కుంగుబాటు - కందర్ప మూర్తి

Kungubaatu

సీతారామయ్య గారి పెరటిదొడ్డి ఆవరణలో విశాలంగా పెరిగిన మామిడి చెట్టు , గట్టు చివర ఒంటరిగా మానుకట్టిన కుంకుడు చెట్టు ఉన్నాయి. నూతికి దగ్గరగా నీటి వసతితో మామిడి చెట్టు కొమ్మలు పచ్చని ఆకులు,చిగుళ్లతో కళకళలాడుతూ కనబడుతోంది. రకరకాల పక్షులు, చిన్న జంతువులు చెట్టు దగ్గర సందడిగా తిరుగుతున్నాయి. రామచిలుకల కలకలారావాలు, ఉడుతల కీచు రాగాలు, తుమ్మెదల జాంకారనాధాలు,కోయిలల కుహు కుహు నినాదాలు, మామిడి పువ్వుల సువాసనలతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కోరడి గట్టు చివర ఒంటరిగా ఉన్న కుంకుమ చెట్టు విచారంతో కుమిలి కుంగిపోతోంది.ఇంతలో ఒక పెద్ద కోతి వచ్చి చెట్టు కొమ్మన ఉన్న కుంకుడు కాయల గుత్తు నుంచి ఒక కాయ కోసి నోటితో కొరికి వెంటనే తుబుక్కున బయటకు ఉమ్మేసింది.అది చూసిన కుంకుడు చెట్టు కన్నీరు పెట్టుకుంది. ఎందుకు ఏడుస్తున్నావని కారణ మడిగింది కోతి. " ఏం చెప్పను ,వానర మిత్రమా! దేవుడు నా పట్ల అన్యాయం చేసాడు.ఆకుల దగ్గర నుంచి కాయల వరకూ అన్నీ చేదుగా పుట్టించాడు. ఒక పక్షి కాని జంతువు కాని నా దగ్గరకు రావు. తేనెను సేకరించే మధుపాలు కూడా దరిచేరవు.అప్పుడప్పుడు కాకులు కొమ్మల మీద కూర్చుని రెట్టలేసి పోతాయి. కుంకుడుచెట్టు దొడ్లో ఉంటే ఆ కుటుంబం చింతలతో కుంగి పోతారనే నమ్మకంతో ఇంటికి దూరంగా కోరడి గట్ల చివర పెంచుతారు.ఇదీ నా దౌర్భాగ్య స్థితి" అని వాపోతూ " అటుచూడు, నూతికి సమీపంలో మామిడి చెట్టును.పచ్చగా పెద్ద ఆకులతో గొడుగులా విస్తరించి చల్లగా కనబడుతుంది. దాని మొదలు చుట్టూ పాడి తవ్వి నీరు పెడతారు. శుభకార్యాలకు, పండగలప్పుడు మామిడి కొమ్మల్ని కోసి గుమ్మాలకు తోరణాలుగా అలంకరిస్తారు. తెలుగు వారి కొత్త సంవత్సరానికి చేసే ఉగాది పచ్చడిలో మామిడి కాయకు ప్రాధాన్యమిస్తారు.పిల్లలు పచ్చి మామిడి కాయల్ని ముక్కలుగా చేసి ఉప్పుకారం నంచుకుని ఇష్టంగా తింటారు. కొత్తగా వచ్చిన మామిడి పూతలోని మధువును సేకరించ డానికి తేనెటీగలు సందడి చేస్తాయి.వసంత కోకిల లేతమామిడి చిగుళ్లు తిని కుహుకుహు రాగాలు ఆలపిస్తాయి. మామిడి కాయలు పెద్దవి అవగానే ఊరకాయ పచ్చళ్లు పెట్టు కుని ఆప్యాయంగా భోజనంతో తింటారు.పండిన మామిడి పళ్లను విదేశాలకు ఎగుమతులు,అంగళ్లలో ఉంచి అమ్ము కుంటారు. దేవుడి పూజా కార్యక్రమాలకు, స్త్రీల వ్రతాలప్పుడు ముత్తయిదువ తాంబూలలో పెట్టి ఇచ్చుకుంటారు.పండిన మామిడి పళ్లరసాలతో శీతల పానీయాలు, ఫ్రూట్ జామ్ లు, మామిడి తాండ్ర రూపంలో వాడతారు. మామిడి చెట్టును సంవత్సరం పొడవునా కామధేనువులా ప్రేమగా చూసుకుంటారు. నన్ను చూడు, నేస్తమా! అధ్వాన్న జీవితం గడుపుతున్నాను. ఒకపక్షి కాని, జంతువుగానీ దగ్గరకు రావు.నన్ను పలకరించే వారు లేరు" గోడు వెళ్లబోసుకుంది కుంకుడుచెట్టు. కుంకుడుచెట్టు మనోవేదన విన్న వానరమిత్రుడు" ఓ వృక్ష రాజమా, దిగులు పడకు. దేవుడు ఏ జంతువు పక్షి వృక్ష జాలానికీ అన్యాయం చెయ్యడు.సృష్టి ధర్మాన్ననుస రించి ప్రకృతిలో చిన్న పెద్ద అందరికీ వాటి శరీర నిర్మాణం, పరిసరాలు, వాతావరణ పరిస్థితుల కనుకూలంగా వాటి శరీర రంగు ఆవాస ఆహార వసతు లేర్పడ్డాయి. నిన్ను ఎవరు ఆదరించడం లేదని చింతపడకు.నీ కుంకుడు ఫలాల చేదును కూడా వినియోగిస్తున్నారు మనుషులు.పండిన కుంకుడు కాయల రసాన్ని చర్మ సౌందర్యాలుగా స్త్రీల కేశ శుభ్రతకు షాంపూలుగా వినియోగిస్తున్నారు. ప్రకృతిలో ప్రతి వస్తువు దాని ప్రాధాన్యాన్ని బట్టి వినియో గింప బడుతుంది. అందువల్ల మామిడి చెట్టుకు లభిస్తున్న ఆదరణను చూసి కుంగిపోయి నిన్ను నువ్వు కించపరుచుకో వద్దు. సృస్టిలో చిన్న చీమ నుంచి భారీ శరీరమున్న ఏనుగు వరకు ప్రతి జీవి ప్రకృతి పర్యావరణానికి తోడ్పడుతున్నాయి.కాబట్టి నువ్వు కూడా నీ సేవల్ని ప్రకృతికి వినియోగించు " అని మనో దైర్యాన్నిచ్చింది కోతి.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు