గ్రో అప్ - గంగాధర్ వడ్లమన్నాటి

Grow up

ఫోన్ రింగ్ అవడం చూసిన లలిత,ముఖం చిరాగ్గా పెట్టి “మధూ చూడు నీ ఫోన్ మొరుగుతోంది”.

“ఎవరూ” అడిగాడు మధు ల్యాప్టాప్ చూసుకుంటూ

“నీ మరదలు గారు .రోజు విడిచి రోజు మీతో మాట్లాడకపోతే తనకి అన్నం సహించదేమో.ఎప్పుడు చూసినా మీకు ఫోన్ చేస్తూ ఉంటుంది .ఎక్కడో డిల్లిలో ఉంది కాబట్టి సరిపోయింది కానీ, ఇక్కడ ఉండుంటే రోజూ వచ్చి మీతో బాతాకానీ పెట్టేదేమో. ఎంత మరీ సొంత అత్త కూతురైతే మాత్రం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చప్పుడు చేయాలా. పోనీ ఆమెకి బుద్ది లేదు సరే నీకైనా ఉండొద్దు. నేనొక దాన్ని ఇక్కడ అగోరించాననే విషయం మరిచిపోయారో ఏమో” నసుగుతూ చెప్పిందామె

ఆ మాటలు విన్న మధు , “ఏంటి లలితా నువ్వు! ఇలా కూడా ఆలోచిస్తావా.వినడానికే నాకు రోత పుడుతోంది. ఏ విషయమైనా నాతో చెపడం తన అలవాటు.ఒట్టి భోళా మనిషి.వాళ్ళాయన కూడా నాతో మాట్లాడుతూ ఉంటాడు తెలుసా”. చెప్పాడు

“భోళా మనిషో లేక మోళీ మనిషో నేను చూడవచ్చానా ఏవిటి.” అంటూ అక్కడి నుండి వెళ్లిపోయిందామె.తరువాత మధు బయటికి వెళ్లడంతో, తన అక్కకి ఫోన్ చేసింది లలిత, “చూడక్కా మీ మరిది, నన్ను వేపుకు తింటున్నాడు.”

“అందుకే చెప్పాను, అతనికి వేపుళ్ళు అలవాటు చేయకూ అని” చెప్పిందామె.

“హాస్యం కాదక్కా., అతని మరదలు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఈయన చక్కగా పళ్లికిలిస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. అంత కబుర్లు ఇద్దరి మధ్యా ఏముంటాయి చెప్పు సిగ్గులేకపోతే సరి”.

“నువ్ గోరంత విషయాలకి కొండంత ప్రాధాన్యత ఇచ్చి, అంతలా వింత ఆలోచనలు చేయకు.ఎందుకు ఊరికే ఇదై పోవడం.మధు దాచాలనుకుంటే వేరే పేరుతో ఆమె నెంబర్ సేవ్ చేసేవాడు. లేకుంటే తను ఆఫీస్ లో ఉండే పలానా టైమ్ లో మాత్రమే ఫోన్ చేయమని తన మరదలికి చెప్పేవాడు. అంతే కానీ ఇలా నీకు తెలిసేలా చేసి, నీ కంట్లో కావాలని ఎందుకు పడతాడు చెప్పు.అంటే ఇద్దరి మధ్యా కేవలం స్నేహం మాత్రమె ఉందని అర్ధం అవుతుంది కదా” .

“కానీ అక్కా”

“ముక్కు పగులుతుంది .ముందు నేను చెప్పేది చక్కగా విను . మొన్న ఇక్కడ నీ స్నేహితురాలి పెళ్లికని ఓసారి వచ్చావ్ ,ఓ జాబ్ ఇంటర్వ్యూకి అని మరోసారి వచ్చావ్.అలా వచ్చిన రెండు సార్లూ మా ఇంట్లో రెండ్రోజులు పాటు రెండు సార్లు ఉన్నావ్ . బావగారి ఇంట్లో ఎందుకూ అని ఓ మాట నిన్ను మధు అడగలేదు . జాబ్ ఇంటర్వ్యూకి అని ఇక్కడికి వచ్చినపుడు ,నీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ నీ కాలేజ్ మెట్ తో ఓ ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెట్టావ్. మధు దాని గురించి కూడా నిన్ను అడిగి ఉండడు.ఎందుకంటే అతనికి నీపై నమ్మకం .నువ్వు ఇలా అతన్ని నిలదీసినప్పుడు,అతను కూడా మీ బావగారింటికి వెళ్తున్నావ్ కదా అంటే ఏమంటావ్?. ఆ అబ్బాయి ఎవరు అతన్ని కలవడానికే ఇంటర్వ్యూ పేరుతో వెళ్ళావేమో అని ఓ మాటంటే ఏమైపోతావ్.కనుక, అతని సహనానికి సమాది కట్టే పనులు మానుకో.మొద్దులా కాక , యుద్ద ప్రాతిపదికన పెద్ద తరహా అలవరుచుకో. గ్రో అప్ మై డియర్” అని ఇంకా వాళ్ళక్క ఏదో చెబుతుండగానే “ఉంటానక్కా” అంటూ ఫోన్ పెట్టేసింది.

మర్నాడు ఆఫీస్ నుండి వచ్చిన మధు, “నువ్ ఇలా అనుకుంటున్నావని, మా మరదలకి నేను ఈ మధ్య చాలా బిజీ అని మెసేజ్ పెట్టేసాను.కనుక ఇక ఫోన్ చేయక పోవచ్చు. నాకు ఫోన్ చేస్తే బిజీగా ఉంటున్నాను అని నువ్వే సున్నితంగా చెప్పేయి”. చెప్పాడు మధు.

“భలే వారే, అలా ఎందుకు చెప్పడం! .నాది సరే చిన్నపిల్లల మనస్తత్వం. మీరు కూడా అలానే హగ్గీస్ బేబీలా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి”. అంటూ మధు ఫోన్ తీసుకుని ,మధు మరదలికి ఫోన్ చేసి “హై స్రవంతి ఎలా ఉన్నారు.మీ బావగారు బిజీ అయిపోయారు .అందుకే నేనే గుర్తు చేసి మరీ మీతో మాట్లాడమని చెప్పాను” అంటూ నవ్వుతూ ఫోన్ అందించింది మధుకి .

చిన్న చిరునవ్వుతో అభినందనగా లలిత వంక చూస్తూ, ఫోన్ అందుకున్నాడు మధు

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు