శ్రావణి 9వ తరగతి చదువుతున్నది. ఆ తరగతిలో ఎప్పుడూ శ్రావణి మొదటి ర్యాంకే వచ్చేది. "శ్రావణీ! నీకు ఎదురే లేదు. ఎప్పుడూ ఎంతో కష్టపడుతూ నీకు పోటీ లేకుండా చేసుకున్నావు. నీకు నా అభినందనలు." అన్నది స్రవంతి. "మా పెద్దమ్మ కూతురు శివానీ కూడా వాళ్ళ ఊరిలో 9వ తరగతి చదువుతున్నది. ఎప్పుడూ ఆమెకు నూటికి తొంభై ఎనిమిది శాతం మార్కులు వస్తాయి. పోటీ అంటే ఒక్క మన పాఠశాల స్థాయిలోనే చూసుకొని మురవకూడదు." అన్నది నళిని. నళినీ లేని సమయం చూసి మాలిని శ్రావణి వద్దకు చేరి, "నువ్వేమీ బాధపడకు. ఆ నళినీ ఎప్పుడూ అంతే. నువ్వు బాగు పడుతున్నా, సంతోషపడుతున్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది" అనేది. "నేను ఆ మాటలు అస్సలు పట్టించుకోను. మరింత పట్టుదలతో చదువుతా. ఆ నళినీ నోరు మూయిస్తా." అనేది శ్రావణి. శ్రావణి ఆటల పోటీలలో అందరి కంటే ఎక్కువగా 11 ప్రథమ బహుమతులను సాధించింది. "నువ్వు చాలా గ్రేట్. అటు చదువులోనూ, ఇటు ఆటల్లోనూ రాణిస్తున్నారు." అని మెచ్చుకుంది సిరి. "మా శివానీ 20 బహుమతులను సాధించింది తెలుసా!" అంది నళిని. మళ్ళీ మాలిని శ్రావణి వద్దకు చేరి, "ఆ కుళ్ళుబోతు నళినీ మాటలను పట్టించుకోవద్దు. నేను ఎప్పుడూ నీ పక్షమే! నువ్వు ఎందులో ముందు ఉన్నా అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే." అంది మాలిని. " అననీ అననీ. నేను ఎలాగైనా ఆటల్లో మరిన్ని మొదటి బహుమతులను సాధిస్తా! కుళ్ళుబోతుల నోరు మూయిస్తా." అన్నది శ్రావణి. ఇలా శ్రావణి ఎందులో రాణించినా నళిని శ్రావణిని తన పెద్దమ్మ కూతురితో పోల్చి చులకనగా మాట్లాడటం, మాలిని శ్రావణిని బాధపడవద్దని అనడం శ్రావణి శపథాలు చేయడం మామూలు అయింది. ఒకరోజు శ్రావణి వాణీ వద్దకు చేరి, "వాణీ! మనకు చదువుతో పాటు మంచి హాబీలు ఉండాలి. మా తాతయ్య చిన్నప్పుటి నుంచీ అనేక రకాల పోస్టల్ స్టాంపులను సేకరించి ఒక డైరీలో అతికించాడట. మొన్న ఆ డైరీని నాకు పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు. ఇక నుంచి నేనూ కొత్త స్టాంపులను సేకరించి ఆ డైరీలో అతికిస్తా." అంది శ్రావణి. " నీకు చెప్పలేదు కదా! నాకూ ఒక హాబీ ఉంది. నేను నీలాగే ఆ కాలం నుంచి ఈ కాలం వరకూ వచ్చిన నాణేలను సేకరిస్తున్నా. దీనికి మా తాతయ్య సహకారం చాలా ఉంది." అంది వాణి. " నేనైతే ఆనాటి పాత సినిమా పాటల నుంచి ఈనాటి పాటల వరకు సేకరించి డైరీలో రాసుకున్నా తెలుసా! పాటలు వింటూ అప్పటికప్పుడు స్పీడుగా రాసుకుంటూ మళ్ళీ వాటిని డైరీలో అందంగా రాసుకుంటా తెలుసా!" అన్నాడు వాసు. అప్పుడు నళిని ఇలా అంది. "శ్రావణీ! మీ తాతయ్య మరీ పిసినారిలా ఉన్నాడు. ఏదైనా ఖరీదైన బహుమతి ఇవ్వాలి కానీ మనవరాలి పుట్టినరోజుకు ఇలాంటి విలువ లేని బహుమతులను ఇస్తాడా?" అని. "నళినీ! ప్రతిదానికీ శ్రావణిని బాధపెట్టడమేనా నీ లక్ష్యం. వాళ్ళ తాతయ్య ఇచ్చిన ఆ బహుమతి విలువ నీకేం తెలుసు? నీకు ఏమైనా మంచి హాబీలు ఉంటేగా?" అంది వాణి. "అయితే ఆ స్టాంపుల పుస్తకం పోతే శ్రావణి ప్రాణమే పోతుందా?" అని వ్యంగ్యంగా అంది నళిని. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక మాలిని శ్రావణిని చేరి ఓదార్చడం తన వంటి శ్రేయోభిలాషులు ఉండగా బాధపడవద్దని అనడం జరిగింది. ఒకరోజు శ్రావణి తన తాతయ్య బహుమతిగా ఇచ్చిన స్టాంపుల డైరీని తన స్నేహితులకు చూపించడానికి తెచ్చింది. చూపించింది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తరగతిలోకి వచ్చిన శ్రావణి తన సంచీ చూసుకుంటే స్టాంపుల పుస్తకం మాయం అయింది. ఎవరు తీశారో చర్చ మొదలైంది. శ్రావణి విపరీతంగా ఏడుస్తుంది. అప్పుడు సిరి "నళినీ మీద నాకు అనుమానం ఉంది. నళినీ సంచీ వెతకండి." అన్నది. వెతికారు. అందులో దొరికింది. అందరూ నళినిని బీభత్సంగా తిట్టారు. నళిని తనను క్షమించమని శ్రావణిని వేడుకుంది. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న నళినీ వద్దకు చేరాడు రాము. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని నిలదీశాడు. అప్పుడు నళిని రాముతోమ ఇలా అంది. "నిజానికి నేను శ్రావణికి పెద్ద శ్రేయోభిలాషిని. ఆమె మంచి ప్రవర్తనను, కష్టాన్నీ బాగా అభిమానిస్తాను. మా పెద్దమ్మ కూతురు శివానీ ఎలా చదువుతుందో నాకు తెలియదు. కానీ మేము ఇద్దరం ప్రాణ స్నేహితులం. మాకు సెల్ ఫోన్లలో మాట్లాడుకోవడం, మెసేజెస్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మా తాతయ్య తన చిన్ననాటి అనుభవాలను నాతో ఎప్పుడూ పంచుకుంటాడు. నేనూ శివానీ ఆ కాలంలో లాగా ఇన్లాండ్ లెటర్సు క్రమం తప్పకుండా రాసుకుంటూ క్షేమ సమాచారాలు, ముచ్చట్లను పంచుకుంటాం. ప్రతిదానికీ శివానీతో పోల్చి శ్రావణిని తక్కువ చేసి మాట్లాడడం శ్రావణిని మరింత రెచ్చగొట్టి మరింత పైకి తేవడానికే. నిజానికి మాలిని ప్రమాదకరమైన శత్రువు. నేను శ్రావణిని చులకన చేసి మాట్లాడిన ప్రతీసారీ మాలిని నా వద్దకు వచ్చి నన్ను బాగా మెచ్చుకుంటుంది. శ్రావణి మొదటి ర్యాంకు రావడం అన్నట్లో ఆమె అందరి ప్రశంసలను పొందడం చూసి మాలిని కుళ్ళుకుంటుంది. మాటలతో ఇంకా శ్రావణిని బాధపెట్టమని నన్ను ప్రోత్సహిస్తుంది. శ్రావణి స్టాంపుల డైరీని మధ్యాహ్నం భోజన విరామంలో ఎవరూ లేని సమయం చూసి మాలిని తీయాలనుకుంది. అంతకు ముందే ఇంటర్వెల్ సమయంలో దానిని దొంగిలించి చింపాలన్న తన పథకాన్ని నాతో అమాయకంగా చెప్పింది మాలిని. అందుకే ఎవరూ లేని సమయంలో ఆ డైరీని నా సంచిలో వేసుకున్నాను. మనతో ప్రేమగా మాట్లాడేవాళ్ళంతా మన శ్రేయోభిలాషులే అనుకోవడం పొరపాటు. ఇలాంటి గోడ మీద పిల్లుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. నిజానికి నేను శ్రావణి ప్రాణ స్నేహితులం. నేను ఏమన్నా తనను రెచ్చగొట్టడానికే అని తనకు తెలుసు. ఇది తెలియని మాలిని ఈర్ష్యతో శ్రావణితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ కీడు చేయాలని చూస్తుంది." అని. వెనుక నుంచి ఇదంతా విన్నది శ్రావణి. పక్కనే మాలిని ఉంది. మాలిని సిగ్గుతో తల వంచుకుంది. శ్రావణి ఆప్యాయంగా నళినీని కౌగిలించుకుంది.