పిసినారి డబ్బు - సరికొండ శ్రీనివాసరాజు

Pisinari dabbu

రంగ 9వ తరగతి చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు ధనవంతులే కాదు. సేవా గుణం కలవారు. కానీ రంగకు ఎక్కడ నుంచి వచ్చాయో కానీ పిసినారి గుణం అలవడింది. రంగ చెల్లెలు లలితకు ఎవరైనా తినడానికి ఏమైనా కొనిస్తే అన్నకు ఇవ్వకుండా తాను తినదు. కానీ రంగకు ఎవరైనా ఏమైనా కొనిస్తే ఒక్కడే ఎవరికీ తెలియకుండా దాచుకుని దాచుకుని తింటాడు. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా ఇస్తున్న పాకెట్ మనీ దాచుకునే వాడే కానీ రూపాయి కూడా ఖర్చు చేయడానికి అతనికి మనసు ఒప్పదు. ఒకసారి రంగ వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకొని విహారయాత్రకు వెళ్ళడానికి నిర్ణయించారు. రంగ వాళ్ళ తల్లిదండ్రులు రంగను కూడా వెళ్ళమని అన్నారు. రెండు వేల రూపాయలు పాకెట్ మనీగా ఇచ్చి, ఆయా ప్రాంతాల్లో నచ్చిన వస్తువులను కొనుక్కోమన్నారు. ఇష్టమైన ఆహారాన్ని తినమన్నారు. ఎవరికైనా అవసరం వస్తే సహాయం చేయమన్నారు. నాలుగు 500 రూపాయల నోట్లను రంగ భద్రంగా దాచుకున్నాడు. అనేక ప్రాంతాలను చూస్తూ ఉన్నప్పుడు విద్యార్థులు తమకు నచ్చినవి కొనుక్కుంటున్నారు. కొన్ని చిరుతిళ్ళను స్నేహితులకూ తినిపిస్తున్నారు. రంగ స్నేహితులు ఇచ్చినవి కాదనకుండా తింటున్నాడు కానీ తన జేబులోంచి డబ్బులు బయటకు తీయడం లేదు. ఎవరైనా అడిగితే తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని అబద్ధం చెబుతున్నాడు. రంగ స్నేహితులు ఎవరూ చూడకుండా దూరంగా వెళ్ళి జేబులో డబ్బులు ఉన్నాయా అని చూసుకున్నాడు. నాలుగు 500 రూపాయల నోట్లు లెక్క పెడుతున్నాడు. ఇంతలో సుదర్శన్, అనంత్ అనే స్నేహితులు "ఒరేయ్ రంగా! నువ్వు ఎలాగూ ఏమీ కొనుక్కోవడం లేదు కదా! ఆ డబ్బులను మాకు అప్పుగా ఇవ్వరా! అవసరమైనవి కొనుక్కోవాలి. ఇంటికి వెళ్ళిన మరునాడు నీ అప్పు తీరుస్తాములే." అన్నారు. "విహారయాత్రలో శ్రీశైలం కూడా వెళ్ళాం కదా! దేవుని హుండీలో వేయమని మా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఇవి. వీటిని అడగడం తప్పు." అన్నాడు రంగ. శ్రీశైలం చూడటం కూడా అయిపోయింది. విహారయాత్ర పూర్తి అయ్యాక తిరిగి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు అందరూ బస్సు దిగారు. రంగ దూరంగా వెళ్ళి జేబులు చూసుకున్నాడు. డబ్బులు లేవు. కంగారు కంగారుగా వెతుక్కుంటున్నాడు. "ఏరా రంగా! మరచిపయావా? శ్రీశైలం హుండీలో వేశావు కదా!" అన్నాడు సుదర్శన్. పగలబడి నవ్వాడు అనంత్. సిగ్గుతో తల దించుకున్నాడు రంగ. "మన తెలుగు మాస్టారు ఏమన్నారో గుర్తు లేదా సుదర్శన్! ధనము కూడబెట్టి ధర్మము చేయక, తాను తినక బాగా దాచి పెడితే అది దొంగలపాలు అవుతుందని." అన్నాడు అనంత్. "అవును." అన్నాడు సుదర్శన్. ఖర్చు పెట్టలేక పోతిని, మిత్రులకు ఇచ్చినా తిరిగి వచ్చేవి. ఇప్పుడు విచారిస్తే ఏం లాభం అనుకున్నాడు రంగ.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు