"అమ్మా! మా తెలుగు మాస్టారు నన్ను అనవసరంగా కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడనుకున్నావు." అన్నాడు రమణ. "అవును ఆంటీ! రమణ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తాడు కదా! ఆ మాత్రం ప్రేమ కూడా రమణపై ఉండదా? పాపం! ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే రమణను అందరూ తిడతారు, కొడతారు. చదువులో అంతంత మాత్రమే అయిన అలివేలును ఎవ్వరూ ఏమీ అనరు. పైగా మన రమణను కాదని ఎప్పుడూ అలివేలును క్లాస్ లీడరుగా చేస్తారు." అన్నాడు రమణ మిత్రుడు సోము. "అవునా! ఏ తప్పూ చేయకుండానే రమణను దండించారా? నేను స్కూలుకు వచ్చి అడుగుతాలే." అన్నది రమణ తల్లి లలిత. లలిత పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిని కలిసి, మాట్లాడి, అనుమతి తీసుకుని సరాసరి రమణ చదువుతున్న తరగతి గదిలోకి వచ్చింది. తరగతిలో మాస్టారు గారు లేరు. లీడర్ అలివేలు నిలబడి తోటి విద్యార్థులను అల్లరి చేయకుండా చూస్తుంది. "మాస్టారు గారు లేరా తల్లీ!" అని అలివేలుతో అంది లలిత. ఇప్పుడే అత్యవసరమైన పనిపై వెళ్ళాడండీ! వస్తారు." అంది అలివేలు. "లీడరుగా తరగతిని మంచి క్రమశిక్షణలో పెడుతున్నావు. శభాష్! మరి మీ తరగతిలో మొదటి ర్యాంకు ఎవరు?" అని అడిగింది లలిత. "రమణ ఆండీ." అన్నది లలిత. మరి రమణకు ఎందుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు?." అన్నది లలిత. ఆ ప్రశ్నకు తరగతిలో చాలామంది స్పందించారు. రమణకు తన చదువును చూసుకొని తానే విర్రవీగుతాడని, ఆ పొగరుతో ఎవ్వరినీ లెక్క చేయడని, అనవసరంగా గొడవలు పెట్టుకుని అందరినీ కొడతాడని, చదువులో వెనుకబడిన వారిని అతి దారుణంగా హేళన చేస్తాడని ఇలా చాలా కారణాలు చెప్పారు. " శభాష్ అలివేలు! నీ సత్ప్రవర్తన వల్ల గురువుల మన్ననలను అందుకున్నావు. అందుకే నీకు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. నీ లాంటి ఉత్తములకు నాయకత్వ బాధ్యతలను అప్పజెబితే తరగతి కూడా క్రమశిక్షణలో నడుస్తుంది." అన్నది లలిత. "చూడు సోము! నువ్వు ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే మీ తల్లిదండ్రులు నిన్ను దండిస్తారా?" అన్నది లలిత. "వాళ్ళ అమ్మ అయితే బీభత్సంగా కొడుతుందండీ." అన్నది సోము వాళ్ళ ఇంటి పక్కనే ఉండే స్రవంతి. "అయితే సోమూ! మీ అమ్మ నిన్ను కొడుతుంటే దాన్ని మాస్టారు గారికి చెప్పవచ్చు కదా! మాస్టారు గారు మీ అమ్మను మందలించేవారు కదా!" అన్నది లలిత. "మా అమ్మ నన్ను కొట్టే విషయం మాస్టారు గారికి ఎందుకు చెప్పాలి? నేను తప్పు చేస్తేనే కదా మా అమ్మ నన్ను కొట్టేది?" అన్నాడు సోము. "మరి గురువులు కూడా ఇక్కడ తల్లిదండ్రులతో సమానం కదా! గురువులు మనం బాగుపడాలని మందలిస్తే తల్లిదండ్రులకు ఎందుకు చెప్పాలి?" అన్నది లలిత. "విద్యార్థులకు కావలసింది చదువుకంటే ముందు వినయం, సౌశీల్యం, సత్ప్రవర్తన. అవి లేనివాడు ఎంత చదువుకున్నా వ్యర్థమే! ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో తరగతిలో గురువులు అంతే! ఇక్కడ గురువులు తల్లిదండ్రులతో సమానం. వారు ఏ విషయాన్ని అయినా ప్రేమతో చెప్పినా, కఠినంగా చెప్పినా మీరు బాగుపడాలనే!" అన్నది లలిత. ఇంతలో ఆ తరగతి ఉపాధ్యాయుడు తెలుగు మాస్టారు తిరుమలేశ్వరులు అక్కడికి వచ్చారు. "క్షమించండి గురువు గారూ! ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్ధినిగా ఈ పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పాలని వచ్చాను. మీపై అనవసరంగా మా అబ్బాయి నాకు ఫిర్యాదు చేశాడు. అందుకు ఎంతో బాధపడి, మా అబ్బాయి ప్రవర్తన గురించి తెలుసుకుందామని వచ్చాను. మా అబ్బాయి క్రమశిక్షణా రాహిత్యానికి నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను. ఇకపై నేను మా అబ్బాయిని మంచిదారిలో పెట్టే ప్రయత్నం చేస్తాను. మా అబ్బాయి రమణ ఎవరిపట్ల అయినా దురుసుగా ప్రవర్తిస్తే అందుకు నన్ను క్షమించండి." అని వేడుకుంది లలిత. సిగ్గుతో తల దించుకున్నారు రమణ, సోముడు. మాస్టారు గారు లలితను అభినందించారు.