రాము శ్యాము గది లో చదువుకుంటున్నారు. ఇల్లంతా నిశబ్ధం. రాము పెద్దవాడు, నెమ్మదస్తుడు. చిన్న వయసులోనే పెద్ద తరహా పుణికి పుచ్చుకున్నాడు. శ్యాము గడసరి, తుంటరి. శ్యాము లో ఎదో అసహనం. తల ఎత్తి దిక్కులు చూస్తున్నాడు. గడియారం వంక పదే పదే చూస్తున్నాడు, గడియ కూడ గడవ కుండా. పుస్తకం లో పేజీలు అటు ఇటు తెగ తిప్పుతున్నాడు. అది తిరగకుండా ఎవరన్నా ఆపేస్తే బాగుణ్ణు అనిపించింది వాడికి. ఇంతలో ఎవరో వచ్చి తన తల అటు ఇటు తిరగకుండా గట్టిగా పట్టుకున్నారు, ఇంకెవరు అన్న రాము.
తను తిరగకుండా ఆపితే బాగుణ్ణు అనుకున్నది గడియారము ముల్లు ని, తన తల ని కాదు.
"ఒరేయ్ అటు ఇటు తెగ తిప్పింది చాలు , కొంచెము హోం వర్కు మీద ధ్యాస పెట్టు" రాము వారించాడు
"ఆ సరెలే అన్నట్టు " తల దించి పుస్తకం పైన వాల్చాడు శ్యాము
మళ్ళీ ఒక్కసారి తల ఎత్తి చుసేసరికి, గడియారం పదకొండు దాటి , పదకొండు నిమషాలు. శ్యాము కి మనస్సంతా పదకొండు గంటలకి టి.వి లో స్పోర్ట్స్ చానల్ లో వచ్చే ఇంటర్వ్యూ ప్రోగ్రాం మీద వుంది. అసలే వాడికి ఇష్టమయిన క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో ఇష్టా గోష్టి. ఇల్లంతా నిశబ్ధం. ఇంక వుండ బట్ట లేక టక్కున లేచి, గది తలుపు తీసి బయటకి తొంగి చూసాడు.
జూ లో పులి కి ఆహారం పెట్టేవాడు, ప్రతీ రోజు అదే పులి, అదే ఆహారం, అయినా ఆచి తూచి అడుగు వెయ్యాలి లేదంటే తాను పలహారం అయిపోతాడు, అదే పులికి. శ్యాము కూడా అల్లగే ఫీల్ అయ్యాడు . నాన్న ఇంట్లో వుంటే గట్టిగా అరుస్తాడు " అప్పుడే అయిపోయిందారా నీ వానాకాలం ఏబ్రాసి చదువు . అన్నీ ముక్కున పెట్టుకు చీదటమే, తుమ్మితే ఊడిపోయే ముక్కు నువ్వూనూ". నాన్న అదో తరహా, ప్రతి మాట కి సమయము సంధర్భము వున్నా లేకున్నా, ఎదో అలంకారాలు, సామెతలు లేకుండా మాట్లాడడు.
తన గది తలుపు తీసి , అడుగు లో అడుగు వేసుకుంటూ బయటకి వచ్చాడు. అది ఒక సగటు మద్య తరగతి రెండు బెడ్ రూంల ఫ్లాట్. వాడు బయటకి వచ్చింది పిల్లల గది నుంచి. దాని బయటకి రాగానే పొడుగ్గా పెద్ద గది. పెద్ద అంటే మరీ అంత పెద్ద గా కాకుండా సుమారు గది. అదే హాలు, అదే లివింగు రూము, అదే ఫోర్మల్ రూము అన్నీ, ఆల్ ఇన్ ఒన్ అన్నమాట. దానిలోనే ఒక కర్టన్ కట్టిన డైనింగ్ పోర్షన్. దానికి కుడి వైపుగా కిచన్.
నాన్న వుంటే , మంచి నీళ్ళ కోసం వచ్చినట్టు నటించాలి అని మనసులో మననం చేసుకుంటూ, కళ్ళలో మొహం లో మంచి నీళ్ళ దాహం నటిస్తూ, పెదాలు ఆరినట్టు తడుపుకుంటూ నడిచాడు హాలు లోకి. అంతా నిర్మానుష్యం. అమ్మ వంటింట్లో వున్నట్టు పసిగట్టాడు. హాల్ లోంచి
"నాన్న ఇంట్లో లేరా " అని మెల్ల గా గొణిగాడు.అమ్మ అస్సలు వినిపించు కోలేదు. కిచెన్ లోంచి మసాలా ఘుమఘుమ లు. కిచెన్ డోర్ దాకా వెళ్ళి, గుమ్మం మీద కాలేసి, గోడ మీద జారబడి, వాసన పీలుస్తూ అన్నాడు " నాన్న గారు లేరా ? "
"ఎమోరా చూడు" అంది అమ్మ పప్పు గుత్తె తో ఒత్తుకుంటూ. శ్యాం అసలే హుషారు. హాల్ చివరకి వెళ్ళి, మెల్లి గా ఎంట్రన్స్ డోర్ తీసి చూసాడు. ఏనాదయినా, ఇంట్లో మరీ వేడి గా వుంటే ' ఈనాడు ' పేపర్ చదవటానికి అరుగు మీద కూచుంటాడు నాన్న. కాని ఎవరూ లేదు. బయట దాకా వెళ్ళి చూసాడు. అరెయ్ !! మహత్యం . నాన్న బజాజ్ చేటక్ స్కూటర్ కూడా లేదు. పులి బోను లే లేదు , బహుసా దాన్ని స్నానానీకో, వెనుకాల వున్న చెట్లలోకొ తీసుకెళ్ళారు. జూ కాపరి ఎంచక్కా హాయిగా బోను లోకెళ్ళి దానికి ఆహారం పడేయొచ్చు, అదే అనుభూతి శ్యాము కి కలిగింది.
చక్కా లోపలకొచ్చి, తలుపుకి గొళ్ళెం పెట్టి, చొక్కా కాలరు పైకి ఎగరేసి "నాన్న లేరు, స్కూటర్ కూడా లేదు" అని గట్టిగా అరిచాడు వాళ్ళ రూము లో వున్న రాము అన్న కి కూడా వినపడేలా
"నాన్న ఎక్కడి కి వెళ్ళారో " అని బిగ్గరగా అడుగుతూనే, ఒక చేత్తో టి.వి మెయిన్ స్విచ్ వేస్తూ, మరో చేత్తో రీమోట్ లో ఆన్ బటన్ మరియు మ్యూట్ బటన్ ఒకేసారి నొక్కాడు. ఈ ట్రిక్ రాము కి కూడా రాదు. అమ్మ , నాన్నా పడుకున్నాక, సౌండ్ రాకుండా టి.వి ఆన్ చెయ్యడం శ్యాం నైపుణ్యం.
అమ్మే కదా అని చాన్స్ తీసుకోలేము, ఎం మూడు లో వుందో ఎమో. తిట్టదు కానీ మందలిస్తుంది. అనవసరం గా పరిస్థితి ప్రతికూలము గా మారనివ్వడు శ్యాము. ' నొప్పించక తానొవ్వక ' వాడి వ్యక్తిత్వం. టి.వి వాడికి కావలసిన చానల్ ప్రోగ్రాం కి మార్చాడు. సచిన్ ని చూడగానే అమితమయిన సంతోషం. సౌండ్ కొంచెం పెంచి టి.వి కి దగ్గరగా జరిగి, నేల మీదే కూచున్నాడు. ఇంతలో రాము
"ఒరెయ్ నాన్న వస్తే " బయం గా అంటూనే పక్కనే చేరాడు.
అన్నకి ' ఏమీ పర్లేదు ' అనే అర్ధం వచ్చేలా అభయహస్తం ఊపొతూ
"నాన్న ఎక్కడికెళ్ళరు ? ఎప్పుడు వస్తారు ? " అడిగాడు కిచెన్ లో వున్న అమ్మకి వినపడెలా గట్టి గా, తాను ఎంత సేపు టి.వి చూసుకోవచ్చు అనే అంచనా కోసం
"ఎమోరా నువ్వేకదా స్కూటర్ కూడా లేదన్నావు. అంటే బయటకే వెళ్ళారు !! సవా లక్ష పనులుంటాయి ఆయనకి. ఎక్కడికో మనకేం తెలుస్తుంది. ఆకలి కి మాత్రం అస్సలు ఆగలేరు, అసలే ఆదివారము కదా. చికన్ కూర , పప్పు చారు. పన్నెండున్నర కల్లా వచ్చి వాలి పోతారు ఇంట్లో, అది మాత్రం చెప్పగలను" వంటిట్లొంచి అమ్మ.
అసలు నాన్న ఎప్పుడు వచ్చేది, ఇంట్లొ అందరి కన్నా శ్యాము కే మొదట తెలుస్తుంది. ఇందాక బయట అరుగు మీద నాన్న వున్నాడెమో అని చూడటానికి వెళ్ళినప్పుడు, గేటు మొత్తం గా వేసి గడియ పెట్టాడు. నాన్న స్కూటర్ పెట్టుకునే స్థలం లో సరిగ్గా తన సైకిల్ అడ్డం పెట్టాడు. నాన్న వచ్చినా , ఈ అడ్డం గా వున్న వాటి కోసం కచ్చితం గా స్కూటర్ హారన్ మోగిస్తాడు. అప్పుడు టి.వి ఆపేసి తుర్రున గది లోకి పారిపోవచ్చు. ఎంతయినా శ్యాము ది చురుకైన బుర్ర.
********************************************
********************************************
******************************************
రాము శ్యాము వాళ్ళ గదిలో చదువుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ కంప్యూటర్ లాప్ టాప్ లలో. పాట్య పుస్తకాలు , ఇంటి వర్కు , క్లాసు వర్కు పుస్తకాలు లాంటివి పోయి, అన్నిటికీ ఒక్కటే తారక మంత్రం ఈ లాప్ టాప్. పిల్లలు దానిలో పనికొచ్చేవి చదువుతూ, హోం వర్కు చేస్తున్నారా, లేక సినేమాలు , యు ట్యూబు లో వీడియోలు చూస్తున్నారో కనిపెట్టడం పెద్దలకు పెద్ద పరీక్ష. వాళ్ళది సైబరాబాదు లో టు బి. హ్ . కె. (రెండు బెడ్ రూంల అపార్ట్ మంట్ ) ఉన్నత మద్య తరగతి.
శ్యాము చిన్నవాడు కొంచెం కొంటెతనం . లాప్ టాప్ లో పని చేస్తూనే పాటలు వినటం వాడికి అలవాటు.
"ఒరేయ్ నువ్వు వినే పాట నీ హెడ్ ఫోన్ లోంచి బయటకొచ్చి , ఆరడుగుల దూరం లో వున్న నాకు వినపడి డిస్టర్బ్ చేస్తోంది, ఇక నీ చెవులు పగిలిపోయి నీకు చెవుడు రావటం ఖాయం" వారించాడు పెద్దవాడు, నెమ్మదస్తుడు అయిన రాము
వినిపించుకుంటేనా మన చిన్నవాడు, పైగా తను వింటున్న పాట లో ఊపుకి తగ్గట్టు తన బుజాలు ఎగరేస్తున్నాడు. రాము తన కుర్చీ లోంచి లేచి వచ్చి, తన తమ్ముడి తల మీద తట్టి వారించాడు. " ఆ ఆ " సరే తగ్గిస్తాలే అన్నట్టు తల ఊపాడు చిన్నాడు. తన స్మార్ట్ వాచి లో ఎదో అలారం మోగింది. సరిగ్గా సమయం పదకొండు. ఆదివారం పదకొండు కి తనకి ప్రీతిపాత్రమయిన క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ తో ఇంటర్వ్యూ టి.వి లో స్పోర్ట్స్ చానల్ లో.
ఆన్ లైన్ ఆటల్లో నైపుణ్యం జాస్తి చిన్నాడికి. ఎప్పుడు దాడి తో చిత్తు చెయ్యాల్లో, ఎక్కడ ఆత్మ రక్షణ ఎత్తులు వెయ్యాలో నేర్పించాయి ఆ ఆటలు. మంచి నీళ్ళ నెపం తో బయటకి వచ్చి హాల్ లో పరిస్థితులని అవగానహ చేసుకున్నాడు. నాన్న ఇంట్లో లేనట్టే వుంది. అమ్మ వంట ఇంట్లో వుందని నిర్దారణ చేసుకున్నాడు.
బిల్డింగు ఎంత హై టెక్, ఆధునికమూ అయినా, కిందన కారు పార్కింగు లకు మూలగా, ఒక చిన్న వాటా వుండటము, దాన్లో వాచ్ మాన్ కం సెక్యూరిటి వాడు, వాడి పెళ్ళాం నివసించటము మాత్రం ప్రాచీనమే. ఈ సదరు వాచ్ మేను గారి పెళ్ళాం కొన్ని ఇళ్ళళ్ళో పనికి వెళ్ళటము కూడా పురాతనమే. ఎమాత్రం మునిపటికి మల్లే కాక వీళ్ళ పిల్లలు కూడ ఇంగ్లీషు మీడియం బడి లో చదువుతూండటం కొత్త పరిణితి.
మన శ్యాము వాచ్ మాను ని ఎప్పుడు టచ్ లో పెట్టుకుంటాడు. వాడి కి వాట్సాప్ చేసాడు.
" ఐరన్ కి బట్టలు తేవాలి , కాళి గా వుందా ? "
జవాబు " ఆ కాళి గానే వుంది "
అది శ్యాము కి వాచ్ మ్యాను కి వున్న సంకేతిక సందేసం.
అర్ధం అయింది వీళ్ళ కారు పార్కింగు స్పాట్ ' కాళీ ' గా వుంది, వీళ్ళ కారు అక్కడ లేదు అంటే , నాన్న ఎక్కడో బయటకు వెళ్ళారు.
కాలరు పైకి ఎత్తుదామనే అనుకుంటే, వేసుకున్న టి షర్ట్ కి కాలరు లేకపోవటం చేత విరమించుకొని, కొంత ధైర్యం తెచ్చుకొని , హాల్ లో టి.వి. ముందు కూచొని , విరాట్ కోహ్లీ తో ఇంటర్వ్యూ చూడటం మొదలెట్టాడు, టి.వి వాల్యూము తగ్గిస్తూ.
"అమ్మా ! .. నాన్న ఎక్కడికి వెళ్ళారు , ఎప్పుడు వస్తారు " అని గట్టి గా వంట గది లో వున్న అమ్మ కి వినపడేలా, తను ఎంత సేపు టి.వి చూసుకోవచ్చో తెలుసు కోవడానికి.
"ఎమోరా నాకు తెలియదు. ఎదొ పని వుందని అన్నారు, నాకు గుర్తు లేదు "
టి.వి వాల్యూం కొంచెం పెంచాడు శ్యాము
ఇంతలో అమ్మ వంట ఇంట్లోంచి హాల్ లోకి వస్తూ అంది " ఒకే గూగుల్ , వేర్ ఈజ్ మై హస్ బండ్ " ..అంటూ నే హాల్ లోకి వచ్చి శ్యాము కి మెత్త గా మొట్టికాయ మొట్టింది 'ఎమ్రా టి.వి చూస్తున్నావ్ చదువుకోకుండా ' అనే ఒక కంటి సైగ తో
ఇంతలొ గూగుల్ సమాధానం చెప్పింది
" మిస్స్ రేవతి , మీ ఆయన సరిగ్గా ఇప్పుడు ఏ స్థానం లో వున్నారో , తెలియటం లేదు , కానీ ఫోన్ నావిగేషన్ బట్టి, ఒక పావు గంట క్రితం మాత్రం, సాయి మారుతి కార్ మెకానిక్ దగ్గర వున్నారు" అంది ఆంగ్లం లో
ఆ సమాధానం విన్న శ్యాము టి.వి వాల్యూం ఇంకొంచెం పెంచటమే కాకుండా , కాలు మీద కాలు వేసాడు.
" ఒరెయ్ కోహ్లీ ఇంటర్వ్యూ ఆ మర్చిపొయ్యా , అయినా ఇప్పుడు ఎందుకు రా లైవ్ లో చూడాలా ? మన హోం వర్క్ లు అయిపొయ్యక చూసుకోవచ్చు గా, యు ట్యూబ్ లో పెట్టేస్తాడు" అంటూ వచ్చి పక్క సీట్ లో కూచుంటూ " అమ్మో నాన్న వస్తే " అని ముగించాడు బయం తో పెద్ద వాడు రాము.
"లైవ్ లో చూడటం కాదు.. ఇక్కడ ఫ్రెండ్స్ తో వాటస్స్ప్ లో, ట్విట్టర్ లో ఎఫ్.బి లో లైవ్ చాట్ ... అది మజా మస్తీ. మేము వెసుకునే జోకులు, చేసే మీములు" శ్యాం ముసి ముసి గా నవ్వుతున్నాడు ఎదొ మెసేజ్ చూసుకుంటూ.
"నాన్న వస్తే , ఇద్దరికీ వుంటుంది వీపు విమానం మోత" అంటూ వంట ఇంట్లో కి వెళ్ళింది అమ్మ.
అసలు నాన్న వచ్చే విషయం తనకే ముందు తెలుస్తుంది. ఎందుకంటే, వాళ్ళ కారు పార్కింగు స్పాట్ లోకి రాగానే వాచ్ మ్యాను తనకి మెసేజి పెడతాడు
" సారీ, నేను సడన్ గా బిజి, ఇప్పుడు ' స్పాట్ కాళీ ' లేదు , మీ బట్టలు ఐరన్ చెయ్యలేను " అని.
*************************************
కొన్ని విషయాలు, మార్పు లేకుండా అలానే వుండి పొతేనే బాగుంటాయి. దాక్కొని దాక్కొని, పెద్దలకి తెలియకుండా చేసే ప్రమాదము లేని స్వల్ప తప్పిదాలు, ఇంట్లో చెప్పకుండా స్కూలు ఎగ్గొట్టి సినేమాకి వెళ్ళే కిక్కు, అనుకోకుండా లటుక్కున స్నేహితులతో వేసిన ట్రిప్పు , ఇలా కొన్ని , కాలాలు మారినా మారక పోతేనే మంచిది. పెద్దవాళ్ళ కి తెలియకుండా ఏమారుస్తున్నాము అని పిల్లలు పడే ముచ్చట, చిన్ని చిన్ని తప్పిదాలు చూసి చూడనట్టు వుండే పెద్దవారి ఓపిక.
తమ్ముడి చిపిలి తనము, చెల్లెలి కొంటెతాము, అన్న పెద్దరికం, అక్క అనురాగము, అమ్మ మందలింపు, బాద్యతతో కూడిన నాన్న బెదిరింపు.
మనిషి ఎంత అత్యాధునిక యుగం లోకి అడుగిడి, వికాసము అభివృద్ది సాదించినా, నాడయినా నేడయినా , మనిషి కి మనసుకు హత్తుకునే భావ ప్రేరేపితమయిన కొన్ని విషయాలు మార్పు లేకుండా అలానే వుండి పొతేనే బాగుంటాయి.