“ఇదిగో లలితా, సాయంత్రం నువు జ్యూలరీ షాప్ కి వెళదాం అన్నావ్ కనుక నేను సరిగ్గా ఆఫీసులో అయిదు టంగుమనగానే ఇంట్లో టింగుమని వాలిపోతాను.నువ్ అప్పటికే తయారయి ఉండాలి మరి.లేదంటే నాకు కోపం వచ్చి చస్తుంది.కనుక నువు ఓ గంట ముందు నుండే తయారయ్యే కార్యక్రమం మొదలు పెడితే మంచిదని నా అభిప్రాయం”.చెప్పాడు మధు.
“భలే వారే.అలాగే.అన్ని సార్లు ఇలా ఇంత గట్టిగా నొక్కి మరీ చెప్పక్కరలేదు.మీరు ఇలా గుమ్మంలో కాలు పెట్టీ,పెట్టకముందే, నా కాళ్ళు మీతో జత కలుస్తాయి చూడండి” చెప్పింది లలిత.
“సరే చూద్దాం” అన్నాడు మధు.
అప్పటి వరకూ ఆ సంభాషణంతా ఆశక్తిగా విన్న లలిత ఇంట్లో పనిచేసే రమణి , “అమ్మగారూ అదీ, మరీ నేనూ” అంటూ నసిగింది.
“ఏవిటే అలా తెగ సాగదీస్తున్నావ్ .డబ్బులు ఏమన్నా కావాలా”
“కాదమ్మగారూ, నేను కూడా డబ్బులు దాచుకున్నాను.ఎప్పటి నుండో మెళ్ళోకి గొలుసు కొనుక్కోవాలని ఆశ.కానీ బంగారం కొనడంలో మోసపోతానేమోనని చిన్న బెరుకు.అందుకే మీరు ఏటీ అనుకోక పోతే,నేనూ మీరేళ్లే దుకాణానికి ఆటోలో వత్తాను.కొంచెం సూసి మంచిది కొనిపెట్టండమ్మా” అడిగిందామె.
“సరేలే ,సాయంత్రం ఇంటికి వచ్చేయ్.కారులో డ్రైవరు పక్కన కూర్చుందువుగాని.ఎలాగో వచ్చేప్పుడు రైతు బజార్లో కూడా కూరలు అవీ కొందువు గాని” చెప్పింది లలిత.
“మా మంచి అమ్మగారు.వత్తానండీ” అంటూ హుషారుగా పరుగు లాంటి నడకతో వెళ్లిపోయిందామె.
ఆమె వెళ్లిపోగానే మధు, లలిత వంక తినేసేలా చూస్తూ, మూతి బిగించి “నీకేమైనా బుద్ది ఉందా.మనతో పాటు ఆమెని కూడా తీసుకు వెళితే మన పరువు పోతుంది”.
“ఏం! ఎందుకని”.
“ఎందుకా .అది కొనే చిన్న నగ కోసం గంటలు పాటు అన్ని మోడల్స్ చూస్తుంది.గీసి, గీసి బెరాలాడుతుంది. వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు.అలాంటి వాళ్ళని మనతో తీసుకువెళ్లడం అంటే, మన పరువు మనమే తీసుకోవడం. నీకు ఆలోచన, పాలోచన లేకుండా గబుక్కున మాట ఇచ్చేసావ్.సాయంత్రం అక్కడ నగల దుకాణంలో ఎలాంటి దారుణాలు చోటు చేసుకున్నా నువ్వే పూర్తి బాధ్యత వహి౦చాలి” చెప్పేసి ఆఫీసుకు వెళ్లిపోయాడు మధు.
మధు మాటలు విన్న లలిత,కాసేపు తల గోక్కుని మరీ ఆలోచించి, “అనవసరంగా మాట ఇచ్చానా ఏవిటి ఖర్మ.పోనీ రావద్దు అని ఏదో వంక చెప్పేద్దామా.ఛ ఛ అస్సలు బాగోదు.నా మాట పోతుంది.ఏదైతే అదే అయింది.తీసుకు వెళ్లడమే సరి” అని నిర్ణయించుకుంది లలిత.
సాయంత్రం నాలుగున్నరకే రమణి వచ్చేసింది.ఉన్నంతలో మంచి చీర కట్టుకుంది. “అమ్మగారూ, నేనేం కొనాలనుకుంటున్నానంటే” అని ఆమె చెప్పేంతలో లలిత అడ్డుపడి
“సరే లేవే, నగల షాప్ లో చెబుదువు గాని కానీ, వెళ్ళి ముందు గిన్నెలు తోమేసి రా.అయ్యగారొచ్చి అగోరి౦చే టైమ్ అయ్యింది” చెప్పింది లలిత.
“సరే” అని వంటగది వైపు వెళ్లింది రమణి.
కొద్ది సేపటికి కార్ హార్న్ వినిపించడంతో, “అయ్యో మధు వచ్చేసినట్టున్నాడే” అని కంగారు పడుతూ , “రమణీ, అయ్య గారొచ్చేసారు. పద బయల్దేరుదాం, నా హ్యాండ్ బేగ్ పట్టుకురా.బెడ్ రూమ్ లో ఉంది”.అరిచింది.
ఇంతలో మధు రావడం, “ఒకె లలితా, సరే నేను కూడా చక,చక ఓ అయిదు నిమిషాల్లో రెడీ అయ్యి డ్రస్ మార్చుకుని వచ్చేస్తా ఉండు” అంటూ ఇలా వెళ్ళి అలా వచ్చేసాడు.
అందరూ కలిసి కారులో నగల దుకాణానికి వెళ్లారు.కారు దిగుతూనే, “ఇదిగో రమణీ నేను కొన్న తరువాత అప్పుడు కొను.ఎక్కువ ఏం మాట్లాడకూడదు.ఇది పెద్ద దుకాణం” అంటూ జాగ్రత్తలు చెప్పింది లలిత.
లలిత నగలు చూడటం మొదలు పెట్టింది.ఒక తులంలో చైన్ కొనుక్కుంది.తరువాత రమణి కూడా చూసి,ఓ గొలుసు బయటకు తీయమంది.అమ్మగారూ ఎలా ఉంది అన్నట్టు చూసింది లలిత వంక. ఆమె ఓ సారి దాని వంక చూసి, “బానే ఉంది కానీ, రెండు తులాలు ఉంటుంది.డబ్బులు ఎక్కువేమోనే” అంది లలిత.
“పర్వాలేదమ్మా నా దగ్గర ఉన్నాయి” అంటూ తన పర్సు తీసింది.బిత్తర పోయింది లలిత.
రమణి డబ్బులతోనూ ,లలిత తన కార్డ్ తో పే చేసారు.వెంటనే రమణికి ఒక కూల్ డ్రింక్ సెర్వ్ చేశారు.ఆ తర్వాత కొద్ది సేపటికి లలితకీ ఇచ్చారు.కానీ లలితకి కూల్ డ్రింక్ వచ్చేవరకూ రమణి తాగలేదు.
తరువాత ఒకతను వచ్చి, “మేడమ్ ఇంకా ఏమన్నా నగలు చూస్తారా, మా దగ్గర చాలా స్కీములు కూడా ఉన్నాయి.మీరు కావాలంటే చేరవచ్చు” అని రమణికే ప్రత్యేకంగా చెప్పాడు సేల్స్ మాన్.
రమణి , “మా అమ్మగారికి చెప్పండి. ఈ సారి వచ్చినప్పుడు చిటికెలో కొంటారు” అంది.
ఇదంతా చూసిన మధుకి ఏం అర్ధం కావడం లేదు.ఇల్లు చేరారు. దారిలో కొన్న కూరగాయల సంచి పక్కన పెట్టిన రమణి, “వస్తా అమ్మగారూ” అంటూ బిక్కు బిక్కుమంటూ వెళ్లిపోయింది.
మధు కాస్త భయ పడుతూ, “ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది. నేను కూడా, రమణి రెండు తులాలు కొంటుందనుకోలేదు.దాన్ని తీసుకు వెళితే మనకి చిన్నతనం అనుకున్నాను.కానీ ఇవాళ దాని ముందు నువ్వు చిన్నబోయినట్టనిపించింది.ముందే తెలిస్తే నేనూ నిన్ను అలాంటి నగే కొనుక్కోమని చెప్పేవాడ్ని”.చెప్పాడు మధు.
“ఇప్పుడు ఏమైందని!. నిజం చెప్పాలంటే ,పాపం రమణి మనతో వచ్చి నగ కొన్న సంతోషం కంటే ,నేనేవనుకుంటానో అని నలిగిపోయింది పాపం.ఈ సంఘటనతో లలిత పెద్ద మనసు బయటపడింది”.చెప్పడంతో మధు కూడా ఊపిరి పీల్చుకున్నాడు.