“ఇందులో రాసిందంతా నిజమేనంటావా? మరీ దారుణంగా అనిపించింది చదువుతూంటే..” యాభై ఐదేళ్ల రామారావ్ అడిగాడు స్నేహితుడ్ని, చేతిలో ఉన్న పుస్తకం చూపిస్తూ. ఇద్దరూ రామారావ్ ఇంటి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
“చూడు రామారావ్, ఇదంతా నిజమా కాదా అని పక్కనబెడితే అందులో చెప్పినవి చాలా గొప్ప విషయాలు.. ఎప్పటినుంచో చదువుదామనుకొని మొత్తానికి ఈ మధ్యే చదివాను. ఎన్నో కొత్త విషయాలు తెలిసినట్టుగా అనిపించింది. అందుకే నీకూ చదవమని ఇచ్చింది” చెప్పాడు స్నేహితుడు.
“నువ్వు చెప్పింది నిజమే. ఇంకొన్ని పేజీలు చదవాల్సి ఉంది. ఈ పూటే పూర్తి చేసి రేపు పుస్తకం తిరిగి ఇచ్చేస్తాలే” చెప్పాడు రామరావ్ చేతికున్న వాచీలో టైమ్ చూసుకుంటూ. సాయంత్రం ఐదు. ఆదివారం.
“అది సరేగానీ, రేపే మావాడి ఫైనల్ ఇంటర్వ్యూ. నువ్వే ఏదో రకంగా వాడికి ఈ ఉద్యోగం దొరికేట్టు చూడాలి. వాడు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతే నాకూ నిశ్చింత..”
“తప్పకుండా చూద్దాంలే. అయినా మీవాడ్ని కూడా బాగా ప్రిపేర్ అవమని చెప్పు. అక్కడ సెలెక్ట్ అవటం అంత తేలిక కాదు.” చెప్పాడు రామారావు.
మరికొంతసేపు మాట్లాడుకున్నాక స్నేహితులిద్దరూ ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు. రాత్రి భోంచేసాక, ఓపిగ్గా పుస్తకం చదవటం పూర్తిచేసాడు రామారావు. మనసునిండా ఎన్నో ఆలోచనలు. చాలాసేపు నిద్రపట్టలేదు.
***
ఉదయం ఆరింటికి మెదడులో పెట్టుకున్న అలారం గట్టిగా మోగటంతో ఉలిక్కిపడకుండానే నిద్రలేచాడు పూర్ణ. కాలకృత్యాలు గబగబా ముగించుకొని గత కొన్నిరోజులుగా చదువుతున్న లావాటి పుస్తకం ముందేసుకొని కాసేపు శ్రద్ధగా చదువుకున్నాడు. ఇంటర్వ్యూలో తప్పకుండా అడుగుతారు అనుకొని బట్టీ పట్టి చదివినవన్నీ బాగా రివైజ్ చేసుకున్నాక సంతృప్తిగా నిట్టూర్చాడు. పుస్తకం మూసేసి చేతులు వెనక్కు పెట్టుకొని గదిలో పచార్లు చేయటం మొదలుపెట్టాడు గంభీరంగా.
కొద్దిసేపట్లో తను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫైనల్ ఇంటర్వ్యూ మొదలవబోతుంది. మనసు రకరకాల ఆలోచనలతో కిక్కిరిసిపోయింది. వాటిమధ్యలో ఎక్కడో ఏదో చెప్పలేని గుబులు, ఉత్కంఠ. ‘తను ధైర్యంగా వాళ్ళడిగేవాటికి జవాబు చెప్పగలడా? తికమకపెట్టే ప్రశ్నలు అడుగుతే? ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే? ఇన్నాళ్ళుగా పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పనీర్ బటర్ మసాలా అవుతుందా? తను సెలెక్ట్ గానీ అయిపోడు కదా? అలాగానీ అవుతే ఇంకేమైనా ఉందా. పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేసి అలాగే గాల్లో తేలిపోవచ్చు. అయితే అదంత తేలిక కాదు. ముఖ్యంగా చివరి రౌండ్లో అడిగే ప్రశ్నలు చాలా కష్టం. ప్రతీసారీ కొత్తవే అడుగుతారు. ఇక్కడిదాకా వచ్చి వెనుదిరిగే వాళ్ళు చాలామందే ఉంటారు.. ఈ ఉద్యోగం దొరికితే తన జీవితం సెటిల్ అయినట్టే. కొన్ని వేల సంవత్సరాల దాకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు..’
నవ్వొచ్చింది తన ఆలోచనకి. పచార్లు చేయటం ఆపి గదిలో ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దం దగ్గరకు చేరుకొని తనని తాను పరీక్షగా చూసుకున్నాడు పైనుంచి కిందిదాకా. చింత మొద్దులాంటి నల్లటి భారీ శరీరం. రోజూ క్రమం తప్పకుండా కసరత్తు చేయటం వల్ల కండలు తిరిగి, ఆరు పలకల దేహంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. తన ఆకారం చూసుకొని సంతృప్తిపడి దట్టంగా పెరిగిన నల్లటి మెలితిరిగిన మీసాలను ఓసారి చేత్తో సవరించుకున్నాడు. క్రోధంగా ఉన్నప్పుడు తన మొహం ఎలా ఉంటుందో చూద్దామని క్రోధాన్ని అనుకరించి చూసుకున్నాడు. కర్కశంగా భయంకొలిపేలా అనిపించింది.
వెళ్ళాల్సిన టైమ్ అవడంతో బట్టలు మార్చుకొని రెడీ అవుతూ తను వెళ్ళేచోటు గురించి ఆలోచించసాగాడు. ఎంత భయంకర ప్రదేశం అది నిజంగా. లోపల జరిగే ఘోరాతి ఘోరాలు బయటకు ఏమాత్రం తెలీవు. తనని అప్పటిదాకా పరీక్షించిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది అక్కడ జరిగేదంతా ఎంత కట్టుదిట్టంగా, గోప్యంగా ఏర్పాటు చేయబడ్డదో అని. అక్కడ పని చేయాలంటే జాలి, దయ, న్యాయం, అన్యాయం లాంటివి పూర్తిగా వొదిలిపెట్టాలి. ఇవన్నీ అక్కడ పనికిమాలిన విషయాలు. కర్కశం, క్రూరత్వం ఏమాత్రం లోపించినా నిలదొక్కుకోవటం కష్టం.. అసలు అలా ఉండటం తనవల్ల అయ్యేపనేనా?
అక్కడ జరిగేది మనసులో మెదిలింది. భయంగా అనిపించింది. రకరకాల ఆలోచనలతో భారంగా కొంత టైమ్ గడిచాక, గట్టిగా నిట్టూర్చాడు. నెగటివ్ ఆలోచనలు కట్టిపెట్టి జరగబోయేదాని గురించి ఆలోచించాడు. ఇక్కడిదాకా వచ్చి తను చేయగలడా లేదా అని సంశయించడం అవివేకం అని సర్దిచెప్పుకున్నాడు. తను కోరుకున్న విధంగా జీవితంలో సుఖంగా ఉండాలంటే ఇవన్నీ తప్పదు. వేరే దారిలేదు. చేయబోయేది తప్పా, కాదా అని ఆలోచిస్తూ వెనుకాడటం సరికాదు అనుకుంటూ స్థిరనిశ్చయంతో మనసులో ఉత్సాహం నింపుకొని ధైర్యంగా వెళ్ళాడు తను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం కోసం.
దాదాపు గంటసేపు ప్రయాణం చేసి అతడికి ముందుగా తెలియజేయబడిన ప్రదేశానికి చేరుకున్నాడు పూర్ణ. చుట్టూ చూసాడు ఆసక్తిగా. దడగా అనిపించింది. ఇంటర్వ్యూలో మొదటి రెండు రౌండ్స్ జరిగింది ఇక్కడకాదు. ఆ ప్రదేశాలు కూడా భయంకరంగానే ఉన్నా, ఇక్కడి వాతావరణం మరీ వణుకు పుట్టించేలా అనిపించింది. వెనక్కి తిరిగి చూడకుండా పారిపొమ్మని మనసు నొక్కి వక్కాణించింది. ‘ఈ ఉద్యోగం తనవల్ల అయ్యేపనేనా?’ అని పదేపదే అనిపించసాగింది. ముందుకు వెళ్ళాలా లేక వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలా అని తేల్చుకోలేక దిక్కులు చూస్తూండగా, అతడ్ని గమనించిన అక్కడి సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు పెద్ద పెద్ద అంగలు వేస్తూ అతడి దగ్గరకు వచ్చారు. క్రూరత్వానికి కాపీ రైట్స్ ఉన్నవారిలా ఉన్నారు ఇద్దరూ.
“ఎవరు నువ్వు?” గంభీరంగా అడిగాడు వచ్చినవాళ్ళల్లో ఒకడు. “నా పేరు పూర్ణ. ఫైనల్ ఇంటర్వ్యూకు వచ్చాను” తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో చెప్పాడు పూర్ణ. అతడ్ని ఎగాదిగా చూసి, వివరాలు కనుక్కొని సంతృప్తిగా తలపంకించి లోపలకు వెళ్లమన్నట్టుగా సూచించారు వాళ్ళు.
‘ఏదైతే అదైంది. తన భవిష్యత్తు కోసం ఇదంతా తప్పదు..’ అనుకుంటూ ముందుకు నడిచి, భారీ తలుపులు తోసుకొని లోపలకు అడుగుపెట్టాడు పూర్ణ. మొదటి అడుగుపడుతూనే అకస్మాత్తుగా, ఏదో మంత్రం వేసినట్టుగా అప్పటిదాకా మనసును పట్టి పీడిస్తున్న సంశయాలన్నీ తొలగిపోయినట్టుగా అనిపించింది. మనసు నిండా ఏదో తెలియని ఉత్సాహం. ఆశ్చర్యపోయాడు. అంతా దైవలీలగా భావించి దేవుడ్ని తలచుకున్నాడు భక్తిగా. ఉత్సాహంగా ఎదురుగా కనిపించే ఆఫీసు రూమ్ వైపు అడుగులు వేసాడు.
ఆ భారీ హాల్లో తనలాంటి బలిష్టమైన అభ్యర్థులు ఇంకో ముగ్గురు ఉండటం గమనించాడు. నలుగురిలో ఒకరినే ఈ ఉద్యోగం వరిస్తుంది. ఆ ఒక్కడూ తానే అవ్వాలని కోరుకున్నాడు పూర్ణ. అభ్యర్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరదూరంగా కూర్చోబెట్టారు నలుగురినీ. అందరూ తమకు రాబోయే పిలుపు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్కడంతా ఓ క్రమ పద్ధతిలో జరగటం గమనించాడు పూర్ణ. ఒకరితో ఒకరు అవసరానికి మించి సంభాషించుకోవటం లేదు. అంతా నిశబ్దం ఆవరించుకొని ఉంది. కాసేపు అంతా పరికించి చూసాక, ఆలోచనల్ని కట్టిపెట్టి తను ఆ రోజు ఉదయాన్నే లేచి చదువుకున్న విషయాల్ని మనసులో గుర్తుకు తెచ్చుకోసాగాడు.
కొద్దిసేపటి తరువాత, వచ్చిన నలుగురి అభ్యర్థుల్లో ఒకరికి పిలుపు వచ్చింది. ఆ తరువాత కాసేపటికి ఒకరొకరుగా అంతా లోపలకు వెళ్ళారు. చివరగా పూర్ణ ఒక్కడే మిగిలాడు. ఇంటర్వ్యూ అయ్యాక వచ్చినదార్లో కాక వేరే దారిగుండా అభ్యర్థుల్ని బయటకు పంపుతున్నారు అనుకున్నాడు. వెళ్ళిన ఎవరూ మళ్ళీ తిరిగి రాలేదు.
కాసేపటికి అతడికి కూడా పిలుపు వచ్చింది. లేచి నిలబడి అక్కడివాళ్లు సూచించిన దారిలో వెళ్ళసాగాడు. పక్కన ఎవరైనా ఉండి దారి చూపుతారని ఆశించాడు కానీ అలా జరగలేదు. దూరంగా ఎవర్నో చావగొడుతున్నట్టుగా ఆర్తనాదాలు, రోదనలు భయంకరంగా వినిపిస్తున్నాయి. గతుక్కుమన్నాడు పూర్ణ. ధైర్యం తెచ్చుకొని ముందుకుసాగాడు.
మరికొంత దూరం వెళ్ళాక, ఓ భారీ భవంతిలాంటి కట్టడం కనిపించింది. తను వెళ్ళాల్సింది అందులోకే. బయట సెక్యూరిటీ వాళ్ళెవరూ లేకపోవటం చూసి మొదట ఆశ్చర్యపోయినా, అనుమతి లేకుండా అక్కడిదాకా రాగలగడం ఎవరి తరమూ కాదు గనక ఇక్కడ ప్రత్యేకించి సెక్యూరిటీ లేదేమో అనుకున్నాడు. లోపలకి వెళ్ళాడు. పెద్ద హాల్లో ఎదురుగా ఓ సింహాసనం లాంటి కుర్చీ తప్ప ఏమీ లేదు. చుట్టూ చూస్తూన్నంతలో “నిటారుగా నిలబడి నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు..” అని గంభీరమైన గొంతు వినిపించింది. అదిరిపడ్డాడు పూర్ణ. మాటలు ఎక్కడనుంచి వస్తున్నాయని చుట్టూ చూసాడు కొద్దిగా కంగారుగా. ఎవరూ కనబడలేదు.
“కంగారేం ఒద్దు. ప్రస్తుతానికి నా గొంతు మాత్రమే వినిపిస్తుంది. నువ్వు మా ప్రశ్నలన్నింటికీ సరైన జవాబు ఇవ్వగలిగితే, చివరి ప్రశ్న అడగడానికి మాత్రం నేను నీకు కనిపించేలా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ప్రతీ ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పాల్సిందే. తప్పు చెప్పిన మరుక్షణం ఇంటర్వ్యూ ముగిసిపోయి నువ్వు ఇంటికి తిరిగివెళ్ళటం జరుగుతుంది. అందుకని బాగా ఆలోచించుకొని ధైర్యంగా నేనడిగే ప్రశ్నలకి జవాబు చెప్పు.. ప్రశ్న తికమకగా అనిపించినా అందులో ఎంతో అర్ధం ఉంటుందని గ్రహించు..” అని వినిపించింది.
ధైర్యం తెచ్చుకున్నాడు పూర్ణ. ఆ కంఠం ఎవరిదో అర్ధమైంది. తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవకపోతే తనకి ఆయన కనబడాల్సిన అవసరమే లేదు. అందుకే ఈ ఏర్పాటు అనుకున్నాడు.
“దయచేసి అడగండి. నేను సిద్ధమే..” మనసు దిటవు పరచుకొని, ఆత్మవిశ్వాసంతో చెప్పాడు పూర్ణ నిటారుగా నిలబడి.
ఫైనల్ ఇంటర్వ్యూ మొదలైంది. ప్రశ్నలు శ్రద్ధగా వింటూ, జాగ్రత్తగా తను చదివినది గుర్తుకు తెచ్చుకుంటూ జవాబులు ఇవ్వసాగాడు పూర్ణ.
మొదటి ప్రశ్న వినబడింది. “ఇక్కడ చుట్టుపక్కల ఒకడ్ని పట్టుకొని ఓ నలుగురు ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, అతి క్రూరంగా కొడుతూ ఉంటే నువ్వేం చేస్తావ్?”
“ఆ నలుగురికీ సహాయపడతాను..” కొద్దిగా ఆలోచించి చెప్పాడు పూర్ణ.
“భేష్! బాగా చెప్పావు. నీకు నచ్చే ఆయుధం ఏంటి?”
“కరుకైన ఇనుప లాటీ, సమ్మెట లేదా ముళ్ళ ఇనుప గద”
“మంచిది. ఎంత కొట్టినా, హింసించినా చావకూడదంటే ఏం చేయాలి?”
ప్రశ్న తికమకగా, క్లిష్టంగా అనిపించింది. కొద్దిసేపు ఆలోచించాక జవాబు స్పురించింది. “ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు.. మనచేత హింసింపబడేవాడు చచ్చే ప్రశ్నే లేదు.. కనీసం మూర్ఛపోవటం కూడా జరగదు”
“బాగా చెప్పావు. విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నట్టున్నావు. ఇది చెప్పు. జాలి, దయ, కరుణ.. వీటి మీద నీ అభిప్రాయం ఏంటి?”
“ఇవన్నీ కలగాల్సిన సమయంలో కలగకపోతే, ఆ తరువాత ఆలస్యమైందనీ, వీటి గురించి ముందుగా తెలీదని ఏడవటం శుద్ధ దండగ..”
“నిజమే. నీ దృష్టిలో అన్నింటికంటే బలమైనది ఏంటి?”
“కాలం.. ఎంతటి గొప్ప బలవంతుడైనా, ఆస్తిపరుడైనా, నాయకుడైనా, మేధావైనా, జనాకర్షణ కలిగినవాడైనా సరే కాలం ముందు తలవంచక తప్పదు..”
“బాగా చెప్పావు. ఈ సృష్టిలో అతి ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మార్పులేకుండా జరిగేదేమిటి?”
ఆలోచనలోపడ్డాడు పూర్ణ. రకరకాల జవాబులు స్పురించినయ్. తప్పుగా చెబితే ఇంటర్వ్యూ ఇక్కడితో ముగిసిపోతుంది.
“ఏంటా ఆలోచన? సరైన సమాధానం చెప్పకపోతే, ఇక్కడిదాకా వచ్చి ఇంటికి తిరిగి వెళ్ళాల్సిందే. నీతో పాటు వచ్చిన మిగితా ముగ్గురూ ఈపాటికి ఇంటికి చేరుకొని ఉంటారు.. నీ పరిస్థితి కూడా అదే అవచ్చు జాగ్రత్త” అని గంభీరంగా వినిపించింది.
“జవాబు తెలుసు. చెబుతాను..”
“చెప్పు..”
“మీరడిగిన దానికి జవాబు ‘మృత్యువు’.. రావలసిన వేళకి మృత్యువు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది” చెప్పాక తను చెప్పింది సరైందా కాదా అని ఊపిరి బిగపట్టి చూసాడు.
“శభాష్! సరిగ్గా చెప్పావు” అని వినిపించగానే ‘హమ్మయ్య’ అనుకొని గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు.
“మనిషి చనిపోయేటప్పుడు తనతో ఏదీ తీసుకు వెళ్లలేరని అంటారు. ఇది నిజమేనా?”
“ఇది అబద్ధం. చనిపోయాక మనిషి తను చేసిన పాపపుణ్యాలను తనతో విధిగా తీసుకువెళతాడు.”
“శభాష్!! అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చాలా చక్కగా చెప్పావు. ఇలా అన్ని శారీరక, మానసిక, విషయ పరిజ్ఞాన పరీక్షల్లో నెగ్గి ఇక్కడి దాకా రావటం అంత తేలిక కాదు. చివరగా ఒక్క ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. దీనికి నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి మా దగ్గర నీకు లభించబోయే స్థాయిని నేను నిర్ణయిస్తాను..”
సంతోషంతో పూర్ణ ఉక్కిరిబిక్కిరి అవుతూండగా, ఎదురుగా ఏదో తెరలాంటిది పక్కకు తొలగి, అప్పటిదాకా ప్రశ్నలు అడిగిన వ్యక్తి బయటకు వచ్చాడు. క్షణకాలం తత్తరపడి తేరుకున్నాక అతడ్ని తేరిపారా చూసాడు పూర్ణ. బాగా పొడుగ్గా, బలంగా ఉన్నాడు. చేతిలో ఏదో పెద్ద పుస్తకం ఉంది. అతడి వేషధారణ కూడా తను అప్పటిదాకా చూసిన వాళ్ళలా కాక వేరేగా అనిపించింది. అతడు అక్కడి నాయకుడికి కుడి భుజం అని తను ఊహించింది నిజమే అనిపించింది.
“మనసులో ఏ ఆలోచనలూ లేకుండా ప్రశాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా ప్రశ్నకు జవాబుతో పాటు అందుకు గల కారణాలను కూడా చెప్పాల్సి ఉంటుంది. సిద్ధమేనా?” అని అడిగాడతడు .
“సిద్ధమే..” స్థిరంగా చెప్పాడు పూర్ణ. తను అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానం చెప్పి ఇంటర్వ్యూలో దాదాపుగా సెలెక్ట్ అయిపోవటం ఏదో కలలా, నమ్మలేనిదిగా అనిపించింది.
“ఓ ఊరి జమీందారు ఓ పేదవాడికి మాయమాటలు చెప్పి వాడి భూమిని అన్యాయంగా చాలా తక్కువ ధరకు తన పేర్న రాయించుకున్నాడు. జమీందారు చెప్పింది గుడ్డిగా నమ్మిన పేదవాడు తను మోసపోయిన విషయం కూడా తెలుసుకోలేదు. ఇంకోచోట, దారిలో దొరికిన బంగారు హారాన్ని తీసుకెళ్ళి నిజాయితీగా పోలీసులకి అప్పగించాడో మనిషి, పోగొట్టుకున్నవారిని కనిపెట్టి వారిది వారికి ఇవ్వమని. పోలీసులు ఆ బంగారాన్ని హాయిగా కాజేసారు. మరోచోట బాసు తనని బాగా నమ్ముతాడని తెలిసిన ఉద్యోగి నోటికొచ్చిన అబద్ధాలు అతికేలా చెప్పి ఆఫీసు డబ్బు లక్షల్లో కాజేయటమే వృత్తిగా పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఆ బాసు ఆ ఉద్యోగిని మనస్ఫూర్తిగా నమ్ముతాడు..” చెప్పటం మధ్యలో ఆపి పూర్ణ వైపు చూసాడతడు ఆలోచనగా. శ్రద్ధగా వింటున్న పూర్ణ ఇందులో ప్రశ్నేమిటా అన్నట్టుగా చూస్తున్నాడు. ఓసారి గట్టిగా ఊపిరితీసుకొని తన ప్రశ్నను పూర్తిచేసాడతడు “ఈ మూడు కేసుల్లో నీ దృష్టిలో అమాయకుడెవరు?”
కొద్దిసేపు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు పూర్ణ ఏదో ఆలోచిస్తున్నట్టుగా. ఆ తరువాత జవాబు చెప్పాడు సూటిగా “నా దృష్టిలో పేదవాడ్ని మోసం చేసిన జమీందారు, బంగారాన్ని కాజేసిన పోలీసులు, బాసుని మోసగించిన ఉద్యోగి అసలు సిసలైన అమాయకులు..”
“అదేంటి? ఎలా?” ఆశ్చర్యపోతూ అడిగాడతడు.
ఓసారి గొంతు సవరించుకొని వివరంగా చెప్పాడు పూర్ణ.
“తన ప్రవర్తన లేదా పనివల్ల కలిగే పరిణామాలు తెలియనివాడ్నే అమాయకుడంటారు. మీరు చెప్పిన మూడు కేసుల్లో అవతలివాళ్ళను మోసగించి తాత్కాలికంగా లాభపడిన వాళ్ళందరూ తమ పాపాల తాలూకు ఫలితం ఎంత భయంకరంగా, దుర్భరంగా ఉంటుందో తెలిస్తే ఆ పని చేసేవారే కాదు. ఇదేదీ తెలియక, తమ తెలివితేటల్ని తలచుకొని అమాయకంగా మురిసిపోయుంటారు.
ఈ సృష్టిలో దాదాపుగా యనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నాయి. నేలలో మొలిచేవి, నీటిలో జీవించేవి, క్రీమికీటకాలు, జంతువులు, పక్షులు, మనిషి మొదలైనవన్నీ కలిపి. వీటన్నింటిలో మనిషి జన్మ సర్వ శ్రేష్టమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు. అలాంటి పరమ దుర్లభమైన జన్మనెత్తిన మనుషులు సత్కర్మలు చేయాలన్న తలంపు లేకుండా, లెక్కలేనన్ని పాపాలు తమ రోజూవారీ జీవితాల్లో అలవాటుగా, నేర్పుగా చేస్తున్నారు. మృత్యువు తప్పదన్న విషయం విస్మరించి, నశించబోయే తమ శరీరాల్ని సుఖపెడుతూ మృత్యువే లేని తమలోని జీవాత్మను పట్టించుకోవటంలేదు. ఇంతకు మించి అమాయకత్వం ఏదైనా ఉంటుందా?
బతికుండగా తానెంతగానో ప్రేమించిన బంధువులు ఆ మనిషి మరణించగానే, శరీరాన్ని కాల్చేసి ముఖం తిప్పుకొని ఇంటికి తిరిగి వెళతారు. అక్కడితో ఆ బంధం ముగిసిపోతుంది. పుట్టినకాడ నుంచీ చావుదాకా పెంచి పోషించి ఇది నాదనుకొని విర్రవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదవుతుంది. వీడని బంధమై మిగిలేది పాపపుణ్యాలే. ధనాన్ని ఎలాగూ పట్టుకుపోలేనప్పుడు, దాన్ని సత్కార్యాలకీ, దానాలకీ ఉపయోగిస్తే ఆ పుణ్యాన్ని తీసుకుపోవచ్చు అన్న అతి మామూలు విషయం కూడా అర్ధం చేసుకోలేనంత అమాయకులు చాలామంది.
మనిషి బతికుండగానే అనుభవించే దుష్కర్మ ఫలితాలను పక్కనబెడితే, చనిపోయిన తరువాత నరకానికి రాగానే ప్రతీ ఆత్మకూ ఒక యాతనా శరీరాన్ని ఇస్తారు. అది కాలుతుంది, చురుకుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది కానీ శరీరం భస్మం కాదు, మృతి చెందదు. యమదూతలు యాతనా శరీరాన్ని సలసలా కాగే నూనెలో ముంచుతారు, భయంకర గదలతో కొడతారు, కత్తులతో పొట్టలోని పేగులను తెంచుతారు. ఏనుగులతో తొక్కించి, పాములతో కరిపిస్తారు. శరీరాన్ని కోసి కండలను తనచేతే తినిపిస్తారు. బతికుండగా చేసిన ఒక్కో పాపానికీ ఒక్కో రకమైన నరకాన్ని చూపిస్తూ యమదూతలు అతి క్రూరంగా చిత్రహింసలు పెడుతూంటే ఏమీచేయలేక రోదిస్తూ, బంధువులను గుర్తుకుతెచ్చుకుంటూ, ఈ విషయం బతికుండగా తెలిసుంటే లేదా నమ్మి ఉంటే, మంచి పనులు మాత్రమే చేసేవారని అనుకుంటూ దు:ఖసాగరంలో మునిగితేలుతూ కొన్ని వేల సంవత్సరాలు అత్యంత దుర్భరంగా గడుపుతారు తప్పుచేసిన వారంతా.
అందుకని, తన తప్పుల తాలూకు ఫలితాలు ఎంత దుర్భరంగా ఉండబోతున్నాయో తెలియక, కాలంతో పాటు నశించిపోయే పేరో, డబ్బో, సుఖమో లేక ఇంకేదో లాభమో కలుగుతుందని సంబరపడిపోతూ పాపాలు చేసే ప్రతీ మనిషీ నా దృష్టిలో పరమ అమాయకుడే..”
“అద్భుతం! సరైన జవాబు.. చాలా చక్కగా చెప్పావు పూర్ణాక్షా! నేను నీకు తెలుసో లేదో. నా పేరు చిత్రగుప్తుడు. మనుషులు చేసే పాపపుణ్యాలను ఏ ఒక్కటీ విడవకుండా రికార్డ్ చేసి యమధర్మరాజుకు చెప్పటమే నా పని. అలాగే యమలోకంలో చేరదామనుకునే నీలాంటి యువ రాక్షసులని ఇంటర్వ్యూ చేసి ఇక్కడ పనిలో నియమించడం కూడా నా పనే. నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను యమదూతగా పదివేల సంవత్సరాలకు అపాయింట్ చేస్తున్నాను.. ఆల్ ది బెస్ట్” చెప్పాడు చిత్రగుప్తుడు.
“చాలా సంతోషం స్వామీ” చెప్పి సెలవు తీసుకొని ఆనందంగా గాల్లో తేలుతూ ఇంటికి తిరిగివచ్చాడు పూర్ణాక్షుడు. తాను ఆరోజు ఉదయాన్నే లేచి చదువుకున్న లావాటి పుస్తకం ఎదురుగా బల్ల మీద ఠీవీగా నిలబడి కనిపించింది. భక్తిగా దానివైపు చూసాడు. దాని పేరు.. “గరుడ పురాణం”.
***
గట్టిగా అలారం మోగటంతో ఉలిక్కిపడి నిద్ర లేచాడు రామారావు. చప్పున టైమ్ చూశాడు. ఉదయం ఐదు. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసాడు. జరిగిందంతా కలన్నమాట..! పుస్తకం చదవటం పూర్తయ్యాక ఎన్నింటికి నిద్రపోయాడో కూడా గుర్తుకురాలేదు. చిన్నగా నిట్టూర్చాడు. తను చదివిన పుస్తక సారాంశమంతా ఎవరో రాక్షసుడు యమదూత పోస్ట్ కి ఇంటర్వ్యూకి వెళ్ళి చెప్పినట్టుగా కల వచ్చింది. మొత్తం తీరిగ్గా గుర్తుకు చేసుకున్నాడు. భయమేసింది కాసేపు. ‘రేపు చనిపోయాక తన పరిస్థితి కూడా అంతేనా? కలలో చెప్పినట్టు, పాడు డబ్బు కోసం ఎన్నో పాపాలు తెలివిగా చేసే తను కూడా ఓ పెద్ద అమాయకుడే.. ఇక మీదట కాదు! చిన్న తప్పు కూడా చేయకుండా మిగిలిన జీవితం గడపాలి. అసలైన తెలివంటే ఇదే!!’ స్థిర నిశ్చయంతో మంచం దిగాడు.
***
కొన్నాళ్ళ తరువాత..
“చాలా ధాంక్స్ రామారావు.. కేవలం నీ వల్లే మావాడికి అంత పెద్ద గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. నీ వాటా పదిలక్షలు కవర్లో పెట్టి ఇంటికి పంపేసాను” ఆనందంగా చెప్పాడు స్నేహితుడు. చిన్నగా, గర్వంగా నవ్వాడు రామారావ్ లంచంగా వచ్చిన డబ్బు ఎక్కడ మదుపు చేయాలా అని ఆలోచిస్తూ. ఇంటి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ.
అర్హుడైన అభ్యర్తికి రావల్సిన ఉద్యోగాన్ని అక్రమంగా తన కొడుక్కి ఇప్పించిన స్నేహితుడూ, లంచం మీదే బతికే గవర్నమెంట్ ఉద్యోగి అయిన రామారావులను యమలోకంనుండి గమనిస్తున్న చిత్రగుప్తుడూ, పూర్ణాక్షుడూ చిన్నగా నిట్టూర్చారు. కలలో కనబడి కనీసం ఒక్క అమాయకుడ్నైనా రక్షిద్దామన్న తమ ప్రయత్నం వృధా అయినందుకు బాధపడ్డారు.
****