గాయత్రి అతి సామాన్య మధ్య తరగతి కుటుంబం లో పెరిగింది . తండ్రి ఒక చిన్న బళ్లో బడిపంతులు . తల్లి గృహిణి . గాయత్రి కి అన్నయ్య ,చెల్లెలు వున్నారు . మధ్య తరగతి సగటు ఆలోచన ఆ సంసారం లో కూడా వుంది .మగ పిల్లవాడిని చదివించాలి ,ఆడపిల్లలకు పెద్ద చదువులు చదివించకుండా వీలైనంత తొందరగా పెళ్లి చేసి పంపాలి ! గాయత్రికి యెన్నో ఆశలు ,యెన్నో వూహలు !అవి గగన కుసుమాలు అని కూడా తెలుసు !
గాయత్రి తల్లితండ్రులు వున్నంతలో శక్తి వంచన లేకుండా వెదికి కౌండిన్య తో పెళ్లి చేసారు . అతనికి తల్లి లేదు . తండ్రి ,చెల్లెలు వున్నారు . వాళ్లది వీళ్లలాగానే మధ్య తరగతి సాధారణ కుటుంబం . కౌండిన్య యోగ్యుడు . తండ్రి పల్లెటూళ్లో వున్న యింట్లో వుండి కూరగాయలు పొలం లో పండించుకుంటూ రోజులు గడుపుతున్నాడు . అప్పుడప్పుడూ కౌండిన్య డబ్బు పంపుతాడు .గాయత్రి పెళ్లయ్యి మూడు నెలలయ్యింది . భర్త మనసు ,అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది .
కౌండిన్య మెడికల్ రిప్రెజెంటివ్ గా పని చేస్తున్నాడు . అతను యింటి కి వచ్చేటప్పటికి యించుమించు చీకటి పడుతుంది . లంచ్ బాక్స్ తీసికెళ్తాడు . స్కూటరు వాయిదా పద్ధతిలో కొనుక్కున్నాడు . ఉదయం సుమారు పది గంటలకు బయలు దేరుతాడు . అప్పటికి గాయత్రి యింటి పనంతా ముగించుకుంటుంది . రెండు గదుల చిన్న అద్దెయిల్లు భోజనం అయిన తర్వాత కాసేపు టి . వి చూస్తుంది . ఇంకా చుట్టుపక్కల అంతా కొత్త . ఎవరితో పరిచయాలు .లేవు . తను పెరిగిన వాతావరణం వల్ల గాయత్రి తొందరగా నలుగురిలో కలవలేదు . ప్రస్తుతానికి గాయత్రి ప్రపంచం కౌండిన్య చుట్టూ పరుచుకుంది . అతని కోసం యెదురు చూడడమే గాయత్రి ముఖ్యమైన పని .
కౌండిన్య మితభాషి . సరదాలు తక్కువ . వచ్చిన జీతం పొదుపుగా ఖర్చు పెడతాడు . గాయత్రి చేతికి యివ్వడు . ఇద్దరూ యింకా ఒకళ్లనొకరు అర్ధం చేసుకోవడం లో వున్నారు . భర్త తత్త్వం గ్రహిస్తున్న గాయత్రి తన సరదాలు చెప్పడానికి కూడా జంకుతున్నది . అతను అడగడానికి కూడా ప్రయత్నించడు . తన భార్య ,సంతోషం ,అవసరాలు ,యేమి పట్టవు . మోజు కూడా తక్కువే . గాయత్రి అందం కూడా అతనిని పెద్దగా కట్టి పడెయ్యలేదు . ఇల్లు వున్నంతలో పొందికగా అమర్చుకుంది . వంట కూడా రుచి గా శుచి గా చేస్తుంది . తనుకూడా పొందికగా వున్నంతలో అతను వచ్చేటప్పటికి అందం గా తయారవుతుంది . కౌండిన్య ఆంతర్యం యేమిటో గాయత్రికి అర్ధం కావడం లేదు . గాయత్రికి భర్త ప్రవర్తన నిరుత్సాహం గా వుంది .
ఒకటి మాత్రం గాయత్రి గ్రహించింది . భర్త కు తానొక్కడే కష్ట పడుతున్నాడని భార్య నీడపట్టున హాయిగా వున్నదని యేదో మనసులో తొలుస్తున్నది . ఈ కొద్దికాలం లో గాయత్రి కి యింతమాత్రం తెలుసుకుంది .
సాయంత్రం ఆరుగంటలయ్యింది . భర్త వచ్చేవేళయ్యింది . గాయత్రి మల్లెపూలు జడలో అందం గా పెట్టుకుని మంచి చీరె కట్టుకుని కౌండిన్య కోసం యెదురు చూస్తూ కూర్చుంది . వస్తూనే చిరాకుగా ,విసుగ్గా వచ్చాడు . ముఖం లో నవ్వు లేదు ,ఆప్యాయత లేదు . గాయత్రి ని తేరిపారా చూసాడు . గబగబా స్నానం చేసి పక్క మీద వాలిపోయాడు . అక్కడ భార్య వుంది ,తన కోసం యెదురు చూస్తున్నదన్న ధ్యాసే లేదు .
గాయత్రి కి దుఃఖం ఆగలేదు . ఒక నవ్వు లేదు . ఒక పలకరింపు లేదు . మనసు చివుక్కుమంది . అమాయకం గా పడుకున్న భర్త ను చూడగానే గాయత్రి తనే అనవసరం గా అపోహలు పడుతున్నానేమో అని మనసు కలుక్కుమంది .ఉదయం నుంచి కాళ్ళరిగేలా తిరిగీ తిరిగీ అలిసిపోతున్నారేమో !! తానే స్వార్ధం గా ఆలోచిస్తున్నదేమో !!ఎంత మందినో కలవాలి ,యెంతో చాకచక్యం గా మెలగాలి . బుర్ర బాగా వేడెక్కి వుంటుందేమో !గాయత్రి తనల్ని తాను నచ్చ చెప్పుకుంది . ఆ క్షణం లో అతనిని చూస్తే జాలి వేసింది .
గాయత్రి నెమ్మది గా అతని పక్కన కూర్చుంది . భుజం తట్టింది .
"ఏమిటీ "కళ్లు మూసుకునే కౌండిన్య ప్రశ్నించాడు .
"లేవండీ ,చీకటి పడుతున్నది . రండి భోజనం చేద్దాం "అంటూ ప్రేమ గా అతని కళ్లల్లోకి చూస్తూ గాయత్రి అన్నది .
"నన్ను విసిగించకు !నీకు ఆకలేస్తే తినేసెయ్యి . ఎండలో తిరిగీ తిరిగీ అలసి వచ్చానన్న యింగిత జ్ఞానం లేదు . ఫో అవతలికి "అంటూ కౌండిన్య చీదరించుకున్నాడు .
గాయత్రి మౌనం గా అక్కడినించి లేచి వంటింట్లో కి వెళ్లింది . బాగా ఆకలి వేస్తున్నది . ఎప్పుడో పొద్దున చేసిన భోజనం . మళ్లీ మధ్యాహ్నం యేమి తినదు . అతను తినకుండా తాను తినడానికి మనసు ఒప్పుకోదు . అతనితో కూర్చుని సరదాగా కబుర్లు చెప్తూ భోజనం చెయ్యాలని గాయత్రి కోరిక .
-------------------------------------------------------------------------------------------------------------------------------
ఉదయం కౌండిన్య కు కాఫీ యిచ్చి తనూ కాఫీ తెచ్చుకుంది . అది చూసి కౌండిన్య మనసులో యేదో ఘర్షణ !గాయత్రి యెప్పుడూ నీడ పట్టున యింట్లోనే వుంటుంది కదా !! కాఫీ తాగకపోతే యేమవుతుంది ?ఆ పాల తో తనకు మజ్జిగ చేసి యివ్వచ్చుగా !!ఇల్లు కదలకుండా అన్నీ తెచ్చి పడేస్తున్నాడు . అతనిది వింత మనస్తత్వం !ఎంతసేపూ తనొక్కడే కష్ట పడుతున్నాడు ,భార్య హాయిగా యింట్లో దర్జా గా వుంటున్నది అని భావిస్తాడు .
గాయత్రి వంట ముగించింది . కౌండిన్య గబగబా స్నానం ముగించి దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చాడు . చేసేది తిరుగుడు వుద్యోగం కాబట్టి భోజనం చేసి బయలు దేరుతాడు .మధ్యాహ్నానికి యింటినించే పెరుగన్నం ,తీసుకెళ్తాడు . భోజనానికి కూర్చున్నప్పుడు కూడా తరుముకొచ్చినట్టు తినేసి లేస్తాడు .. అంతేకానీ కూర బాగుందనీ ,పప్పు బాగుందనీ ,పచ్చడి బాగుంది యెన్నడూ అభినందించడు . గాయత్రికి వుత్సాహం జావగారిపోతుంది . ఆ రోజు బంగాళాదుంప వేపుడు మొత్తం భర్త కె వేసింది . అది చూసి కూడా కౌండిన్య కనీసం భార్య వేపుడు మొత్తం తనకే వేసిందని కూడా ప్రశ్నించలేదు . భోజనం ముగించి తయారయ్యి 'తలుపేసుకో 'అంటూ వెళ్లిపోయాడు . గాయత్రి కి అతని మనస్తత్వం అర్ధం అవుతున్న కొద్దీ బాధ కలుగుతున్నది .ఇతన్ని యెలా మార్చాలి ?ఇద్దరం ఒకరికొకొకరు అని యెప్పటికి అర్ధం అవుతుంది !
సాయంత్రం అతను వచ్చేటప్పటికి రోజూ లాగానే అందం గా తయారయ్యి కౌండిన్య కోసం యెదురు చూస్తున్నది . యధాప్రకారం రుసరుసలాడుతూ చిటపటలాడుతూ కౌండిన్య వచ్చాడు . గాయత్రి ప్రసన్నం యెదురొచ్చి అతని చేతిలో బ్యాగు అందుకోబోయింది . కౌండిన్య విసుక్కుంటూ భార్యను పక్కకు తోసేసాడు .
గాయత్రి కి యేడుపు ,కోపం ,అవమానం ,ఉక్రోషం అన్నీ ఒక్కసారి తన్నుకొచ్చాయి .
"ఏమండీ ! మీరు వెళ్లినప్పటినించీ ఒక్కదాన్ని పడివుంటాను . మీకోసం కళ్లల్లో వత్తులు వేసుకుని యెదురు చూస్తుంటాను . కనీసం ఒక నవ్వూ ,ఒక మంచి పలకరింపు లేదు . అసలు నేను యెవరిని అనుకుంటున్నారు ?మిమ్మల్ని పెళ్లి చేసుకుని చిటికెన వేలు పట్టుకుని యిల్లాలిగా వచ్చాను "కందగడ్డ బుగ్గలతో గాయత్రి ప్రశ్నించింది .
"నన్ను విసిగించకు . దర్జాగా యింట్లో భోజనం చేసి టి . వీ చూస్తూ కూర్చుంటావు . బోలెడు సుఖం ,హాయి ,నీకేం తెలుసు నా కష్టం !చచ్చి చెడి యింటికి వస్తాను . నీతో కబుర్లు చెప్పడమే నా పనా !"విసుక్కున్నాడు కౌండిన్య .
----------------------------------------------------------------------------------------------------------------------------------
గాయత్రి ,కౌండిన్యల వైవాహిక జీవితం యేడాది పూర్తి చేసుకున్నది . భర్త నడవడిలో ,ఆలోచనలలో మార్పు రాలేదు . పైగా యింకా మొండితనం ,కఠినత్వం యెక్కువ అయ్యాయి . గాయత్రి కి మతి పోతున్నది ."అసలు యీయన యెందుకు పెళ్లి చేసుకున్నారు ?" గాయత్రి కౌండిన్యను మార్చడానికి శత విధాలా ప్రయత్నించింది ,ప్రయత్నిస్తున్నది కూడా !
క్రమం గా గాయత్రి అతని తో మాటలు తగ్గించింది . తాను తల్లి కాబోతున్నట్టు గ్రహించింది . ఒక పక్క సంతోషం గా వుంది . తన కు జీవిత మాధుర్యం చవిచూసే సమయం వచ్చింది . మరో పక్క గాయత్రి కి కౌండిన్య కు చెప్పగానే యెలా ఆలోచిస్తాడో అని భయం !!
ఆ రాత్రి భోజనాలయ్యాక నిద్ర పోయే సమయం లో స్త్రీ సహజమైన సిగ్గుతో "నేను తల్లిని కాబోతున్నాను "అంటూ గాయత్రి భర్త ను చూసింది . అతని ముఖం లో యే భావమూ లేదు .
"ఏమండీ మాట్లాడరేం "నవ్వుతూ అతన్ని చూసింది .
"నీకేం తల్లివి అవుతావు !కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తునాన్న జ్ఞానం వుందా నీకు !నా కష్టం తో హాయిగా తిని కూర్చుంటున్నావు !ని పిల్లల్ని కూడా మేపాలా "కోపం గా అన్నాడు కౌండిన్య .
గాయత్రి విస్తుపోయింది . 'ఏం మనిషి !యెంత సంతోషమైన విషయం !కనీసం దీనికయినా అతనిలో మార్పు ఆశించింది . గాయత్రి కి అతనంటే అసహ్యం వేసింది .
"అసలు మీ వుద్దేశం యేమిటి ?తల్లినవ్వడానికి నేనొక్కదాన్నే కారణమా ?మీరు కూడా బాధ్యులే గా !అయినా మీకు పిల్లలొద్దా ?" గాయత్రి కొంచెం గట్టిగా కోపం గా అరిచింది .
మర్నాడు సాయంత్రం కౌండిన్య యింటికి వచ్చేటప్పటికి యిల్లు తాళం వేసివుంది . కౌండిన్య తెల్లబోయాడు . ఇంతలో పక్కింటి అమ్మాయి వచ్చి తాళంచెవి ,ఒక, కవరు యిచ్చి వెళ్లింది .
కౌండిన్య మౌనం గా తలుపు తీసి కుర్చీ లో కూర్చున్నాడు . యధాప్రకారం చిటపట ముఖం తోనే వచ్చాడు కానీ గాయత్రి కనపడ పోయేసరికి తన విసుగు యెవరి మీద చూపించాలో అర్ధం కాక ఆలా కూర్చున్నాడు . గాయత్రి తను యెంత విసుక్కున్నా ,చీదరించుకున్నా సహిస్తుంది కానీ తొందర పడి వెళ్లే మనిషి కాదు అనుకున్నాడు . ఇల్లంతా శుభ్రం గా వుంది . కనీసం ఏం వ్రాసిందో అని కవరు విప్పికూడా చదవలేదు . స్నానం చేసి వంటింట్లో కి వెళ్లాడు . గాయత్రి వంట కూడా చేసి పెట్టింది . హాయిగా తిన్నాడు ,నిశ్చింతగా నిద్రపోయాడు .
కౌండిన్య యథాప్రకారం వుదయం పళ్ళుతోముకుని కాఫీ కోసం యెదురుచూస్తూ అప్పుడు కానీ గాయత్రి గుర్తుకు రాలేదు అతనికి . గబగబా కవరు విప్పాడు .
"ఇలా మీకు రాయాల్సి వస్తుందని నేను కల్లో కూడా వూహించలేదు . మీకు భార్య గా నేను ప్రేమ ,అనురాగం కోరుకున్నాను . మీరు నేను మీ సంపాదన తో బ్రతుకుతున్న మనిషిగానే చూస్తున్నారు కానీ మీ జీవన సహచరి గా గుర్తించడం లేదు . ఇటువంటి భయంకర వాతావరణం లో మన బిడ్డను పెంచదలచుకోలేదు . అందుకే వెళ్లిపోతున్నాను . మీ సంపాదన ,మీ యిల్లు మీయిష్టం !చెమటోడ్చి సంపాదిస్తున్న మీ డబ్బు మీరే అనుభవించండి . " కౌండిన్య చదివాడు . విసుక్కుంటూ కాఫీ కలుపుకున్నాడు . చీపిరి తీసుకుని చిమ్మాడు . వంటింట్లో కి వెళ్లాడు . . వంటిల్లు యెక్కడ యేముంటాయో తెలియదు . కందిపప్పు డబ్బా వెతుకుతూ పక్కనున్న మినప్పప్పు డబ్బా దొర్లించాడు . ఇంకేముంది వంటిల్లంతా చిందరవందర !పప్పులో నీళ్లు తగ్గి మాడిపోయింది . కుక్కర్ లో బియ్యం పెట్టి బెండకాయలు కోస్తుంటే వేలు కోసుకుపోయింది . అప్పుడు చిరాకు మొదలయ్యింది వంట కూడా రుచి గా లేదు . ఏదో తిన్నానంటే తిన్నాను అనుకున్నాడు . నూనె ఒలికిపోయింది . .
గబగబా తినేసి బయటపడ్డాడు . మొదటి రోజు అనుభవం చేదుగా వుండి పదేపదే గాయత్రి గుర్తుకొస్తున్నది . సాయంత్రం యింటికి వచ్చాడు . ఇప్పుడు కౌండిన్య లో విసుగు కన్నా కొద్దిగా ఆలోచనలు మొదలయ్యాయి . ఇంటికి యిల్లాలు యెంత అవసరమో అర్ధం అయ్యింది . తను యెప్పుడూ తనొక్కడే కష్టపడుతున్నాడని భార్య దర్జాగా హాయిగా ఇంట్లో సుఖపడుతున్నదని అనుకుంటున్నాడు . గాయత్రి కష్టం కూడా అర్ధం అయ్యింది . తను ఆర్ధికం గా శ్రమ చేస్తున్నాడు . గాయత్రి శారీరకం గా శ్రమ చేస్తూ సంసారాన్ని పొందికగా నడుపుతున్నది . కౌండిన్య రెండు రోజుల యింటిపని ,భార్య కోసం తపన మొదలయ్యాయి .
గాయత్రిని తను యెంత హింస పెట్టాడో అర్ధం అయ్యింది . "నన్ను మన్నించు గాయత్రీ " అనుకుంటూ మనసులోనే బాధపడ్డాడు . గాయత్రి పయిన అనురాగం మొదలయ్యింది . గాయత్రి పుట్టిల్లు అదే వూరు . తన తప్పును సరిదిద్దుకుని తన యింటికి తన ఇల్లాలిని అనురాగబంధంతో తెచ్చుకోవడానికి వెంటనే బయలుదేరాడు కౌండిన్య .
గాయత్రి వరండాలో పూలు అల్లుకుంటున్నది . గేటు సవ్వడికి తలెత్తి చూసింది . కౌండిన్య రివ్వున దగ్గరగా వచ్చేసి ఆమె రెండు చేతులు దగ్గరగా తీసుకుని ఆప్యాయం నిమురుతూ కళ్ళల్లోకి చూస్తూ " :గాయత్రీ నన్ను మన్నించు . నువ్వు లేని నేను లేను "అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు .
గాయత్రి నవ్వుతూ అతన్ని అల్లుకుపోయింది .