ఇది అంతా కరోనా నే చేసింది - Madhavi

Idi Anta karona ne chesindi

నవంబర్ 18 ఉదయం.. ట్రింగ్.. ట్రింగ్.. అలారమ్ మోత మొదట కలలో లా అనిపించింది. కానీ కల కాదు. సెల్ ఫోన్ లో మోగుతూనే వుంది. నిద్ర మత్తులో ఆపేసి పడుకున్నా. కానీ మళ్ళీ నిద్ర పట్టలేదు. కారణం ఈ వెధవ స్మార్ట్ ఫోన్ లో ఏ ఎమర్జెన్సీ బటన్ నొక్కుతామో అని భయం నిద్రలో. ఈ సెల్ ఫోన్లు లేనప్పుడే బాగుంది. ఆ అలారమ్ గడియారం ని ఎన్ని సార్లు కొట్టిన కిక్కురుమనకుండా పడుండేది. మంచం మీద నుండి లేచి వెళ్లి బ్రష్ చేసుకుంటూ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇండియా లో ఫామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో వరద లా మెస్సేజ్ లు వచ్చాయి శుభోదయం అనుకుంటూ.. స్నేహితుల గ్రూప్స్ లో కొంచెం నయం గుడ్డిలో మెల్ల వంద కి పది మెసేజెస్ లో ఎదో ఒక వార్త లేదంటే జోక్ ఉంటుంది. పెద్దలు పిల్లలు వున్న చుట్టాల గ్రూప్ వుంది. దానిలో మరీ విడ్డూరం గా ఉంటాయి మెస్సేజ్ లు. దేవుడి ఫోటో పెడతారు. దణ్ణం పెట్టేలోపు ఎవడో బండ బూతులు తిట్టే యూట్యూబ్ వీడియోస్ వస్తాయి. ఛీ ఛీ అనుకునే లోపు దూరపు బంధువు పోయాడు అని ఫోటో పెడతారు అయ్యో పాపం ఎలా జరిగింది అని అడిగే గ్యాప్ లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ పెడతారు. అసలు నాకు అర్ధం కాదు మా బాబాయిలు పెద్దమ్మలకి కూడా నేను ఫ్రెండ్ ఏమిటి ఎదో కొంచెం తల మీద నాలుగు తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం. ఇంతలో ఒక జోక్ మళ్ళీ దాని తరువాత అత్తయ్య కి బాగోలేదు అని. ఇన్ని నవరసాలు ఫోన్ లో పలికించిన తరువాత అయోమయం తో రెడీ అయ్యాను వర్క్ ఫ్రొం హోమ్ కి. ఎదో తయారు అవడం అంటే మంచి బట్టలు, జుట్టు దువ్వుకుని, మేకప్ తో కాదు. అమ్మమ్మదో బామ్మదో అన్నట్టు వున్న చొక్కా, ప్యాంటు అయితే ఏ రంగో కూడా తెలియకుండా మాసిపోయింది. జుట్టు ఏమో కొబ్బరి పీచులా గిన్నెలు తోముకోవచ్చు. ఇంట్లో వుండానికి ఏమి రెడీ అవుతాం? ఆ మధ్య ఒక రోజు పోనీ లే ఒక రోజు ఇంట్లో వాళ్ళకోసం జుట్టు సరిగా దువ్వి రెడీ అయితే మా కుక్క అరిచింది ఎవరో అనుకుని. ఆ తరువాత మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు. మొదట్లో వర్క్ ఫ్రొం హోమ్ అని ఆఫీస్ లో వాళ్ళు వీడియో లో కనపడాలి వినపడాలి అన్నారు. ఆ తరువాత ఈ జిడ్డు మొహాలు చూడలేక వాళ్ళే కెమెరా ఆఫ్ చేసుకుంటున్నారు. కనపడొద్దు లే వినపడండి అన్నారు. ఈ మధ్య ఇంట్లో కుక్కర్, కుక్కలు, పిల్లల శబ్దాలకి మరీ ప్రతి మీటింగ్లో వినపడొద్దు లే అంటున్నారు. అప్పట్లో వీడియో లో కనపడకపోతే ఉద్యోగాలు వుండవు, పిల్లలకి బడి లో టీసీలు ఇస్తాం అన్నారు. ఆ రోజులు మరీ భయానకం గా గడిచాయి. ఏ గదిలో కి వెళితే ఎవరు కెమెరా ఆన్ చేశారో మనం ఎలా ఉన్నామో అని టెన్షన్. తలుపుల వెనక నక్కి, గోడలకి రాసుకుంటూ పాక్కుంటూ డేక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. యుద్ధం లో రహస్య సైనికులకు కూడా అంత ట్రైనింగ్ ఇవ్వరు.

నీరసం గా ఎదో ఎండిపోయిన బ్రెడ్ పిల్లలలకి, మాడిపోయిన అట్టు భర్త కి వేసి ఇచ్చి ఒక లోటా కాఫీ తెచ్చుకుని కంప్యూటర్ ముందు తిష్ట వేసా. హాస్పిటల్ లో వీల్ చైర్ లో వున్న ముసలి వాళ్లకి ఈ కంప్యూటర్ ముందు నేను కూలబడానికి పెద్ద తేడా లేదు. గంటలు గడిచి పోయాయి. ఎవడో కుంక ఆఫీస్ మీటింగ్ లో అరుస్తున్నాడు ప్రాజెక్ట్ ని ఇంక ముందుకు లాగుదాం, అవగొడదాం, మనమేందో నిరూపిద్దాము అంటూ. అతడి దవడలు లాగుతున్నాయి కానీ ఎవరిలో పౌరుషం రావడం లేదు. నీరసం గా వుంది ముందు లంచ్ చేయాలి అన్నారు. సరే తిని తగలడండి అని వదిలాడు. పిల్లలు స్కూల్ కి వెళ్ళాక ఈ రోజు సెలవు ఇచ్చాం బడి లేదు అంటే ఎలా పరిగెడతారో ఇంటికి ఆలా వెళ్లిపోయారు మీటింగ్ నుండి. మధ్యాహ్న భోజన పధకం ఏమిటి అని చూస్తే మూడు రోజుల ముందు వండిన పాచిపోయిన ముద్ద పప్పు ఎదో ఉంటే తీసి వేడి చేసి పెట్టా. అందరి మొహాలు చిటపట లాడుతున్నాయి కదా ఎలాగూ అని వడియాలు అవి వేయించడం మానేశా ఈ మధ్య. పిల్లలు స్కూల్ కి వెళ్లినా బాగుండు ఫ్రీ ఫుడ్ ఎదో ఇస్తున్నారు అంట గవర్నమెంట్ అని మాట్లాడుకుంటున్నారు. మా అయన నాలుగు డాలర్లు పెడితే బయట నవ్వుతూ పెడతారు నాలుగు రకాలు అని తిట్టుకుంటూ తిన్నాడు. వరద బాధితులు భోజనం అయ్యాక ఎవరి పని లోకి వాళ్ళు వెళ్లినట్టు అందరం ఎవరి గదిలో కి వాళ్ళు వెళ్ళాం. ఈ సారి పప్పు అన్నం తిన్నాక బలం వచ్చినట్లు వుంది పిల్లలకి గట్టిగా అరుస్తున్నారు ఆన్లైన్ క్లాసుల్లో. నాకు నిద్ర వచ్చింది. ఈ సారి ఇంకో లోటాడు టీ తెచ్చా. మళ్ళీ వచ్చాడు ఆఫీస్ కుంక. ఈ సారి కరిచేలా వున్నాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రాజెక్ట్ అయ్యేది అని. పాపం ఈ లంచ్ బ్రేక్ లో అతనికి మురిగిపోయిన పాస్తా కూడా దొరికి ఉండదు అనుకుని అందరం ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా నీ ప్రాజెక్ట్ అవుతుంది అని అతని మీద శపధం చేసాం. ఈ లోపు వేడి టీ కి నా గొంతు బొంగురు పోయింది అనుకుంట. ఎవడో ఆఫీస్ మీటింగ్ లో హి, హిం అంటున్నాడు నన్ను. ఎందుకైనా మంచింది అని వీడియో ఆన్ చేశాను. నా జిడ్డు మొహం చూడగానే వెంటనే మీటింగ్ అయింది అన్నాడు. ఫస్ట్ లో ఎలా వున్నారు అని అడిగే వాళ్ళు మీటింగ్స్ లో మర్యాదగా. ఇప్పుడు ఇంకా పోలేదు గా వున్నారు గా అని కంఫర్మ్ చేసుకుంటున్నారు. ఒక రోజు పది నిముషాలు ఆలస్యం గా మీటింగ్ లో జాయిన్ అయితే వినపడుతుంది నాకు. గంట ముందే మీటింగ్ లో చూసాను. బాగానే వుంది మరి ఇంతలో ఏమి అయిందో. తన మేనేజర్ కి చెప్పాలి కోవిడ్ ఏమో కనుక్కోమని. అప్పుడే అర్ధం అయింది నా గురించి అని. నేనొచ్చా అని అరిచి చెప్పా. వంద ఈమెయిల్స్ చూసి ఈ రోజు కి మమ అనిపించి మూసేసా కంప్యూటర్. పక్క గది లో నుండి మాటలు వినపడుతున్నాయి. అన్నా నువ్వు నన్ను చంపకు, నేను కూడా నీ జోలికి రాను, కానీ మనం ఇద్దరం ఎలాగైనా ట్రాప్ చేసి బ్రాండన్ గాడిని చంపుదాం అని మా అమ్మాయి అంటుంది మా అబ్బాయితో. నాకు ఒక నిమిషం గుండె ఆగినట్టు అయింది. తలుపు తీసి చూస్తే ఎదో వీడియో గేమ్ అంట, సీరియస్ గా ఆడుతున్నారు నన్ను చూసేసరికి గేమ్ లో ఓడిపోయారు అంట కోపం గా చూసారు నా వైపు. అంతా చీకటి గా వుంది ఏమిటి అని కింద కి వచ్చి హాల్ లో లైట్ వేసాను. మా కుక్క కు నచ్చలేదు. ఏమిటి నీ నస నిద్రపోతుంటే అన్నట్టు అరిచింది. మా అయన చీకటిలో ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. కంప్యూటర్ వెలుగులో మూడు రోజుల తరువాత లేచి వచ్చిన యేసుక్రీస్తు లా అనిపించాడు. ఈ పాడు పొట్ట కి ఎదో ఒకటి తినాలి గా అని ఏమి వంట చేయాలి అని ఫ్రిడ్జ్ ముప్పై సార్లు తీసాను. అసలు నా జీవితం లో ఒక కూరగాయని ఎన్ని రకాలు గా వండి వేధించొచ్చు అని ఈ మధ్యనే తెలిసింది. దేశం ఒక్కటే మతాలు వేరు అయినా అన్నట్టు. కూరగాయ ఒకటే. ఓట్స్ లో, అన్నం లో, రసం లో, ఉప్మా లో, సాంబార్ అన్నం లో , కిచిడి లో, నూడుల్స్ లో వండి దాని అంతు చూసే వరకు వదలడం లేదు. వండేది ఒక పదార్ధం, కానీ ఈ హడావిడి లో స్టీల్ గిన్నెలు, పళ్ళాలు పడ్డాయి ఫ్లోర్ మీద. ఇంట్లో అందరూ పరిగెత్తుకు వచ్చి ఏమిటి ఈ సౌండ్ అని విసుక్కుని వెళ్లారు. అదేమిటో ఇళయరాజా ఇడ్లీ తిని స్టీల్ ప్లేట్ కింద విసిరికొట్టినా కూడా మ్యూజిక్ బాగుంటుంది. మన చేతిలో నుండి ఒక స్పూన్ కింద పడితే కర్ణ కఠోరం గా ఉంటుంది చెవులకి. అందరూ అన్ని రోజులు ఇంట్లో ఉండడంతో మొహం మొత్తి అరుపులు, కేకలతో నిండి పోయింది ఇల్లు. ఒక వైపు టీవీ లో ఒకటే అరిగిపోయిన వార్తలు. ఇటు చూడు బే అంటూ అమెరికా ఎలక్షన్స్, అటు చూడు బే ఆంధ్ర అమరావతి కాపిటల్ అని ఒకటే తిట్టుకోవడం టీవీ లో. ఎలాగోలా అందరూ తిన్నాక రోజుకి ఒక గండం లా వుంది బాబోయ్ అనుకుని అని పడక ఎక్కి పాత ఆలోచనల్లో కి వెళ్ళాను. కరోనా కి ముందు ఎలా వుంది అని.

------------------------------------------------------------------------------------------------------------------------

2020 లో అడుగు పెట్టగానే, ఈ సంవత్సరం ఆద్భుతం గా ఉంటుదని అందరూ పండగ చేసుకున్నాం. సన్నగా అవ్వాలి, తిండి తగ్గించాలి, యోగా చేయాలి ప్రతి రోజు అని అందరం ప్లాన్ చేసుకున్నాం. 02 02 2020 ఇంకా మంచి రోజు, అందరికి బాగా గుర్తు ఉంటుంది అని కొందరు పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు చేసుకున్నారు. ఇంకొంతమంది వేడుకలు చేసుకోడానికి సిద్ధం అయ్యారు. ఆఫీస్ లో వాళ్ళు మీ కంటి చూపు ఒక్కటే 20/20 ఉండాలి అనుకోకుండా కంపెనీ విజన్ 2020 ని బాగా అర్ధం చేసుకుని పనిచేయమని చెప్పారు. అప్పుడే బోనస్ లు ఇస్తాము అన్నారు. అంతా బాగుంది అనుకునే లోపు ఎదో చైనా లో ఎదో వైరస్ వచ్చింది అనడం విన్నాను. ఎక్కడో చైనా లో కదా వాళ్ళే చూసుకుంటారు anukunna కానీ ఇలా ప్రతి వస్తువు వెనక మేడ్ ఇన్ చైనా అని ఉన్నట్టు ఆ వైరస్ అన్ని దేశాల్లోకి ఎగుమతి అవుతుంది కొన్ని రోజుల్లో అని అనుకోలేదు.

----------------------------------------------------------------------------------------------------------------------

అది మార్చ్ 13 రాత్రి. వాట్సాప్ గ్రూప్స్ లో ఒకటే గోల.. వచ్చేసింది ఇక్కడ కూడా వైరస్ కొంతమందికి. ఇప్పుడు దానికి పేరు కూడా పెట్టారు కరోనా వైరస్. పలకడం రాకపోతే దాన్నే డేవిడ్ లాగా కోవిడ్ అనొచ్చు అన్నారు. తెల్లారేసరికి మొన్న వైరస్ వచ్చిన అందరూ చనిపోయారు అని మళ్ళీ ఒకటే మెసేజెస్ మోత. ఈ దెబ్బతో ఆఫీస్ లో వాళ్ళు ఇంట్లో నుండి తగలెట్టండి జాబ్, టీచర్స్ పిల్లలకి బడి కూడా ఇంటర్నెట్ లో అన్నారు. సరుకులు వుండవు, తిండి దొరకదు ఇంకో గంటలో సూపర్ మర్కెట్స్ కి వెళ్లకపోతే అని సైరెన్ మోగించారు వాట్సాప్ లో. భయం తో అందరం వెళ్లి కనీసం ఒక సంవత్సరం కి సరిపోయే సరుకులు తెచ్చాం ఇంటికి ఓ మనిషి ఒకో స్టోర్ కి వెళ్లి. అవి పట్టక పోతే ఇంట్లో కొన్ని సామాను బయట పడేసి సరుకులతో ఇల్లు నింపాము. వైరస్ వచ్చి మొదట చనిపోయిన వాళ్ళ చిన్న కర్మ అయేసరికి అందరం తెచ్చిన సరుకులతో ఏమి చేయాలో తోచక తెచ్చుకున్న సరుకులు రోజుకి 4 సార్లు వండి తిన్నాం. ఈ లోపు వైరస్ ఇంకా దగ్గరకి వచ్చేసింది. అన్నిట్లో దేవుడు ఉంటాడు కానీ కనపడడు. వైరస్ కూడా బయట అన్నిట్లో అలాగే ఉంటుదని వేసిన వార్తలే వారం రోజులు వేశారు. బయట తలుపులు తీయొద్దు, వైరస్ గాలి లో తేలినట్టు వుందే అని పాడుకుంటుంది అన్నారు. ఈ భయం తో చర్మం పోయేలా చేతులు కడుక్కోవడం, సరుకులు తుడిచి కడిగి అవి చివరికి తింటుంటే పండ్లో లేక మందో అర్ధం అయ్యేది కాదు. ఇంట్లో ఎవరు దగ్గినా తుమ్మినా వాళ్ళని రూమ్ లో పెట్టి గడి వేసి అవి చుట్టుపక్కల వాళ్లకి వినపడకుండా టీవీ పెద్ద సౌండ్ తో పెట్టి కొన్ని రోజులు నెట్టుకొచ్చాం.

ఇంట్లో ఉండి తలుపులు వేసుకుని 24 గంటలు ఉండి ఏమి చేయాలో తెలియదు. గంటకో సారి తిండి ఏముంది అని స్టోర్ రూమ్ తీయడం తినడం. వచ్చిన నాలుగు రకాల వంటలు 4 రోజుల్లో వండాక, ఎవడు ఆన్లైన్ లో ఏ వంట చూపెట్టినా దాన్ని వండాను. వాడు వంట చూపెట్టేది 2 నిమిషాలు, మా ఛానల్ సబ్స్క్రయిబ్ చేయండి, గంట కొట్టండి అని అరిచి చెప్పడానికే సరిపోయేది. పాపం వాళ్ళు అన్ని సార్లు అడిగారు అని గంట కొడితే, నేను మీటింగ్ లో ఉంటే మధ్య లో గంట మోగేది మేము ఇంకో కొన్ని రకాల వంట తో వచ్చేసాం నువ్వు గంట కొట్టడానికి రెడీ అవ్వు అని. ఈ గంట సౌండ్ కి మా పిల్లలు ఇంటర్నెట్ బడి అయిపొయింది అని పుస్తకాలు సర్దేసేవాళ్ళు.

ఇలా చూస్తూ ఉండగానే రోజులు నెలలు గడిచి పోయాయి. మనుషులని దూరం నుండి మాస్క్ వేసుకుని చూసి, ఇంటి ముందు కనపడగానే తలుపు మూసేయడం, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా కావలి అని వస్తే, ఇంట్లో కి రాకండి అని మొహం మీద చెప్పేయడం ఇలాంటి కొత్త మర్యాదలు నేర్చుకున్నాం. మధ్య లో వైరస్ కేసు లు తగ్గాయి కొంచెం అన్నారు. అప్పుడు అందరం జన జీవన స్రవంతి లోకి అడుగు పెట్టాం. కానీ ఏమి లాభం? ఇంట్లో నెలలు తరబడి తిని అందరం లావు అయ్యి, పిల్లలు పొడుగు పెరిగి, అబ్బాయిలకి గడ్డం పెరిగి, ఎవరిని గుర్తు పట్టలేకపోయాం. కంపెనీ లో కూడా ఇంట్లో 24 gantalu ఉండి వీళ్ళు ఏమి పీకుతున్నారు అని బానిసల్లా పని చేయిస్తున్నారు. అదేమిటంటే నీకు ఈ మాత్రం జాబ్ ఉండడం గొప్ప అంటున్నారు. ఇంటర్నెట్ చూసి చూసి కంటి చూపు కూడా 10 /10 కి పడిపోయింది.

------------------------------------------------------------------------------------------------------------------------------

ఇలా గతం గుర్తు చేసుకుని చేసేది ఏమి లేక ఈ దిక్కుమాలిన వైరస్ కి మందు ఎక్కడ వుందో, మాకు ఎప్పటికి ఇస్తారో, మళ్ళీ బాగా బతికిన రోజులు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు