“అమ్మాయ్ కనకం!అంట్లు తరువాత తోముకోవచ్చు.ఇటురా!"అని ఇంటి యజమాని వనజమ్మ పిలవటంతో 'వస్తున్నానమ్మగోరూ'అంటూ పెరట్లో నుంచి పరిగెత్తినట్టొచ్చింది కనకం చేతులు కడుక్కొని పమిటతో తుడుచుకొంటూ.
"ఇందా కాఫీ!అవునూ...నిన్న మన ప్రక్కింటి డాక్టరమ్మగారింట్లో గోలగోలగా కేకలు వినబడినై. ఏమిటి సంగతీ?"దీర్ఘం తీస్తూ అడిగింది యజమాని వనజమ్మ.
"అదా...వాళ్ళమ్మాయి కాలేజీలోఎవర్నో పేమించిందట.ఆ సంగతి తెలిసికొన్న డాక్టరు దంపతులు కూతుర్ని చడామడా తిట్టి చితకబాదరు అమ్మగోరూ!అదే గోల."కాఫీ తాగుతూ అంది.
"వాళ్ళు చేసింది కరక్టేనమ్మా!ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా వుండాలి.అన్నట్టు ఆ ఎదురింటి లాయరుగారికేమైంది పాపం! ఆంబులెన్సులో ఆసుపత్రికి తీసుకువెళ్ళి తలకు దట్టమైన కట్టు కట్టి మూడు రోజులు ఐ.సి.యూలో వుంచి తెచ్చారట!నువ్వు నాకు చెప్పనేలేదూ కనకం ?" బాధ పడుతున్నట్టు అడిగింది వనజమ్మ.
"అవునమ్మగోరూ!ఇంతకు వాళ్ళు ఈ మధ్యే పెళ్ళయిన కొత్తజంట.లాయరుగారేమో పొద్దాక ఆఫీసు, క్లయింటులంటూ అక్కడక్కడ తిరుగుతూ బాగా మందు తాగి రోజూ రాత్రి పన్నెండు దాటిన తరువాత ఇంటికొస్తారట. ఎంతైనా వయస్సు లో వున్న పిల్ల కదా...తనలో ఓర్పు కాస్తా నశించి పేడుతో భర్త తలను పగలగొట్టింది" చెప్పి వ్యంగ్యంగా నవ్వింది కనకం.
"కరక్టు.అతనికి అలాగే కావాలి కనకం.కాకపోతే.దారిన కనబడ్డ ఆడదాన్నల్లా చతురులాడు తుంటాడు. వాడెవడో అన్నట్టు పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వెధవకు పరాయోడి పెళ్ళాం మీద మోజంట.నన్ను కూడా వాడు అదోలా చూస్తాడే!మంచి పనే చేసింది.అన్నట్టు అనసూయమ్మ గారింటికి పోలీసు వ్యానొచ్చి వెళుతుంటే చూశాను.ఎందుకో!"అడిగింది వనజమ్మ. "అదా!ఆళ్ళింట్లో దొంగలు పడి బోలెడు క్యాష్ ,బంగారాన్ని దొంగిలించుకు పోయారటమ్మా పాపం!" సానుభూతి ధోరణితో అంది కనకం.
"పాపమంటావేంటి?ఆడికి తిక్కకుదిరింది.లేకపోతే ఫైనాన్సు కంపెనీ పెట్టి కోట్లు సంపాయించి ఓ రోజు బోర్డు తిప్పేశాడు కక్కుర్తి వెధవ.ఆడి కంపెనీలో ఫైనాన్సు చేసిన జనాల పాపం వూరికే పోదుగా!సరే...వెళ్ళి పని చూసుకో"అంది నిత్యం ఇతరుల విషయాలు పనిమనిషి చెపుతుంటే ఆసక్తిగా చెవులు రిక్కించుకొని వినే వనజమ్మ.
"మొత్తానికి అమ్మగోరూ!నా చేత ఇంటి పని,ఇన్ఫ్మార్ పనని రెండు పనులు చేయించుకొంటు న్న మీరు నాకు రెండు జీతాలివ్వాలి.ఆఁ. "అని నవ్వుకొంటూ కిచ్చన్లోకి వెళ్ళిపోయింది కనకం.
మరుసటి రోజు పది గంటల సమయాన ప్రక్క వీధిలో వుంటున్న వనజమ్మ ఫ్రెండు పద్మజ పరుగు పరుగున వచ్చింది.
"రావే పద్మాజా!అలా ఎగ స్వాసతో చాలా దూరం నడుచుకొంటూ రాకపోతే ఆటోలో రావొచ్చు గా...ఏమిటి సంగతి?" వ్యంగ్యంగా అడిగింది వనజమ్మ.
"నిన్ను ఓ చిన్న సందేహాన్నడిగి నివృత్తి చేసుకొని వెళ్ళాలని వచ్చానే!అవునూ...మీ ఆయన ఆఫీసులో పాతికవేలకు చెయ్య చాచి సంబంధిత అధికారులకు దొరికిపోయారటగా!నాకు నిన్నే తెలిసింది . అది నిజమా?" అడిగింది పద్మజా.
" నిజమేనమ్మా! గుట్టు రట్టు కాకుండా ఆ చేత్తోనే వాళ్ళకో లక్ష కొట్టి తప్పించుకున్నాడు ."
"పోనీలే! పరువుతో కూడిన విషయం.మీ ఆయన్నుజాగ్రత్తగా వుండమను.మన చుట్టూ బోలెడు మంది ఇన్ఫార్మరులున్నారే పిచ్చి మొహమా!నేనొస్తాను"అంటూ వెళ్ళిపోయింది పద్మజ .
అప్పుడు 'తప్పే!అవతలి వాళ్ళ విషయాలను ఆసక్తితో తెలుసుకోవాలనుకునే నేను నా ఇంటి గుట్టు రట్టవుతుందని ఇప్పుడు తెలుసుకున్నాను.ఇంతటికి కారణం పనిమనిషి కనకమే! అవును. తను ఇతరుల గుట్టును నాకు చెపుతున్ననప్పుడు నా ఇంటి గుట్టు వాళ్ళకు చేరవేయకుండా వుంటుందా!అందుకే ఇకపై ఇతరుల సంగతులు కనకాన్ని అడగను.తను చెప్పినా వినను' అని మనసులో అనుకొంటూ పడగ్గదిలోకి వెళ్ళిపోయింది వనజమ్మ.
©©©©© ©©©©© ©©©©©