ప్రఖ్యాత గాయనీమణి శ్రీమతి యామిని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న "శ్రీరామ అంథుల సంగీత పాఠశాల" వార్షికోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వం వారు. దీనికి మరొక కారణం లేకపోలేదు. అంథులకు ప్రభుత్వం నిర్వహించిన పాటల పోటీలో అత్యధికంగా బహుమతులు గెలుచుకున్నది " శ్రీరామ అంథుల సంగీత పాఠశాల" విద్యార్థులే. దానిని నిర్వహిస్తున్నది మృదంగవిద్వాంసుడు రఘురామయ్య గారు. ఆయన ఒకప్పుడు మంచి పేరున్న సినీ నేపథ్యగాయకుడు. కానీ చిన్నతనంలోనే స్వరపేటికలో కణిత ఏర్పడి గొంతు ఆపరేషన్ చేయడం వలన పాటలు పాడే అవకాశాన్ని కోల్పోయాడు. చిన్నగా తప్ప అందరిలా వేగంగా మాట్లాడలేడు. తనకు ప్రావీణ్యం ఉన్న మృదంగాన్ని సాధన చేస్తూ, తన స్నేహితుడు మరియు గాయకుడు అయిన శ్రీనివాసరావుతో కలసి ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకున్న ప్రత్యేకత ఉచితంగా అంథులకు భోజన వసతి కల్పించి, సంగీతాన్ని నేర్పించడం. ఇందులో విద్యార్థులకు పాటలే కాకుండా, అన్ని రకాల వాయిద్యాలలో శిక్షణ ఇస్తారు. ఇంతటి ఉదాత్తమైన, విలువలు కలిగిన సంస్థకు మరింత ప్రచారాన్ని ఇచ్చి, ఇటువంటి సంస్థలు మరెన్నో దివ్యాంగులకు రకరకాల వృత్తులలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని ప్రభుత్వమే ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనిని ఆ జిల్లా కలెక్టరు శ్రీ ధనుంజయ్ గారు పర్యవేక్షిస్తున్నారు. మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ గారు రావడంతో కార్యక్రమం ప్రారంభమయింది. ******* ప్రధానవక్త కలెక్టర్ ధనుంజయ్ గారు మాట్లాడుతూ " వేదిక నలంకరించిన మంత్రివర్యులకు, తదితర ప్రముఖులకు, మన అతిథి శ్రీమతి యామిని గారికి, విచ్చేసిన కళాభిమానూలకు నా హృదయపూర్వక నమస్సులు. అన్ని అవయవాలు ఉన్నవారు చాలామంది వృధాగా కాలక్షేపం చేస్తూ ఒక లక్ష్యమనేది లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాత్కాలికమైన వ్యామోహాలకు లోనై యువత ఎటువంటి అకృత్యాలను చేస్తున్నారో రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులు సంపాదనలో పడి, పిల్లలను పట్టించుకోకపోవడమే. అటువంటి బాధ్యతా రహిత సమాజంలో అంథులైన పిల్లలను చేరదీసి వారిలోని జిజ్ఞాసను వెలికి తీసి, ఉచితంగా సంగీతాన్ని నేర్పించి, వారికొక జీవనోపాధిని కల్పించే దిశగా ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులోని విద్యార్థులలో ఎక్కువమంది అనాథలే. వీరందరి బాధ్యతలు తీసుకుంటున్నది రఘురామయ్య గారే. అతని ఉదారతకు, మంచి మనసుకు చేయెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సంస్థ స్థాపించి సుమారు పది సంవత్సరాలు కావస్తున్నదని రఘురామయ్య గారు చెప్పారు. ఈయన సహచరుడు మరియు వియ్యంకుడు అయిన గాయకుడు శ్రీనివాసరావు ప్రోత్సాహమే కారణమని ఆయన చెప్పారు. ఆ వివరాలు శ్రీనివాసరావు గారి నోటితోనే వినేముందు మా నుంచి ఒక శుభవార్తను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడే మన మంత్రివర్యుల వారు నాకు చెప్పారు. ఈ సంస్థకు ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం వారు సంవత్సరానికి పది లక్షలు గ్రాంటును ఇవ్వనున్నారు. ఇలాగే ఇంకెవరైనా దివ్యాంగులను చేరదీసి ఏ వృత్తిలో నైనా శిక్షణ ఇవ్వదలచినట్లైతే, సదరు పాఠశాలలకు ప్రభుత్వ అనుమతితో పాటు, ఇలాగే పదిలక్షల గ్రాంటు కూడ ఇవ్వనున్నారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వమే వారి స్వయం ఉపాధికి ఆర్థికంగా చేయూతనిస్తుందని మంత్రివర్యుల ఆదేశం మేరకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటగా పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు శ్రీమతి యామిని గారు అందజేస్తారు. విజేతలందరికీ అభినందనలు" అని తన ఆసనంలో వెళ్ళి కూర్చున్నారు ధనుంజయ్ గారు. బహుమతుల విజేతల వివరాలతో ఒకతను వేదిక మీదకు వచ్చారు. " అందరికీ నమస్కారములు. బహుమతి ప్రదానానికి ముందుగా ప్రథమ బహుమతి గ్రహీత చిరంజీవి హన్షిత తన పాటతో మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తారు. ఈ పాప ఎవరో కాదు, రఘురామయ్య గారి మనుమరాలు. హన్షితను తీసుకురండి సర్" అని రఘురామయ్య వైపు చూశాడు. రఘురామయ్య గారు ఒక ఏడు సంవత్సరాల పాపను తీసుకుని వేదిక మీదకు వచ్చారు. వస్తున్న ఆ పాపను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది యామిని. 'ఆ పాప అచ్చు చిన్నతనంలో తనలాగే ఉన్నది. ఇప్పుడు రూపంలో చాలా బేధం వచ్చింది తనకు. అందుకే ఎవరూ పోల్చుకోలేకపోవచ్చు. కానీ తనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఇదెలా సాధ్యం' ఆలోచనలో పడ్డది యామిని. పాప పాట మొదలైంది. అప్పటిదాకా గుసగుసలుగా మాట్లాడుకుంటున్న జనం, ఆ పాప గొంతు తెరవగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు. వారే కాదు, వేదిక మీద ఉన్న అందరూ నిజంగానే మంత్రముగ్దులయ్యారు. ముఖ్యంగా యామిని. 'పాతిక సంవత్సరాల వయసులో తను సాధించిన స్వరంలో పట్టు ఈ పసిది ఇప్పుడే సాధించింది. సందేహం లేదు, ఇది వంశపారంపర్యంగా వచ్చిన స్వరజ్ఞానమే. తెలుసుకోవాలి అసలు ఈ పాప నిజంగా రఘురామయ్యగారి మనుమరాలేనా అని'. హాలు దద్దరిల్లిపోయేలా మారుమ్రోగిన చప్పట్లతో మన లోకంలోకి వచ్చింది యామిని. "యామిని గారు. మీ స్వరానికి సరితూగే స్వరం తెలుగు సినీరంగానికి వారసత్వంగా రాబోతున్నది" అని ప్రేక్షకులలో ఎవరో బిగ్గరగా అరిచారు. యామిని లేచి వచ్చి పాపను దగ్గరకు తీసుకుంది. ఆమెలో ఏదో తెలియని సరికొత్త అనుభూతి. కంటిపాపలను దూరంచేసిన దేవుడు, తన తప్పు తెలుసుకుని స్వరాన్ని వరంగా ఇచ్చాడు. యామిని మనసు గతంలోకి జారింది. ****** " విహారి, ఈ కళ్ళు లేని బిడ్డను నేను సాకలేను. తీసుకెళ్ళి ఏ అనాధాశ్రమంలోనో, ఏ రైల్వేస్టేషను లోనో వదిలిపెట్టిరండి" గొంతు చించుకుని అరిచింది యామిని. " యామిని కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎంత కాదనుకున్నా అది మనం కన్నబిడ్డ. మనవాళ్ళు మనలనూ వెలివేశారు. ఒంటరిగా బ్రతుకుతున్న మనకు దేవుడిచ్చిన బిడ్డ ఈ పాప. ఒక్కసారి ఆలోచించు. ప్లీజ్" బ్రతిమలాడాడు విహారి. " వద్దు విహారి. నావల్ల కానిపని ఇది. నన్నింక బలవంతపెట్టకు. నీవల్ల కాకపోతే నేనే ఆ పని చేస్తాను" రాజీపడలేదు యామిని పాపను తీసుకుని వెళ్ళిపోయాడు విహారి. గుండెలు పగిలేలా ఏడ్చింది యామిని ******* " మేడమ్. బహుమతి ప్రదానం మొదలుపెడదామా ఇక" అన్నాడతను. పాపను వదలిపెట్టి లేచింది. కానీ ఆలోచనలు ఆమెను వీడలేదు. పరధ్యానంగానే బహుమతి ప్రదాన కార్యక్రమం ముగించింది యామిని. శ్రీనివాసరావును వేదిక మీదకు ఆహ్వానించారు అధ్యక్షుల వారు. రఘురామయ్యతో సహా వేదిక మీదకు వచ్చాడు శ్రీనివాసరావు. " వేదిక మీద వున్న వారికి, విచ్చేసిన అందరికీ మా నమస్కారములు. నిజానికి రఘురామయ్య గారే ఈ వార్షికోత్సవ సందర్భంగా మాట్లాడాలి. కానీ ఆయన ఆ భారాన్ని నా మీద పెట్టాడు. అందులకు ఆయనకు నా కృతజ్ఞతలు. నిజానికి ఈ సంస్థ స్థాపించడానికి ప్రధానకారణం రఘురామయ్య గారి కూతురు, నా కోడలు వర్షితే. పుట్టుకతోనే అంథురాలైన వర్షితను తమ ప్రాణంగా పెంచుకున్నారు రఘురామయ్య. తనకు గుడ్డితనాన్ని శాపంగా ఇచ్చిన దేవుడు మధురస్వరాన్ని వరంగా ఇచ్చాడు. అది గుర్తించిన రఘురామయ్య తానే గురువై వర్షితను తీర్చిదిద్దడానికి పూనుకున్నాడు. అదే సమయంలో ఒక కార్యక్రమంలో మేమిద్దరం పాల్గొనడం జరిగింది. అప్పుడే మా మధ్య స్నేహం ఉదయించింది. నా కొడుకును అతని దగ్గర సంగీతానికి చేర్చాను. కాలక్రమంలో రఘురామయ్యకు ఆపరేషను జరగడం, అతని వద్ద చేరిన పిల్లలకు నేను పాఠాలు చెప్పవలసిరావడం జరిగింది. ఆ కుటుంబం మంచితనం నాకు నచ్చింది. మా అబ్బాయి కూడ నాకు అంగీకరించడంతో వర్షితను మా ఇంటికోడలిని చేసుకున్నాను. ఆమె కోరిక మేరకు ఈ పాఠశాలను ప్రారంభించాము. ఉచితంగా సంగీతం నేర్పించాలనే నా కోడలి కోరిక తీర్చడం కోసం ప్రారంభించిన పాఠశాల ఇది. హన్షితకు జన్మనిచ్చిన వర్షిత, పాపకూడ అంథురాలు కావడంతో క్రుంగిపోయింది. మేమే ధైర్యమిచ్చి వర్షితను ఓదార్చాము. మా దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. పాపకు సంవత్సరం వచ్చేసరికి రఘురామయ్య భార్య చనిపోయింది. మరో ఆరునెలలు తిరగకముందే నా కొడుకు, కోడలు కారు ప్రమాదంలో చనిపోయారు. కానీ మేము క్రుంగిపోలేదు వారి ఆశయం కోసం గుండెదిటవు చేసుకున్నాము. ఈ పిల్లలనే మా పిల్లలు అనుకున్నాము. ఈ రోజు కలెక్టరుగారి మాటలు మాకు కొండంత బలాన్ని ఇచ్చాయి. ఇంకా ఎక్కువ మంది అంథ అనాథలను చేరదీస్తాము. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు అంగవైకల్యమున్న వారిని చేరదీసి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలని మా విన్నపము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మంత్రివర్యులకు, కలెక్టరు గారికి, శ్రీమతి యామిని గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు" అని అందరికీ నమస్కరించి దిగివచ్చారు రఘురామయ్య, శ్రీనివాసరావు. సభ ముగిసింది. అందరూ బయలుదేరారు. యామిని బయలుదేరబోతూ రఘురామయ్య దగ్గరికి వచ్చింది. " రఘురామయ్య గారు మీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా" అడిగింది " అడగండి మేడమ్" చిన్నగొంతుతో కొంచెం కష్టంగా మాట్లాడాడు రఘురామయ్య. " వర్షిత మీ అమ్మాయేనా" " అవును " " నిజం చెప్పండి. తను మీ కన్నకూతురేనా " ఒక్క క్షణం తటపటాయించాడు రఘురామయ్య. " రఘురామయ్య గారూ. నేను ఎవరికీ ఏమీ చెప్పను. కానీ నాకు నిజం తెలియాలి. ఆమె మీ కన్నకూతురు కాదు కదూ" ఆత్రుతగా అడిగింది యామిని. ఆమె కన్నుల్లో కన్నీళ్ళు ధారలు కడుతున్నాయి. అర్థంకాలేదు ఎందుకలా ఆమె అడుగుతున్నదో రఘురామయ్యకు. చెప్పాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నాడు. వత్తిడి చేయసాగింది యామిని. మెత్తబడ్డాడు రఘురామయ్య. " వర్షిత నా కన్నకూతురు కాదు. సుమారు ముప్ఫై సంవత్సరాల క్రితం నాకు రైల్వేస్టేషనులో దొరికింది. పిల్లలు లేని నాకు తనే కూతురయింది. అంథురాలైనా నాకు తను దేవుడిచ్చిన వరంగా పెంచుకున్నాము. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నా బిడ్డకు స్వరాన్ని వరంగా ఇచ్చాడు దేవుడు. అదృష్టం వక్రించి నా బిడ్డను దేవుడు తీసుకెళ్ళినా, కోకిల వంటి మనుమరాలిని ఇచ్చాడు. దయచేసి ఈ విషయం ఎవరితోను చెప్పకండి. మీరు బాధపడుతుంటే చెప్పాను" అతికష్టం మీద నెమ్మదిగా చెప్పాడు రఘురామయ్య. హతాశురాలైంది యామిని. "సందేహం లేదు. వర్షిత తన కూతురే. కాకుండా వుంటే హన్షితకు తన పోలికలు రావు. తప్పుచేశాను. కన్నబిడ్డ అంథురాలని గాలికి వదిలేస్తే, పెద్దమనసుతో తీసుకోచ్చుకుని పెంచుకున్న రఘురామయ్య ముందు తను పాతాళంలో ఉన్నట్లుగా తోచింది యామినికి. ఎంత పేరు, డబ్బు సంపాదిస్తే ప్రయోజనమేమిటి? ఒక లోపం వున్నదని కన్నబిడ్డనే వదిలేసిన మనిషిని, అసలు నేను మనిసినేనా?" అనేక ప్రశ్నలు యామినిలో ఉదయించాయి. తన తప్పిదం తన కళ్ళముందే సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఆమె కళ్ళలో నీరు ధారాపాతంగా కారుతూనే వుంది. ఏదైనా చేయాలి. నాలాగ ఎందరో ఇలాంటి తప్పులు చేసి, కన్నబిడ్డలు లోపాలతో పుట్టారని నిర్దాక్షిణ్యంగా వదిలేసి అనాథలను చేసి చేతులు దులుపుకుంటున్నారు. అలాంటి అనాథలకు ఏదైనా చేసి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అవునులచేసుకోవాలి. ఏదో నిర్ణయానికి వచ్చింది యామిని. ****** " యామిని గారు మీరిక్కడికి..." ఆర్దోక్తిలో ఆగిపోయాడు శ్రీనివాసరావు. " అవునండి. ఇకనుంచి నేను మీతోనే. నా యావదాస్తిని మీ అంథ అనాథ సంగీత పాఠశాలకు వ్రాస్తున్నాను. ఇక నేను ఇక్కడే వుంటాను. దయచేసి అనుమతించండి" ప్రాధేయపూర్వకంగా అడిగింది యామిని. " అయ్యో అవేం మాటలమ్మా. మాకు ఆస్తులు వద్దమ్మా. మీవంటి సంగీత సరస్వతులు మాకు సహాయంగా వుంటానంటే అంతకంటే మాకు ఏంకావాలి" ఆనందంతో చెప్పాడు శ్రీనివాసరావు. ఇంతలో రఘురామయ్య వచ్చాడు హన్షితతో కలిసి. హన్షితను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది యామిని. తన బిడ్డనే తను హత్తుకున్న ఆనందం కలిగింది యామినికి. దారి తప్పిన స్వరం తిరిగి గాడిలో పడినట్లనిపించింది ఆమెకు. ******* అయిపోయింది ********