ఎ.పి.పి స్ట్రీట్ పోలీసు - కందర్ప మూర్తి

APP Street police

ఈ హాస్య ముచ్చట నేను బాల్యంలో చదువుకునే రోజులవి. మాది విశాఖపట్నం జిల్లా చోడవరం. మా ఇల్లు మా ఇంటి పేరుతో ఉండే కందర్ప కోలనీలో ఉండేది. మా ఇంటికి దగ్గర లోనే జిల్లా బోర్డు హైస్కూలు, శ్రీ రామా ప్రాధమిక పాఠశాల ఉండేవి.మా చదువులు అక్కడే సాగాయి. అప్పట్లో మా కుటుంబాలు ఉమ్మడి గానే ఉండేవి.ఎప్పుడూ పిల్లలు పెద్దలు వచ్చే పోయే బంధువులతో సందడిగా కనబడేవి. శుభకార్యాలు పండగలపుడు అప్పటి వాతావరణం చెప్పనవసరం లేదు. మా పెదనాన్న బాబయ్యలు వారి కొడుకులు కోడళ్లు మనుమరాళ్లు మనుమలతో ఒకే ఇంట్లో ఉంటే వారి బంధువు లందరూ ఆ వీధిలోనే ఉండేవారు. పిల్లల పెళ్లి సంబంధాలు కూడా కుటుంబ సబ్యుల దగ్గర సంబంధాలే చేసుకునే వారు. అందువల్ల బీరకాయ పీచు బాంధవ్యాలే. జిల్లా దాటి బయటి పెళ్లి సంబంధాలు చేసేవారు కాదట. అంతకు ముందు రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవట. ఆస్థి కోసమొ లేక పిల్లని దూరం ఇవ్వడం లేకనో, బాల్య వివాహాలు భార్య చనిపోయిన పెద్ద వయసు వారితో వయసులో చిన్న ఆడపిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేసేవారట. కొంతమంది బీదరికం వల్లకూడా చిన్న పిల్లల పెళ్లిళ్లు పెద్ద వయసు వారితో చేసే వారట. అలా జరిగే బాల్య వివాహాల్లో వయసు రీత్యా భర్తలు చనిపోయిన ఆడపిల్లలు బాల్య వితంతువులుగా ఉండేవారట. పునర్వివాహానికి అప్పట్లో పెద్దలు అంగీకరించే వారు కాదట. చనిపోయిన భర్త ఆస్థి వాటాలు బంధువులు సరిగ్గా ఇవ్వక కోర్టులు మధ్యవర్తులు గొడవలు జరిగుతూండేవట. అలా బాల వితంతువులు పుట్టింటికి చేరేవారట. వారికి వచ్చిన భరణం ఆస్థిపాస్తులు అన్నదమ్ములు లేక మరుదులు చక్క బెట్టేవారట. ముక్కు పచ్చలారని ఆడపిల్లల్ని పెద్ద వయసు వారితో పెళ్లిళ్లు చెయ్యడం , వారి ఖర్మ బాగులేక మొగుడు చచ్చిపోతే బాల వితంతువులుగా మిగలడం అప్పటి సమాజం తీరు. అన్నదమ్ములు తల్లిదండ్రులు బాధ పడినా ఏమీ చేయలేని సమాజ స్థితి అప్పుడు. ఆ అమ్మాయి జుత్తు తీయించి చెవులకు ముక్కు మెడలో కాళ్లకు ఏ అభరణాలు లేకుండా నుదుటున బొట్టు ఏమీ లేకుండా అనాకారిగా చేసేవారట. వారు ఏ శుభకార్యాలకు వెళ్లకూడదు , ఎదురు పడి చూడకూడదు. ఎవరైన ప్రయాణాలప్పుడు ఎదురు రాకూడదు. రాత్రి చాప మీదే పడుకోవాలి. ఉప్పు కారం లేని చప్పటి తిండే తింటు వంటగదే నివాసం. ఉదయాన్నే లేచి ఎవరికి ఎదురు పడకుండ దిన చర్య ప్రారంభించాలి. విధవ అంటే ముత్తైదువకుండే ఏ లక్షణం కనబడకూడదు. తెల్లని నేత పంచ కట్టుకుని జుత్తు లేని బోడిగుండు నెత్తిమీద కప్పు కోవాలి. తోటి అక్క చెల్లెళ్ల , కుటుంబసబ్యుల వివాహ వేడుకల్లో కాని స్నేహితుల శుభ కార్యాల్లో వేడుకల్లో పాల్గొనే అవకాశమే ఉండదు. ఏ గోడ చాటునుంచో తలుపు చాటు నుంచో చూడవల్సిందే. అత్తారింట్లోనే ఉంటే వయసులో ఉన్నందున మగాళ్ల లైంగిక వేధింపులు తప్పవు. ఇదీ ఆనాటి వితంతువుల నరకజీవితం. ఈ సంప్రదాయాలు ఎక్కువగా అప్పటి బ్రహ్మణ కుటుంబాల్లో ఉండేవి. ఈ దురాచారాలను అరికట్టడానికి అప్పట్లో శ్రీ గురజాడ అప్పారావు గారు , కందుకూరి వీరేశం పంతులు గారి వంటి సంఘ సంస్కర్తలు వారి రచనలు చేతలతో ప్రయత్నించారు. ఇంక అసలు విషయాని కొస్తే మా ఇంట్లో అన్నపూర్ణమ్మ అని ఒక మద్య వయస్కురాలైన వితంతువు ఉండేది. నల్లగా వంటి మీద తెల్లని సైను పంచెతో నెత్తి గుండు మీద కప్పుకుని వంటి మీద ఎటువంటి ఆభరణం లేకుండా కనబడేది. ఆవిడకు ఎవరూ బంధువులు లేనందున మా పెదనాన్న చేరదీస్తే వంట పనులు పై పనులకు సహాయంగా ఉండేది. ఆవిడకు చాదస్తం, మడి ఆచారం ఎక్కువ. వంట సమయ మప్పుడు మా పిల్లల్ని వంటగది వైపు రానిచ్చేది కాదు. మడిమడి అంటూ దూరం పెట్టేది. అందువల్ల మేమందరం ఆవిడను బోడీ బోడీ అంటూ ఆట పట్టించేవాళ్లం. కాకి వెధవల్లారా అంటూ తిట్టిపోసేది. మా ఇంట్లో పెద్ద వాళ్లందరు ఆవిడకు గౌరవం ఇచ్చేవారు. పెళ్లి సంబంధం మరేదైన శుభ కార్యమప్పుడు చర్చించే టపుడు ఆవిడ సలహా కూడా తీసుకునే వారు ఇంట్లో వాళ్లు. పనులన్నీ అయిపోయాక సాయంకాలం మా వీధి లోని బంధువుల ఇళ్లకు చక్కర్లు కొట్టేది. పదేసి నిముషాలైన ఒక్కొక్క ఇంటిని సందర్సించేది. అందరూ ఆప్యాయంగా ఏదో ఒక వరస కలిపి పలకరించి ఏదో పండో ఫలహారమో తినిపించేవారు. ఆవిడ సంచారంలో పరమార్థముండేది. ఎవరింట్లో పెళ్లికొచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే ఆ సమాచారం చేరవేసి సంబంధాలు కలపడం , అత్తాకోడళ్ల తగువులు , చావులు ఇంటి తగవులు ఇలా ఏదో ఒక వార్త అటు ఇటు చేరవేసేదట. అందువల్ల పెద్దలు కలగచేసుకుని సమస్యలు పరిష్కరించే వారట. మమ్మల్ని మడి ఆచారం అని తిడుతుంటుందని ఎప్పుడు ఆవిడను ఆట పట్టించేవాళ్లం. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ ,మాకు పిన్ని వరస అవుతుందట.అందువల్ల అన్నపూర్ణ పిన్నిని ఆట పట్టించడానికి App అని పోలిచేవాళ్లం. అలా ఇంగ్లీషులో పిలిస్తే మరీ రెచ్చిపోయి కాకి వెధవ్వల్లారా అని తిట్టి పోసేది. అదీగాక ప్రతి ఇంటి సమాచారం చేరవేస్తుందని స్ట్రీట్ పోలీసు నిక్ నేమ్ తగిలించి AP SP (ఆంధ్రప్రదేశ్ స్ట్రీట్ పోలీసు)అని పిలిచేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్ళు మమ్మల్ని అదిలించినా ఏదో సమయంలో ఆవిడతో తిట్లు తింటేనే కాని మాకు పొద్దు పోయేది కాదు. ఒకసారి గుళ్లో ప్రసాదమని హల్వా తినిపించేము. తర్వాత ఎవరో మామ్మా నీకు కోడిగుడ్డు కలిపిన కేకు తినిపించారని ఆట పట్టించారు. ఇంకేమి చెప్పాలి 'కోతి మూక వెధవ్వల్లారా! నా మడి ఆచారం బ్రష్టు పట్టించారు ' అంటూ ఒకటే వాంతులు చేసు కోవడం మొదలెట్టింది. వాస్తవానికి అది గోధుమ హల్వా. ఇలా మా బాల్యం అల్లరి చిలిపి పనులతో సాగిపోయింది. తర్వాత చదువుల ధ్యాసలో సబ్యతగా బుద్ధిగ ఉండేవాళ్లం. కాని ఇప్పుడు మా అన్నపూర్ణ పిన్నిని పట్టించిన ఆటలు తలుచుకుంటే జాలీ బాధ కలుగుతుంది. * * *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు