ఈ వీధిలో వెళుతున్న ప్రతి సారి తల పైకెత్తి చూసి అనుకునేదాన్ని.. "ఒక్కసారైనా లోపలకు వెళ్ళగలనా! దర్జాగా ఆర్డర్ ఇచ్చి బిర్యానీ తినగలనా "అని. మధ్యతరగతికి చెందిన నాకు అది కలగానే తీరని కోరికగా మిగిలిపోయింది.. గత నాలుగున్నర సంవత్సరాలుగా. కానీ ఈ రోజు లోపలకు అడుగు పెడుతున్నా నా కలను నిజం చేసుకుంటూ..! ఇదేచోట రోజువారీ కూలిగా పని చేసినా.. అవమానాలు అవహేళనలు అనుభవించినా. ఏదో ఒక రోజు లోపలకు అడుగు పెట్టాలనుకున్నా. నేడు నా కోరిక తీర్చుకుంటూ లోపలకు అడుగు పెడుతున్నా... "మేడమ్ మీరు తిరిగి వచ్చే వరకు ఉండమంటారా! వెళ్ళమంటారా!మీరు వచ్చేవరకు.....! కాస్త వెయిటింగ్ ఛార్జ్ ఇస్తే చాలు." అంటున్న ఆటో అతని మాటలు వింటుంటే నువ్వు వచ్చింది నాకు. ఇదే చోట రోజువారి కూలికి ఇటుకలు మోసినా! అప్పుడు" నా పేరు ఏయ్ పిల్లా "కాస్త వయ్యారం తగ్గించి పని మీద దృష్టి పెట్టు"అది మేస్త్రి పిలుపు. సంవత్సరం తరువాత ఇదే చోట గ్రౌండ్ ఫ్లోర్ లో టైల్స్ వేసా. అప్పుడు నా పేరు "ఇదిగో విజయా"కాస్త దగ్గరుండి చూసుకో! మా మేస్త్రి మాట. మరో సంవత్సరం తరువాత ఇదే చోట డెకరేషన్ కబోర్డ్స్తో తయారీకి నడుము వంచి పనిచెసా. అప్పుడు నాపేరు "ఇలాంటి పనులు విజ్జీకీ" పురమాయించండి,తను బాగా చూసుకో గలదు." ఇది మా కార్పెంటర్ కాంట్రాక్టర్ మాట. నేడు అదే చోట ఆటో దిగి లోపలకు వెళ్తుంటే ఆటో అతని పిలుపు "మేడమ్" ఎన్ని మార్పులు. నా ఉనికిని తెలిపేందుకు ఇన్ని పేర్లు.. గుర్తుచేసుకుంటూ నవ్వుకుంటూ లోపలకు అడుగు పెట్టా.. ఇంద్ర భవనం అనే మాట వినడమే కానీ,కనులారా చూడడం ఇదే మొదటి సారి. రంగురంగుల విద్యుత్ దీపాలు వెలుగులు.. నడిచే నెలపైన మెత్తని గ్రీన్ కలర్ తివాచీ.. మరో ప్రక్కన కూర్చునేందుకు కుషన్ సోఫా సెట్లు. శ్రావ్యంగా వినిపించే వెస్ట్రన్ మ్యూజిక్.. లోపలకు ఆహ్వానించే హోటల్ సిబ్బంది. వినయంగా నిలుచుని ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్స్. నేరుగా వాష్ రూమ్ లోపలకు వెళ్లి ప్రెష్ గా బయటకు వచ్చి ,ఓ కార్నర్ టేబుల్ చూసుకుని రిలాక్స్ గా కూర్చున్నా.. తెల్లని యూనిఫాంలో మెరిసిపోతూ,చిరు వధనంతో నా వైపు చూస్తూ... ఆర్డర్ ప్లీజ్ మేడమ్.. అంటూ మెనూ కార్డు నాకు అందించి ముందుకు వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే , ఓ దేశపు యువరాణికి సేవచేసేందుకు మేము సిద్దం అన్నట్లుగా ఉన్న సైన్యాధిపతి గుర్తుకుతెచ్చుకునేలా చేసాడు .. మెనూ కార్డులోని ఐటమ్స్ వెంట పరుగుతీస్తున్నాయి నా కన్నులు... సామాన్యుడు ఎప్పుడూ ఊహించని రేట్లు. దానికి తోడుగా సర్వీస్ ఛార్జ్,జీ యస్ టి.అధనం.. నా కోరికల లిస్ట్ నా ముందు ప్రత్యక్షమైంది. ఏమేమి ఆర్డర్ చేయాలో సెలెక్ట్ చేసి,మనసులో స్కాన్ చేసుకున్నాను. ***** ఆటో ఇంటి ముందు ఆగింది. చేతిలో ఉన్న కవర్స్ అమ్మకు అందించి కాళ్ళూ చేతులూ కడుకుని వచ్చి అమ్మను కుర్చోమని టేబుల్ పైన అన్నీ తనకోసం తెచ్చినవి అమర్చా. అమ్మ తింటున్న ప్రతి ముద్దు నాలోని ఆకలికోరికను తీర్చేసింది. తన కోసం తెచ్చిన మూడు కాటన్ చీరలు చూసి అమ్మ ఎంతగా మురిసిపోయిందో . అమ్మ కన్నుల్లో మెరుపు తెలియచేసింది. ఫైవ్ స్టార్ హోటల్లో బిర్యానీ తిన్నా ఇంత సంతోషం కలిగేది కాదేమో..నాకు. అక్కడ నాకు మాత్రమే సంతోషం మిగిలేది. ఇక్కడ అమ్మ మనసు నిండిపోయింది. అక్కడ నేను ఐస్ క్రీమ్ తో సరిపుచ్చుకున్నా! ఇక్కడ అమ్మకు సంవత్సరం వరకు మిగిలిపోయే జ్ఞాపకాన్ని అందించినందుకు నాకు కలిగిన తృప్తి వెలకట్టలేనిది.