సర్ప్రైస్ - గంగాధర్ వడ్లమన్నాటి

Surprise

మధు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు.

లలిత, అడుగుదామా వద్దా అని సందేహిస్తూనే “ఏవండీ, నా చెవి దిద్దులు పాతవై పోయాయి. ఇవి మార్చేసి ఎంచక్కా కొత్తవి కొనుక్కోవాలని ఉంది. పెద్ద పై డబ్బులు ఏం పడవు.జ్యూలరీ షాప్ కి వెళ్ధామండీ” అడిగింది లలిత.

“కుదరదు లలితా.ఈ నెల అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయింది.అందుకే నేను గత వారం రోజులుగా ఆఫీస్ లో టీ సమోసా తినడం కూడా మానేశాను మరి” చెప్పి లోనికి నడిచాడు.

ఆ మాటలు వింటూనే “ ఛీ ఛీ, వట్టి పిసినారి. ఓ డబ్బులన్నీ కలిపి ఫిక్సిడ్ డిపోసిట్లు,చిట్లు అంటూ ఓ దాచుకోవడం. ఛ ఛ ,ఏం మనిషో ఏమో.దాచుకున్నదంతా ఏం చేసుకుంటాడో, పెద్ద సంపాదిస్తున్నాడని పొగరు.అయినా ఆ పిఠాపురం పశువుల డాక్టర్ సంబంధం వద్దన్నపుడే మా నాన్న చెప్పాడు.మళ్ళీ ఆలోచించుకో అని. వింటేగా, ఈయన సాఫ్టు వేర్ ఉద్యోగం అని చూసి పెళ్లాడాను.పెళ్ళైన మొదటి ఆరు నెలలూ బానే ఉండేవారు. ఇదిగో ఆ తరువాత మొదలు నాకు ఈ ఇబ్బందులు.మా అక్కలకి అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి. నా రాతే ఇలా తయారైంది. మంచోడు, మంచోడు అని కనీసం సొంత కొంప లేనోడికి ఇచ్చి కట్టబెట్టాడు మా నాన్న దరిద్రుడు”. ముక్కు చీదింది ఆమె.

ఇంతలో మధు స్నానం చేసి వచ్చాడు. “లలితా వేడిగా పకోడీలు వేయవోయ్, టి.వి చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ తిందాం” అన్నాడు.

ఆ టైమ్ లో మధు తనకి, రాక్షసుడు మనిషి రూపంలో ఉన్నట్టు కనిపించాడు. “సరే” అని అసహనంగా అక్కడినుండి వంటగది వైపు నడిచిందామె.

మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళబోతూ “ఇదిగో ఇంట్లో ఖర్చులకి ఈ అయిదువందలూ ఉంచు” అన్నాడు.

“ఏవిటండీ మీరు.ఇదివరకు కూరగాయలకి,పై ఖర్చులకీ అయిదు రోజులకి వెయ్యి రూపాయిలిచ్చేవారు.ఇపుడు ఇలా అయిదు వందలు ఎలా సరిపోతాయి చెప్పండి.పైగా మీరు సరిగా డబ్బులు ఇవ్వకపోవడం తో నేను బ్యూటీ పార్లర్ కి కూడా ఇదివరకులా వారం వారం వెళ్ళడం మానేసాను”. చెప్పింది లలిత చిటపట లాడిపోతూ.

“కొన్ని సార్లు సర్ధుకోవాలి మరి. ఓపిక పట్టాలి, అప్పుడే పెద్ద సంతోషాలు మన సొంతం అవుతాయి. ఈ సారి నీ పుట్టిన రోజుకి పెద్ద సర్ప్రైస్ ఇస్తాను చూస్తుండు.మారాం చేయకూడదు”.అంటూ ఆఫీస్ కి వెళ్లిపోయాడు.

“ఛ ఛ, ఈ మనిషి ఇక మారడు. అన్నీ గాలి మాటలు” .అంటూ తన లాయర్ కి ఫోన్ చేసి “నేను బాబాయ్ లలితని. మా ఆయన ఈ మద్య మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.నాకు లైఫ్ అంటే చిరాకుగా ఉంది.డివోర్స్ కి అప్లై చేద్దామనుకుంటున్నా బాబాయ్” చెప్పిందామె.

ఆమె మాటలు విన్న ఆ లాయర్ “సరేనమ్మా అలాగే కానీ.విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడూ అంటే తాగి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా మరి”.

“లేదు బాబాయ్”.

“పోనీ నిన్ను చీటికి మాటికీ ఊరికే తిట్టి ఇబ్బంది పెడుతున్నాడా”.

“అది కూడా కాదు బాబాయ్”.

“పోనీ నీతో ప్రేమగా ఉండకపోవడం, వేరే అమ్మాయిలతో గట్రా వెకిలి చేష్టలూ లాంటివి ఉన్నాయా”.

“ఆయన అలాంటివారు కాదు బాబాయ్”

“మరి ఇంకెందుకమ్మా విడాకులు!. నీకు పనిలేకపోతే సరి కానీ”.

“ఈ ఓ సంవత్సరo గా నాకు జీతం కొంచెం తక్కువ ఇస్తున్నారు. పెద్ద ఖర్చులు చెబితే నవ్వేసి దాట వేస్తున్నారు.అందుకే ఇలా మరీ పొదుపు మనిషితో అన్నీ అదుపు చేసుకుని ఉండటం కష్టం అనిపించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను.మీకు డీటైల్స్ అన్నీ పంపుతాను ఆయనికి ఓ డివోర్స్ నోటిస్ తయారు చేసి వాట్సప్ చేయండి.దాంతో భయపడి నా దారికి వస్తారు” చెప్పిందామె తేలిగ్గా.

“సరే అలాగే, తప్పకుండా పంపిస్తాను .దారికి తెచ్చుకోవడానికి అని అంటున్నావ్ కదా, అలానే కానీ .పైగా నువ్ చెప్పాక తప్పుతుందామ్మా” అన్నాడాయన.

ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన మధు, “రా లలితా వెళదాం .నీ చెవి దిద్దులు మార్చుకోవాలన్నావ్ గా” అన్నాడు.

ఆమెకి ఏం అర్దం కాలేదు. తరువాత ఓ క్షణం ఆలోచించి ఏదో తట్టినట్టు “అర్ధమైంది.ఇదంతా డివోర్స్ నోటిస్ మహిమ. భలే, ఇదే సమయం” అని మనసులో అనుకుని, తనకి కావాల్సిన నగలూ ,చీరలూ ,ఆ తరువాత కొద్ది రోజులకి, కులుమనాలి , కాశ్మీర్ లాంటి టూర్లు మధుతో తిరిగేసింది.

ఆ తరువాత జీతం కూడా ఎప్పటిలా అంతా తనకే ఇచ్చేసాడు.అయితే ఓ ఆరు నెలల తరువాత ,లలిత ఫ్రెండ్ ఫోన్ చేసి , “హాపీ బర్త్ డే లలితా” అని విష్ చేసి, కొంచెం మాటలు అయ్యాక, “అవునూ, నీ పుట్టిన రోజుకి మధు,నిన్ను సర్ప్రైస్ చేస్తూ నీకు ఫ్లాట్ కొనిస్తా అన్నాడు.మా రియల్ ఎస్టేట్ కంపెనీలోనే అపార్ట్మెంట్ ఫ్లాట్ బుక్ చేశాడు.దాని కోసం చిట్ అలాగే తన జీతం జాగ్రత్తగా దాస్తున్నాను అని చెప్పాడు .ఇంకో ఆరు నెలల్లో ఆ మొత్తం కట్టేయొచ్చు అని అన్నవాడు, సడన్ గా కేన్సిల్ చేసేశాడు మరి.ఎందుకో అర్ధం కాలేదు లలితా .మనసులో పెట్టుకో మధుతో అనకూ” చెప్పి ఫోన్ పెట్టేసిందామె.

ఆ మాటలు వింటూనే,నెత్తిన సుత్తి పడ్డట్టు, “అరె ఎంత పని జరిగింది.సొంతిల్లు కొనడానికని జాగ్రత్త చేస్తున్నారని తెలియక ,చిన్న చిన్న సంతోషాల కోసం , ఆయన ప్లాన్ చేసిన పెద్ద సర్ప్రైస్ మిస్ అయ్యాను. ఛ” అనుకుందామె.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు