హిమగిరిరాజ్యానికి రాజైన శాంతిసేనుడు మరణించాడు.ఆయన కుమారుడు విశ్వసేనుడు రాజయ్యాడు. విశ్వసేనుడికి రాజయిన ఆరునెలలకే రాజ్యవిస్తరణ కాంక్ష మొదలయింది.తనరాజ్యం చుట్టూ ఉన్న చిన్నచిన్న దేశాలను జయించి చక్రవర్తి కావాలనే కోరిక ఏర్పడింది. ఒకరోజు మంత్రి హిమవంతుడిని సైన్యాధిపతిని సమావేశపరిచి తన కోరికను చెప్పాడు.రాజుకోరికవిని మంత్రి "ప్రభూ!మీతండ్రిగారు ఇప్పటివరకూ ఎవరిపైకీ యుద్దానికి వెళ్లలేదు. రాజ్యరక్షణకు సైన్యాన్ని సిద్దంగా ఉంచేవారు. హింసతో కూడిన యుద్దం వారికిష్టముండేది కాదు. ధన,ప్రాణ నష్టాన్ని కల్గించే మీ కోరికను విడిచిపెట్టండి"అని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. "మాతండ్రిగారు నాకిచ్చిన రాజ్యం, అధికారం నాకు సంతృప్తిని కల్గించడంలేదు. రాజ్యాలను జయించి చక్రవర్తిని కావాలి. వెంటనే యుద్దానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి"అని ఆజ్ఞాపించాడు. చల్లని సాయంకాలం యుద్దసన్నాహాలను పర్యవేక్షిస్తున్న విశ్వసేనుడికి మంత్రి ఒకపత్రం ఇచ్చాడు. "మహారాజా!మీతండ్రి మరణానికి ముందు మీకివ్వమని ఇచ్చారు. ఇన్నిదినాలూ గుర్తులేక మీకివ్వలేదు. ఇందులోని అంశాన్ని రాత్రి నిద్రించడానికి ముందు వందసార్లు చదవాలని మీతండ్రిగారు చెప్పమన్నారు. ఇది ఆయన కోరిక.ఆయన కోరిక తీర్చండి" అని చెప్పాడుమంత్రి. ఆరాత్రి నిద్రించేముందు పత్రంలోని అంశాన్ని వందసార్లు చదివి నిద్రపోయాడు రాజు. ఆయన పదేపదే చదివిన పత్రంలోని అంశం కలగా వచ్చింది. అది భయంకరమైన అడవి. ఆఅడవిలో చెట్లమధ్య ఒక పురాతనమైన శివాలయం ఉంది.ఒక పక్షి ఎగురుతూ వచ్చి ఆలయంలోని శివలింగం ముందు వాలి ఈశ్వరుడిని ప్రార్థించసాగింది. "ఈశ్వరా!నాకు పక్షులకు రాజును కావాలనుంది. అన్నిపక్షుల్లాగే వున్న నాకు గుర్తింపురావడానికి ప్రత్యేకంగా బంగారు రెక్కలు ప్రసాదించండి." అని శివుడిని కోరింది.పదేపదే పక్షి ప్రార్థిస్తూ ఉంది. అప్పుడు శివలింగంనుండి మాటలు వినిపించాయి."సృష్టిధర్మాన్ని కాదని అత్యాశకు పోయి బంగారురెక్కలు కోరుకుంటున్నావు.నామాటవిని ఈకోరికను విడిచిపెట్టు"అన్నాడు ఈశ్వరుడు. అయినా పక్షి వినలేదు. మొండిగా ప్రార్థించసాగింది. "తథాస్తు"అని బంగారురెక్కలు ప్రసాదించా డుఈశ్వరుడు. బంగారురెక్కలను చూసుకుని మురిసిపోయింది పక్షి. ఏపక్షికీ ఇటువంటి రెక్కలు లేవు. కావున పక్షులన్నీ తన ప్రత్యేకతను గుర్తిస్తాయి.భగవంతుడు వాటికి రాజుగా ఉండమని నన్ను పంపాడని చెబితే తనను రాజుగా గౌరవించడం జరుగుతుందని పక్షి ఆశించింది. బంగారురెక్కలను చూసుకుని మురిసిపోతూ ఆలయంనుండి బయటకు వచ్చింది.దారిన వెళ్తున్న కొందరు వ్యక్తులు వెంబడించారు.బంగారురెక్కలతో వేగంగా ఎగురలేని పక్షిని పట్టుకుని రెక్కలను నరికి తీసుకెళ్లారు."ఈశ్వరా!నీవు ప్రసాదించిన జీవితంతో తృప్తిచెందక దురాశతో బంగారురెక్కలను ఆశించాను. బంగారురెక్కలతో ఎగరాలని, పక్షులకు రాజును కావాలని అత్యాశపడ్డాను. ఆకోరికవల్ల వచ్చే నష్టాన్ని, కష్టాన్ని తెలుసుకోలేకపోయాను"అని పక్షి విలపించసాగింది.పక్షి ఏడ్పుతో విశ్వసేనుడి కల చెదిరిపోయింది. పాన్పుపై నుండి లేచాడు.ఉదయమే మంత్రికి తనకలను వివరించి "మాతండ్రి పత్రంలో వ్రాసిన అంశం వందసార్లు చదివి నిద్రించడంవల్ల కలగా వచ్చింది.ఈకల అర్థమేమిటో వివరించగలరా?"అని అడిగాడు. "ప్రభూ!శాంతి, అహింస అనే రెక్కలతో మీతండ్రి రాజ్యాన్ని పాలించాడు. చక్రవర్తికావాలనే రాజ్యకాంక్ష, హింసతో కూడిన యుద్దం అనేవి బంగారురెక్కల్లాంటివి. ఆబంగారురెక్కలతో పైకి ఎగిరి చక్రవర్తి కావాలనుకోవడం ప్రమాదం.ఈస్వప్నానికి అర్థం ఇదే.మీనాన్న లేఖలోని సారాంశం కూడా ఇదే" అని వివరించాడు హిమవంతుడు. "అశాశ్వతమైన పదవీకాంక్ష, యుద్దం అనే బంగారురెక్కలను నేను కోరుకోను. నాతండ్రి నాకు ఇచ్చిన శాంతి, అహింస అనే రెక్కలతో మంచిగా జీవిస్తాను. యుద్దం ఏర్పాట్లను ఆపండి" అన్నాడు విశ్వసేనుడు. రాజులో వచ్చిన మార్పుకు మంత్రి సంతోషించాడు.శాంతిసేనుడి ముందుచూపును మనసులో ప్రశంసించారు మంత్రి,సైన్యాధిపతి.