ఆ అడవిని పరిపాలించే సింహం అడవి జీవుల సమస్యలను పట్టించుకోవడం లేదు. అడవిలో ఏ మాత్రం తిరగకుండా తనకు కావలసిన ఆహారాన్ని తన నమ్మకస్తులతో తెప్పించుకుంటుంది. ఏ జీవి అయినా సింహం వద్దకు వెళ్ళి, తన సమస్యను చెప్పుకుంటే చూద్దాం అనేది. కానీ ఆ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాదు. ఆ జంతువుల సమస్యలను చూసిన ఏనుగుకు జాలి వేసింది. తానే స్వయంగా అడవి అంతా తిరిగుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది. అనారోగ్యంతో బాధపడుతున్న జీవులకు తానే స్వయంగా ఆహారాన్ని సేకరించి, ఇచ్చేది. తాను అన్ని జబ్బులకు వైద్యాన్ని నేర్చుకొని ఏ జీవికి ఏ జబ్బు వచ్చినా వైద్యం చేసి బ్రతికించేది. ఏ జీవికి ఆపద వచ్చినా ఆదుకునేది. ఇలా కరిరాజు అడవికి అనధికారికంగా రాజు అయింది. ఆ అడవిలోనే ఒక అతి బలిష్టమైన నక్క ఉండేది. తనకు ఈ ఆకారం దేవుడు ఇచ్చిన వరంగా భావించింది. ఆ అడవికి తాను రాజు కావాలని ఆశ పడింది. అన్ని జీవులతోనూ స్నేహాన్ని నటించింది. తీయగా మాట్లాడుతూ అన్నింటినీ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. తరచూ అడవి జీవులతో సమావేశం ఏర్పాటు చేస్తూ సింహం చేసే తప్పులను ఎత్తి చూపేది. సింహాన్ని కఠినంగా దుర్భాషలాడుతూ లబ్ది పొందాలని ప్రయత్నించింది. ఒక సమావేశంలో సింహం తన పొట్ట తానే నింపుకోవాలని చూస్తుందని, అడవి జీవుల ఆవేదన దానికి పట్టడం లేదని ఉపన్యాసం మొదలు పెట్టింది. ఆ అడవిలోని కొన్ని జీవులు తమ ఆకలి బాధను నక్కకు చెప్పుకొని తీర్చమని వేడుకున్నాయి. "ఓ దానికేం? మీకు నేను కాక ఇంకెవరు ఉన్నారు?" అనేది. ఆ తర్వాత మరచిపోయేది. మరోసారి సమావేశమై సింహం పరిపాలనలో అడవి జీవుల ఆరోగ్యాన్ని పట్టించుకునే నాథుడే లేడని, అడవి జీవుల సంఖ్య ఇలా తగ్గిపోతే అడవిని ఎవరు కాపాడుతారు?" అంటూ ఆవేశంగా ఉపన్యాసం ఇస్తూ సింహాన్ని ఇష్టానుసారంగా దుర్భాషలాడసాగింది నక్క. ఒక కుందేలు "అవును మిత్రమా! నాకు తెలిసిన కొన్ని జీవుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అనారోగ్యంతో వాటి ప్రాణాలు పోయేటట్లు ఉంది. ఎలాగైనా ఏనుగుకు ఈ విషయం చెప్పి సాయం చెయ్యి. గజరాజు వైద్యంతో ఆ జీవుల ప్రాణం నిలుస్తుంది." అని నక్కతో అంది. నక్కకు ఈర్ష్యతో ముఖంలో రంగులు మారాయి. వెంటనే ఆ భావం కనబడనీయకుండా " సరే! గజరాజుతో చెప్పి, ఆ జంతువుల ప్రాణాలను నిలబెడుతా." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ విషయం మరచిపోయింది. మరోసారి ఆ నక్క మళ్ళీ జంతువుల సమావేశం ఏర్పాటు చేసి ఇలా మాట్లాడింది. "అసలు ఈ అడవిలో పరిపాలన అనేది ఉందా? రోజురోజుకూ మన సమస్యలు పట్టించుకునే వారే లేరు. అడవికి రాజు అంటే ఎలా ఉండాలి? అడవి అంతా కలియదిరుగుతూ స్వయంగా జీవుల సమస్యలను తెలుసుకొని, పరిష్కరించాలి కానీ సింహం కొండలాగా ఒక్కచోటే కూర్చొని తినడమే తప్ప ఇంకేమీ చేయడం లేదు. ఈ అడవికి మీ సమస్యలన్నీ తెలిసిన కొత్త రాజును నిర్మించడమే దీనికి తక్షణ పరిష్కారం." అని మొదలు పెట్టి, మళ్ళీ సింహాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టింది. అప్పుడు రామచిలుక "మా అందరి సమస్యలు తెలిసిన నువ్వు ఉన్నావు కదా! ఎవరు రాజైతేనేమి? నువ్వు అడవి అంతా కలియదిరుగుతూ మా అందరి సమస్యలను పరిష్కరించవచ్చు కదా!" అన్నది. అప్పుడు నక్క "ఓ దానికేం? మీ అందరికీ ఎప్పటికైనా పెద్ద దిక్కు నేనే కదా! అలాగే పరిష్కరిస్తా." అన్నది. ఆ తర్వాత చాలా రోజులు తప్పించుకొని తిరిగింది. సింహం మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎదురు తిరిగిన జంతువులను చంపుకు తింటుంది. మళ్ళీ నక్క అడవి జీవుల అన్నింటినీ సమావేశపరచింది. "చూశారా! ఆ దుష్టరాజు ప్రవర్తన. రాజే మనల్ని చంపుకు తింటే ఇక మనకు ఎవరు దిక్కు? ముందు ముందు మనల్ని అందరినీ చంపుకు తినడం ఖాయం. మనం అందరం ఐకమత్యంగా ఉండి ఆ సింహంపై ఒకేసారి దాడి చేసి దాన్ని చంపెయ్యాలి. ఆ తర్వాత మనం అందరం సమావేశం అవుదాం. మీ అందరిలో ఎక్కువ జీవుల అభిప్రాయం ప్రకారం కొత్త రాజును నియమించుకుందాం. మీరంతా భయపడుతూ కూర్చుంటే ఇక మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు." అన్నది. అన్ని జీవులు ఐకమత్యంగా ఉండి సింహాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకున్నాయి. సింహం రోజూ తిరిగే ప్రదేశంలో సింహం రాక కోసం పెద్ద పెద్ద జీవులు చాటుమాటుగా పొంచి ఉన్నాయి. సింహం కనబడగానే మూకుమ్మడిగా జంతువులు అన్నీ సింహం మీద దాడి చేసి సింహాన్ని అంతమొందించాయి. అప్పుడు నక్క " నా ప్రియమైన స్నేహితులారా! దాదాపు అందరం ఇక్కడే ఉన్నాము. మీ అందరి అభిప్రాయం ప్రకారం కొత్త రాజును ఇప్పుడే ఎన్నుకుందాం. చెప్పండి. నూతన రాజు ఎవరైతే బాగుంటుంది?" అని. అన్నీ కలసి గజరాజు రాజైతే అడవికి న్యాయం జరుగుతుందని అన్నాయి. నక్క ఖంగు తిన్నది. "ఏం? మీ సమస్యలు అన్నీ తెలిసిన నేను రాజుగా ఎందుకు ఉండకూడదు?" అన్నది. అప్పుడు జింక ముందుకు వచ్చి ఇలా అన్నది. "మా సమస్యలు తెలుసుకొని ఏమీ పట్టించుకోకుండా కేవలం పాలకులను ఇష్టం వచ్చినట్లు తిట్టగానే రాజుగా అర్హత ఉంటుందా? ఏనుగు నిత్యం మన మధ్య తిరుగుతూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. నిజంగా నువ్వు అడవి జీవుల శ్రేయోభిలాషివే అయితే మాకు ఏది న్యాయమో తెలుసుకొని దాన్ని అంగీకరించాలి. రాజ్యకాంక్ష ఉండకూడదు. సముద్రంపై వారధి నిర్మిస్తున్నపుడు నా వల్ల ఏమవుతుందిలే అని చిన్ని ఉడుత ఊరుకోలేదు. నిజంగా దానివల్ల ఏమీ కాకపోయినా తన వంతు కృషి చేసింది. నిజంగా నీకు అడవి జీవులపై ప్రేమ ఉంటే సమావేశాలు పెట్టి సింహాన్ని తిడుతూ సమయాన్ని వృథా చేసుకోవు. చేతనైనంతలో మాకు ఎంతో కొంత సాయం చేస్తావు. కానీ మేము ఏ సహాయం అడిగినా చేస్తా అని తప్పించుకున్నారు. నీకు రాజ్యకాంక్ష తప్ప మాకు సేవ చేయాలనే ఆలోచన లేదు." అని. నక్క ఆవేశం ఆపుకోలేక జింకపై దాడి చేయబోయింది. మిగతా జంతువులు రెప్పపాటులో స్పందించి, నక్కపై దాడిచేసి, దాన్ని బాగా కొట్టి, నడుం విరగ్గొట్టి వదిలేశాయి. గజరాజును రాజుగా ప్రకటించుకున్నాయి.