అది శ్రీపురం ఉన్నత పాఠశాల. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తారు. ఫలితంగా విద్యార్థులు చాలామంది బాగా చదువుతారు. ఒకరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఆ పాఠశాల తనిఖీకి వచ్చాడు. అన్ని తరగతులకూ వెళ్ళి విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎలా చదువుతున్నారో, వాళ్ళు నోట్సులు ఎలా రాస్తున్నారో పరిశీలించాడు. విద్యార్థుల సమస్యలను, పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల విద్యార్థులను అందరినీ మైదానంలో కూర్చోబెట్టారు డి. ఈ. ఓ. గారు. సబ్జెక్టు విషయాలు కాకుండా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను అడిగాడు. పొడుపు కథలను అడిగి పరిష్కరించమన్నాడు. తెలిసిన సామెతలను చెప్పమన్నాడు. తెలిసిన కథలను చెప్పమన్నారు. ఇంకా లోక జ్ఞానానికి సంబంధించిన చాలా విషయాలు అడిగాడు. కానీ విద్యార్థులు అన్నిటా చాలా వెనుకబడి ఉన్నారు. కానీ ఒక శ్రీవిద్య మాత్రం అన్నిటా చురుకుగా ఉన్నది. డి. ఈ. ఓ. గారు శ్రీవిద్యను పిలిచి, "నువ్వు ఇంత చురుకుగా ఉండడానికి కారణం చెప్పమ్మా!" అని అడిగాడు. చెప్పింది శ్రీవిద్య. డి. ఈ. ఓ. గారు మాట్లాడుతూ "నేటి పిల్లలు కేవలం సబ్జెక్టు పుస్తకాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. తీరిక సమయాన్ని సెల్ ఫోన్లు, టి. వి. లు, కంప్యూటర్లకే కేటాయిస్తున్నారు. అది మన భవిష్యత్తును దెబ్బ తీస్తుంది. కథల పుస్తకాలను, విజ్ఞాన గ్రంథాలను, మన తెలుగు భాషకు పుష్టిని ఇస్తున్న సామెతలను, పొడుపు కథలను, జాతీయాలను నేర్చుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళచే కూడా ఇవన్నిటినీ చెప్పించుకోండి. తెలివిని పెంచే ఆటలను కూడా ఆడండి. అప్పుడు మనకు మానసిక వికాసం కలుగుతుంది. నైతిక విలువలు అలవడుతాయి. మనం మంచి మార్గంలో పయనిస్తాం. శ్రీవిద్య ఇవన్నీ చేసింది కాబట్టే ఇంత చురుకుగా ఉంది." అన్నాడు. విద్యార్థులు అందరూ చప్పట్లు కొట్టారు. డి. ఇ. ఓ. శ్రీవిద్యకు రెండు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఈ డబ్బుతో ఏం చేస్తావు." అని అడిగాడు. మరిన్ని మంచి పుస్తకాలను కొని చదివేస్తా." అన్నది. అంతా చప్పట్లు కొట్టారు.