బస్సు దిగి మా కాలనీకి నడక సాగించాను..
సాయంత్రం ఆరు కావస్తోంది.. శీతాకాలం మూలాన కనుమసకవుతోంది. దాదాపు ఒక కిలోమీటరు దూరం. ప్రధాన రోడ్డు దిగాను. ఇక మట్టి రోడ్డే గత్యంతరం. ఉదయం వేళలో తప్ప ఆ దారిన నడిచే వారు బహు తక్కువ. పదడుగులు వేశానో లేదో.. నా గుండె ఝల్లుమంది. ఎదురుగా వచ్చేది మణిమాలలా కనబడింది. స్థాణువునై పరీక్షగా దృష్టి సారించాను. నిజమే..! ఆమె మణిమాలనే.. చిన్న పాపను చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వస్తోంది. పాప నడకలో అలసత్వం గమనించిందో ఏమో..! ప్రక్కనే ఉన్న ఒక బండ రాయిపై కూర్చోబెట్టి తనూ పాప ప్రక్కనే కూర్చుంది. వాస్తవానికి అది అభివృద్ధికి నోచుకోని మా కాలనీ పార్కు. అందులో నుండే దారి.
ఆమె ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆమెకెదురు పడి ముఖం చూపించే ధైర్యం నాకు లేదు.. కాని మరో దారి లేదు. అయినా అదియును ఒకందుకు మంచిదే.. ఇప్పటికైనా ఆమె జవాబు చెబుతుందో లేదో..! అని నా మనసులోకి రాగానే.. కుదేలైపోయాను. నా కాళ్ళల్లో శక్తి సన్నగిల్లింది. పరుపులా పరిచి ఉన్న పచ్చని గడ్డి చూసి నా బ్యాగు పక్కకు పెట్టి కూర్చున్నాను.
దాదాపు పది సంవత్సరాల కింది మాట.. ఆ రోజు నాకింకా బాగా గుర్తుంది..
***
“తమ్ముడూ..!”
“ఏంటన్నయ్యా”
“ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళి ఉషకిచ్చిరావాలిరా. మూడో కంటపడకుండా.. జాగ్రత్తగా ఇవ్వాలి. నీ కంటే నమ్మకస్థుడు నాకెవరున్నారు చెప్పు” అంటూ నన్ను అందలమెక్కిస్తూ.. అడిగాడు అన్నయ్య.
అన్నయ్య అంటే స్వంత అన్నయ్యేమీ కాదు. దూరపు బంధువు శంశాంక్. పేరుకు తగ్గట్టు చాలా హాండ్ సమ్ పర్సనాలిటీ.. కాలేజీలో చదివే సమయంలో అమ్మాయిలను తను లైన్లో పెట్టేవాడు అనే కంటే.. అమ్మాయిలే లైన్లో నిలబడే వారంటే అతిశయోక్తి గాదు. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవన్నట్టు.. అన్నయ్యకు అలాంటి అంటురోగం ఇంకా పోలేదు. ఒక ఇంటివాడయినా.. తన మీద పారేసుకున్న ఉష హృదయానికి సాంత్వన కలిగించాలనుకున్నాడేమో!.. ముందు ఉత్తరాయణంతో మొదలు పెట్టాడని ఊహించాను.
వదినమ్మ పురిటి కోసం పుట్టింటికి వెళ్ళడం.. అన్నయ్య అంతర్గత కోర్కెలు పురి విప్పిన నెమలిలా నాట్యమాడాయి. ఆ ఆసమయంలో అనాకారిని చూసినా అందగత్తెలా అగుపడడం అసహజమేమీ కాదనుకుంటాను.. ఉషకు ప్రమాదమని తెలిసినా ఆమె పొందు కోరాడు. ఇంట్లో ఉషకు పెళ్ళిసంబంధాలు చూస్తున్నారు. అయినా ఉష అన్నయ్యపట్ల ఉత్సుకత చూపిస్తూండడం.. ఆడది ఎంతకైనా.. తెగిస్తుందని.. తప్పించుకునే నైపుణ్యం ప్రదర్శిస్తుందని.. నేను ‘శకసప్తతి’ కథల్లో చదివాను. నాకు పుస్తక పఠనమంటే మక్కువ. ఎక్కువ సమయం గ్రంధాలయంలో గడుపుతాను.
ఉత్తరం.. ఒక పెళ్లి కాని అమ్మాయికి అంటే అర్థం కాని వయసు కాదు నాది. ఉత్తరంలో ఏముందో తెలుసుకోవాలనే.. జిజ్ఞాస కలిగిన వయసు. స్కూల్ ఫైనల్ చదువుతున్నాను.
అతికించిన కవరును నేర్పుగా విప్పదీశాను. అన్నయ్య అక్షరాలు ముత్యాల్లా ఉన్నాయి. సాహిత్యం సరససల్లాపాలాడుతోంది. అది చదివితే.. ఏ అమ్మాయి అయినా.. నిద్రాహారాలు మాని పొందు కోసం తపించుకుంటూ.. తపించుకుంటూ.. తహ, తహలాడాల్సిందే..
అన్నయ్య ప్రేమలేఖ సాంతం చదివి ముగ్ధుడనయ్యాను. అది నా మీద అత్యంత ప్రభావం చూపింది.. నాలో అలజడి రేపింది. అలాంటి ప్రేమలేఖను నేను గూడా ఒక అమ్మాయికి అందజేస్తే’.. అధరామృతం ఆస్వాదించవచ్చనే ఆలోచన రాగానే నా మైండ్ బ్లాంకై పోయింది. అయిదు నిముషాలు అచేతనుడయ్యాను.
తిరిగి ఆ ఉత్తరాన్ని అత్యంత నేర్పుగా అతికించి ఉషకు అందించాను.
“సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక కలిసి వెళ్ళు క్రాంతి.. జాబు రాసిస్తాను” అంటూ తన కాటుక కళ్ళల్లో అందాలు ఒలికించింది ఉష. అందులో రహస్యము బట్టబయలు చేయొద్దు సుమా! అనే హెచ్చరికా..గోచరించింది. నేను ‘రాముడు మంచి బాలుడు’ మాదిరిగా తలూపి వెనుదిరిగి చూడకుండా వేగంగా ఇంటికి వచ్చాను. త్వర, త్వరగా తయారై పాఠశాలకు పరుగులాంటి నడక అందుకున్నాను.
పంతుళ్ళు చెప్పే పాఠాలు తలకెక్కడం లేదు. అన్నయ్య రాసిన ప్రేమలేఖ నా కళ్ళల్లో కదలాడుతూ.. నన్ను పరధ్యానంలో ముంచింది.. నాకు లాంగ్ బెల్ తప్ప మరేమీ వినిపించ లేదు.
నేరుగా ఉష ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఉష ఒక్కర్తే ఉంటుందని తెలుసు. ఆమె ఇదే సంవత్సరం ఇంటర్ మీడియట్ పూర్తవగానే చదువుకు ఇంతే సంగతులని చెప్పింది. పెళ్లి సంబంధాల వేటలో ఉష అన్నయ్య ఊరెళ్ళాడు. ఉష తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళి సందె వేళలో గాని తిరిగిరారు.
ప్రేమలేఖతో ఛార్జ్ అయిన ఉష మోములో.. ఎక్కడలేని హుషారుతనమంతా కనబడింది. ప్రేమ లేఖకు జవాబు ప్రేమలేఖనే అన్నట్టు నాచేతిలో పెట్టి జాగరూకతలు చెప్పింది. నేను గంగిరెద్దులా తలూపి బయటపడ్డాను.
హోంవర్క్ చేసుకుంటాననే నెపంతో నా గది లోకి వెళ్లాను. తలుపు గడియ బిగించుకుని ఉష రాసిన ఉత్తరం జాగ్రత్తగా విప్పి చదివాను. కొన్ని అక్షర దోషాలు తప్ప తన భావాన్ని బాగానే వ్యక్తపర్చింది. ఇద్దరి ఉత్తరాలలో కనబడేది.. ఒకే దూల. ‘రగులుతోంది మొగలి పొద.. గుబులుగుంది కన్నె ఎద.. కాటేస్తావో..! మాటేస్తావో..!! ‘.
ఉత్తరం యధాప్రకారం అతికించి అన్నయ్య ఆఫీసునుండి రాగానే అందజేశాను. అన్నయ్య ఆకాశమెత్తు ఎగిరాడు.
నేనూ అన్నయ్యలా ప్రేమలేఖ రాసి.. ఉష లేఖలా జవాబు పొందాలని ఉద్వేగానికి లోనయ్యాను. ‘కులం చెడ్డా సుఖం దక్కాలి’ అన్నట్టు ఆ రాసేదేందో అందమైన అమ్మాయికి రాయాలని నిర్ణయించుకున్నాను. తళుక్కున మెరిసింది మణిమాల నామదిలో. ఆమె నా క్లాస్ మేట్. నిజంగా మాణిక్యమే.. చూసిన కొద్దీ చూడాలనే రూపం. క్లాసులో అంతా మణి అని పిలుస్తాం. తరగతి గదిలో ప్రక్క, ప్రక్కగా అమర్చిన ముందు బెంచీలలో కూర్చుంటాం. ఎలా? ఎక్కడ మణిమాలకు ఉత్తరం అందజేయాలో రచించుకునే ప్రణాళికలు... ఆ రాత్రంతా నిద్ర రాకుండా చేశాయి. తెల్లవారు ఝామున్నే లేచి భగవన్నామ స్మరణంలా, మణిమాల నామస్మరణం చేస్తూ .. మొదటిసారిగా ప్రేమలేఖ రాశాను. పదే, పదే పది సార్లు చదివి సరి చూసుకున్నాను.
మా పాఠశాల ప్రార్థన సమయంలో అమ్మాయిలంతా హాజరుగాక పోవడం పరిపాటి. అప్పటివరకు అంతా స్కూల్ వెనుకాల చిన్న గేటు వద్ద గుంపుగా నిలబడి ఉంటారు. ప్రార్థన, ప్రతిజ్ఞ అనంతరం నేరుగా వారి, వారి తరగతి గదుల్లోకి వెళ్తారు. ప్రతిజ్ఞ చేయించడం.. నా నిత్యకృత్యం.
ఆ రోజు నేను కావాలని కాస్త ఆలస్యంగా బయలుదేరాను. అమ్మాయిల ముందుకు వెళ్ళి మణిమాలను ప్రక్కకు పిలిచాను.
“మణీ.. నా లెక్కల నోట్స్ అడిగావు కదా..” నోట్ బుక్ ను చేతికందిస్తూ.. నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినపడేలా.. “అందులో నా ఉత్తరం ఉంది. చదివి జవాబివ్వు” అని ఉన్న ఫళంగా మాయమయ్యాను.
ఆ మరునాడు మణిని జవాబు కోసం అర్థించాను. మణి మౌనమే సమాధానమయ్యింది. మరో రోజూ.. ప్రయత్నించి విఫలుడనయ్యాను. వనిత తాను వలచి రావాలేగానీ, ఇష్టం లేని వారిని కష్టపెట్టగూడదనుకుని.. ఆ విషయం వదిలేశాను
‘దొంగతనమైనా, రంకుతనమైనా ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పదు’. అన్నయ్య, ఉషల మీద మాకాలనీలో గుస, గుసలు బయలుదేరాయి. ఇన్నాళ్ళూ ఉష చదువు కోసమే ఇక్కడ మకాం పెట్టిన కుటుంబం.. గుట్టు బట్టబయలు గాక ముందే ఇల్లు ఖాళీ చేసి వారి స్వగ్రామానికి వెళ్ళిపోయారు.
