మల్లంపల్లి మండల కేంద్రమైనా.. మరీ పెద్ద ఊరేమీ కాదు. దాదాపు వేయి గడపల జనవాసం. కరోనా కష్టకాలంలో సాగర్ తన పథకం ప్రకారం .. స్నేహ బృందంతో ‘యుగంధర్ యువజన సంఘం’ ఏర్పాటు చేశాడు. యుగంధర్ అతని అన్నయ్య పేరు. మన ఊరిని మనం కంటికి రెప్పలా.. ఎల్లవేళలా కాపాడుకోవాలని.. దాని కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలని కలలు కనే వాడు. కాని అది కార్య రూపం దాల్చక ముందే కన్ను మూశాడు. అలా అతడి ఆశయాల మేరకు సాగర్ యువజన సంఘానికి తెరలేపాడు..
మన ఊరును రావణ కాష్టంలా మార్చుకోవద్దని.. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం.. మాస్కులు, శానిటైజర్లు పంచడం యువజన సంఘ దిన చర్యగా మార్చాడు. దాంతో ఆ ఊళ్ళో ఒక్క పాజిటివ్ కేసు గూడా నమోదు కాలేదు. అందుకే సాగరన్నా, యువజన సంఘమన్నా.. ఊళ్ళో అందరికీ అత్యంత అభిమానం. సంఘం చెప్పింది.. తు.చ. తప్పకుండా పాటిస్తారు.
అనంతయ్య పండ్లు, కూరగాయల ఏజెంట్. రైతుల వద్దకు నేరుగా వెళ్ళి, వాళ్ళ కడుపులు కొట్టి సరుకు వ్యానులో తెస్తాడు. ముందస్తుగానే డబ్బులు వస్తున్నాయనే ఆశతో పాపం!.. రైతులు అనంతయ్య కరారు చేసిన ధరకే అందజేస్తారు. తెల్ల వారు ఝామున్నే మల్లంపల్లికి వచ్చి షాపు యజమానులకు పండ్లు, కూరగాయల ధరలు తనే నిర్ణయించి అంటగడ్తాడు. దాంతో చిల్లర వ్యాపారుల చేతులు బండ కింద చేతులు ఇరుక్కు పోయినట్టు బాధ పడే వారు. అనంతయ్య నిర్ణయించిన ధరలే ఎక్కువ. వారు మరింత పెంచి అమ్మక పోతే వాళ్ళకూ జీవనం గడవదు. మనసును చంపుకుని అధిక ధరలకు అమ్మక తప్పేది కాదు.
రాత్రి పది గంటలకు అనంతయ్య తిరిగి వచ్చి.. తన వద్ద ఉన్న చిట్టా ప్రకారం డబ్బులు వసూలు చేసుకుంటాడు. అదనంగా కనికరం లేకుండా కమీషను సరేసరి. అలా మరో రెండు , మూడు మండలాలలో తన వ్యాపారం వ్యాప్తి చేసుకున్నాడు స్థిరంగా ఒక ఊళ్ళో అంటూ ఉండడు. అతనికి పోటీదారులు రాకుండా రాక్షసంగా వ్యవహరించే రకం.. ఎవరూ అతనిని ఎదురించి బతికి బట్ట కట్టలేరని ప్రతీతి. ఊరి సర్పంచ్ లను బుట్టలో వేసుకుని తన పని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. పోలీసులకు మామూళ్ళు మామూలే.. అలా అనంతయ్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది..
కరోనా కాలంలో అనంతయ్య ఆగడాలు మరింత అధికమయ్యాయి. విపరీతంగా ధరలు పెంచేసి అధిక లాభాల వేటలో పడ్డాడు.
‘కరోనా వైరస్’ ను అడ్డు పెట్టుకుని, అదనంగా సంపాదించాలని.. ఆరాట పడే అనంతయ్యకు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రణాళికలు రచించాడు సాగర్. దానిలో భాగంగా యువజన సంఘ సభ్యులను సమావేశ పరిచి తన ప్రణాళికను వివరించాడు. ఒక్కొక్కరికి ఒక వీధి అప్పంగించాడు. ఇది సాధ్యయ్యే పనేనా! అని ముందు అంతా తటపటాయించారు. కాని సాగర్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ..
“మనం ప్రయత్నించకుండా ఫలితం ఆశించ లేము. మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రజలు మనకు అండగా ఉంటారనే నమ్మకం నాకుంది” అంటూ ప్రజలకు ఎలా చెప్పాలో మరో మారు విశదీకరించాడు. కార్య దీక్షలో అంతా ముందుకు కదిలారు.
***
ఆరోజు అనంతయ్య దినచర్య మల్లంపల్లిలో యధావిధిగా మొదలయ్యింది. ప్రతీ షాపు ముందు కూరగాయ ధరల పట్టిక వేళ్ళాడ దీసి మరో ఊరికి పయనమయ్యాడు. అలా, అలా తిరుగాల్సిన ఊర్లన్నీ తిరిగాడు. కరోనా కర్ఫ్యూ మూలాన కాస్త పెందళాడే డబ్బు దండుకుందామని మల్లంపల్లికి వచ్చాడు.
అక్కడి వాతావరణం చూసి కంగుతిన్నాడు.
మార్కెట్ అంతా నిర్మానుష్యంగా ఉంది. వ్యాపారస్తులు ఈగలు తోలుకుంటున్నారు. అనంతయ్యను చూస్తూనే.. ఈరోజు బోణీ కాలేదన్నట్టు బావురుమన్నారంతా..
“అదేంటి.. “ అంటూ ఆరా తీశాడు.
ధరలు ఎక్కువ ఉన్నాయని.. ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని వివరించారు.
అనంతయ్యకు ఆమానమేసింది. తేల్చుకుందామని ఊళ్లోని సర్పంచ్ ను కలిశాడు. సర్పంచ్ నేరుగా ‘యుగంధర్ యువజన సంఘానికి’ దారి చూపాడు. అనంతయ్యకు అరికాలి మంట నెత్తికెక్కింది. సంఘం అంతు చూడాలని ఆ ఊళ్ళో తన కుడి భుజాలైన నేస్తాలకు ఫోన్లు చేశాడు. ఎవరూ సహకరించ లేదు. మొదటి సారిగా ఒంట్లో వణకు పుట్టింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. యువజన సంఘంలో అడుగు పెట్టాడు. ఎదురుగా బోర్డు కనబడింది. ‘మాస్క్ లేనిదే ప్రవేశించరాదు’. వెంటనే మాస్క్ పెట్టుకున్నాడు. సాగర్ బృందం సాదరంగా అనంతయ్యకు స్వాగతం పలికింది.
‘తాడో..! పేడో..! ‘ తేల్చుకోవాలి అన్నట్టు నేరుగా విషయానికి వచ్చాడు అనంతయ్య.
“సాగర్.. బాగా చదువుకున్న వాడివి. ముందుండి సంఘాన్ని నడిపిస్తూ.. గ్రామ క్షేమాన్ని కాపాడుతున్నావని తెలుసు. కాని నేవ్వే ఇలా పండ్లు, కూరగాయలు ఎవరూ కొనకుండా అడ్డుకోవడం విచిత్రంగా ఉంది. ఈ కరోనా కాలంలో మనషులకు ఇమ్యునిటీ పెంచేది అవే గదా.. “ అంటూ లాజిక్ గా అడిగాడు.
సాగర్ చిరు నవ్వు నవ్వుతూ.. “చూడు అనంతయ్యా.. అదే కారణంతో కరోనా కాలంలో నీ ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మడం సబబు కాదు. మన గురజాడ వారు 'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి..’ అన్నారు. నీ బ్రతుకుదెరువు కోసం వ్యాపారం చేసుకోవడంలో తప్పు లేదు. కాని అమానుషంగా నడుచుకోవడం సరియైనది కాదని మా సంఘం తరఫున హెచ్చరిస్తున్నాను. ఇక ముందు నువ్వు రైతుల నుండి రశీదులు తీసుకు వచ్చి మాకు చూపాలి. మా సంఘం ధర నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే మా వ్యాపారులు అమ్మకాలు జరుపుతారు. కమీషన్లంటూ కక్కుర్తి పడగూడదు. అలా నీకు కుదరదని పక్షంలో.. మా ఊరి వ్యాపారం మా సంఘమే చూసుకుంటుంది ” అంటూ ఊరి కట్టుబాట్లను వివరించాడు.
“నాకు ఈ ఊరేమీ శాశ్వతం కాదు సాగర్.. వస్తాను” అంటూ రుస, రుసా వెళ్ళిపోయాడు అనంతయ్య. రెండు రోజులు పోతే వాళ్ళే దారికి వస్తారన్న ధోరణిలో..
నాలుగు రోజులయినా.. మల్లంపల్లిలోనే కాదు ఇతర ఊళ్లలోనూ అనంతయ్య సరుకు అమ్ముడు పోలేదు. పండ్లు, కూరగాయలు కుళ్ళి పోతూండడంతో ధరలు తగ్గాయి అనే తాయిలం బోర్డులు తగిలించాడు అనంతయ్య. అయినా అతని వ్యాపారంలో ఏమాత్రమూ మార్పు రాలేదు.
యుగంధర్ యువజన స్ఫూర్తి గ్రామ, గ్రామానికీ ప్రాకింది. ప్రతీ ఊళ్ళో ఒక యువజన సంఘం వెలిసింది.
ప్రజలతో బాటు వ్యాపారస్తులంతా యువజన సంఘాలకు సంఘీభావం తెలిపారు.
యువజన సంఘాలన్నీ ప్రజా బలంతో వ్యాపారం దిశగా పావులు కదుపుతుంటే.. అనంతయ్య గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. కాళ్ళబేరానికి రాక తప్ప లేదు. *