స్త్రీ వ్యామోహం - చెన్నూరి సుదర్శన్

Stree vyamoham

ములుగు పోలీసు స్టేషన్. ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది..

రఘువీర్ తన ఛాంబర్ లోకి అడుగు పెడుతూనే.. మోగుతున్న ల్యాండు లైన్ ఫోన్ రిసీవర్ ఎత్తి..

“హలో.. ఎస్సైని మాట్లాడుతున్నాను” అన్నాడు.

“సార్ నేను గట్టమ్మపల్లె నుండి గొల్ల గట్టయ్యను. నేను గొర్రెల మందను మేపుకుంటూ.. గట్టు మీదికి వెళ్ళాను. ఎవరో రావిచెట్టు దగ్గర గొయ్యిలో ఎవరో బోర్లా పడిపోయి ఉన్నాడు సర్.. బాగా తుప్పలుండి సరిగ్గా కనబడ్డం లేదు. పిలిస్తే.. పలకడం లేదు. వెంటనే మీకు ఫోన్ చేస్తున్నా..”

“నీ పేరు” చెప్పాడతను.

“సరే నువ్వు మెయిన్ రోడ్డు ప్రక్క నిలబడు. నేను బయలుదేరుతున్నాను” అంటూ రిసీవర్ పెట్టేసి, జీబు డ్రైవర్ ను అప్రమత్తం చేశాడు రఘువీర్. లాగ్ బుక్ లో సంతకం పెడుతున్న సదానందంను చూసి..

“త్రీ నాట్ త్రీ మన క్లూస్ టీంకు, అంబులెన్స్ కు ఫోన్ చేసి గట్టమ్మపల్లెకు అర్జంటుగా రమ్మను. నువ్వూ.. జీబెక్కు. క్విక్..” అంటూ ఆదేశాలు జారీ చేశాడు.

ములుగు పోలీసు స్టేషన్ నుండి గట్టమ్మపల్లె గట్టు మీదికి దాదాపు మూడు కిలో మీటర్ల దూరం. జీపు గట్టమ్మపల్లె బస్ స్టాఫ్ కు చేరుకోగానే పరుగెత్తుకుంటూ.. వచ్చిన ఆసామి “సార్.. నేనే యాదయ్యను.. మీకు ఫోన్ చేసింది” అంటూండగా.. జీపు ఎక్కమన్నట్టు చేత్తో ఇషారా చేశాడు రఘువీర్.

జీపు బయలుదేరగానే.. దాని వెనుకాలే పరుగు అందుకున్నారు కొందరు. అప్పటికే యాదయ్య ఆ వార్తను వ్యాప్తి చేసిన ఫలితమది.

జీపును గట్టు మీద బండ్లబాటన ఆపించి.. కనబడే రావిచెట్టు చెంతకు పరుగులాంటి నడక అందుకున్నాడు యాదయ్య. అతణ్ణి అనుసరించారంతా..

రఘువీర్ గొయ్యి చుట్టూ తిరుగుతూ.. శవాన్ని పరిశీలనగా చూడసాగాడు. దట్టంగా చిన్న. చిన్న చెట్లు, పొదలు అడ్డుకుని సరిగ్గా కనబడ్డం లేదు శవం. పరిసరాలూ గమనించాడు. రావిచెట్టు ఊడలు జడల్లా అల్లుకుని ఉన్నాయి. చెట్టు మొదట్లో నల్లని బండరాయి బల్లపరుపుగా ఉంది. అక్కడక్కడా చిన్న, చిన్న తుప్పలు, రాళ్ళు రప్పలు తేలి ఉన్నాయి.

క్లూస్ టీం చేరుకోగానే వారికి సూచనలిచ్చాడు రఘువీర్. వారు వారి పనులలో నిమగ్నమయ్యారు. యాదయ్యని పిలిచి మరిన్ని వివరాలు అడుగుతుంటే.. సదానందం నోట్ చేసుకో సాగాడు.

క్లూస్ టీం మరో ఇద్దరి సాయంతో శవాన్ని గొయ్యి నుండి పైకి తీసి వెల్లికిలా వేశారు. శవాన్ని చూడగానే.. ఉలిక్కిపడ్డాడు యాదయ్య.

“సార్.. అతను తెలుగు లెక్చరర్” అన్నాడు. “ములుగు కాలేజీలో పని చేస్తాడు సార్. వారం, వారం గట్టమ్మతల్లి గుడికి వచ్చి దేవిని దర్శించుకుని వెళ్తాడు”

రఘువీర్ ముఖంలో వెలుగు రేఖ పొడిచింది. చనిపోయిన వ్యక్తి ఎవరో తెలిసింది.

ఇంతలో క్లూస్ టీం వాళ్ళ పని పూర్తయ్యిందన్నట్టు థమ్సప్ సింబల్ చూపించి సెలవు తీసుకున్నారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే, పరిశోధనలో మరో అడుగు ముందుకు పడుతుందని.. ఆ ఏర్పాట్ల కోసం సదానందాన్ని పురమాయించాడు రఘువీర్.

***

జీపు నేరుగా జూనియర్ కాలేజీ ముందాగింది.

రఘువీర్ జీపు దిగుతూనే సదానందంకు సూచనలిచ్చి తను నేరుగా ప్రిన్సిపాల్ గదివైపు నడిచాడు. దాదాపు అరగంట తరువాత ఇరువురు కలుసుకుని తిరిగి జీపులో పోలీసు స్టేషన్ కు బయలుదేరారు. సదానందం ఏదో చెప్పబోతుంటే.. వద్దన్నట్టు అరచేయి చూపించాడు రఘువీర్.

జీపు దిగి రఘువీర్ నేరుగా తన ఛాంబర్ కు వెళ్తుంటే.. సదానందం కిమ్మనకుండా అనుసరించాడు.

“ఆ.. ఇప్పుడు చెప్పు “ తన సీట్లో కూర్చుంటూ అన్నాడు రఘువీర్.. క్యాప్ తీసి టేబుల్ పైన పెడుతూ.

“ఏ పరిశోధనకు సంబంధించిన విషయాలైనా మూడో మనిషికి తెలియొద్దని వద్దన్నాను. మన డ్రైవరనే కాదు.. చివరికిరికి స్వంత మనుషులను కూడా నమ్మొద్దు” రఘువీర్ తన నేర పరిశోధన అనుభవాన్నంతా రంగరించి చెబుతున్నట్లు సదానందానికి కనబడింది. నిజమే అన్నట్టు తలూపుతూ.. తాను జూనియర్ కాలేజీ స్టాఫ్ రూంలో సేకరించిన విషయమంతా వివరించాడు.

“చూశావా.. సదానందం. నాకు ప్రన్సిపాల్ ఈ విషయం చెప్పనే లేదు. కేవలం తెలుగు లెక్చరర్ మంచితనం గురించి మాత్రమే పొగిడాడు. అతని పేరు అనిల్ కుమార్ అని.. ఇక్కడే ఫస్ట్ అప్పాయింట్ మెంట్ అని ఇదే ఊళ్ళో ఒక గది తీసుకుని ఉంటున్నాడని.. పిల్లలకు పాఠాలు బాగా చెబుతాడని మొదలగు వివరాలు చెప్పాడు.

నీ సేకరణతో.. మనకొక దారి కనబడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రేపు వస్తే గాని.. సరియైన దారిలో పరిశోధనకు అవకాశముండదు. ఇంతలో నువ్వు మరొక పని చెయ్యాలి” అని ఆలోచిస్తున్నట్టు నుదురుపై వేళ్ళతో నిమురుకుంటూ.. “ఇంగ్లీష్ మేడం ఇందుమతి ఇంటి స్థితిగతులు సేకరించు” అంటూ వాచ్ లో టైం చూశాడు. భోజన సమయయ్యింది. ఇక వెళ్దాం అన్నట్టుగా లేచాడు రఘువీర్.

ఒక కడక్ సలాం కొట్టి రఘవీర్ వెనుకాలే బయలుదేరాడు సదానందం.

***

మరునాడు ఉదయమే రఘువీర్ తన టేబుల్ పైన అనిల్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ దర్శనమిచ్చాయి. ఆతృతగా ఫైల్ తెరిచాడు. అనిల్ కుమార్ మీద విషప్రయోగం జరిగినట్టు.. నిన్న సాయంత్రం ఆరు, ఏడు గంటల మధ్యలో చనిపోయినట్టు వివరాలున్నాయి. ఆశ్చర్యపోయాడు. ఒక ఉత్తముని మీద విషప్రయోగం.. నమ్మశక్యం కాలేదు. ఇంతలో సదానందం రావడం.. ఉత్సుకత చూపించాడు రఘువీర్.

“సర్.. నేను కొంత సమాచారం సేకరించాను” అంటూ తాను ఇందుమతి ఇంటి ప్రక్కల వారితో కనుక్కొని రికార్డు చేసిన ఫైల్ ముందు పెట్టాడు. అది చదువుతుంటే రఘువీర్ భృకుటి ముడి పడింది.

“సాయంత్రం ఇందుమతి మేడం ఇంటికి వెళ్లాను సర్. ఆమె లీవులో ఉంది కదా..! వచ్చిందో రాలేదో అని అనుమానిస్తూ.. గేటు దగ్గరికి వెళ్ళే సరికి.. ఇంట్లో నుండి ఇద్దరు ఆడవాళ్ళు ఒకరి మీద మరొకరు అరుచుకుంటున్నట్లుగా వినబడింది. శబ్దం రాకుండా.. గేటు తెరచుకుని వెళ్ళి కిటికీ వారగా నిలబడి విన్నాను. ఒకరు ఇందుమతి మేడం.. మరొకరు ఆమె తల్లి తాయారమ్మ.. అని అర్థమయ్యింది” అంటూ వారి సంభాషణ కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు సదానందం.

రఘువీర్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. “సదానందం ఇంకొక పని చెయ్యాలి. కేసుకు అది ఎంతో ముఖ్యం. నువ్వు క్లోజ్డ్ సర్క్యూట్ నియంత్రణ కార్యాలయానికి వెళ్లి గట్టమ్మపల్లె వైపు ఆరు, ఏడూ గంటల మధ్య ప్రయాణించిన వాహనాల రికార్డు కాపీ చేసుకునిరా. మన దావఖాన ప్రధాన గేటు వద్ద అమర్చిన కెమెరాలో దొరుకుతాయి” అంటూ.. క్లూ గూడా ఇచ్చాడు.

సదానందం వెళ్లి మరో గంటలో వాహనాల లిస్టు తెచ్చి రఘువీర్ ముందర పెట్టాడు. అంత త్వరగా వస్తాడని ఊహించని రఘువీర్ అబ్బురపడి ప్రశంసిస్తూ.. ఫ్లాస్కు వైపు చూశాడు. అర్థం చేసుకున్న సదానందం ఫ్లాస్కు లోని కాఫీ కప్పులో వంచి సర్వ్ చేశాడు. ఆ కప్పును సదానందానికిచ్చి తాను మరో కప్పులో తీసుకున్నాడు.

ఇద్దరూ కాఫీ సేవించడం పూర్తవగానే.. సదానందం తన సెల్ ఫోన్ ఆన్ చేసి వాహనాల రికార్డును ఓపెన్ చేశాడు. ఇద్దరూ నిశితంగా వీక్షించసాగారు.

“సర్.. అది మన ఊరి కారే.. కోమటి శంకరయ్యది” అన్నాడు సదానందం.

వీడియోను రివైండ్ చేసి స్లో మోషన్ లో నంబర్ నోట్ చేసుకుని వెరిఫై చేశాడు రఘువీర్. నిజమే అది సామర్ల శంకరయ్య పేరున రిజిస్టర్ చేయబడి ఉంది. అదే కారు తిరిగి మరో అరగంటలో రావడం అనుమానమేసింది. విషయం ఆరా తీయాలని ..

“సదానందం.. వెళ్లి శంకరయ్యను పట్టుకురా..” అంటూ పురమాయింఛి తిరిగి వీడియో పరిశీలనలో నిమగ్నమయ్యాడు.

ఒక్కొక్క క్లిప్ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ.. అనుమానం వచ్చిన చోటల్లా మళ్ళీ, మళ్ళీ జల్లెడ పట్టాడు. కొన్ని ఆర్.టి.సి. బస్సులు.. ఎక్కువగా లారీలు ప్రయాణించాయి. ప్రైవేటు వాహనాలు నాలుగు మాత్రమే. అందులో ఒకటి అదే ఊరిది కావడం గొప్పవిశేషమేమీ గాక పాయినా.. అరగంటలోనే తిరిగి రావడం.. అనుమానానికి ఆస్కారమిచ్చింది. అయినా శంకరయ్య చాల పలుకుబడి కలిగిన వ్యక్తి. అనుమానించదగ్గ వాడూ కాదు. కాని ఈకాలంలో ఎవరినీ నమ్మగూడదు.. అది పోలీసు నియమాలలో ప్రాధమిక అంశం.. అని మనసులోకి రాగానే రఘువీర్ పెదవులు విచ్చుకున్నాయి.

ఇంతలో.. “సార్ శంకరయ్యసేటును తీసుకు వచ్చాను” అని.. లోనికి పిలువమంటారా అన్నట్టు చూశాడు సదానందం. పిలువమన్నట్టు తలూపాడు రఘువీర్.

పిల్లి కూనలా గదిలోకి అడుగు పెట్టాడు శంకరయ్య.

“సేటూ.. నిన్న సాయంత్రం ఆరు, ఏడు మధ్యలో ఎటు వెళ్లావు” పోలీసు స్టైల్లో అడిగాడు రఘువీర్.

“సార్ ఎటూ వెళ్ళ లేదు. మా షాపులోనే కూర్చున్నా..” రెండు చేతులు కట్టుకుని సమాధానమిచ్చాడు శంకరయ్య.

“మరి మీ కారు గట్టమ్మపల్లె దిక్కు వెళ్ళి వచ్చినట్టు సి.సి.కెమెరాల్లో రికార్డయ్యింది..” అంటూ తీక్షణంగా చూశాడు రఘువీర్.

“నిజమే సార.. మా కస్టమర్ తాయారమ్మ కారు అడిగింది సర్. గట్టమ్మ దేవతను దర్శించుకుని వస్తానంటే.. మొదటిసారిగా అడిగిందని ఇచ్చాను. కామేశం సార్ వచ్చి తీసుకెళ్ళాడు. గంట లోపలే మళ్ళీ తీసుకుని వచ్చిచ్చాడు” అని నీళ్ళు నములసాగాడు. ఏంతప్పు జరిగిందో అన్నట్టు.

కేసు తేలిపోయినట్టుగా రఘువీర్ మోముపై చిరునవ్వు మొలిచింది. శంకరయ్యను పంపించి వేశాడు. ఇంత త్వరగా అనిల్ కుమార్ హత్యకేసు ఒక కొలిక్కి వస్తుందని అనుకోలేదు. అయితే సదానందం తెచ్చిన సమాచారాన్నంతా ఒక ఫ్రేమ్ లో పెట్టి.. నిజం నిగ్గు తేల్చడానికి పథకం రచించాడు. దాని ఎలా అమలు పర్చాలో సదానందంకు వివరించాడు రఘువీర్.

“కాలేజీకి సెలవు ప్రకటించారని తెలిసింది. ఈరోజే పని పూర్తవ్వాలి” అంటూ పురమాయించి తన క్వార్టర్ కు వెళ్ళాడు.

సదానందం నివ్వెర పోయాడు. ఇది సాధ్యమయ్యేనా అని లిప్తకాలం ఆలోచించి.. బాస్ మీద నమ్మకంతో కార్యరంగంలోకి దిగాడు సదానందం.

రఘువీర్ సూచనల మేరకు ఒక గంటవ్యవధిలో జూనియర్ కాలేజీ కామర్స్ లెక్చరర్ కామేశంను ఒక సెల్లో.. దానికెదురుగా లేడీ కానిస్టేబుల్ సాయంతో తాయారమ్మను మరో సెల్లో.. వేయించాడు సదానందం. ఇద్దరు ఊచలు లెక్క పెట్టుకుంటూ.. బిక్కు, బిక్కుమని ఒకరినొకరు చూసుకోసాగారు.

రఘువీర్ తనదైన శైలిలో లాఠీ ఊపుకుంటూ వచ్చి.. ఒకసారి లాకప్ ల వంక దృష్టి సారించాడు. తాయారమ్మ తల దించుకుని నేల చూపులు చూస్తోంది. కామేశం నన్నెందుకు తీసుకుని వచ్చారు..పైగా నేరస్తుడిలా సెల్లులోనా వేసేది అన్నట్టు తలబిరుసుగా చూడసాగాడు. అలా లాకప్ లో వేస్తేనే భయంతో నిజాలు బయటకు వస్తాయని రఘువీర్ పథకం లోని మొదటి అంకమది.

తాయారమ్మను తన ఛాంబర్ లోకి తీసుకు రమ్మన్నట్టుగా లాఠీని గాలిలో ఊపుకుంటూ.. లేడీ కానిస్టేబుల్ కు సంకేతాలందించాడు రఘువీర్.

తాయారమ్మను గదిలోకి పంపి గుమ్మం ముందు మరెవ్వరూ రాకుండా నిలబడింది..లేడీ కానిస్టేబుల్. తాయారమ్మను ఎగాదిగా చూస్తూ.. నేరుగా విషయంలలోకి వచ్చాడు రఘువీర్. సదానందం రికార్డు చెయ్యసాగాడు.

“చూడు తాయారమ్మా.. నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. బుకాయించాలని చూడకు. నిజం చెప్పు. తెలుగు లెక్చరర్ అనిల్ కుమార్ ను ఎందుకు చంపావ్?”

డైరక్ట్ గా అడిగే సరికి కంగు తింది తాయారమ్మ.

“సార్.. నేను చంప లేదు. నాకేం అవసరం సార్” అంది లేని ధైర్యం కూడగట్టుకుని.

“అదుగో అదే వద్దన్నాను. నువ్వు ప్రశ్నలు వేయొద్దు. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. అనిల్ కుమార్ కు పొటాసియంగోల్డ్ సైనైడ్ విషమిచ్చి చంపడానికి కారణమేమిటి?.. జరిగింది చెబుతావా.. లేక చెప్పించాలా?” అంటూ.. తన అనుమానాన్ని మాటల రూపంలో మార్చి ఝలకిచ్చినట్టు లాఠీని టేబుల్ పైన గట్టిగా బాదాడు. అది పోలీసు సైకాలజీ..

గజ్జున వణకింది తాయారమ్మ. రఘువీర్ తన అనుమానంతో అలా అడుగుతున్నాడని పసిగట్ట లేక పొయింది. అంతా తెలిసి పోయిందనుకుని.. బయం, భయంగా నోరు విప్పింది.

“సార్ నేను చంప లేదు. కామేశం చంపాడు”

“ఎందుకు”

“సార్.. జరిగింది చెబుతాను” అంటూ కళ్ళ నీళ్ళు కడకొంగుతో ఒత్తుకుంటూ.. “మా ఇందుమతిని పెళ్ళాడుతానానని అతని తల్లిదండ్రులతో ఒక రోజు మాఇంటికి వచ్చాడు. ఇల్లరికం రావాలని నేను షరతు పెట్టాను. కామేశం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ తరువాత తాను ఒక్కడే వచ్చి ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా.. ఇల్లరికం వస్తానని ప్రమాణం చేశాడు.

ఇందుమతిని అడిగితే.. తను, అనిల్ కుమార్ ప్రేమించుకుంటున్నామని.. అతను ఇల్లరికం రాడని తెగేసి చెప్పింది. నాకేమో!.. అల్లుడు ఎవరైనా సరే.. ఇల్లరికం రావాలని నా పంతం. కుట్టు మిషన్ కుట్టుకుంటూ.. కష్టపడి పిల్లల చదువులు పూర్తి చేయించాను.. ఉన్న ఒక్క కొడుకును పెళ్లికాగానే.. ఎగురేసుకు పోయింది వాని పెళ్ళాం. ముండరాలలిని.. ఈ వయసులో ఇందుమతి గూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపొతే నాకింకా దిక్కెవరు. ఇల్లరికపు అల్లుడు కావాలని చూస్తున్నాను.

ఇందుమతి ససేమిరా అంది.. వారం రోజుల క్రితం ఇందుమతి ఎదో ట్రైనింగ్ అంటూ హైదరాబాదు వెళ్ళింది. ఇదే మంచి సమయమని కామేశం పథకం పన్ని అనిల్ ను మా ఇంట్లోనే కాఫీలో విషం కలిపి చంపేశాడు. నేను భయపడిపోయాను. ఎవరిదో కారు అడుక్కుని వచ్చి శవాన్ని తీసుకు వెళ్ళాడు. గట్టు ఆవల ఉన్న లోకం చెరువులో శవాన్ని వేద్దామనుకున్నాడట. కాని కారు పోను వీలుగాక గొయ్యిలో వేసి వచ్చానన్నాడు. తన చేతి వేలి ముద్రలు పడకుండా జాగ్రత్త పడ్డాను భయమేమీ లేదని చెప్పాడు” అంటూ కన్నీరు మున్నీరయ్యింది తాయారమ్మ,

సదానందం రికార్డ్స్ మీద తాయారమ్మ సంతకం తీసుకుంటుంటే.. నిముషం పాటు ఆమె హావభావాలను చదివాడు రఘువీర్. ఎప్పుడూ.. ఒక వైపు ఇని నిర్ణయానికి రాగూడదనేది జగమెరిగిన సత్యం. తాయారమ్మ బంతిని పూర్తిగా కామేశం గ్రౌండులోకి బాదిందనుకున్నాడు. ఇక కామేశం ఆ బంతిని ఎలా వాడుకుంటాడో చూద్దామన్నట్టుగా.. తాయారమ్మను తిరిగి సెల్ లోకి పంపించి కామేశాన్ని పిలిపించుకున్నాడు రఘువీర్.

సదానందం తిరిగి కామేశం వాంగ్మూలాన్ని రికార్డు చెయ్యడంలో మునిగిపోయాడు.

“చూడు కామేశం.. నీకు కాబోయే అత్తగారు నిజాలన్నీ కక్కేసింది. ఇక నువ్వు చెప్పినా చెప్పక పోయినా ఆధారాలన్నీ దొరికాయి. ఇక నిన్ను అరెస్టు చేసి జైలుకు పంపడమే తరువాయి. ఉరికంబం ఎక్కే వాణ్ణి గూడా చివరికోరిక అంటూ అడుగుతారు. ఇక నువ్వు చెప్పాల్సిందేమైనా ఉంటే మూడు ముక్కల్లో చెప్పు. ఇదే నీ చివరి అవకాశం అనుకో.. “ అంటూ లాఠీతో బెదిరించాడు రఘువీర్.

“సర్.. తాయారమ్మ ఏం చెప్పిందో! ఏమో! గాని నేను చెప్పేది మాత్రం వాస్తవం.. ” అంటూ మొదలు పెట్టాడు కామేశం.

“నాకు ఇందుమతి అంటే ఇష్టం.. నాప్రాణం సర్. అయితే వచ్చిన చిక్కల్లా ఇల్లరికం. నేను మా ఇంట్లో ఎదురించి ఒప్పుకున్నాను. కాని ఇందుమతి ఇష్టపడే.. అనిల్ కుమార్ ఒప్పుకోలేదు. ఇలా తన స్వంత తల్లి అయితే పేచీ పెట్టక పోయేదేమోనని నా అనుమానం సర్..” అంటూ కాసేపు ఆగాడు.

కామేశం చెప్పేది నమ్మశక్యంగా ఉందన్నట్టు సందానందం వంక చూసి తలాడించాడు రఘువీర్. సదానందం మోములో గూడా రైట్ సింబల్ కనబడింది. తిరిగి చెప్పడమారంభించాడు కామేశం.

“తాయారమ్మది క్రిమినల్ బుర్ర సర్. నాతో ఇల్లరికం ఒప్పందమని బాండు పేపర్ మీద సంతకం తీసుకుంది. ఇందుమతి మెడలు వంచి నీకు కట్టబెడ్తాను కాని అనిల్ కుమార్ అడ్డు తొలగించుకుంటే మంచిదని పథకం వేసింది. ఇందుమతి తండ్రి గారు బంగారు ఆభరణాలు చేసే వాడు. క్రమేణా ఆ వ్యాపారం మందగించడం.. భార్య అకాల మరణం అతణ్ణి కృంగదీసింది. అతనికి అండగా ఉంటానని విధవరాలైన అతని మేనమరదలు తాయారమ్మ కుట్టు మిషను పట్టుకుని వీరి ఇంటికి మారు మనువుగా వచ్చింది. ఇందుమతి అన్నయ్య ఇంటి పరిస్థితులు చూసి నచ్చక పెళ్ళాంతో వెళ్ళి పోయాడు. ఆ మరునాడే హార్ట్ ఎటాక్ తో ఇందుమతి నాన్నగారూ పోయారు. అప్పుడు ఇందుమతి ఆంగ్లంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తాయారమ్మనే దిక్కయ్యింది. ఇందుమతికి ఉద్యోగం వస్తే తాను ఇక నిశ్చితంగా బతుకవచ్చని అనుకుంది. అదృష్టవశాత్తు ఇందుమతికి ఉద్యోగమూ వచ్చింది. కాని ఆమెలో మరో రకమైన భయం ఆవహించింది. ఇందుమతి గూడా పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతే తనకు దిక్కెవరని ఇల్లరికం షరతు విధించేది. ఆ నిబంధనతో రెండు, మూడు సంబధాలు విచ్చుకు పోయాయి గూడా.

గతవారం ఇందుమతి సబ్జెక్ట్ రిఫ్రెష్ ట్రైనింగ్ కోసం హైదరాబాదు వెళ్ళింది. తాయారమ్మ పథకం ప్రకారం నేను అనిల్ కుమార్ ను తీసుకుని మొన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇందుమతి ఇంటికి వెళ్లాను. తాయారమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇద్దరికీ ఇచ్చింది. కాఫీ తాగడం పూర్తవక ముందే అనిల్ కుమార్ నేల కొరిగాడు. నేను భయంతో వణకి పోయాను. అంత హఠాత్తుగా పోవడానికి కారణం.. పొటాసియం గోల్డ్ సైనైడ్ అని చెప్పింది తాయారమ్మ. శంకరయ్యకు ఫోన్ చేసింది కారుకావాలని. ఇందుమతి పెళ్లి త్వరగా కుదురాలని గట్టమ్మ దేవతకు మొక్కుకున్నానని.. దర్శించుకుని వస్తానని అర్థించింది. నేను విస్తుపోయి.. వెళ్లి కారు తెచ్చాను. శవాన్ని కార్లో సర్దడానికి సాయపడింది. నేరుగా తీసుకు వెళ్లి లోకం చెరువులో వేసి రమ్మంది. ఈ రహస్యం మన మధ్యలోనే ఉండాలి.. తప్పకుండా ఇందుమతి నీదై పోతుంది. నేను మాట తప్పను. నువ్వు మాటతప్పినా.. రహస్యం బయట పెట్టినా నీకూ ఇదే గతి పడ్తుందని హెచ్చరించింది. నేను గజ, గాజా వణకుతూ.. బయలుదేరాను. లోకం చెరువు వెళ్ళడం వీలుగాక గట్టు మీద రావి చెట్టు ప్రక్కన గొయ్యిలో శవాన్ని నెట్టేసి వచ్చాను” అంటూ.. సదానందం ముందు పెట్టిన రికార్డు మీద సంతకం పెట్టి, దేవుని మీద ప్రమాణం చేశాడు కామేశం.

“చూడు కామేశం.. నేరం చేసినా.. నేరం చేసిన వారికి సహకరించినా.. శిక్ష అనుభవించక తప్పదు. అనిల్ కుమార్ చనిపోగానే నేరుగా వచ్చి మా స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది. స్త్రీ వ్యామోహంలో పడి నువ్వూ తప్పుదోవ తొక్కావు. శిక్షల విషయం కోర్టులో తేలుతుంది. నా పని ఎఫ్.ఐ.ఆర్. రాసి కేసు బుక్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టడమే..” అంటూ ఆపనిలో నిమగ్నమయ్యాడు రఘువీర్.*

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు