బంగార్రాజుకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీటకన్నా తీవ్రంగా ఉంది. బ్యాంకులన్నీ పిలిచి పిలిచి మరీ ఋణాలిస్తుంటే ఇదేమంత తీరని కోరికా- అన్న సందేహం అందరికీ రావచ్చు. అక్కడే ఉంది అసలు మెలికంతా. అందరిలా బంగార్రాజుకు పాతికేళ్ళకు ఉద్యోగం రాలేదు. నలభై సంవత్సరాల వయసులో కోర్టువారి చలువ వల్ల అదృష్టం మురిగి వచ్చింది. అందుకని ఇరవై సంవత్సరాల సర్వీసు మాత్రమే చేసి పదవీవిరమణ చేశాడు. దానితో అతనికి వచ్చే పెన్షను పదివేలకే పరిమితమయింది. ఉద్యోగం చేసినన్ని రోజులు పిల్లలకు చదువులని, పెళ్ళిళ్ళని అప్పులు తీసుకుని, వాటికి కంతులు కట్టుకుంటూ అత్తెసరు జీవితాన్నే వెళ్ళబుచ్చాడు పాపం. తనతో పనిచేసిన అందరికీ నగరంలో సొంత ఇళ్ళు ఉన్నాయి. కానీ బంగార్రాజుకు మాత్రం అతని సొంత ఊరిలో ఉన్న తాతలనాటి పెంకుటిల్లు తప్ప వేరే ఇల్లు లేదు. అతను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో వాయిదాల పద్ధతిలో ఒక పదిహేను గదులు నగరం చివరలో కొన్నాడు. అతని హస్తవాసి ఏమిటో గాని, ఆవైపు తప్ప మిగిలిన మూడువైపులా పెరిగింది ఊరు. అక్కడ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏదో ఒకటిలే అనుకుని, ఆ ఏకాంతపురంలోనే ఓ మూడుగదుల ఇల్లు కట్టుకోవాలని పది లక్షలు ఋణం కోసం అన్ని ప్రభుత్వబ్యాంకులను అర్ధించాడు. కానీ ఎవరూ అయిదు లక్షలకు మించి ఇవ్వలేమన్నారు. కారణం అతనికి పెన్షను తక్కువ రావడమే. ఏంచెయ్యాలో పాలుపోక దిగులుపడుతున్న బంగార్రాజుకు అతని మిత్రుడు నరహరి ఒక కొత్తగా పెట్టిన ప్రైవేటు బ్యాంకును చూపి, అక్కడైతే నీకు ఋణం ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మబలికి అక్కడికి పంపాడు. ******** బ్యాంకులోకి అడుగు పెట్టగానే హిమాలయంలో ఉన్నంత చల్లగా తగిలింది గాలి వంటికి. ప్రభుత్వ బ్యాంకుల్లో అంత చల్లని గాలి ఎప్పుడూ వంటికి తగలలేదు బంగార్రాజుకు. ఎంతైనా ప్రైవేటు ప్రైవేటే అనుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి నమస్కారం పెట్టి, చేతిలో శానిటైజరు వేసి, పేరు, సెల్ నెంబరు పుస్తకంలో వ్రాయించి, వచ్చిన పనిని కూడా వ్రాయించి సంతకం పెట్టించుకున్నాడు. తరువాత అతనికి కుర్చీ చూపించి కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మర్యాదలకు ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు బంగార్రాజు. పది నిముషాల తరువాత అతను వచ్చి బంగార్రాజును తీసుకువెళ్ళి ఒక కౌంటరు ముందున్న కుర్చీలో కూర్చోబెట్టి, ఒక పది నిముషాలు వెయిట్ చెయ్యమని, అధికారి వచ్చి మాట్లాడుతారని వెళ్ళిపోయాడు. సరిగ్గా పది నిముషాలకు నీట్ గా డ్రస్ చేసుకున్న కుర్రాడు వచ్చి కౌంటరులో కూర్చున్నాడు. ప్రభుత్వ బ్యాంకులో ఉండే ఉద్యోగస్తుల ఆహార్యానికి, వీరి ఆహార్యానికీ పొంతన కనిపించలేదు బంగార్రాజుకు. తన్మయత్వంలో ఉండిపోయాడు. " సర్ బంగార్రాజు గారు. మీరు ఇల్లు కట్టుకోవడానికి ఋణం కోసం వచ్చారు కదా" అడిగాడా కుర్ర అధికారి " అవును సర్" బదులిచ్చాడు తేరుకుని. " మీకు మా బ్యాంకులో ఖాతా ఉన్నదా" " లేదండీ " " అయితే ముందు ఖాతా తెరవండి. దానికి గాను మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాలి. రెండు ఫొటోలు కూడ కావాలి. తెచ్చారా?" " తెచ్చాను సర్ " " ఓకె. వాటి ఫొటో కాపీలు ఉన్నాయా " " లేవండి. తీసుకురాలేదు" " పర్వాలేదు. నేను తీసియిస్తానులెండి" అని వాటిని తీసుకుని ఫొటోలు పక్కనబెట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురమ్మని వాటిని మెసెంజరుకిచ్చి పంపాడు. తరువాత దరఖాస్తు ఫారం మీద బంగార్రాజు వివరాలు వ్రాసి, సంతకాలు చేయించుకుని అతనికిచ్చాడు. " సర్. మీరు వెళ్ళి ఈ ఓచరు అక్కడ ఇచ్చి పదివేలు డబ్బు కట్టి ఇక్కడికి వచ్చేయండి. మీకు ఋణానికి సంబంధించిన వివరాలు చెబుతాను. ఈ లోపుగా మీ ఖాతా తెరుస్తారు" అని ఎంతో గౌరవంగా చెప్పి పంపాడతను. 'పదివేలే' అని బాధపడుతూనే నగదు కౌంటరులో కట్టి వచ్చి కూర్చున్నాడు బంగార్రాజు. " ఇప్పుడు చెప్పండి మీకు ఎంత ఋణం కావాలో" అడిగాడు ఆ కుర్రాడు. " సర్. ఊరిలో మామిడిపాలెం చెరువు దగ్గర మా ఆవిడ పేరుతో పదిహేను గదుల స్థలం ఉన్నది అందులో ఓ మూడు గదుల ఇల్లు కట్టుకుందామని. అందుకని ఓ పది లక్షలు ఋణం కావాలి సర్" " ఓకె. మీ ఆదాయవనరులు చెప్పండి " " నేను రిటైర్డ్ ఉద్యోగిని సర్. పెన్షను పదివేలు వష్తుంది " " అంటే మీకు పదిహేను సంవత్సరాలు మాత్రమే రికవరి పిరియడ్ పెట్టాలి. పదిలక్షలు అంటే మీ పెన్షను సరిపోదు కదండి. ఓకె. మీరు ఒక రూములో ఉండి మిగిలిన రూముల అద్దెకు ఇచ్చినట్లు రాద్దాములెండి. అప్పటికీ చాలకపోతే హెడ్ ఆఫీసుకు వ్రాసి ఇరవై సంవత్సరాల రికవరికి అనుమతి తీసుకుందాంలెండి. మీ స్థలం రిజిస్ట్రేషను కాగితాలు తీసుకురండి పని మొదలు పెడదాం" అన్నాడు ఆ అధికారి కుర్రాడు " థాంక్యూ సర్. తప్పకుండా తీసుకొస్తాను. మీ వడ్డీ రేటు మరియు ఇతర ఛార్జీల వివరాలు చెబుతారా" వినయంగా అడిగాడు బంగార్రాజు " తప్పకుండా. మా వడ్డీరేటు అన్ని ఇతర బ్యాంకుల వడ్డీరేటుతో సమానమే. అదిగాక ఋణము మీద ఒక శాతం ప్రాసెసింగు ఛార్జీలు, మీరు కంతులు చెల్లించే సమయం ఆలస్యమైతే రోజుకు వంద రూపాయలు చొప్పున అదనపు రుసుము, నెల రోజులు దాటి ఆలస్యమయితే బలవంతపు వసూలు టీమ్ వారికి నెలకు రెండు వేలు అదనపు రుసుము, ఇంకా..." " అదనపు వసూలు టీమ్ ఏమిటండీ అది. ఒకవేళ మేము కట్టలేకపోతే ఇల్లు జప్తు చేసుకోవాలి లేకపోతే కోర్టుకు వెళ్ళాలి. అంతేగాని ఇదేమిటండి" అర్థంగాక అడిగాడు బంగార్రాజు. " సర్. మా బ్యాంకు అందరి బ్యాంకు లాంటిది కాదు. ఎంత సులభంగా ఋణం జారీ చేస్తామో అంత కఠినంగా వసూలు చేస్తు. అందరిలాగా 'అమ్మా...అయ్యా' అంటూ బ్రతిమలాడే తరహా కాదు. అదిగో అటువైపు చూడండి. అక్కడ కూర్చున్నారే ఇద్దరు వ్యక్తులు, వారే మా రికవరీ ఏజెంట్లు" అటు తిరిగి చూశాడు బంగార్రాజు. ఇద్దరు వస్తాదుల్లాంటి వాళ్ళు కనిపించారు. అదిరిపడ్డాడు. గొంతు తడారిపోయింది. బిక్కమొహం వేసుకుని ఆ కుర్రాడి వైపు చూశాడు. "అలాంటి వారు ఇంకా పదిమంది ఉన్నారు. మీరు ప్రతినెల ఒకటవ తేది కల్లా కట్టవలసిన కంతు మీ ఖాతాలో జమ చేయాలి. నెలకు మించి ఆలస్యమయితే వారు మీ ఇంటికి వచ్చి వాళ్ళ ట్రీట్ మెంటు వాళ్ళు ఇస్తారు. అప్పుడు మేము జప్తు చేయకుండానే మీరే మీ ఆస్తులు అమ్మి మా బాకీ కడతారు. అదీ మా ప్రత్యేకత. రేపు మీరు కాగితాలు తీసుకురండి. ఒక గంటలోపు మీ ఋణం మంజూరు చేయిస్తాను" అంటూ చిరునవ్వు నవ్వాడా కుర్రాడు. అంత ఏ.సి గదిలోను ముచ్చెమటలు పట్టాయి బంగార్రాజుకు. వడ్డీరేటు సమానమని చెప్పి అదనంగా ఎన్ని ఛార్జీలు చెప్పాడు. అవి సరే, ఋణవసూలుకు గూండాలను పంపుతాడా. అమ్మో వద్దు. వీళ్ళు వద్దు, వీళ్ళ ఋణమూ వద్దు. అసలు నాకు ఎక్కడా అప్పు వద్దు. ఉహూ అసలు ఇల్లే వద్దు. భయపడిపోయాడు బంగార్రాజు. లేని ధైర్యం తెచ్చుకుని " సర్. నేను ఆలోచించుకుని రేపు చెప్తాను. నా పాసుపుస్తకం ఎక్కడ ఇస్తారు" అని అడిగాడు. " ఒక్క నిముషం సర్ " అని మెసెంజరును పిలిచి పాసుపుస్తకం తెప్పించి ఇచ్చాడు అతను. పాసుపుస్తకంలో బ్యాలెన్సు చూసి అదిరిపడ్డాడు. పదివేలకు బదులు ఏడువేలు మాత్రమే ఉంది. ఛార్జీల క్రింద మూడువేలు చూపించారు. అర్ధంగాక అతడిని అడిగాడు. " ఓ అదా. మిమ్మల్ని మరల మరల తిప్పకుండా వెంటనే ఖాతా తెరిచినందుకు గాను అయిదు వందలు, మీతో ఇంతసేపు మాట్లాడి వివరాలు చెప్పినందుకు విచారణ రుసుము క్రింద రెండువేల అయిదు వందలు, మొత్తం మూడు వేలు ఛార్జీలు. మీరు ఖాతా సంవత్సరం లోపు రద్దు చేసుకుంటే వెయ్యి రూపాయలు అదనంగా తగ్గిస్తారు. కనీసనిల్వను ఉంచకపోతే నెలకు అయిదు వందలు రుసుము వసూలు చేస్తారు. సర్ మీకు నిర్దేశించిన సమయం అయిపోయింది. ఉంటాను సర్. రేపు కలుద్దాం" అంటూ లేచి వెళ్ళిపోయాడు ఆ అధికారి కుర్రాడు. నీరసంగా లేచి బయటకు నడిచాడు బంగార్రాజు. ఏడుపు ఒక్కటే తక్కువయిందతనికి. ఏ పనీ కాకుండానే మూడువేలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. 'హంగూ, ఆర్భాటమూ చూసి మురిసిపోయాను. ప్రైవేటంటే ' పై వేటు' అని ఇప్పుడు అర్థమయింది. వద్దు. నాకిక ఏ ఇల్లూ వద్దు. నా సొంత ఊరికి పోయి మా తాత కట్టిచ్చిన ఇల్లు బాగు చేయించుకుని అక్కడే వుంటాను' అనుకుని క్షణం ఆలస్యం చేయకుండా నరహరికి ఫోను చేశాడు. " ఒరేయ్ నరహరి. నేను ఇల్లు కట్టుకునే ఆలోచన మానుకుంటున్నానురా. ఉన్న ఆ పదిహేను గదులు అమ్మి ఆ డబ్బుతో మా ఊరిలో నా ఇల్లు బాగుచేసుకుంటాను. కడుపునిండిందిరా బ్యాంకుతో బంధం" అంటూ కసిగా బ్యాంకు బోర్డు వైపు చూశాడు బంగార్రాజు. " మంచి నిర్ణయం తీసుకున్నావురా. మాకందరికీ టౌనులో ఇళ్ళున్నాయని, మేమేదో సుఖపడి పోతున్నామని అనుకుంటున్నావు. లేదురా ఇరుకు గదులలో నరకం అనుభవిస్తున్నాము. మాకు నీలాగ పల్లెలో ఇల్లు ఉంటే ఎంచక్కా అక్కడే ఉండి పోయేవాళ్ళం. హాయిగా ఆరుబయట నవారు మంచం మీద బూరుగదూది పరుపు వేసుకుని, పైన ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టుకుంటూ, వేప చెట్టు చల్లని గాలి వంటికి తగులుతుంటే ఉండే హాయి, ఎన్ని ఏ.సి లు పెడితే వస్తుందిరా. ఇక ఆలస్యం చేయకు. సొంతవూరు కన్నతల్లిలాంటిది. హాయిగా పల్లె ఒడిలో సేదదీరు. ఆల్ ది బెస్ట్" అన్న నరహరి మాటలు బంగార్రాజు మీద బాగా పనిచేశాయి. బుద్ధుడికి బోధివృక్షం క్రింద జ్ఞానోదయమైనట్టు బంగార్రాజుకు ప్రైవేటు బ్యాంకు దగ్గర విజ్ఞానం తలుపు తెరుచుకుంది. "ఏమైనా సొంతవూరు సొంతవూరే, తాతలనాటి ఇల్లు అనుబంధాల హరివిల్లే". ******* అయిపోయింది *******