మధు ఆనందానికి హద్దులు లేవు.ఇదివరకటి ఆఫీసులో, తనతో పాటు కలిసి పనిచేసిన స్రవంతి ఈరోజు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. అంతే, వెంటనే యాక్సెప్ట్ చేసి తనలో తానే మురిసిపోతూ కొంచెం సిగ్గుపడిపోయాడు .
ఆ తరువాత, నెమ్మదిగా ఆమెతో స్నేహం మొదలు పెట్టాడు.తర్వాత దానిని ముదరబెట్టాడు.హోటళ్ళలో రాత్రి మిగిలిన అన్నం పొద్దున్నకి పులిహోరగా మారినట్టు, వారి ముదిరిన స్నేహం ఆనక ప్రేమగా మారింది.
కొద్ది రోజులకి ఆమెతో పూర్తిగా ప్రేమలో మునిగిపోయాడు.తరువాత ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. దాంతో ఇది కలొ,నిజమో తెలియక తన చేతి మీద గిల్లుకుని చూసుకున్నాడు.తర్వాత ఆమె ఫోన్ లో ముద్దు పెట్టింది, మళ్ళీ గిల్లుకున్నాడు.తర్వాత ఆమె అతన్ని బేబీ అంటూ పిలవడం మొదలుపెట్టింది, మళ్ళీ గిల్లుకున్నాడు.ఇలా గిల్లుకునీ ,గిల్లుకునీ చేయి మొత్తం పుండు చేసుకున్నాడు.దాంతో అలెర్జీ రావడంతో డాక్టర్ ని కలిసి మందులు వాడాడు .
ఆమె ఇలా ఎండాకాలంలో వర్షంలా, హఠాత్తుగా తన జీవితంలోకి రావడం మధుకి ఎంతో సంతోషాన్ని కలిగించింది.ఇద్దరూ పలానా రోజు పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారు . తర్వాత, అనుకోకుండా ఓ రోజు తనతో పాటే పాత ఆఫీసులో పనిచేసిన గిరి ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చాడు. మధు “తప్పకుండా వస్తా” అని కార్డ్ అందుకుని తెరిచి, అందులో ఫోటోలు చూసి బిత్తర పోయాడు.తర్వాత “ఒన్ మినిట్” అని లోనికి వెళ్ళి జుట్టు పీక్కున్నాడు.తను జుట్టు పీక్కున్న సంగతి తెలియకుండా, దువ్వెనతో క్రాఫ్ దువ్వుకుని వచ్చి గిరి ముందు కూర్చుని “ఏవిటీ నువ్వు చేసుకుంటోంది స్రవంతినా”.అడిగాడు అసహనంగా
“అవును ఏం”!
“ఆమె నన్ను ప్రేమిస్తోంది.బహుశా వాళ్ళ పెద్ద వాళ్ళు ఆమెని బలవంతంగా నీతో పెళ్ళికి ఒప్పించి ఉంటారు” చెప్పాడు మధు
“అలా ఏం కాదు.ఆఫీస్ మారిపోయినా, నేను తనూ ఈ మధ్య ఫేస్ బుక్ లో కలిసి ప్రేమించుకున్నాం.ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది నిశ్చిత్తార్ధం రోజు కూడా బానే మాట్లాడుకున్నాం .చివరికి ఇలా పెళ్లి చేసుకోబోతున్నాం”. చెప్పాడు గిరి
“అలాగా, అయితే నాకూ అచ్చం ఇలానే జరిగింది.ఇది చూడు” అంటూ ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఆమె పెట్టిన మెసేజ్ లూ ఫోటోలూ చూపించాడు.ఆమె ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కూడా ఓపెన్ చేసి చూపించే సరికి గిరికి తల తిరిగింది .దాంతో గిరి, “ఒక్క నిమిషం” అని బాత్రూo లోకి వెళ్ళి “వ్వా, దేవుడా, ఇది నిజం కాకుండా చూడు.లేదంటే నా కొంప కొల్లేరైపోద్ది ” అని వెక్కి వెక్కి ఏడ్చాడు. తర్వాత సబ్బుతో మొహం కడుక్కుని ,కర్చీఫ్ తో తుడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు.తర్వాత కొద్ది సేపటికి, స్రవంతికి ఫోన్ చేసి, “ఏంటి స్రవంతి ఇది? ఫేస్బుక్ లో మన మధుకి మెసేజ్ ఏమైనా పెట్టావా” అడిగాడు గంభీరంగా.
“మధు ఎవరు”! అడిగిందామె
“అదే మన పాత ఆఫీస్ లో కొలీగ్” .
“అవునా?అయినా అతనికెందుకు మెసేజ్ పెడతానూ” అడిగింది స్రవంతి అయోమయంగా.
“అయితే ఉండు” అని కొన్ని స్క్రీన్ షాట్స్ మరియి ఆ వాట్సాప్ నెంబర్ తనకి పంపాడు గిరి.
అవి చూసిన లలిత, “అది నా ఫేస్ బుక్ కాదు, ఫేక్ అక్కౌంట్ .ఆ నెంబర్ కూడా నాది కాదు. నా ప్రొఫైల్ పిక్ పెట్టి సేవ్ చేసినట్టు అనిపిస్తోంది నాకు .అయినా ఇది వరకే నేను నా ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పెట్టాను . నా పేరుతో ఎవరైనా రిక్వెస్ట్ పంపినా, డబ్బు అడిగినా ఇవ్వొద్దు అని.అది మధు చూసి ఉండడు. నువ్ పంపిన స్క్రీన్ షాట్స్ ని బట్టి చూస్తే ,ప్రేమ వల వేసి డబ్బు గుంజేలా కనిపిస్తోంది వ్యవహారం .ముందు ఏమైనా డబ్బులు ఇచ్చాడేమో అడుగు” అంది స్రవంతి కాస్త కంగారుగా .
“మధు అంత తెలివి తక్కువ వాడు కాదు.అలాంటి డబ్బులేo ఇవ్వలేదట” చెప్పి ఫోన్ పెట్టేసి, “ఏదో బావుండదని స్రవంతికి అలా చెప్పాను .నిజం చెప్పు, ఆ ఫేక్ అకౌంట్ మాయలో పడి డబ్బులేo ఇవ్వలేదు కదా” అడిగాడు గిరి.
“నిన్ననే వాళ్ళ నాన్నకి కరోనా అని ఆ కరోడా నా దగ్గర నుండి పది వేలు నొక్కెసిందిరా” చెప్పాడు నీరసంగా.
“అలాగా?అయినా ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా డబ్బులు లాంటివి అడిగితే ,ఒకటికి నాలుగు సార్లు నిర్ధారించుకోవాలి.అనుమానం ఉంటే డబ్బులు అస్సలు ఇవ్వకూడదు. అలాగే అమ్మాయిల పేరుతో రిక్వెస్ట్ వచ్చింది కదా అని, పొలో అని ఏక్సెప్ట్ చేయకూడదు” అని గిరి చెప్తుండగానే, తల తిరగడంతో “ఒన్ మినిట్” అంటూ మళ్ళీ ఓ సారి లోనికెళ్ళాడు మధు.