విధి వాత - గంగాధర్ వడ్లమన్నాటి

Vidhi vaata

“అమ్మా చూసావా”!.అని మరేదో చెప్పేంతలో

“లేదురా, సమయానికి కరెంటు పోయింది. బంగారం లాంటి సీరియల్ భాగం దాదాపు మొత్తం మిస్సయ్యాను. కోడలు పిల్ల, దివానీ కాట్ మీద ఉన్న పిల్లో తీసుకుని,ఆ తర్వాత పిల్లిలా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ అత్తగారి బెడ్ రూమ్ లోకి వెళ్తుంది.అత్తగారి మొహం మీద పిల్లో అదిమి పట్టి చంపేద్దామనుకున్నదల్లా బిక్క మొహం వేస్తుంది. ఎందుకంటే అత్తగారు బోర్లా పడుకుని ఉంటుంది. ఇలా కాదని వంటింట్లోకి వెళ్ళి కత్తి తీసుకుని, ఆమె మంచం దగ్గరకి వెళుతూ ఉండగానే టక్కున కరెంట్ పోయింది.చంపిందో లేదో చూడాలి మరి” చెప్పింది లక్ష్మమ్మ దిగాలుగా.

“నా నోట్లో మాట నోట్లో ఉండగానే నువ్ అడ్డుపడిపోయి, సీరియల్ బాగాలు చెప్పడం ఏం బాలేదు. ముందు దయచేసి పూర్తిగా విను.నేను చెప్పబోయింది సీరియల్ గురించి కాదు. నా మాచవరం పెళ్లి సంబంధం గురించి” చెప్పాడు, అసహనంగా తన చేయి కొరుక్కుంటూ.

“అవును అడగడం మరిచాను. ఎవయ్యిందా సంబంధం.వాళ్లు కూడా నిన్ను కాదన్నారా. అయినా నీకు పెళ్లి అయి, విడాకులు తీసుకున్నావ్. ఆ అమ్మాయి మతి బాలేదు, సరే వద్దనుకున్నావ్, విడాకులు ఇచ్చేసి బయట పడ్డావు. కానీ లోకం తీరు వేరు, సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అంటారు. కానీ నువ్వేమో,పెళ్లి కాని అమ్మాయి కావాలంటున్నావు. అన్ని అర్హతలూ ,వయసు ఉన్న అబ్బాయిలకే బోలెడు వంకలు పెడుతున్నారు.కనుక, తల్లి మాట విని ఆ నిడదవోలు సంబంధం చేసుకో. ఆ అమ్మాయికి రెండో పెళ్లి అయినా మంచి కుటుంబం, పిల్ల లక్షణంగా ఉంది. నా మాట కాదనకు. తల్లి ఏం చెప్పినా నీ మంచికే చెప్తుంది పైగా వాళ్ళు మనకు దూరపు చుట్టాలు కూడానూ”.

“నో నేను ఆ సంబంధం చేసుకోను. పైగా, ఆ మాచవరం వాళ్ళు నా లాంటి వాడి కోసమే కాచుకు కూర్చున్నారట.దాంతో వెంటనే సరే అనేశారట మన మీడియేటర్ చెప్పాడు. అది నా డిమాండ్” చెప్పాడు అటు తిరిగి గోడని గీకుతూ మరీ సిగ్గిపాడిపోతూ.

“అలాగా” అని ఓ క్షణం ఆలోచించిన ఆమె “ఏమోరా! నువ్వు ఏమైనా చెప్పు, నీకు రెండో పెళ్లి అని తెలిసినా ఇంత త్వరగా ఒక్క పూటలో టక్కున సరే అని ఒప్పుకున్నారంటే, నాకెందుకో ఓ పట్టాన సందేహంగా ఉందిరా”.చెప్పిందామె బుర్ర గోక్కుని ఓ పేను తీసి కుక్కుకుంటూ.

“నాకు కొత్త సందేహాలు పెట్టకు. ఇప్పటికే పాతబడిపోయాను. కనుక ఇక నేను వినను. నేను మంచి సంబంధం చేసుకోవడం నీకు ఇష్టం లేనట్లుగా ఉంది” అని ఆమెని వారించి.తరువాతి కొద్ది రోజుల్లోనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు.

కొద్ది రోజుల తర్వాత, మధు దంపతులు ఒకసారి బయటికి వెళ్లారు. అప్పుడు అతని స్నేహితుడొకడు కనబడటంతో , “సుజాత, నువ్ సూపర్ మార్కెట్లోకి వెళ్లి, కావలసినవి కొనుక్కుని రా.నా ఫ్రెండ్ ఒకడు కనబడ్డాడు .నే వెళ్లి పలకరించి వచ్చేస్తాను” చెప్పాడు మధు

మధు,తన ఫ్రెండుతో మాట్లాడుతూ ఉండగానే,సుజాత తన షాపింగ్ ముగించుకుని ,సూపర్ మార్కెట్ బయటకు వచ్చి నిలబడింది.ఆమెని చూసిన మధు ఫ్రెండు,”అరె, ఈ అమ్మాయి ఏవిటీ ఇక్కడ ఉంది” అన్నాడు ఆశ్చర్యంగా.

“ఆ అమ్మాయి తెలుసా నీకు”. అడిగాడు మధు

“తెలుసు. ఆమె సంవత్సరం క్రితం ఒక అబ్బాయిని ప్రేమించి లేచిపోయింది. తర్వాత నెలకి, వాడు మోసగాడని తెలిసి తిరిగి వచ్చింది. చేసేది లేక ఎవరో ఒకరిని చూసి ఆ విషయం దాచి పెళ్లి చేసేసారు”.చెప్పాడతాను.

“అలాగా!అయినా, ఇవన్నీ నీకెలా తెలుసు”.

“ఎలా అంటే, వాళ్ళ దూరపు చుట్టం మా నాన్నకు ఫ్రెండ్. ఈమెని కూడా ఒక్కోసారి మా ఇంటికి తీసుకు వచ్చేవాడు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు, మాటల సందర్భం వచ్చినప్పుడు ఈ ముక్క చెప్పాడులే. అదీ సంగతి.మొన్న నీ పెళ్ళికి, ఇప్పుడు మీ ఇంటికి రాలేదని ఏమనుకోకు. బిజినెస్ బిజీ” అని వెళ్ళిపోయాడతను.

ఆ మాటలకి బిక్కచచ్చిన మధు,”నేను నిమిత్తమాత్రుడ్ని. విధి రాత, కాదు,కాదు విధి వాతని తప్పించుకోలేకపోయాను. ఏది జరిగినా మన మంచికే అనుకోవడం తప్ప,ఇప్పుడు ఏం చేయగలం” అని అక్కడి నుండి నిదానంగా కదిలాడు.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు