చుకొని..ఆ మాటల్లో మునుపటంత ధాటీ లేదు. "అదే అంకుల్ 4రోజుల క్రితం మన కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ మా ఇంటికి వచ్చి..కంపెనీ నష్టాల్లో ఉందని తామంతా విత్డ్రా అవుతామని అన్నారు..ఆ ముందు రోజు పరాంకుశం గారు వచ్చి కంపెనీ నష్టాల్లో ఉంది , వర్కర్స్ కి జీతాలివ్వడం కష్టంగా ఉంది అన్నారు దాని గూర్చి మాట్లాడదామని.." అన్నాడు వికాస్. "ఇంక మాట్లాడేందుకు ఏముంది..అంతా అయిపోయాక!" అన్నాడు ధనుంజయ. " అదే ఒకసారి మీతో మాట్లాడాలి,నేను వస్తున్నాను!" అంటూ అతడికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. రవీ సువర్చలా 'కరెక్ట్' అన్నట్లుగా బొటనవేలు ఎత్తారు విజయసూచకంగా. అతడు వెళ్లేసరికి ధనుంజయ తన గదిలో సిద్ధంగా కూర్చున్నాడు. వికాస్ ని చూసి పలకరింపుగా నవ్వి.."రా..కూర్చో!" అంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. వికాస్ అతడి ఎదురుగా కూర్చుంటూ"ఏమిటి మావయ్యా ఇలా అయిపోయారు?"అనడిగాడు వికాస్ బాధగా చూస్తూ. "నేనెలా ఉంటే నీకెందుకు గానీ వచ్చిన పని చెప్పు ముందు!" అన్నాడు విసుగ్గా. అతడితో మామూలుగా మాట్లాడితే కుదరదని అర్ధమైన వికాస్ "మావయ్యా..నేను ఆఫీస్ రికార్డ్ అంతా పరిశీలించాను..మన కంపెనీకి ఎక్కడా నష్టం వచ్చినట్లుగా లేదు..బేంకులో కోటిరూపాయల పైన ఉండగా పరాంకుశం గారు వర్కర్స్ కి జీతాలివ్వలేక పోతున్నాము అన్నారు. ఎందుకు మావయ్యా లేనిది ఉన్నట్లుగా సృష్టించి నన్నింత యాతనకు గురి చేశారు? చిన్నప్పటి నుండి మా నాన్నగారి తరువాత మిమ్మల్నే ఆ స్థానంలో ఉంచి గౌరవించాను. నాన్న లేకపోయినా మీరు నాకున్నారని ఎంతో ధైర్యం గా ఉన్నాను. ఎందుకు మావయ్యా ఇలా చేసి నా నమ్మకాన్ని వమ్ము చేశారు? నాదగ్గర ఉన్న ఈ ఆధారాలతో మిమ్మల్ని నలుగురి ముందూ దోషిగా నిలబెట్టేందుకు మూడు నిమిషాలు పట్టదు..కానీ నా కది ఇష్టం లేదు..సమస్యను మీకే వదిలేస్తున్నాను చెప్పండి ఏమి చేద్దామో;"అన్నాడు వికాస్. అతడి మాటలు వినడంతోనే ధనుంజయ మనసంతా అపరాధ భావనతో నిండిపోయింది. పసివాడు...వాడి మనసులో నాకు అంత ఉన్నత స్థానం ఇస్థే నేనెంత నీచంగా ఆలోచించాను. నాకూతుర్ని వద్దన్నాడన్న కోపంతో మిత్రద్రోహానికి తలపెట్టి నా స్నేహితుడ్ని పొట్టన బెట్టుకున్నాను..ఇంకా కసి తీరక వీడిని అగచాట్ల పాలు చేయాలనుకున్నాను. కానీ అన్నీ తెలిసి కూడా ఎంత ఔదార్యం తో ప్రవర్తిస్తున్నాడు?అనుకోగానే అతడి మనసంతా కరిగి కన్నీరై పొంగింది. "అరే వికాస్,నేను చేసింది తప్పేరా..నన్ను మన్నించు. నా మాట చెల్లలేదనే కోపంతో మీకు తీరని ద్రోహం తలపెట్టాను..ఫలితంగా నా ప్రాణమిత్రుడైన మీ నాన్నని కోల్పోయాను.. ఆనాటినుండి ప్రాణం లేని కట్టెలా ఉన్నాను..ఈ వారం రోజులుగా పరాంకుశం చేసిందేమీ నాకు తెలియదు..నేను గతంలో అన్నమాటలు పట్టుకొని అతడిదంతా క్రియేట్ చేసి ఉంటాడు" అంటూ కుర్చీలోనుండి లేచివచ్చి వికాస్ చేతులు పట్టుకున్నాడు ధనుంజయ. "అంతమాట వద్దు మావయ్యా..జరిగిందేదో జరిగిపోయింది మర్చిపోదాం అదంతా..మరి నేను వెళ్లి వస్తాను."అంటూ లేచాడు. అతడిని ఉండమనేందుకు కూడా ముఖం చెల్లలేదు ధనుంజయకు..మౌనంగా తల పంకించాడు. అతడికోసం ఆత్రంగా ఎదురు చూస్తూ రవీ సువర్చలా అక్కడే ఉన్నారు.వెళ్లిన అరగంటకే తిరిగి వచ్చిన వికాస్ వైపు ఆత్రంగా చూశారిద్దరూ! " సాధించాను, మీరిద్దరూ తోడు అయ్యాక మనకి విజయం తప్ప అపజయం ఎందుకుంటుంది? దిక్కు తోచని స్థితిలో స్నేహానికి అసలు సిసలైన నిర్వచనంలా నాకు అండగా నిలచి దిశా నిర్దేశం చేశారుమీరు.నిజానికి ఈ విజయం నాది కాదు మీది!" అన్నాడు ఆనందంగా. "అంత మాటలెందుకు లేరా..మనది విడదీయరాని స్నేహబంధం..ఒకరి కాల్లో ముల్లు గుచ్చుకున్నా మిగతావారి కంట్లో నుండి నీళ్లు వస్తాయి...అందుకే పెద్దలంటారు 'స్నేహమంటే మధ్యలో పుట్టి మట్టిలో కలిసేది కాదు...మనసులో పుట్టి మట్టిలో కలిసే దాకా మాసిపోనిది'అని....మనది కూడా అలాంటి స్నేహమేరా!" అన్నాడు రవిఅభిమానంగా చూస్తూ. "మీ ఇద్దరితో కూర్చుంటే కబుర్లు తెమలవు గానీ నేనిక వెళ్తాను" అంటూ లేచింది సువర్చల. "థేంక్యూ సువర్చలా.ఐ విల్ నాట్ ఫర్ గెట్ యువర్ హెల్ప్ ఇన్ మై లైఫ్!"అన్నాడు వికాస్ ఆమెకు షేక్ హేండ్ ఇస్తూ! "ఇట్స్ ఓకే!" అని చిన్నగా నవ్వుతూ వెళ్లిపోయింది సువర్చల. ఆమె వెళ్లిన వంకే చూస్తూ "ఎంత మంచి అమ్మాయిరా సువర్చల..నీకు కష్టం వస్తే తనకే వచ్చినట్టుగా గిలగిల లాడిపోయింది..అరే వికాస్, నువ్వేమి అనుకోనంటే నిన్నొక మాట అడుగుతానురా!" అన్నాడు రవి. "అడగరా..నా దగ్గర నీకు మొహమాటం ఏమిటి?"అన్నాడు వికాస్ చిరునవ్వుతో. "ఏమీ లేదురా..సువర్చల లాంటి మంచి అమ్మాయిని ఎలా కాదన్నావురా..ఎవరినైనా ప్రేమించావా?" అనడిగాడు రవి ఆసక్తిగా. "అయ్యో అంత సీనేమీ లేదురా..నా దృష్టంతా కెరీర్ మీదే ఉండేది. మంచి కార్డియాలజిస్ట్ కావాలనేది నాకల..అసలు సువర్చలనే కాదు, ఏ అమ్మాయినీ నేను పెళ్లి దృష్టితో చూడలేదు ఇప్పటివరకూ!" అన్నాడు వికాస్ మెల్లగా. "పోనీ ఇప్పుడాలోచించరా తన గూర్చి..మీరిద్దరూ మేడ్ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారని నా ఉద్దేశ్యం.తనతో నీ లైఫ్ చాలా హేపీగా ఉంటుందని నా నమ్మకం!"అన్నాడు రవి నచ్చజెప్తున్నట్లుగా. "నిజమేరా..నేనూ అలాగే అనుకుంటున్నాను మనసులో..తనిక్కడి నుండి వెళ్లిపోయాక నాకు చాలా వెలితిగా అనిపించింది. కాని ఒకసారి కాదన్నాక ఇపుడు కావాలంటే.. తనేమనుకుంటుందోరా...మనకి చేసిన సాయానికి బదులుగా పెళ్లి చేసుకుంటాను అన్నానని అపార్ధం చేసుకోదా?" అన్నాడు సందేహం గా. "అయితే తనంటే నీకు అభ్యంతరం లేదు కదా నేను వెళ్లి మాట్లాడనా?"అన్నాడు రవి ఉత్సాహంగా. "వద్దురా ,తనని కాదని బాధ పెట్టింది నేను..నేనే స్వయంగా మాట్లాడి ఒప్పిస్తాను." అన్నాడు వికాస్. "మంచి నిర్ణయంరా..నేను వెళ్లొస్తాను!"అంటూ వికాస్ని ఒకసారి ఆలింగనం చేసుకొని వెళ్లిపోయాడు రవి. అతడు వెళ్లాక సువర్చలకు ఫోన్ చేశాడు వికాస్. "హలో వికాస్.." అంది ఫోనెత్తి సువర్చల. "హలో సువర్చలా,అర్జంటుగా నిన్ను కలవాలి. నువ్వెక్కడున్నావు?"అనడిగాడు ఆత్రంగా. " మా ఇంట్లో నే ఉన్నాను..అయినా ఇప్పటి దాకా అక్కడే ఉన్నాను కద,ఏమిటంత అర్జంటు?" అనడిగింది అర్ధం కాక. "వచ్చాక చెప్తాను కద!"అంటూ ఫోన్ పెట్టేసాడు వికాస్. ఏమిటబ్బా అంత అర్జెంట్ అనుకుంది సువర్చల. అన్నట్లుగానే వెంటనే బయలుదేరి వెళ్లాడు. వికాస్ ని చూసి ధనుంజయ అతడి భార్యా ఆశ్చర్యపోయారు. ఫార్మల్ గా వారిని విష్ చేసి సువర్చల గదిలోకి వెళ్లాడు. "వచ్చావా..రా కూర్చో!"అంటూ చనువుగా చేయి పట్టుకొని కూర్చీ దగ్గరకు తీసుకు వెళ్లింది సువర్చల. వికాస్ కూర్చోకుండా ఆమెముందు మోకాళ్లమీద కూర్చొని. "ఐయామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ సువర్చలా..నేను నిన్ను చాలా నొప్పించాను..ఎంతో కష్ట పెట్టాను మానసికంగా..ప్లీజ్,జరిగిందంతా మర్చిపో..మనం పెళ్లి చేసుకుందాం. నా మా ట కాదనకు!"అన్నాడు వికాస్ ప్రాధేయపడుతున్నట్లుగా. అతడి మాటలు వినడం తోనే అంతవరకూ ప్రసన్నంగా ఉన్న సువర్చల ముఖం గంభీరంగా మారిపోయింది. "ఏమిటి వికాస్, లేముందు..నేను నీకు చేసినదానికి ప్రత్యుపకారంగా నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా?" అని అడిగింది సువర్చల ఆత్మాభిమానం దెబ్బ తిన్నట్లుగా చూస్తూ. "లేదు లేదు ,నువ్వంటే నాకు చాలా ఇష్టం..ఇన్నాళ్లూ నేనేం కోరుకుంటున్నానో నాకే తెలియక నిన్ను కాదన్నాను. ఇపుడు నాకు క్లారిటీ వచ్చింది. నీవు లేకుండా నిజంగా నేనుండ లేను. ఐలవ్ యూ సువర్చలా!" అన్నాడు ఉద్వేగంగా. ”ఎలా వచ్చింది క్లారిటీ? ఇన్నాళ్లూ లేనిది ఈ నాలుగు రోజుల్లోనే వచ్చిందా? అసలు ప్రేమంటే అర్ధం తెలుసా నీకు?ఇదేమైనా పిల్లాట అనుకుంటున్నావా?స్విచ్ వేస్తే వెలిగే లైట్ లా..నువు కాదంటే కృంగి పోయి అవునంటే పొంగి పోయేందుకు..నేనూ మనిషినే వికాస్. నాకు కూడా కొన్ని స్వంత అభిప్రాయాలు ఉంటాయని గమనించావా అసలు..వద్దు ,నాకు ఇలాంటి ప్రేమ అవసరం లేదు. ఎప్పటిలాగే మనం స్నేహితులుగా ఉందాము.అంతకంటే నా నుండి ఎక్కువ ఆశించకు!"అంది సువర్చల ఖండితంగా. "అయ్యో సువర్చలా నీ కెలా చెప్తే అర్ధమవుతుంది?నేను కావాలని చేయలేదు..అలాగే నిన్ను నొప్పించే ఉద్దేశం అసలు లేదు..కేవలం కెరీర్ మీద దృష్టితో ఇప్పట్లో పెళ్లి వద్దనుకున్నాను...కాని ఇక్కడికి వచ్చాక పరిస్థితులను తట్టుకోలేక నేను ఆత్మహత్యా ప్రయత్నం చేసినపుడు నాకోసం నీవు తల్లడిల్లిపోతూ కన్నీరు కార్చినపుడు అర్ధమైంది.నా అనే బంధం ఎంత బలమైనదో...ఆ క్షణమే నిర్ణయించుకొన్నాను..నా సోల్మేటువు నువ్వేనని..నీవు కాదంటే నేను జీవితంలో పెళ్లిమాట తలపెట్టను!" అన్నాడు ఆర్తిగా. అతడి మాటల్లోని నిజాయితీ సువర్చల శంకించ లేకపోయింది. వెంటనే తానూ అతడి ముందు కూర్చుని "ఐ టూ లవ్ యూ వికాస్!" అంటూ అల్లుకుపోయింది వికాస్ ని.