ఆరాట పడే అన్నయ్య కళ్ళు, ఒళ్ళు మరో అమ్మాయి మీద వాలక ముందే.. వదినమ్మ పండంటి బిడ్డను ఎత్తుకుని ఇంట్లో అడుగు పెట్టింది. వాళ్ళ అమ్మగారు నెల రోజులుండి పాప సంరక్షణలో సాయం చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళి పోయింది.
ఆ రోజు ఆదివారం పాపను చూద్దామని అన్నయ్య ఇంటికి వెళ్ళాను. నన్ను చూడగానే..
“క్రాంతీ.. మీ అన్నయ్యకు బాగానే సాయం చేశావుగదా..!” అంది వదినమ్మ. నాగుండె గుభేలుమంది. ఎదలో నుండి దుఃఖం ఉప్పెనలా.. తన్నుకు వచ్చింది. అవును.. అన్నయ్యకు సాయం చేశాననుకున్నానే గానీ, వదినమ్మకు ద్రోహం చేస్తున్నాననే తలంపు రాలేదు నాకు. వదినమ్మ దేవత.. మాతృమూర్తితో సమానం. నన్ను తన స్వంత తమ్ముడిలా చూసుకుంటుంది. కళ్ళు అబద్దాలాడవు.. కన్నీళ్లు కార్చసాగాయి నిజమే నువ్వు ద్రోహివి అన్నట్టు. అవి గమనించి.. అన్నయ్య ఒక్క ఉదటున మా ముందు వాలాడు.
“శ్రావణీ.. ఇందులో తమ్ముని తప్పు ఏమాత్రమూ లేదు. అంతా నాతప్పే.. తప్పును నేనూ దాచుకోలేదు. డైరీలో ప్రతీ అక్షరం.. పొందు పర్చాను. నా అనుమతి లేకుండా డైరీ చదివావు. చదువుతావనీ తెలుసు. అయినా భార్యా భర్తల మధ్య ఎలాంటి రహస్యాలుండగూడదనే.. డైరీ దాచి పెట్టలేదు. ఇక ముందు తప్పు చేయను. తమ్ముణ్ణి ఏమీ అనకు. ప్లీజ్ ఈ ఒక్క సారికి క్షమించు” అంటూ అన్నయ్య రెండు చేతులూ జోడించాడు.
వదినమ్మ కళ్ళు కన్నీటి కడవలయ్యాయి. కాసేపు మామధ్య మౌనం ఆవహించింది.. పాప తొట్టెలో ప్రశాంతంగా నిద్రపోతోంది. ఎత్తుకుందామని వచ్చిన నేను.. కళ్ళు ఒత్తుకోవాల్సి వచ్చింది.. దీర్ఘంగా పాపనే చూడసాగాను. వదినమ్మ పెదవి విప్పడంతో తిరిగి తల దించుకున్నాను.
“క్రాంతీ అలా తల దించుకునే పనులు ఇకముందు ఎప్పుడూ చెయ్యగూడదు” అని నన్ను హెచ్చరించి, అన్నయ్య వైపు తిరిగింది. “శశాంక్.. అలాంటి పోస్ట్ మన్ పనులు పిల్లలతో చేయించగూడదు. అది వారి కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశముంది.. అదే నా బాధ”
వదినమ్మ మాట నా వీపు మీద కొరడాతో కొట్టినట్టయ్యింది.. అలాంటి పిచ్చి పనులు జన్మలో చెయ్యగూడదనుకున్నాను.
***
“చీకట్లో నడువద్దమ్మా..” అనే మాటతో తేరుకుని చటుక్కున నిల్చున్నాను.
నన్ను చూసి మ్రానపడి పోయింది మణిమాల.. చంకలో అమ్మాయి. చూడ చక్కగా ఉంది. అన్నీ మణిమాల పోలికలే..
“అ..! క్రాంతీ..!” అంటూ నోరు తెరిచింది. “హమ్మా.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ..!” అంటూ దీర్ఘం తీసింది.
“అవును మణీ.. చాలా కాలమయ్యింది. నేనంటే అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను. కాని నిన్ను చూసే అదృష్టమే నాకు కలుగ లేదు. పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్లి పోయావు. మళ్ళీ ఇదే ప్రథమంగా చూడ్డం. దూరంగా చూసి.. నిన్ను పోల్చుకోలేక పోయాను”
ఇద్దరిలో ఆనందభాష్పాలు దొర్లాయి. మణి కూతురు మా ఇద్దరి వంక మార్చి, మార్చి చూస్తోంది.
“మీ అమ్మాయి చాలా బాగుంది. ఎందరు?” అడిగాను.
అలా కూర్చుందాం.. అన్నట్టుగా గడ్డిలో కూర్చొని పాపను ఒళ్లోకి తీసుకుంది. నేను కాస్త ఎడంగా కూర్చున్నాను. బ్యాగు దగ్గరికి లాక్కుంటూ..
“బాబు తరువాత ఈ అమ్మాయి” అంది.
కుశల ప్రశ్నలు.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాం. నా మదిలో మణికి రాసిన ప్రేమలేఖ.. జవాబు కోసం తపిస్తూ.. గిల్లుతూనే ఉంది.
“మణీ.. ఏమీ అనుకోవద్దు ప్లీజ్.. ఒక మాట అడుగనా..” అన్నాను వేడుకోలుగా..
“నా ప్రేమలేఖకు జవాబివ్వలేదేం? అనే గదా” అంది ఠక్కున.
నేను అవాక్కయ్యాను. ఆమెకు గూడా ఇంకా నా ప్రేమలేఖ గుర్తుంది. నిజమే.. ఎవరికైనా మనం కీడు చేసిన.. మేలు చేసినా.. జీవితాంతం గుర్తుండి పోతుంది. నా మౌనం అర్థం చేసుకున్న మణి తిరిగి తనే మాట్లాడసాగింది,
“క్రాంతీ.. నువ్వు రాసిన ఉత్తరం చదివి జవాబివ్వకపోవడమే మంచిదనిపించింది. నువ్వు ఏదో క్షణికావేశంలో రాశావనుకున్నాను. సమాధానమివ్వకపోయినా నువ్వేమీ చెయ్యలేవని తెలుసు. ఒకవేళ ఎవరి ప్రోద్బలం వల్ల అయినా నువ్వు మరో అడుగు ముందుకు వేస్తే.. అప్పుడు నీ ప్రేమలేఖను మా అన్నయ్యలకు చూపిస్తానని అనుకున్నాను. ముందే చూపిస్తే.. నీ మీద మచ్చ పడుతుంది. నీది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే.. జీవితాంతం నేను కుమిలి కుమిలి ఏడ్చే దాన్ని.
క్లాసులో ఎప్పుడూ.. ఫస్ట్ వచ్చే వాడివి.. ఏడవ తరగతిలో మన జిల్లాలోనే ప్రథమ ర్యాంకు సాధించావు. ప్రతీ సంవత్సరం మెరిట్ స్కాలర్ షిప్ కైవసం చేసుకుంటున్నావు. ఇక స్కూల్ ఫైనల్లో రాష్ట్రంలో మంచి ర్యాంకు రావాలని మన ఉపాధ్యాయ బృందం కృషి చేస్తోంది. ఆ సమయంలో నీ భవిష్యత్తు గురించి ఆలోచించాను. అందుకే సమాధానమివ్వలేదు”
మణి విశాలహృదయం ముందు నేను మరుగుజ్జునై పోయాను. అప్రయత్నంగా నా చేతులు జోడించు కున్నాయి. తప్పులు జరగడం సహజం.. సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం. *