పాజిటివ్ - ఎం బిందుమాధవి

Positive

"అనూ...అబ్బాబ్బా కూర మాడి చస్తోందే..నాకు పూజ గదిలోకి వాసనొస్తోంది! ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వరు కదా! మీకెవ్వరికీ ముక్కులు పనిచెయ్యట్లేదా" అంటూ కమలమ్మ గారు లేచి బయటికొస్తూ, నైవేద్యం కోసం పక్కన పెట్టుకున్న పాలగ్లాసు తన్నేశారు.

"చదివేదేమో "లలిత పంచకం" చేసేదేమో "శివతాండవం".... అమ్మా అసలు వంటే మొదలుపెట్టలేదు మనింట్లో! ఇందాక నువ్వేగా... 'పూజ చేసుకొచ్చి టిఫిన్ చేస్తానని చెప్పావు '. పక్కింట్లో వాసన అది! చూడు నీ కంగారుతో పాల గ్లాస్తన్నేశావ్" అన్నది కూతురు అనురాధ.

"అబ్బా దీని కంగారు దొంగలు దోలా, ఎన్నిసార్లు చెప్పినా ప్రశాంతంగా తను పూజ చేసుకోదు, నన్ను నామాలుచదువుకోనివ్వదు" అన్నది బామ్మ పున్నమ్మ గారు..అలా ఎండలో కూర్చుని తను చదువుకునే విష్ణు సహస్ర నామాలుఆపి!

"కమలా నీకున్న కంగారు, ఉద్వేగం తగ్గించుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నీ గురించి పక్కింటి వాళ్ళు వంటచేసుకోవటం మానెయ్యాలా? లేక పాలు పొంగపెట్టటం, కూరలు మాడ్చటం మానాలా?" అన్నారు నవ్వుతూ భర్తజనార్దనం.

"నాకు కంగారే! దానికి అందరూ ఇలా పాఠం చదవాలా" అన్నది కమలమ్మగారు, ఉడుకుమోతుతనంతో!

అప్పటికా ప్రహసనం అయింది.

******

కమలమ్మగారమ్మాయి అనురాధ పురిటికొచ్చి మూణ్ణెల్లయింది. పిల్లవాడు ఇప్పుడిప్పుడే బోర్ల పడుతున్నాడు.

"పిల్లాడు అంతలా గుక్క పట్టి ఏడుస్తుంటే వినిపించట్లేదా? కింద పడ్డాడో ఏమిటో? ఎప్పుడు చూసినా దిక్కుమాలినటీవీ చూట్టమో, లేకపోతే ఫోన్లు పట్టుకు గంటలు గంటలు మాట్లాడుతూ చుట్టూ ప్రపంచం మర్చిపోవటమో! నాకొక్కదానికే అన్నీ వినిపిస్తాయి, కనిపిస్తాయి. ఎన్నని పట్టించుకోను" వంటింట్లోంచి కమలమ్మగారి దండకంనడుస్తున్నది.

"వాళ్ళమ్మ అక్కడే ఉందత్తయ్యా! డైపర్ మారుస్తున్నది. దానికే వాడి గగ్గోలు. మీకన్నిటికీ కంగారే" అన్నది కోడలు సుజాత.

"అబ్బాబ్బా ఈవిడతో ఎట్లా వేగుతున్నావో కానీ వదినా! గుండె కాస్త బలహీనమయితే ఆగిపోతుంది? అసలు నోటికి మంచిమాట రానే రాదు. మా చిన్నప్పుడు ఇంత చేటు ఉండేది కాదు" అన్నది అనురాధ.

"మొన్న నేను దోశలు వేస్తుంటే ఇలాగే అరిచారు. కంగారుకి నా చేతిలో అట్లకాడ వెళ్ళి నూనె గిన్నె మీద పడి, అదితిరగపడి వంటిల్లంతా నూనె మయం. శుభ్రం చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చిందనుకో" అన్నది సుజాత.

"అవునొదినా! కొందరి ఆలోచనల్లో ఉద్వేగం, మాటల్లో అపశకునం త్వరగా వస్తాయి. నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో మామేనేజర్ నా ఫస్ట్ జీతం తీసుకుంటూ, నా పే స్లిప్ చూసి గ్రూప్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి సర్ అనడిగా. 'నువ్వుచచ్చిపోయావనుకో' అని మొదలుపెట్టాడు. 'ఊరుకోండి సర్, పాపం అమ్మాయి ఇప్పుడే మొదటి జీతంతీసుకుంటున్నది. అలా చెబితే హడలి పోతుంది. మేం చెబుతాంలే' అని సీనియర్ స్టాఫ్ మెంబర్స్ ఆయన మాటని కట్చేశారు."

"ఇంకోసారి లంచ్ టైం లో అందరం గుమికూడి మాట్లాడుకుంటున్నాం. క్యాబిన్ లో నించి చూసి ఆయన బయటికొచ్చి"ఏంటి ఎవరికీ యాక్సిడెంట్ అయింది" అని మొదలు పెట్టాడు.

"యాక్సిడెంటా? ఎవరు చెప్పారు సర్. మన వేణుమాధవ్ గారి అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో టెంత్ పాసయ్యాడని చెబుతుంటే, అందరం ఆయన్ని అభినందిస్తున్నాం! మా మొహాల్లో ఆనందం కనిపిస్తుంటే, మీకు మాత్రం యాక్సిడెంట్ గురించిమాట్లాడుతున్నట్టనిపిస్తోందా? ఏం మనుషులు సర్" అన్నాడు ప్రతాప్ కొంచెం చనువుగా"

"అలా...కొందరు మనుషుల మనసుకి ఎప్పుడూ కీడే తోస్తుంది. నోటికి అమంగళం మాటలే వస్తాయి" అన్నది అనురాధ.

"నువ్వీమాట అంటే నాకు నిన్న చూసిన ఒక మెసేజ్ గుర్తొస్తున్నది వదినా! మనం కొండల మధ్యలో నిలబడి గట్టిగా అరిస్తేమన మాట మనకే ప్రతిధ్వనిగా వస్తుంది కదా! అలాగే ఖాళీ ప్రదేశంలో కూడా.... అక్కడ ఉన్న గాలి, వాతావరణం మనమాటని మనకే వినిపిస్తాయి. అంటే మనం మంచి అంటే, మంచి..చెడు అంటే చెడు ప్రతిధ్వనులే వస్తాయి."

"మనం స్వరంతో అంటే అంతే స్థాయిలో ప్రతిధ్వని వస్తుంది. అంటే గాలి, నీరు, వాతావరణం మన స్పందనకి అదే ప్రతిస్పందనని ఇస్తాయి. అలాగే మన శరీరం కూడా పంచభూతాత్మకమే కదా! మనం మంచి ఆలోచిస్తే, మన ఉచ్ఛ్వాసనిశ్వాసాల ద్వారా మన చుట్టు వాతావరణం సానుకూల ప్రకంపనలు సృష్టిస్తుందిట. మనం మళ్ళీ అదే గాలిపీలుస్తాం...అలా మన చుట్టూ ఉండే వాతావరణం, గాలి మన మన:స్థితిని బట్టి

అనుకూల, ప్రతికూల ప్రకంపనలని కలిగిస్తాయిట. రకమైన వివరణ ఎంత బాగుందో కదా! ఇందులో లాజిక్కునిఎవరయినా ఒప్పుకుని తీరాల్సిందే" అన్నది సుజాత ఆడపడుచుతో!

"కరెక్ట్ వదినా! ఎవరి గురించయినా చెడుగా ఆలోచించినా, మాట్లాడినా..అది అవతలి వారిని చేరేలోపే, మన చుట్టూఉండే వాతావరణం ద్వారా మళ్ళీ మనమే ముందుగా లోపలికి పీలుస్తాం! ఉదాహరణకి కోపంగా, ఆవేశంగా ఉన్నప్పుడుమనం విడిచే గాలి వేడిగా ఉంటుంది. మనం తీసుకునే ఊపిరులు కూడా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వేడి గాలినేమనం పీలుస్తుంటాం! కాబట్టే పెద్దలు మంచి ఆలోచించు, మంచే మాట్లాడు, మంచి చెయ్యి...నీకు మంచే జరుగుతుందిఅని చెబుతారు" అన్నది అనురాధ.

"మా అత్తగారు ఎప్పుడూ రామాయణ భాగవతాల్లో పద్యాలు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతూఉంటారు. నిరుడు మా ఇంటికి ఒకాయన వచ్చారు. ఆయన ఇల్లంతా తిరిగి 'మీ ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ఉన్నాయో అంటూ కళ్ళు మూసుకుని కాసేపు అలాగే నుంచుండి పోయాడు. బహుశ: నువ్వు ఇప్పుడు చెప్పిన లాజిక్కేఅయ్యుంటుంది వదినా" అన్నది సుజాతతో అనురాధ.

"నాకు మెసేజ్ పంపించు వదినా! ఒక సారి చదువుతాను. మరికొందరికి కూడా పంపుతాను"అన్నది అనురాధ.

"అమ్మకి ఉద్వేగం, కంగారు మా చిన్నప్పటి నించీ ఉన్నాయి కానీ...పెద్ద వయసు వస్తుంటే ఇప్పుడు ఇంకాఎక్కువయ్యాయి. ఎప్పుడయినా అరిచినా ఏమనుకోకు. మనసుకి తీసుకోకు. బామ్మా, నాన్నా షాక్ ఎబ్జార్బర్స్ లాగా ఉన్నారుకనుక, రియాక్ట్ అవకుండా వినీ విననట్టు ఉండు" అన్నది.

"నువ్వంతగా చెప్పక్కరలేదమ్మా! నా భయమల్లా ఆవిడ కంగారుతో తన ప్రాణం మీదికి తెచ్చుకుంటారేమో అని. కానీ ఏంచేస్తాం, ఇదొక రకం మనస్తత్వం అని సరిపెట్టుకోవటమే! నువ్వు ఇంత పాజిటివ్ గా ఆలోచించటం, నా గురించి అక్కరచూపటం నిజంగా అదృష్టం అనూ! ఎప్పుడన్నా మరీ ఇబ్బందిగా ఉంటే నీకు ఫోన్ చేస్తాను. సానుభూతితో అర్ధం చేసుకోచాలు" అని వదినా మరదళ్ళిద్దరూ పెద్దావిడ గురించి తమ మనసు విప్పి హాయిగా మాట్లాడుకుని ఒకరి భావాలొకరుపంచుకుని తేలిక పడ్డారు.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు