అనూఢ (శృంగార కథ) - చెన్నూరి సుదర్శన్

Anoodha

మధ్య హారతి ఉదరభాగంలో దినం, దినం మార్పు కనబడుతోంది. బ్రా హుక్స్ పట్టడం లేదు. జాకెట్లు తమ నిస్సహాయతను వ్యక్త పరుస్తున్నాయి. కడుపు మీదకు కట్టుకున్న చీర కనికరం లేకుండా నాభి కిందికి జారిపోతుంది.

అనుభవజ్ఞురాలైన ఆశమ్మ ఓరోజు హారతిని నిలదీసింది.

“నీ అనుమానం నిజమే..” అని చాలా కూల్‍గా సమాధానమిచ్చింది హారతి.

ఆకాశం దద్దరిల్లేలా అరుస్తూ.. తారాజువ్వలా హారతి పైకి ఎగిసింది ఆమె మారు తల్లి ఆశమ్మ. ఆమె విశ్వరూపం చూడడం అదే మొదటిసారి.

“అవును నిజమే.. ఏంచెయ్యమంటావ్..? నేనేమైనా మొల్లినా? నాకు పెళ్ళి అయితేనే గదా..చెల్లికి పెళ్లి అయ్యేది. నాకు పెళ్ళి గాకుండా అడ్డుకుంటున్నావ్. నేనూ చీమూ నెత్తురు ఉన్న మనిషినే.. ఉప్పూ, కారం తింటున్నా.. నాకూ కోర్కెలుండవా?” అంటూ తొలి సారిగా ఆశమ్మ మీదకు ఎదురు దాడికి దిగింది హారతి. “ఎప్పుడైనా మాసుఖం గూర్చి ఆలోచించావా? ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళి పోతే అనాధనై పోతానేమోనని వక్రంగా ఆలోచిస్తునావు. మమ్మల్ని డబ్బు సృష్టించే యంత్రాలుగా చూస్తున్నావే గాని ఆత్మీయతలు, అనురాగాలు పంచుతున్నావా? మా అమ్మా, నాన్న ఉంటే మాకీ దుర్గతి పట్టేది కాదు” అంటూ వాపోయింది. “ఇలాగే నాస్నేహితురాలు ఒకరు సరియైన వయసులో పెళ్ళిగాక, కోర్కెలను అదుపులో పెట్టుకోలేక పిచ్చిదై పోయి చచ్చిపోయింది. నా కలాంటి చావు రాకుండా ఉండాలని ఈనిర్ణయం తీసు కున్నాను” అంటూ వివర్ణమైన ముఖంతో హారతి అలా ఫైరయ్యే సరికి ఆశమ్మ నిర్ఘాంత పోయింది.

“కాని యిదేం పద్ధతే..! పెళ్ళీ, పెటాకులు లేకుండా కడుపు తెచ్చు కోవడం.. మేము వీధిలో తలెత్తుకొని తిరగాలా వద్దా ఎంత అప్రతిష్ట? హవ్వ.. హవ్వ..” అంటూ ఆశమ్మ నోరు బాదుకో సాగింది.

“పెళ్ళి కాలేదని ఎవరన్నారు?” తల ఎగరేసింది హారతి. మెడలోని మంగళ సూత్రాన్ని తీసి చూపించింది. ఆశమ్మ అవాక్కయ్యింది.

***

‘తలనిండ పూదండ దాల్చిన రాణీ.. మొలకా నవ్వులతోడ. మురిపించబోకే..’ అనే దాశరథి గీతాన్ని అలనాటి మధుర గాయకుడు ఘంటసాల ఆలపించినట్లు నగు మోముతో ముందర నిల్చున్న మధుకర్ ను చూడగానే హారతి మనసాగలేదు. ఒక్క ఉదుటున వెళ్ళి అమాంతంగా కౌగిలించుకుంది.

“ఏయ్.. మెల్లిగా. నీ దూకుడుకు కాస్తా కళ్ళెం వేయి. నువ్వసలే ఒఠ్ఠి మనిషివి గూడా గాదు.. మన మధ్య బిడ్డ నలిగి పోడూ..!” అంటూ సున్నితంగా హెచ్చరించాడు మధుకర్.

చిరునవ్వుతోనే సమాధానమిచ్చింది హారతి.

హారతి తల లోని మల్లె పూలు మధుకర్ మతి పోగోడుతున్నాయి. పూల పరిమళాలను ఆస్వాదిస్తూ.. సుతారముగా హారతిని అలుముకుని.. రతీ మన్మధుల ప్రణయ ప్రాంగణానికి తీసుకెళ్ళాడు.

మధుకర్ కు మనసారా మనసిచ్చుకొంది. తనువిచ్చుకొని తల్లిని గావాలనే తాపత్రయాన్ని మధుకర్ వివాహ బంధం అడ్డు పడింది. కాని నేడు సంఘం కట్టుబాట్ల సంకెళ్ళను తునాతునకలు జేశాననే విజయ గర్వంతో.. ఆమె మధుకర్ బాహు బంధాలలో శిథిలమై పోవాలని తపన పడుతూ.. సిగ్గు మొగ్గయ్యింది.

కలువల రాయుని కాంతి కిరణాల వలను విసిరాడు మధుకర్. ఆపాదమస్తకం అలుముకున్న వలలో కిల, కిలా నవ్వుతూ ‘నీకు గాక మరెవ్వరికీ తనువు’ అన్నట్లు నెలరేడు కన్ను సోకిన కలువపూవులా విచ్చుకుంది అర్చన. మధుకర్ ప్రదర్శించే నైపుణ్యాన్ని మత్తు కళ్ళతో గమనిస్తూ.. అతని చేయి తన ఎదపై పడగానే.. దిగ్గున కళ్ళు తెరిచింది హారతి.

ఎదురుగా ఆశమ్మ.

“హారతీ.. కడుపులో ఏమైనా నొప్పిగా ఉందా? మెలికలు తిరిగి పోతున్నావు” అంటూ ఆందోళనగా అడుగింది.

“లేదమ్మా..” అంటూ హారతి లేచి కూర్చొని మంచినీళ్ళడిగింది.

‘ఇదంతా కలనా..!’ అని మనసులో మదనపడుతూ.. ఆశమ్మ తెచ్చిచ్చిన మంచినీళ్ళు త్రాగి తిరిగి బెడ్ పై నిస్తేజంగా వాలి పోయింది.

***

హారతికి పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. తన కోరికపై ’సురక్షిత సంతాన సాఫల్య కేంద్రం’ లో చేర్చింది ఆశమ్మ.

హారతిని స్ట్రెచర్‍పై పడుకోబెట్టి ప్రసూతిశాలకు తీసుకు వెళ్తుంటే.. “అమ్మా.. ఆడదానికి ప్రసవం ఒక పునర్జన్మ. నీకు తెలియంది కాదు. నేను జన్మ ఎత్తినా ఎత్తక పోయినా దయచేసి ఆపీసు పని మీద వెళ్ళిన చెల్లాయి అమెరికా నుండి రాగానే తప్పకుండా పెళ్ళి చేయమ్మా.. నీకు దండం పెడ్తాను” అంటూ రెండు చేతులా మొక్కింది. ఆశమ్మ నివ్వెరపోయింది....

ప్రసూతిహాల్లో ఎట్టి పరిస్తితులలోనూ తనకు సిజేరియన్ చేయొద్దని, ఎంత బాధనైనా తాను భరిస్తానని పదే, పదే డాక్టరమ్మను వేడుకోసాగింది హారతి. సిజేరియన్‍తో మాతృత్వ పరిపక్వత సంపదను ఆస్వాదించలేనని ఆమె తపన.

బయట వరండాలో ఆశమ్మ భగవన్నామ స్మరణలో లీనమవుదామని ప్రయత్నిస్తూ విఫలమౌతుంది. ఆమెకు హారతి అభ్యర్థన పదే, పదే గుర్తుకు రాసాగింది.

ఇంతలో దూరంగా హారతి సహ ఉపాధ్యాయుడు మధుకర్ తన సతీమణితో రావడం కాస్త ధైర్యం తెచ్చుకుంది ఆశమ్మ. అంత హారతికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ.. ఆశమ్మ ప్రక్కనే కూర్చున్నారు.

మాటల సందర్భంలో “అర్చన తన భర్త గూర్చి పూర్తి వివరాలు చెప్పడం లేదు. మీకేమైనా తెలుసా? సార్” అంటూ ఆశమ్మ ఆరా తీసింది.

మధుకర్ దంపతులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆశమ్మ అతి దీనంగా ముఖం పెట్టింది.

“హారతికి పెళ్ళే కాలేదు అలాంటిది.. భర్త గూర్చి ఏం చెప్పను?” మధుకర్ అలా అనేసరికి ఆశమ్మ కంగుతింది.

“అదేంటి సార్... తనకు పెళ్ళయ్యింది. హారతి మెళ్ళో మంగళ సూత్రం గూడా ఉంది. భర్త దుబాయికి వెళ్ళాడని, తన ప్రసవ సమయానికి తప్పకుండా వస్తాడని హారతి చెబుతోంది”

మధుకర్ దంపతులు చిరు నవ్వులతో ఒకరినొకరు చూసుకుంటుంటే ఆశమ్మ బిత్తర బోయింది.

మధుకర్ తన భార్యను చూపిస్తూ.. “ఈవిడగారు గర్భం ధరించిన ప్రతీ సారీ గర్భస్రావమయ్యేది. ఇదే నర్సింగ్ హోంకు తీసుకు వచ్చే వాన్ని. డాక్టరమ్మ పరీక్షలన్నీ నిర్వహించి ఇప్పటికే అదృష్ట వశాత్తు పెను ముప్పు తప్పిందని.. ఆపరేషన్ జేసి గర్భాశయం తొలగించింది. మాకిక సంతాన యోగమే లేదా అని చాలా నిరాశకు లోనయ్యాం.

ఆసమయంలో అర్చన తనను పెళ్ళి చేసుకొమ్మని వేడుకొంది. నేను సున్నితంగా తిరస్కరించాను” అంటూ తన భార్య వంక చూశాడు. ఆమె ఆశ్చర్యంగా మధుకర్ ను చూడసాగింది.. తనకీ విషయం తెలియదన్నట్లు.

కాసేపు నోట మాట రాక మౌనం వహించాడు మధుకర్. ఆశమ్మ గుండె వేగంగా కొట్టుకో సాగింది.

“ఈవిడ తన దీనావస్థను, నిస్సహాయతను తలుచుకుంటూ రోజూ రోదించేది. డాక్టరమ్మ అద్దె గర్భం గూర్చి సలహా యిచ్చింది.

పరిస్థితులనర్థం జేసుకున్న హారతి కనీసం ఈసహాయమన్నా చేయనివ్వండి నాకు తృప్తి అయినా మిగులుతుందని ఏడ్చింది. పెళ్ళి గావాల్సిన దానివి.. కుమారివి.. వద్దంటూ డాక్టరమ్మ, నాభార్య, నేను ఎంతగానో వారించాం. కాని అర్చన మొండిగా తన పంతం నెగ్గించుకుంది.

ఒప్పందం ప్రకారం యీ విషయాన్ని అతి రహస్యంగా దాచాం. మంగళసూత్రం చూపిస్తూ మిమ్మల్ని మభ్య బెట్టింది గాని ఆమె అవివాహిత. నిజంగా అర్చన మాపాలిటి దేవత. ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేము” మధుకర్ కంటి ఆదేశాలతో ఇద్దరు కలిసి ఆశమ్మ పాదాలకు మొక్కారు.

ఇంతలో హడావుడిగా డోర్ తెర్చుకొని బయటికి వచ్చిన నర్స్. “హారతికి అబ్బాయి పుట్టాడు” అంటూ తీపి కబురు తెచ్చింది.

ఆనందంగా అందరూ లోనికి పరుగులు తీశారు.

“అయాం సారీ మధుకర్.. హారతి ఈజ్ నో మోర్.. ఆమె వద్దని వేడుకున్నా.. ఆపరేషన్ చేయాక తప్పింది కాదు. నా శాయశక్తులా ప్రయత్నించాను” అంటూ బాబును తెచ్చి మధుకర్ దంపతుల చేతుల్లో పెట్టింది.

ఆశమ్మ హృదయం బద్దలైంది.. ఆమె కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి. *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు