దెబ్బ మీద దెబ్బ - శింగరాజు శ్రీనివాసరావు

Debba meeda debba

ఎంత ఆలోచించినా అప్పారావుకు మామ గారిని ఏమి అడగాలో అర్థం కావటం లేదు. పెళ్ళయిన తరువాత మొదటిసారిగా మామ గారింటికి పోతున్నాడు. ఇంట్లో వాళ్ళంతా గోల పెడుతున్నారు. కానీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నావు. కనీసం లాంఛనాలైనా సరిగా యివ్వలేదు. ఇప్పుడైనా అడిగి తగలడరా అని తల్లి సతపోరుతున్నది. 'సరేలేవే' అన్నాడే గానీ ఏమడగాలో పాలుపోవడం లేదు. పాపం సగటు మనిషి, కారు కొనివ్వమంటే ఎక్కడ తేగలడు. అదేమాట తల్లితో అన్నాడు. " అమ్మా మరీ సతాయించకే. పాపం ఆయన చేసేది ఉపాధ్యాయ వృత్తి. ఏ లోటు లేకుండా మనం అడిగినట్లు ఘనంగా పెళ్ళి చేశాడు. ఇప్పుడు మరల కారు, గీరు అని పోడు పెడితే, దీని బదులు కట్నమే పారేస్తే పోయేది కదా అనుకోడటే" " ఆయన సంగతి తరువాత నువ్వే తెగ బాధపడిపోతున్నావే మీ మామ గారి గురించి. ఏం పర్వాలేదు. ఒక్కగానొక్క కూతురు. ఏం తేరగా వస్తాడా బ్యాంకు ఆఫీసరు అల్లుడుగా. ఎలాగు మీకు బ్యాంకు వాళ్ళు పెట్రోలుకు డబ్బులు ఇస్తారన్నావు కదా. మనకు పైసా ఖర్చు లేకుండా కారులో హాయిగా తిరగవచ్చు" " అసలే బ్యాంకు నష్టాలలో నడుస్తున్నది. ఎప్పుడు ఏమవుతుందో, ఏ తోక ఎప్పుడు కత్తిరిస్తారో తెలియదే. అలాంటప్పుడు ఇది అవసరమా?" " మీ నాన్నలాగ అన్నీ అపశకునపు మాటలే. నోరు మూసుకుని చెప్పింది చెయ్" అని కసురుకుని వెళ్ళిపోయింది తల్లి. ******** అడిగిన వెంటనే కాదనలేక అప్పుచేసి మరీ కారు కొనిచ్చాడు మామగారు, పాపం ఒక్కగానొక్క అల్లుడిని బాధపెట్టడం ఇష్టంలేక. బ్యాంకు వారు ఇచ్చే ఇరవై లీటర్ల పెట్రోలు పోయించుకుని, అంతవరకే తిరుగుతూ కారు వచ్చినందుకు ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడసాగారడు. పార్కింగుకు స్థలం లేని చిన్న ఇల్లు కావడంతో ఇంటి ముందే పార్క్ చేసి, దాని మీద కవరు వేసి చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు కారుని. ******* " సార్. ఎవరిదండీ బయట వున్న కారు" అంటూ పొద్దున్నే వచ్చాడు ఒకతను. " నాదే. ఎందుకు" అడిగాడు అప్పారావు. " నేను కార్పొరేషను ఉద్యోగిని. మీరికనుంచి కారు గనుక ఇంటి ముందుపెడితే నెలకు నాలుగువేల రూపాయలు మాకు చెల్లించాలి. అడ్వాన్సు పదివేలు కట్టాలి. లేదంటే కారును ఎక్కడైనా పెట్టుకోండి. ఇదిగోండి నోటీసు. పదిరోజులలోగా మీ నిర్ణయాన్ని తెలియజేయండి" అని కాగితం ఇచ్చి వెళ్ళాడతను. " ఒరేయ్ నీకు ఫోను" అంటూ ఫోను చేతికిచ్చింది తల్లి " ఒరేయ్ నేనురా శీనుని. పేపరు చూశావా ఈరోజు. మన బ్యాంకు నష్టాలలో ఉందని, ఒక అయిదు సంవత్సరాల పాటు మన అలవెన్సులు అన్నింటిని నిలిపివేస్తున్నామని, అందుకు సిబ్బంది సహకరించాలని పత్రికలో వేశారు. దీనికి మన సంఘాలన్నీ ఆమోదం తెలిపాయట. ఇకనుంచి మనకు పెట్రోలు, పేపరు, టీ వగైరా అలవెన్సులన్నీ కట్" "ఆ" అని మాత్రం అనగలిగాడు అప్పారావు. ఆ తరువాత నోట మాట రాలేదు తగిలిన దెబ్బ మీద దెబ్బకి. " ఒరేయ్ సాయంత్రం అందరం కలిసి కారులో వినాయకుడి గుడికెళదాం. బ్యాంకు నుంచి తొందరగా రా" అని అరిచింది తల్లి లోపలినుంచి. " వినాయకుడి గుడికి కాదే శనీశ్వరుడి గుడి కెళదాం. మా మామ ప్రాణం తీయించి కారు కొనిపించావు గదే. ఆ ఉసురు ఊరికే పోలేదే. ఇప్పుడు చూడవే నా బ్రతుకు, 'నాడా దొరికిందని గుర్రాన్ని కొన్న' సామెతలా అయిందే. దాన్ని పోషించడం నావల్ల కాదు తీసుకెళ్ళి బ్యాంకు సెల్లారులో పడేస్తా. ఇక అది నా పాలిట తెల్లయేనుగే" అంటూ నెత్తిబాదుకున్నాడు అప్పారావు. గాయమైన కాలికే రాయి కొట్టుకోవడమంటే ఇదేనేమో..... ******* అయిపోయింది **********

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు