అగ్రహారం గ్రామంలో సీతారామయ్య గారి పెరటి దొడ్డి విశాలంగా వివిధ ఫలవృక్షాలు , కాయగూరలు, పూల మొక్కలతో కళకళ లాడుతుంటుంది మధ్యలో పెద్ద మంచినీటి నుయ్యి నీళ్లతో నిండుగా కనబడు తుంది. రకరకాల పక్షులు వచ్చి చెట్ల మీద గూళ్ళు కట్టుకుని అరుపులతో సందడి చేస్తూంటాయి. తేనెటీగలు చెట్ల కొమ్మలకు పట్లు కట్టి ముసురుతు ఝాంకార నాథాలు కలగచేస్తాయి. సీజన్లో సీతాకోకచిలుకలు రంగులతో ఎగురుతు అలరిస్తాయి. రామచిలుకలు, కాకులు ,కోయిలలు , మైనగోరింకలు , కొంగలు ఇలా అనేక పక్షుల అరుపులతో వాతావరణం ఆహ్లాదకరం ఉంటుంది. నూతి తియ్యటి నీళ్లు కాలువల ద్వారా పూల మొక్కలు, కూరపాదులకు పుష్కలంగా అందుతున్నందున పచ్చగా పూలతో కాయగూరలతో నిండుగా కనబడుతుంటాయి. కోరడి గట్టంట నూతి వద్ద కొన్ని బంగారుతీగ చెరుకు గడలపొద ఉంటే దగ్గరలో పచ్చి మిర్చి మొక్కలు, టమాటా, బెండ , వంగ , పొట్ల , దొండ పాదులు ఒకపక్క ఉంటే కొద్ది దూరంలో తియ్య గుమ్మడి పాదు కాయలతో ఉంది. మరోవైపు ఏపుగా ఎదిగిన కరివేపాకు చెట్టు, పక్కన అరటి బోదెలు , అలాగే పెద్ద మట్టలతో కొబ్బరి మొక్కలు విస్తరించి ఉన్నాయి. కోరడి మరోవైపు వెలగచెట్టు, ములగ ,జామ, నేరేడు మామిడి, చింత చెట్లు కొమ్మలతో విస్తరించి ఉన్నాయి. ఏ సీజన్లో ఆ చెట్లు , పూలమొక్కలు, పాదులు , ఫలవృక్షాలు కాయగూరలతో కళకళలాడుతుంటాయి.అందువల్ల పక్షుల సంచారంతో కిలకిలారావాలతో సందడిగా కనబడుతుంది ఇంటి యజమాని సీతారామయ్య గారి పెరటి దొడ్డి వాతావరణం. ఒకరోజు మధ్యాహ్నం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పండుకోతి దొడ్లో ప్రవేసించి దాహం ఆకలితో ఉన్నందున తిండి కోసం వెతుకులాడుతోంది. " కోతి బావా , నా దగ్గరకు రా- అంటే నా దగ్గరకు వచ్చి నీఆకలి తీర్చుకో " అని స్వాగతం పలికాయి. ఆ దొడ్లోని చల్లని పచ్చటి చెట్ల మొక్కల ఆదరణకు పరవసించి పోయింది వానరం. రకరకాల పక్షులకు నివాసం , తేనేటీగల సందడి చూసి ఆ ఇంటి యజమానికి పర్యావరణం ప్రకృతి పట్ల ఆదరణకు ఆనందపడింది. ఇలా మనుషులందరు ప్రకృతిని కాపాడితే మాలాంటి జంతు జాలానికి తిండి కొరత ఉండదనుకుంది. ఆకలితో పాటు దాహంగా ఉన్నందున ముందు నీళ్లు తాగి తర్వాత ఆకలి తీర్చుకోవాలని నూతి దగ్గరకెళ్లింది కోతి. నూతి నిండా నీళ్లున్నాయి కాని తాగడానికి ఏదీ సాధనం దొరక్క గట్టు చుట్టు తిరుగుతుంటే దగ్గర కాలువ ఒడ్డున ఉన్న బంగారుతీగ చెరకుగడలు " కోతి మావా , మా చెరకుగడలు తిని రసం తాగి దాహం తీర్చుకో" అన్నాయి ఆప్యాయంగా. వాటి ఆదరకు ఆనందించి ముదురుగా ఉన్న చెరకుగడ విరిచి ముక్కను పళ్లతో నమిలి రసం మింగుతోంది. ఇంతలో పక్క నున్న చెరకు గడ "ఎలాగుంది రసం మావా?" అని అడిగింది. " అమృతంలా తియ్యగా ఉందని" చెప్పింది చెరకు గడ నములుతు కోతి. " మరేమనుకుంటున్నావ్! చెరకు రసమంటే అమృతం లాంటి తీపి ఉంటుంది. మా చెరకు రసంతో మనుషులు బెల్లం , పంచదార చేసుకుంటారు. మా తీపిలేందే ఏ పిండి వంటకు రుచి రాదు. ఇక్కడున్న మొక్కలు చెట్లన్నిటిలో మేమే గ్రేట్! తీపిలేందే మనుషులకు మనుగడ లేదు. మా మొవ్వు ఆకులు ప్రీతిగా తిని పసువులు పాలు ఎక్కువ ఇస్తాయి" అని దర్పం కనబర్చింది చెరకుగడ. ఆ మాటలు విన్న మిగతా ఫలవృక్షాలకు కూర పాదులకు అసూయ కలిగింది. పక్కనున్న అరటిమొక్క" ఊరుకోవమ్మా! నువ్వే కాదు, మేమూ మనుషులకు ఉపయోగ పడుతున్నాం. మా అరటి పళ్లు తియ్యగా పూజలకు , ఆకులు అన్నంతినడానికి , కాయలు దవ్వ పువ్వులు కూరలకు ఉపయోగ పడతాయంది." వెంటనే కొబ్బరి మొక్క' మా కొబ్బరికాయలు గుళ్లలో అభిషేకాలకు , ఇళ్లల్లో కూరలు చెట్నీలు , పాయసంలోను అలాగే బోండాలు వేసంగిలో దాహం తీరుస్తాయి.పేషెంట్లకు ఔషధంగాను ఎండిన కొబ్బరి పీచుతో రకరకాల అలంకరణ వస్తువులు , పచ్చి మట్టలు కల్యాణ మండపాలకు , ఆకులు పిల్లల ఆటవస్తువులుగా ఉపయోగిస్తారంది.' కొద్ది దూరంలో ఉన్న వెలగచెట్టు అందుకుని మాది అరుదైన వృక్షమని, పండిన వెలగపండు మంచి వాసనతో పెరుగు పచ్చడి కోసం మా యజమాని ఎదురు చూస్తారంటే, అక్కడే ఉన్న ములగచెట్టు "ఆపండి, మీ గొప్పలు. నా చెట్టు ములగ కాడలంటే సాంబారు , రసం తయారీలో ఉండాల్సిందే.లేకపోతే వాటికి రుచి సువాసన రావు. ములగ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారనగానే, కొద్ది దూరంలో ఉన్న కరివేపాకు చెట్టు కలగ చేసుకుని మీరే కాదు సాంబారు రసం తయారీకి మా కరివేపాకు సువాసనే కాకుండా ఆకుల్ని ఆరోగ్య పరంగా చెట్నీలకు ఎండబెట్టి పౌడరుగా వాడుతున్నారని చెబుతూండగా , కోరడు గట్టున ఉన్న చింతచెట్టు మాట్లాడుతూ సీజన్లో చింత చిగురు పప్పులోకి పచ్చి కాయలతో పచ్చడి , పండిన చింతపండుతోనే సాంబారు రసం తయారవుతుందని తన ఘనత చెబుతూండగా, మూతి మూడు వంకరలు తిప్పిన మామిడి చెట్టు తన గొప్పతనం చెప్పుకుంటు మామిడి చెట్టు లేకపోతే మనుషులకు రోజు గడవదని మామిడి ఆకులు శుభకార్యాలు పర్వదినాలప్పుడు ఎంతో అవుసరమవుతాయని , మామిడి కాయలు ఊరగాయలకు గాను , పండిన పళ్లు శుభకార్యాల పుడు తినడానికి వ్యాపారానికి ఉపయోగ పడితే మామిడి లేత పువ్వు తిని మత్త కోకిల కుహు కుహు నాథం చేస్తుందని , పువ్వుల మధువును మధుపాలు సేకరించి తేనెగూడు కట్టు కుంటాయని సోది చెబుతూండగా, దోర ముగ్గిన పళ్లతో ఉన్న జామిచెట్టు మధ్యలో అడ్డు తగిలి దోర ముగ్గిన జామపండు ఎక్కడుంటే చుట్టూ సువాసన ఉంటుందనీ కాబట్టే మనుషులతో పాటు రామచిలుకలు ఉడతలు మా చెట్ల మీదే కొలువుంటాయంది గర్వంగా. దాని పక్కనున్న సపోట , సీతాఫలం ,నేరెడు చెట్లు మేము మీకెవరికీ తీసిపోమని వాటి గొప్పలుఅవి చెప్పుకుంటున్నాయి. పెరటిలోని పెద్ద చెట్లు వాటి వాటి ఘనతను చెప్పుకుంటుంటే కింద మళ్లలో ఉన్న పచ్చిమిర్చి ఆకులెగరేసి 'ఓసోసి, మా పచ్చిమిరప లేందే కూర లేదు చట్నీ లేదు, ఇంక మా ఎండుమిర్చి లేకపోతే వంటలే ఉండవంది' హాస్యంగా. దానితో టమాటా , వంగ , బెండ, పొట్ల, చిక్కుడు వాటి అవసరం కూడా ముచ్చటించుకుంటే, భూమ్మీద విడమరిచి పాకిన పెద్ద గుమ్మడి కాయ భుజాలెరేస్తూ ' నన్ను చూడు నా అందం చూడు ' అంది దర్పంగా. ఇలా చెట్లు మొక్కలు కూరపాదులు వాటి వాటి దర్పం చూపి మురిసిపోతుంటే పూలు ఘుమఘుమ పరిమళాలతో విరబూసిన ఎర్రమందారం, నంది వర్ధనం , దిల్బాహార్,చామంతి బంతి తలలు ఆడిస్తుంటే , దట్టమైన పచ్చని ఆకుల మధ్య సువాసనలతో ముత్యాల్లాంటి మల్లెపువ్వుల తుప్ప కలగ చేసుకుని సాయంకాలమైతే అమ్మగారు పెద్ద గిన్నెతో వచ్చి నా మల్లె మొగ్గలు కోసి దండ గుచ్చి కోడలి జడలో ముడుస్తారు' అంది గర్వంగా. ఇంక కోరడి చివర్న ఉన్న గోరింట పొద ఉండలేకపోయింది. . 'మీకే కాదు నాకూ ఆదరణ ఉంది. శ్రావణ ఆషాఢ మాసాల్లో మా గోరింటాకును కన్నెపిల్లలు కొత్త పెళ్లికూతుళ్లు లేత ఆకుల్ని నూరి రకరకాల డిజైన్లతో చేతులకు అలంకరించుకుంటారు' అంది. ఈ విధంగా సీతారామయ్య గారి పెరటి ఆవరణలో ఫల వృక్షాలు మొక్కలు కూరపాదులు పుష్ప మొక్కలు వాటి వాటి గొప్పతనాన్ని వెళ్లబుచ్చాయి. ఓపిగ్గా అన్నీ విన్న వానరం అందర్నీ మెచ్చుకుంటూ "మీలో మీరు, ఎవరికీ తీసిపోరు. ఎవరి విలువ వారికుంది. మిమ్మల్నింత ఆప్యాయంగా శ్రద్ధగా పెంచుతున్న ఇంటి యజమానిని అభినందించాలి. ఇలాగే అందరు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడితే మాలాంటి ఎన్నో జంతువులు ఆకలితో తిరగాల్సిన పని ఉండదు. ఇప్పుడు కరోనావైరస్ కారణంగా అన్ని దేవాలయాలు , పుణ్యక్షేత్రాలకు భక్తులు రాక మాకు తిండి కొరత ఏర్పడి ఆహారం కోసం ఊళ్లంట తిరుగుచున్నామంది బాధతో. పండుకోతి అక్కడి పళ్లు తిని సంతృప్తి పడింది. * * *