సమిష్టి కృషి - కందర్ప మూర్తి

Samisti krushi

రోడ్డు పక్క తినుబండారాల దుకాణం వద్ద ఉంచిన చెత్తలతొట్టె బయట ఒక సమోసా పడిఉంది. ఆహారం కోసం అటుగా వెల్తున్న నల్ల గండుచీమకి నోరూరి దాన్ని తినాలని కోరిక పుట్టింది. చుట్టు తిరిగి ఎంత ప్రయత్నించినా పైన ఉన్న గట్టి మైదా తొడుగు కొరక బడలేదు. లోపలి నుంచి ఘుమ ఘుమ ఆలూ మసాల కూర వాసన వస్తోంది. నోటితో కొరికి తినడానికి సాధ్యం కావడం లేదు. వదిలి పోదామంటే మనసు ఊరుకోవడం లేదు. ఎలాగైన మసాలకూర తినాలని నిశ్చయించు కుంది. తన ఒక్క దానివల్ల జరిగే పని కాదని తలిచి చీమలపుట్ట దగ్గర కెళ్లి సహచర మిత్రులకు విషయం చెప్పి మీరు సహాయం చేస్తే అందరం పంచుకుని తినొచ్చు అంది. పుట్టలోని మిగతా చీమలకు కూడా ఆలూ మసాల కూర సమోసా తినాలని కోరిక కలిగి అన్నీ గుంపుగా వచ్చి సమోసా చుట్టూ తిరిగి ఎంత ప్రయత్నించినా రంద్రం చెయ్యడం సాధ్యం కాలేదు. అలిసి పోయి అవన్నీ తిరిగి పుట్ట దగ్గరకు వెళిపోయాయి. మొదటి చీమకు నిరాశ కల్గింది. దిగులుగా దిక్కులు చూస్తోంది. కొద్ది దూరంలో ఈగల గుంపు కనబడింది. దగ్గరకెళ్లి విషయం చెప్పి వాటి సహాయం అడగ్గా మేము కూడా ఆ సమోసా తినాలనే ఆశతో ఎంత ప్రయత్నం చేసినా పైనున్న మైదా కవచాన్ని ఛేదించ లేక వదిలేసామన్నాయి. నల్లచీమకు చింత ఎక్కువైంది. సమిష్టిగా ప్రయత్నిస్తే సాధ్యమవుతుందని చీమల దండుకీ ఈగల సమూహానికి నచ్చ చెప్పి అందర్నీ సమోసా దగ్గరకు రప్పించింది. ఈగల గుంపు పైన నల్ల చీమల దండు కిందన సమోసాకు రంద్రం చెయ్యాలని రంగంలోకి దిగాయి. చెమటలు పట్టేయి కాని సమోసాకి రంద్రం చెయ్యలేక పోయాయి. చెత్తల తొట్టెకి కొద్ది దూరంలో బొరియ దగ్గర మస్తుగా తిని కడుపు నిండి మత్తుగా ఒక ఎలక నిద్ర పోతూ కనబడింది ఈగలు , చీమలు ఎలుక సాయం తీసుకోవాలను కున్నాయి. కలుగు దగ్గరికెళ్లి మూషికాన్ని ఎంత పిలిచినా నిద్రమత్తు నుంచి లేవ లేదు. కొన్ని ఈగలు ఎలుక కళ్ల మీద వాలి , కొన్ని చీమలు దాని మూతి మీసం మీద ఎక్కి సందడి చేయసాగాయి. " అబ్బబ్బ ! ప్రశాంతంగా పడుకో నివ్వవు ఈ పాడు ఈగలూ, దోమలు" అంటూ చికాకు పడింది మూషికం. " మిత్రమా, కోపగించుకోకు. మాకు నీ వల్ల ఒక సాయం కావాలి. అదిగో , అటుచూడు. చెత్తలతొట్టె వద్ద సమోసా పడి ఉంది. దాని బయటున్న మైదా కవచం చిదగ్గొట్టడం మా వల్ల సాధ్యం కావటం లేదు. నీ పళ్లు వాడిగా దిట్టంగా ఉంటాయి కనక పైనున్న మైదా తొడుగు నువ్వు తిని లోపలి ఆలుమసాల కూర మాకు పెట్టు. నీ పేరు చెప్పుకుంటా"మని ప్రాధేయ పడ్డాయి. ఈగల చీమల దీనావస్థను చూసి ఎలక్కి జాలి కలిగింది. పాపం, అవి సూక్ష్మ కీటకాలు. వాటికీ అన్నీ తినాలని కోరిక ఉంటుంది. తను రోజూ ఇటువంటి సమోసాలు , పకోడీలు, వడలు తింటూనే ఉన్నాను. తప్పక ఈ చిట్టి కీటకాల కోరిక తీరుస్తానని తలిచి " మీరు దిగులు పడకండి , నేను సమోసా తొడుగును కొరికి మీ అందరికీ ఆలుమసాల కూర తినిపిస్తానని" చెప్పింది. సమోసా దగ్గరికొచ్చి నోటితో గట్టిగా కొరికింది ఎలుక.. సమోసా లోపలి నుంచి ఆలుకూర బయట పడింది. ఈగల గుంపు కొంత , చీమలదండు కొంతా కడుపు నిండా తృప్తిగా ఆరగించాయి. చిట్టి కీటకాలన్నీ ఎలక్కి కృతజ్ఞతలు చెప్పాయి. వాటి ఆనందం చూసి ఎలుక మనసు సంతోష పడింది. నల్ల గండుచీమ పట్టుదలగా సమోసాలోని మసాల ఆలుకూర తినాలన్న కోరిక నేరవేరిందని పొంగిపోయింది. నీతి : సమిష్టిగా కలసి కృషి చేస్తే ఎటువంటి కష్ట కార్యమైనా సాధించ వచ్చని ఈ చిన్న కీటకాలు నిరూపించాయి. * * *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు