"మాతృమూర్తీ! నీకు వందనం!" - గంజి సాంబశివరావు

Matrumoorthi neeku vandanam

అది ఒక మహానగరం! ఆ నగరంలో ఒక కాలనీలో నివసిస్తున్నారు ముకుందరావుగారు. వారిది మధ్యతరగతి కుటుంబం! పదవీ విరమణ పొంది, భార్యాపిల్లలతో ప్రశాంతజీవితం గడుపుతున్నారు. కుమారుడు ' వరప్రసాద్ ' ముస్తాబయి, అమ్మభాగ్యలక్ష్మికీ, భార్య శ్రావణికీ 'బై ' చెప్పి, "ఆఫీసుకు వెళ్ళొస్తాను నాన్నా!" అని బైకు స్టార్టు చేసి బయలుదేరాడు. వరప్రసాద్ , శ్రావణి చాలా అన్యోన్యమైన దంపతులు. వారికి ముద్దులొలికే కుమారుడు 'అఖిల్ '. అయిదవ తరగతి చదువుతున్నాడు. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. అయితే కొద్దిరోజులుగా...వరప్రసాద్ ఆరోగ్యం లో ఏదో మార్పు వచ్చింది! నీరసంగా వుంటు న్నాడు. నడకలో వేగం తగ్గింది! ఆఫీసులో సెలవులు ఎక్కువగా తీసుకుంటున్నాడు. ముకుందరావుగారు భాగ్యలక్ష్మితో కొడుకును డాక్టర్కి చూపించమన్నారు. ముకుందరావుకంటే భాగ్యలక్ష్శిగారే అన్ని విష యాల్లోనూ ధైర్యంగా, చొరవగా వుంటారు! ఆస్పత్రిలో వరప్రసాదుకు 'లాబ్ టెస్టు' లన్నీ చేసి రెండురోజుల తరువాత రమ్శన్నారు! రెండురోజులాగి,మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళారు భాగ్యలక్ష్మిగారు కొడుకుతో! ఇద్దరు డాక్టర్లు టెస్టురిపోర్టులను నిశితంగా పరిశీలించారు! "సారీ మేడమ్ ,మేము చెప్పే విషయం విని కంగారు పడకండి! ధైర్యంగా వుండండి! మీ అబ్బాయికి ఒక కిడ్నీ పూర్తిగా పాడయిపోయింది! రెండవది కూడా దాదాపు అదే స్థితికి వచ్చేటట్లువుంది" డాక్టర్లు చెప్పిన విషయం విని భాగ్యలక్ష్మి, వరప్రసాదులకు నోట మాటరాలేదు! ప్రక్కలో బాంబు పేలినట్లయింది! ఎలాగో తేరుకొని, "డాక్టరుగారూ,మీరు అంటున్నది నిజమేనా? రిపోర్టులు బాగా చూసారా?"బేలగా అడిగింది భాగ్యలక్ష్మి. "..అన్నీ క్షుణ్ణంగా పరిశీలించామమ్శా! మేము చెప్పింది కరెక్టే, డయాలసిస్ చేసి కొంత కాలం గడపవచ్చు! అయితే ఎక్కువరోజులు కంటిన్యూచేయడం మంచిది కాదు.కిడ్నీమార్పిడి చేస్తే...మీఅబ్బాయి తిరిగి ఆరోగ్యవం తుడవుతాడు! మీరేమీ అధైర్యపడకండి. రక్త సంబంధీకులెవరైనా ఒక కిడ్నీ దానం చేయడానికి ఒప్పుకుని ముందుకు వస్తారేమో చూడండి. అదయితే బాగా సెట్ అవుతుంది! బయటివాళ్ళ నుండి కిడ్నీ కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని!"...డాక్టర్లు వివరించారు. తల్లీకొడుకులకు తల తిరిగినంత పనైంది! బాధతో,బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో ముకుందరావు,భాగ్యలక్ష్మి తర్జన భర్ఙన పడుతున్నారు. "కిడ్నీదానం చేయమని మన కూతురుని అడుగుదామా?"...అడిగాడు ముకుందరావు. "వద్దండీ!మన అమ్మాయి ఒప్పుకున్నా... అత్తగారు,మన అల్లుడు ఒప్పుకోరు! మరోలా అనుకుంటారు...వాళ్ళను బాధ పెట్టొద్దు!" "మరేం చేద్దామంటావు భాగ్యం" బేలగా అడిగాడు ముకుందరావు."నేను నా కిడ్ని ఇస్తా నండీ!"అంది భాగ్యలక్ష్మి వెంటనే. "నువ్వా! నీకూ అరవైఏళ్ళు పైబడ్డాయి!" ఆందోళనగా అడిగాడు ముకుందరావు. "నాకేమండీ! ఇప్పుడు నేను ఆరోగ్యంగానే వున్నానుగా! మన వంశాంకురం భార్యతో, కొడుకుతో కలకాలం సుఖంగా జీవించాలి! నాదేముంది... జీవితంలో చివరి దశకు చేరుకున్నాను. వాడి సంతోషంకంటే నాకేదీ ముఖ్యం కాదు.మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణం ఇచ్చైనా...వాడ్ని కాపాడుకుంటాను!" అంది భాగ్యలక్ష్మి ధృఢనిశ్చయంతో! ముకుందరావు గత్యంతరంలేక అంగీక రించాడు! హాస్పిటల్లో భాగ్యలక్ష్మిగారికి అన్ని టెస్టులూ నిర్వహించి, ఆమె కిడ్నీ కొడుక్కి పర్ఫెక్టుగా సెట్ అవుతుందని డాక్టర్లు చెప్పారు. భాగ్యలక్ష్మి ఎంతో సంతోషించారు! ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసారు డాక్టర్లు! రోజులు గడిచేకొద్దీ...మంచి ఆరోగ్యంతో కోలుకున్నాడు వరప్రసాద్ . డాక్టర్లు చెప్పిన నియమాలు పాటిస్తూ, తల్లీకొడుకులు ఆరోగ్యంతో...సంతోషంగా కాలం గడపసాగారు. అయితే విధి బలీయమైనది! కొడుక్కి ఆపరేషన్ జరిగి రెండేళ్ళు ముగిసేలోపే, ముకుం దరావు 'గుండెపోటు'తో పరమపదించారు! ఇది ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ! భర్త మరణం భాగ్యలక్ష్మిని బాగా క్రుంగతీసింది! ఆ దిగులుతో అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమె శరీరం లో వున్న ఒక్క కిడ్నీ కూడా సంతృప్తికరంగా పనిచేయడం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు! భర్త మరణించి ఏడాది లోపే ఆమె కూడా స్వర్గస్థురాలయ్యింది.వరప్రసాద్ కుమిలిపోతూ శోకసముద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియలు,కర్మకాండ పూర్తయింది! వరప్రసాద్ భార్య,కొడుకుతోపాటు తల్లి చిత్రపటం ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. కళ్ళవెంట కన్నీరు కారుతోంది! మనస్సుమాత్రం మౌనంగా యిలా రోదించసాగింది! "అమ్మా! నన్ను నవమాసాలు మోసి,నాకు నీ రక్తమాంసాలు పంచి జన్మనిచ్చి, నన్ను పోషించి,విద్యాబుధ్ధులు నేర్పించి, ఇంతవాడ్ని చేసిందిగాక...నాకు ప్రాణా పాయ సమయంలో నీ శరీరంలోని ఒక భాగాన్ని సంతోషంగా నాకు అర్పించి, మృత్యుకౌగిలి నుండి తప్పించి, మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చావు. నాకు నీ కిడ్నీని దానం చేసి, నీ ఆయుష్షును తగ్గించుకుని,నా ఆయుష్షును పెంచావు. నీ ఋణం నేనెలా తీర్చుకోగలను? నీలాంటి త్యాగమూర్తికి కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం... మళ్లీ నాకు జన్మంటూవుంటే...నేను నీకొడుకుగానే పుట్టాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను! "మాతృమూర్తీ! నీకు శతకోటి వందనాలు". చిత్రపటం లోనించి ఆ మాతృదేవత "చిరంజీవ... సుఖీభవ!" అని ఆశీర్వదించింది చిరునవ్వుతో!. ************. **********. **********"

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు