యం.కాం. డిగ్రీ చేత పట్టుకుని కట్టు బట్టలతో బ్రతుకు తెరువు కోసం సికిందరాబాదు చేరిన ఆనంద్ కి సిటీ కొత్త. తెలిసిన వారెవరూ లేరు. దేవుడి మీద భారం వేసి గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక దారి దొరక్కపోదనే ఆత్మ విశ్వాసంతో హైదరాబాదుకి బయలు దేరేడు. సికిందరాబాదు రైల్వస్టేషన్ ప్లాట్ ఫారం మీద జేబులో మిగిలిన పది రూపాయలు పెట్టి బిస్కిట్ పేకెట్ కొని తింటూ కాలినడకన వస్తూంటే కొద్ది దూరం తర్వాత క్లాక్ టవర్ పబ్లిక్ పార్కులో చెట్ల కింద పడుకుని కొందరు, చీట్ల పేకాట ఆడుతూ మరికొందరు తనలాగే బ్రతుకు తెరవు కోసం వచ్చిన వారిలా కనిపించారు. ఎండ ముదిరినందున కొంచం విశ్రాంతి కోసం పార్కులో కొచ్చి ఒక చల్లని ప్రదేశంలో చెట్టు కింద కూర్చున్నాడు. రోడ్డు మీద చెత్తాచెదారం ఏరుకుని అమ్మి దొరికింది తింటూ విశ్రాంతి మందిరంలా గడ్డి మీద పడుకుని సేద తీరుతున్నారు మరి కొందరు. పార్కు చివర ఫుట్ పాత్ నీడలో చిలక జోస్యం చెప్పే వ్యక్తి పాత న్యూస్ పేపర్ పరుచుకుని కూర్చుంటే ఒకరిద్దరు ఆశావాహులు అతని దగ్గర చేరి వారి భవిష్యత్ కలలు తెలుసుకుంటున్నారు. ఆనంద్ బిస్కిట్ పేకెట్ తిని పార్కులో కొళాయి నీళ్లు తాగాడు కాబట్టి కడుపు చల్లబడింది.తర్వాతి కార్యక్రమ మెలాగా అని ఆలోచనలో పడ్డాడు. సిటీలో మంచి ఉధ్యోగం సంపాదించి అమ్మని తీసుకు వచ్చి మంచి డాక్టరుకి చూపించి ఆయాసానికి వైద్యం చేయించాలి. కళ్లడాక్టరు చేత పరిక్ష చేయించి కళ్లజోడు పెట్టించాలి.భవిష్యత్ గురించి ఆలోచనలో ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత మరొక వలసపక్షి పాత న్యూసు పేపరు కింద పరుచుకుని ఆనంద్ కి కొద్ది దూరంలో కూర్చున్నాడు. అక్కడి పరిసరాలు పరిస్థితులను బట్టి పొట్ట చేత పట్టుకుని వచ్చిన తనలాంటి వారి అడ్డా క్లాక్ టవర్ పార్కని అర్థమైంది ఆనంద్ కి. అక్కడ ఉన్న వారిలో అన్ని వయసుల వారు చింపిరి జుత్తు పెరిగిన గెడ్డాలు మాసిన బట్టలతో దేవదాసుల్లా కనబడుతున్నారు. " ఏ ఊరు సామీ ! " పలకరించాడు దగ్గర కూర్చున్న వ్యక్తి. ఆంధ్రా నుంచి వచ్చానని తన వివరం చెప్పాడు ఆనంద్ . " అలాగా , సదువుకున్న కుర్రోడివా ? సదువుకున్నోడైనా చాకలైనా ఈ సిటీలో ఒకటే. ఇప్పుడు సిటీలో ఎలక్సన్లు జరుగుతున్నాయి. పార్టీ జండాలు పట్టుకుని జై కొట్టడానికి మనుసులు అవుసర మవుతారు. మనుసుల్ని సప్లై చేసే బ్రోకరోడు ఈడ కొస్తాడు.ఆడితో పోతే లారీ ఎక్కించి తీసుకుపోయి బిర్యానీ పేకెట్టు క్వార్టరు మందు ఆడి కమీసను తీసుకుని వంద రూపాయిలిచ్చి ఈడ వదిలి పోతాడు. ఇస్టమైతే సెప్పు. బ్రోకరోడు వచ్చి నాక మాటాడుతా" అన్నాడు. ప్రస్తుతానికి ఏదోఒక ఆధరువు దొరికితే తర్వాతి సంగతి ఆలోచించ వచ్చను కున్నాడు మనసులో. మధ్యాహ్నం మూడు గంటలైంది. ఒక లారీ పార్కు గేటు పక్కన ఆగింది. దుబ్బు మీసాలు భారీ శరీరం పహిల్వాన్ లాంటి వ్యక్తి మెడలో రుమాలు చుట్టి తెల్లని కల్లీషర్టు చేతికి సిల్వర్ కడియంతో పార్కులో కొచ్చాడు. వలస పక్షులన్నీ అతన్ని చుట్టు ముట్టాయి.బ్రోకరుతో పాటు వచ్చిన అనుచరులు సభకి కావల్సిన వారిని ఒకపక్క నిలబెడుతున్నారు. చెట్టు కింద కూర్చున్న ఆనంద్, పక్కనున్న వ్యక్తిని చూసి దగ్గరకు రమ్మని చేత్తో సంజ్ఞ చేసాడు బ్రోకరు.వాళ్లిద్దరూ దగ్గరికి రాగానే బండి ఎక్కండన్నాడు. ఉదయం తిన్న బిస్కిట్ పేకెట్టు తప్ప మరేమీ లేనందున కడుపు ఆకలితో నకనక లాడుతోంది. వీళ్లతో వెల్తే ఏదైనా తినిపిస్తారను కున్నాడు. ఆనంద్ పక్కన కూర్చున్న వ్యక్తి ఇంతకుముందు రాజకీయ మీటింగులకి వెళ్లి వచ్చిన వాడే కనక ఆనందుని కూడా వారి వెంట తోలుకుపోయాడు. రాజకీయ సభ అంబర్ పేటలోనట. అక్కడ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఎలక్షన్లో తలపడుతున్నారు. పోటీ చాలా గట్టిగా ఉంది . కూలీ జనం లారీ దిగగానే బిర్యానీ పేకెట్టు మంచినీళ్ల పేకెట్టు ఇచ్చి డబ్బులు క్వార్టర్ బాటిల్ మందు మీటింగు అయిన తర్వాత ఇస్తారట. ఆనంద్ వెంట ఉన్న వ్యక్తికి ఈ బ్రోకర్ తో ముందు పరిచయం ఉండటం వల్ల చనువుగా ఉంటున్నాడు. మాటల సందర్భంలో " అన్నా , ఈ పోరగాడు కాలేజీ సదివినోడని ఏదైనా నౌకరీ చూడ మన్నాడు. బ్రోకరు ఆనంద్ ని పైనుంచి కిందకు చూసి " బిడ్డా , ఏం చదువుకున్నావని "అడిగాడు. ఆనంద్ సమాధానం చెప్పేడు. " అరె , మా సారుకి ఎలక్సను పద్దులు రాయడానికి చదువుకున్న పోరగాడు కావాలని చెప్పిండు. ఈ మీటింగు అయినాక సార్ ని కలుద్దాంలే." అని తన పనిలో పడ్డాడు. సభ మైదానంలో కుర్చీల మీద జనం కూర్చుని జైజై కొడుతు మద్యలో కార్యకర్తలు చెప్పినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. కిరాయి జనంతో మైదానం కిటకిట లాడుతూంటే సభా వేదిక మీద నాయకులు ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. రాత్రి పది గంటల వరకూ ఎన్నికల ప్రచారం జరిగింది. కిరాయి జనాలు జండాలు అప్పగించి వంద రూపాయలు క్వార్టరు బాటిలు మందు అందుకుని లారీ ఎక్కేరు. బ్రోకరు మనుషులు లారీని ముందుకు నడపబోతే బ్రోకరు ఆనంద్ ని ఆపి మిగతా జనాల్ని పంపించేసాడు. మీటింగు పూర్తయి కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో బ్రోకరు ఆనంద్ ని వెంట బెట్టుకుని సిటింగ్ యం.యల్ . ఏ. గారికి పరిచయం చేసాడు. యం.యల్ .ఏ. గారు ఆనంద్ క్వాలిఫికేషన్ అడిగి తెలుసుకుని ఆనంద్ భుజాన్నున్న బ్యాగులోంచి తీసి చూపిన సర్టిఫికేట్లు పరిశీలించి మర్నాడు తన పి. ఏ. ని కలవమని చెప్పేరు. రాత్రికి బ్రోకరు ఆనందుకి వసతి ఏర్పాటు చేసాడు మర్నాడు ఉదయాన్నే ఫ్రెష్ గా తయారై యం.యల్. ఏ. గారి పి. ఏ. ని కలియగా ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించి కొన్ని ప్రశ్నల ద్వారా తన అనుమానాల్ని తీర్చుకున్నారు. ఆనంద్ కామర్స్ పి.జీ. తో పాటు కంప్యూటర్ ఎక్కౌంట్సు కొన్ని స్పెషల్ కోర్సులు చేసినందున పి.ఏ. గార్ని సంతృప్తి పరచడంలో సఫలీ కృతుడయాడు. అందువల్ల ఎన్నికల జమాఖర్చులు చూసే ఎకౌంటెంటు గా కుదిరాడు. ఉండటానికి వసతి భోజనం ఏర్పాటు అయింది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆనంద్ తన శక్తి సామర్ద్యాలతో మీటింగు పనులు జమాలెక్కలు చక్కబెడుతున్నాడు. పని వత్తిడితో బిజీ అయిపోయాడు. పోలింగ్ తేదీ దగ్గరవడంతో రాత్రింబవళ్లు కష్టపడి కార్యాలోచన చేసి పోలింగు సక్రమంగా జరిగింది. ప్రచార కార్య క్రమాలతో అలిసిన ఆనంద్ కి విశ్రాంతి చిక్కింది. ఎన్నికల ఫలితాలు తెలిసాయి. సిట్టింగు యం.యల్.ఏ. గారు రెండవసారి భారీ మెజారిటీ తో విజయం సాధించడమే కాకుండా బంపర్ ఆఫర్ గా మంత్రి పదవి వరించింది. ఆనంద్ కృషి కష్టపడి పని చేసిన తీరు చూసి యం.యల్ .ఏ. గారు సంతోషించి ఆనంద్ ని తన దగ్గరే ఉంచుకున్నారు. మంచి జీతం, వసతి సౌకర్యాలతో అక్కడే కుదురుకున్నాడు. ఆనంద్ దశ తిరిగింది. పెద్ద వయసైన మంత్రి గారి పి.ఏ. అకస్మాత్తుగా గుండె పోటుతో చనిపోవడంతో ఆ పదవి ఆనంద్ ని వరించి మంత్రి గారి ఆంతరంగిక కార్యదర్సిగా అయాడు. అనామకుడిగా ఎటూ దారి తెలియని స్థితిలో హైదరాబాదులో అడుగు పెట్టిన ఆనంద్ ని అదృష్టదేవత కనికరించి అందలమెక్కించింది. ఇప్పుడు ఆనంద్ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి గారి వెంట తిరుగుతూ వారి రాజకీయ కార్యక్రమాలు నిర్ణయిస్తూ అధికారులకు అపాయింటుమెంట్లు ఇస్తు అందరిలో గౌరవప్రదమైన వ్యక్తిగా పరిగణింప బడుతున్నాడు. తన పనుల వత్తిడితో బిజీగా మారిన ఆనంద్ తనను ఇంత ఉన్నత స్థాయికి తెచ్చిన క్లాక్ టవర్ పార్కులో కలిసిన అజ్ఞాత వ్యక్తి కోసం ఎంత ప్రయత్నించినా అతని జాడ దొరకలేదు. బ్రోకర్ ద్వారా వెతికించినా ఫలితం లేకపోయింది. క్లాక్ టవర్ వలస పక్షులకు ఆవాసం తిండి వసతి కలగచేసాడు. పల్లెలో ఉన్న తల్లిని నగరానికి తీసుకు వచ్చి తగిన వైద్య చికిత్సలు చేయించాడు. బ్రతుకు తెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వలస పక్షిలా వచ్చిన తనకు నగరం ఒక ఉన్నత స్థాయి కల్పించి తన ఆశయాల అలలను తీరం చేర్చిన భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆనంద్. * * *