ఆమె ఒక పనసకాయ్ - గంగాధర్ వడ్లమన్నాటి

Aame oka panasakaay

ఆసుపత్రిలో లక్ష్మమ్మని కలిసిన ఆమె స్నేహితురాలు జగదాంబ, “లక్ష్మీ ఎలా ఉన్నావ్ , ఈ మధ్య మీ ఇంటికి రావడం కుదరలేదు సుమీ”.

“ఏం బాగులే, కోడలి చేతిలో జీవితం బ్లోక్ అయిపోయింది. పిల్లాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే, సరే అన్నాను. కానీ వాడి పెళ్లి , ఇలా నా పీకల మీదకి వస్తుందని ఊహించలేదు”.

“ఏవైందని ఇలా బాధ నటిస్తున్నావ్” అని నాలుక కరుచుకుని “అదే బాధ పడుతున్నావ్” అడిగింది జగదాంబ,తన ఒళ్ళో పెట్టుకున్న పనసకాయ్ సంచిని కింద పెడుతూ.

“ఏం చెప్పనూ.వాడికి పెళ్ళైన నాటి నుండీ, నాకు మంచి తిండి లేకుండా పోయింది.మా కోడలు, ఆమెకీ మా వాడికీ కలిపి, మంచి కూరలు చేసుకుతినడం, నాకు మాత్రం వేరేగా కొంచెం పప్పో ,ఆకుకూరో తగలబెట్టడం. మొన్నటి వరకూ మా ఇంట్లో బుస కొట్టిన నా పెత్తనం, ఇప్పుడు తుస్సయిపోయింది.నేను వంట చేస్తా అంటే కూడా వద్దనేసింది. మా వాడు ఏం తెచ్చినా మా కోడలు తీసుకుపోయి దాచేస్తోంది. ఇదివరలో మా వాడు, వాడి ఆఫీసులో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా నాతోనే చర్చించేవాడు .ఇప్పుడు మా కోడలితో చెప్తున్నాడో ఏమో కానీ, నా చెవిన ఓ ముక్క కూడా కక్కడం లేదు. ఇన్నాళ్ల నుండీ మేవుంటున్న మేడ మీద ఇల్లు ఖాళీ చేయించి, వాళ్ళ స్నేహితురాలి ఇల్లట .అందులో , కింద ఉన్న ఓ చిన్న పోర్షన్ లో దించింది. టీ.వీలో అవి చూడొద్ధు , ఇవి చూడొద్దు అంటూ ఆంక్షలు వేరు. అదంతా వదిలేయి, ఇప్పుడు నాతో పాటు ఆసుపత్రికి రామ్మా అంటే,నన్ను ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను అంటూ వెళ్లిపొయింది.అలా ఉంటారు ఈ కాలం కోడళ్ళు”.

“సరేలే అన్నీ వాటంతట అవే సర్ధుకుంటాయి .నువ్వు వాటిపై ఎక్కువ ధృష్టి పెట్టకు” అని ఆమె చెప్తుండగానే ,రిసెప్షనిస్ట్ వచ్చి “లక్ష్మమ్మ గారూ” అంటూ పిలిచింది.

వెంటనే లేచి “నేనేనమ్మా, వస్తున్నా” అంటూ డాక్టరమ్మ గారి గదిలోకి వెళ్లింది.

“ఆ లక్ష్మమ్మ గారూ, మీ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఈ మధ్య మీరేం చేసారో తెలీదు కానీ, అన్ని రిపోర్టులూ చాలా బాగా వచ్చాయి. హై షుగర్ ,బీపీ కంట్రోల్ లోకి వచ్చేసింది.మీ కాళ్ళ నెప్పులు కూడా తగ్గాయి అన్నారు. మునుపటి కంటే కొంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు.కాబట్టి ఇలానే ఇక మీదట కూడా మీ ఆరోగ్యం పై శ్రద్ద వహించండి మరి” .చెప్పింది డాక్టర్.

సరే అన్నట్టు తలూపి బయటకి వచ్చేసింది లక్ష్మమ్మ.

రిసెప్షన్ లో , జగదాంబ పక్కన కూర్చుంది.ఇంతలో కోడలు ఫోన్ చేసి , “అత్తయ్య వచ్చేస్తున్నా, ఓ రెండు నిమిషాలు” చెప్పిందామె.

“సరేనమ్మా” ఫోన్ పెట్టేసింది లక్ష్మమ్మ.

కొద్ది క్షణాలు ఆలోచనలో పడిన లక్ష్మమ్మని జగదాంబ కాస్త తడుతూ “ఏమైంది! డాక్టర్ ఏమన్నారు”.

“నా ఆరోగ్యం ఇలా ఉండటానికి కారణం మా కోడలే” జగదాంబ చెప్పిందామె.

“అలాగా ,పద నీతో పాటు మీ ఇంటికి వచ్చి, మీ కోడలిని ఓ మాట అడుగుతాను”. అందామె.

“నేనూ ఇలానే అపార్ధం చేసుకున్నాను జగదాంబ. కానీ మా కోడలు పనసకాయ్ లాంటిది. పైకి గరుకుగా, అలా కనిపించినా మనసు పంచదార.నేను ఉప్పూ, కారం ఎక్కువ తినకూడదని , నాకు తానే ప్రత్యేకంగా కూరలు వండుతోంది. నేను వంట చేస్తే , ఉప్పు, గట్రా వేసుకుంటానని , నన్ను వంట చేయవద్దంది.మా అబ్బాయి ఆఫీసు నుండి వచ్చేప్పుడు స్వీట్లు అవీ తెస్తే ,దాచేసేది. నేను చూస్తే తింటానని, మళ్ళీ నాకు షుగర్ పెరుగుతుందని ఆమె భయం.అనవసర విషయాలు, అవీ వింటే ఆందోళన పడతానని నాకు అన్ని విషయాలూ చెప్పలేదు. మేము మేడ పైన ఇంట్లో అద్దెకి ఉన్నప్పుడు , రోజుకి నేను ఒక్క సారైనా కిందకి దిగిపోయి మళ్ళీ ఇబ్బంది పడుతూ పైకి ఎక్కేదాన్ని. దాంతో నా మోకాళ్ళ నొప్పులు తగ్గేవే కాదు.దాంతో మా కోడలు, ఇలా కాదని ఏకంగా కింద పోర్షన్ ఇల్లు అద్దెకి తీసుకుంది.టీవీలో నేను వార్తలు అవీ ఎక్కువగా చూస్తే, బీపీ పెరగడం మనసు పాడవడం జరుగుతుందని భక్తి టీవి చూడమని చెప్పేది. ఇలా బిడ్డ నా గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, నేనే ఇన్ని రోజులూ గ్రహించలేక తనని అపార్ధం చేసుకున్నా జగదాంబ” .చెప్పింది కళ్ళు ఒత్తుకుంటూ.

బాధ పడకు. మీ కోడలు నీ ఆరోగ్యం కోసమే ఇదంతా చేసిందని అర్ధమైంది కదా. ఇక సమస్య లేదు అని ఆమె లక్ష్మమ్మతో అంటుండగానే “జగదాంబ గారూ” అని రిసెప్షనిస్ట్ పిలవడంతో, “ఇది నువ్ ఉంచుకో” అని పనసకాయ్ ఉన్న సంచిని లక్ష్మమ్మకి ఇచ్చి, డాక్టర్ గారి చాంబర్లోకి నడిచిందామె.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు