కఱ్ఱిసోము ,కూసుమంచిలోని ఎప్పుడూ చొంగ కారుస్తూ ఉమ్ములేస్తుండే, చొంగ కరీమ్ కొట్లో పని చేస్తున్నాడు. కరీమ్ నోట్లోంచి నిత్యం చొంగ కారుతూనే ఉంటుంది,అందుకే ఆ పేరు. అది పల్లెటూరు కావటాన, ఆ ఊళ్ళో కరీమ్ షాపే సూపర్ మార్కెట్ లాంటిది. ఐతే దుకాణానికి కావాల్సిన సరుకంతా ఖమ్మం నుండే తెచ్చి మారుబేరానికి అమ్ముతుంటాడు,కరీమ్. ఆరోజు కరీమ్ కఱ్ఱి సోమును పిలిచి "రేయ్! కఱ్ఱోడా! కొట్లో సరుకు నిండుకుంది. తీసుకురావాల. ఇదిగో! ! డబ్బులు! ఖమ్మంయెల్లి తేవాలి .గోనెసంచులు ఎత్తుకెల్లి ,సరుకంతా కొని అన్నీ లెక్కచూసుకుని,పెందరకాడ వచ్చేయ్! నేను మిల్లు కాడికి ఎడతండా!" అని కఱ్ఱి సోము కు పని పురమాయించి, చొంగ కారుస్తూ ఉమ్ము లేసుకుంటూ వెళ్ళిపోయాడు కరీమ్. కఱ్ఱిసోము, ఖమ్మం వచ్చాడు. సరుకంతా కొని, గోనెసంచులన్నీ,లెక్కపెడుతుండగా వెంకటాయపాలెం నుండి 'లాయరు పిట్ట' అదే షాప్ కి వచ్చాడుసరుకులు కొంటానికి. ప్రతీ విషయాన్నీ 'లా' పాయింట్లతో మాట్లాడుతూ ఉంటాడుఅతను. తానే తెలివైన వాడిననీ, ప్రపంచం లోని అన్ని విషయాలు మెుత్తం తనకే తెలిసినట్లూ "లా" పాయింట్లతో మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల అందరూ అతనికి నిక్ నేమ్ పెట్టేసారు. 'లాయర్ పిట్ట' అనే తప్ప అసలు పేరు మర్చిపోయారందరూ. ముఖం సింకిచాటంత చేసుకుని ,"ఏరా! పిట్టలాయరూ! నిన్ను సూడక చాన్నాళ్ళయిందిరా! " అన్నాడు కఱ్ఱి సోము "ఏరా! కఱ్ఱోడా! నేను కొన్న లగేజ్ అంతా ఈడనే పెట్టా! నువ్వూ పెట్టూ! అలా యెళ్ళి మాట్లాడుకుందాం!" అన్నాడు పిట్ట లాయరు కఱ్ఱోడికర్ధమైంది.మాట్లాడుకోటం అంటే ఏంటో. ఇద్దరూ ఇకిలించుకుంటూ కల్లుపాకలో దూరారు. పీకలదాకా తాగారూ, తూలారూ వాగారూ ! దొర్లారు, చీకటి పడుతుండగా తూలుకుంటూ ,ఎవరి లగేజ్ తో వాళ్ళు ఊరు చేరారు. చొంగ కరీమ్ ఖమ్మం నుండి , కఱ్ఱి సోము తెచ్చిన సరుకుల మూటలు విప్పి సరుకు లెక్కచూసుకుని సొల్లు నోటితో బూతులు లంకించుకున్నాడు. "కఱ్ఱి నా~~ ఏందిరా యిదీ! ఎండు సేపలు తెమ్మన్నానుగా!ఎండు సేపల మూటలు ఎయ్యిరా? మరి యియ్యేంటీ బూడిద సంచులేందిరా.? అందులోనూ అంట్లుతోమేబూడిదా! తాగుబోతు నాయాలా? ఏం చేసావురా? " తిట్ల ప్రవాహం సాగిపోతూనే ఉంది. /÷/÷/÷/ అవతల వెంకటాయపాలెంలో మడిబట్ట మంగతాయారమ్మ లాయర్ పిట్ట తెచ్చిన మూట విప్పటానికి సమాయత్తం అయింది. సంచిలోంచి ఏదో చెడు వాసన వస్తుంటే, "ఏదో వాసనా ఏంటో! "అనుకుంటూ . మూట ఊడదీసి ఎండు చేపల వాసనకి తట్టుకోలేక అవతలికి దూకి,వాంతిచేసుకునిమూర్ఛపోయి, మళ్ళీ తేరుకుని.. " ఏరా! పిట్టగా! నీ నోట్లో కాకిరెట్టెయ్యా! దొంగ సచ్చినోడా! నీ శ్రాద్ధం పెట్టా! నా మడినంతా మంటగలిపావుగదరా ఏదో పనిమీద ఖమ్మం వెడుతున్నావూ! అక్కడ అంట్లుతోముకోటానికి బస్తాడు బూడిద దొరికితే తేరా! అనడిగా నా బుధ్దితక్కువై ! మరి ఈ మూటలో ఎండు చేపలేమిట్రా ముదనష్టపోడా! ఇప్పుడు నేను ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఈ కంపు వదిలించుకోవాలిరా?! తాగుబోతుచచ్చినోడా? ఇప్పుడు నేనేం చేసేదిరా?! అయ్యయ్యో! నీ జిమ్మడిపోనూ!" తిట్లపురాణం కొనసాగిస్తూనే ఉంది. అటు కఱ్ఱి సోము కీ, ఇటు లాయర్ పిట్టకీ తాగుడు మైకం లో పొరబాటు ఎక్కడ జరిగిందో అర్ధంకాక తలపట్టుక్కూర్చున్నారు.