మర్నాడు కోర్టులో చాలా కేసులు లిస్ట్ అయి ఉన్నాయి. వాటిలో హియరింగ్ కి వచ్చే వాటికి మటుకు నోట్స్ తయారుచేసుకున్నాను. మా సీనియర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత
నాకు సివిల్, క్రిమినల్ కేసులు రెండూ పెరిగాయి.
మా సీనియర్ రంగనాథం గారి టేబుల్ మీద, ఆయన కేసులు నోట్స్ పెట్టి, గుమస్తా అప్పారావు కేసి చూశాను . ఇంకా టీ రాలేదేమిటని.
" ఇందాకానే చెప్పాను సార్ వస్తూ ఉంటాడు " అన్నాడు అప్పారావు, సినియర్ ఇచ్చిన డిక్టేషన్ టైపు చేస్తూ.
మా సీనియర్ కి నాకు వేరే వేరే రూంలు ఉన్నాయి ఆఫీసులో. నా రూం కి వచ్చి రిలాక్స్ అవుతూ యాదయ్య తెచ్చిన టీ సిప్ చేస్తోంటే, ఫోన్ రింగ్ అయింది
" నాన్నగారే అయి ఉంటారు, మళ్ళీ ఎదో పెళ్లి సంబంధం గురించి అనుకుంటూ నంబర్ చూశాను . నాన్నగారు కాదు, కృష్ణ బాబాయి.
" ఒరేయి సాయంత్రం ఓ మాటు రా. వర్ధని విషయం మాట్లాడాలి " అని పెట్టేశాడు
******
నాన్నగారు తరవాత నలుగురు అత్తల తరవాత కృష్ణ బాబాయి పుట్టాడు. నరసాపురం లో బికాం అవగానే నన్ను నాన్నగారు హైద్రాబాద్ లో ఉంటున్న కృష్ణ బాబాయి ఇంట్లో ఉండి, లా
చేయమని పంపించారు. అందు చేత కృష్ణబాబాయి ఇంట్లో ఉండే నేను లా పూర్తి చేశాను. మొదట హాస్టల్లో ఉంటేనే బాగా ఫ్రీడమ్ ఉంటుందని అనుకుని నాన్నగారితో చెప్పాను. కానీ
ఆయన అది కాదురా నువ్వు చదువు తో పాటు నేర్చుకోవాలిసినవి చాలా ఉన్నాయి. అందు చేత నువ్వ్వు కృష్ణ దగ్గరే ఉండు. ఒక నెల చూసి, నచ్చక పోతే అప్పుడు. ఆలోచిద్దాము అన్నారు. ఒక నెల ఏమిటి ఒక వారం రోజులలోనే, బాబాయి ఒక్కగానొక్క కూతురు వర్ధని 'అన్నయ్యా అన్నయ్యా, అంటూ చాల దగ్గర అయ్యింది . పిన్ని, బాబాయి కూడా
నన్ను చూసుకునే పద్దతి చూసి నాకు వేరే ఆలోచన రాలేదు. అక్కడే ఉండి పోయాను. వర్ధని నాకంటే మూడేళ్లు చిన్న దయినా, చదువులోనూ, మిగతా చాలా విషయాలలో నా సహాయం తీసుకుంటూ నాకు బాగా దగ్గర అయింది.
చదువు అయి , నాన్నగారి మిత్రులు రంగనాధం గారి దగ్గర జూనియర్ గా చేరిన తరువాత, ఆయన ఆఫీసు, బాబాయి ఇంటికి చాలా దూరం అవడం తో , ఆయన ఆఫీసుకి,
కోర్టుకి మధ్యలో ఫ్లాట్ తీసుకున్నా. అయినా శని అది వారాలు బాబాయి దగ్గరే గడపటం అలవాటు అయింది. వర్ధని డిగ్రీ పూర్తి చేసి ఎంసీఏ పూర్తి చేసింది.
*****
సోమవారం కేసులు విషయం ఆదివారం ప్రొద్దుటే చూసుకుని, మధ్యాహ్నం ఆఫీసు మూసేస్తాం.
బాబాయి ఫోన్ ఎందుకు చేశాడో అనుకుంటూ సాయంత్రం ఆయన ఇంటికి బయలు దేరాను.. డ్రైవ్ చేస్తున్నా బాబాయి మాట్లాడే విషయం ఏముంటుందబ్బా అన్న దాని మీద
ఆలోచనలు పోయాయి. బాబాయి చేసేది రైల్వే లో ఉద్యోగం అయినా, ఆయన జ్యోతిషం సర్కిల్స్ లో చాలా ఫేమస్. ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టరేట్ పట్టా యే కాకుండా,
అక్కడ కోర్సులకి లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. అదేమిటో కానీ , నాకు, వర్ధని కి కూడా జ్యోతిషం మీద పెద్ద అభిప్రాయం లేదు. మేమిద్దరం, బాబాయి దగ్గరికి వచ్చే అనేక మందిని చూసి
నవ్వుకునేవాళ్ళం. ఏమిటి వీళ్ళ పిచ్చి?. మనిషి జీవన గమనాన్ని వాడి ప్రవర్తన నిర్ణయిస్తుంది కానీ ఎక్కడో దూరం లో ఉన్న గ్రహాలూ నిర్ణయిస్తాయని నమ్మడం అర్థం లేదని
అనిపించినా, చాలా పెద్ద వాళ్ళు కూడా బాబాయి చెప్పే విషయాలకి ఇచ్చే గౌరవం చూస్తే. మనసులో ఎక్కడో, మన ఊహకి అందని విషయాలు ఉంటాయేమో అని కూడా
అనిపించేది.
అంతకు ముందు ఆయనతో వాదన పెట్టుకునే ధైర్యం లేక చదువు అయ్యేదాకా , జ్యోతిషం గురించి చర్చించలేదు. చదువు అయి ప్రాక్టీస్ పెట్టిన తరువాత, ఒక రోజు నేను, వర్ధని ఎదో
మాట్లాడుకుంటూ ఉంటె, ఎవరో జ్యోతిషం సహాయం కోసం వస్తే, వాళ్ళని పంపించి బాబాయి మా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అనుకోకుండా అప్పుడు అయన తో కొంత వాదన చేశాను
" బాబాయి ఒకటి చెప్పు. మనుషుల జీవితాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంతా జాతకాలలో ఉంటుందా ? అంతా జాతకం లో ఉన్నట్టు జరిగితే, ఇక మనుషులు ఇలా చేయాలి,
అలా చేయాలి అని పెట్టె ప్రవర్తన నియమాలకి అర్థం లేనట్టే కదా ? . అంతా జాతకాలాలో ఉన్నట్టే జరిగితే, దానిని ముందు తెలుసుకోవడం వల్ల ఉపయోగమేమిటి?" అడిగాను నేను
వాళ్ళ నాన్న చూడకుండా బొటకన వేలు పైకి ఎత్తి చూపింది వర్ధని
"చాలా ప్రశ్నలు వేశావు. ఒకటి తరవాత ఒకటికి వద్దాము. ప్రవర్తన నియమాలకు అర్థం ఏమిటన్నావు. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం, అని అన్ని చోట్లా స్లైడ్స్ చూస్తున్నావు కదా ?
అది ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పెట్టిన నియమం. అది చూసి అందరూ మానేయక పోయినా, కొంతమంది మీద ప్రభావం ఉందంటావా ? లేదా ? అంటే అది చూసి మానేయడం,
మానేయక పోవడం వాళ్ల వాళ్ళ జాతకాల బట్టి ఉంటుంది. ప్రమాదం నుంచి తప్పించుకోవడం అనేది జాతకం లో ఉన్నవాడు మానేస్తాడు. అది లేనివాడు పట్టించుకోడు.
ఒకడికి మానేయాలనే ఆలోచన రావడం, ఇంకొకడికి దాన్ని మానే యాలనే ఆలోచన రాకపోవడం, జాతకం బట్టి ఉంటుంది." వివరించాడు బాబాయి
"అంటే ఆకాశం లో గ్రహాల ప్రభావం మన ఆలోచనల మీద ఉంటుందన్న మాట. " అడిగాను నేను
"పౌర్ణమి కి సముద్ర తరంగాలలో తేడా ఉండడం, మానసిక రోగుల ప్రవర్తనలో తేడా ఉండడం చాలా మంది గమనించినదే కదా ?భగవద్ గీత ని ప్రపంచం అంతా ఒక గొప్ప
గ్రంధం క్రింద ఆమోదిస్తారు " అవునా అడిగాడు బాబాయి
" అవును అంగీకరిస్తారు " అన్నాను నేను
" అది కృష్ణుడు చెప్పాడనా లేక అందులో చెప్పిన విషయం బట్టినా ?"
" అందులో విషయం బట్టి కదా ? " నేను
"భగవద్ గీత లో అర్జునిడికి అయన ఏమి చెప్పాడు. "నువ్వేదో శత్రువులని చంపుతున్నానని బాధ పడుతున్నావు. చేసేది చేయించేది అంతా నేనే గ్రహించు" అనేకదా ?. మీరెవరు
భగవద్గిత పూర్తిగా చదవరు" అదే సమస్య
" అంటే అంతా ఆయనే చేస్తాడని నేను కాళ్లు ముడుచుకుని కూర్చోవాలన్న మాట " అన్నాను
" దానిని వితండ వాదం అంటారు . అలా అని అయన చెప్పలేదు. ఒకవేళ నువ్వు అలా అర్థం చేసుకుని ఏమీ చెయ్యకుండా కూర్చోగలవా ?"
" మరి ఎలా అర్థం చేసుకోవాలి. ? " అడిగాను
" నువ్వు చేయాలనుకున్న పనులు నువ్వు చేయాలి. అక్కడ నీకు స్వా తంత్రం ఉంది అనుకో . కానీ ఫలితం నే చేతి లో లేదు. ఫలితం పరమాత్మ ఇచ్చినదే స్వీకరించాలి. నిజంగా
నువ్వే చేస్తున్నానని అనుకునే చేసిన పనులేవీ నువ్వు చేసినవి కావని గుర్తించడం లోనే రహస్యం ఉంది. అప్పుడే ఫలితం ఏది వచ్చినా భగవత్ ప్రసాదమని రాగ ద్వేషాలు లేకుం డా
స్వీకరించ గలుగుతావు" వివరించాడు బాబాయి
" మరి గ్రహాల వల్ల మనిషి పనులు చేస్టున్నాడని కదా మీ జ్యోతిషం చెబుతోంది "
" పిచ్చివాడా గ్రహాలు జడం. వాటివెనకాల ఏ శక్తి ఉంది ?" అడిగాడు బాబయ్య నవ్వుతూ
ఆ వేళ చర్చ అక్కడితో ముగిసినా, ఎప్పుడో అప్పుడు బాబయ్యని కార్నర్ చేయాలనీ నాకు లోపల దొలుస్తూ నే ఉంది
బాబాయి జ్యోతిషం మీద నుంచి ఆలోచనలు వర్ధని మీదకి పోయాయి. వర్ధని విషయం మాట్లాడాలి అన్నాడు. దాని ప్రేమ వ్యవహారం బాబాయికి తెలిసిందా ఏమిటి కొంపతీసి
అనుకున్నా.
. అది అనుకోకుండా ఒకరోజు ఒక అబ్బాయి తో చట్నీస్ లో కలిసింది. తన సీనియర్ అని పరిచయం చేసింది.. అంతకన్నా ఏదో ఉందని తరవాత అడిగితే చెప్పింది. అతను
రాజగోపాల్. తన తో పరిచయం అతను చాల విచిత్రంగా చేసుకున్నాడ ని చెప్పింది. వర్ధనికి ముఖేష్ పాటలు ఇష్టమని దాని క్లాస్మేట్ ద్వారా తెలుసుకుని, రోజు రాత్రి తొమ్మిది
తరవాత రాజ్ కపూర్ కన్హయ్య లో పాట ముఝే తుమ్ సే కుచ్ న చాహియే విజిల్ మీద పాడుకుంటూ వెళ్లే వాడట. మొదట ఫస్ట్ ఫ్లోర్ వరండా లో నుంచున్నప్పుడు
వినడం జరిగిందట. వరసగా రోజు వినపడటం తో ఎవరా అనుకునేదిట. ఆ తరవాత కాలేజ్ లో పరిచయం చేసుకుని, పాట బాగుందా అన్నాడట. తాను కూడా ముఖేష్ ఫేవరైట్ అని
చెప్పి , తనని చాలాకాలం నుంచి గమనిస్తున్నానని, స్నేహితురాలు జలజ ద్వారా వర్ధనికి ముక్జేష్ పాటలు ఇష్టం అని తెలుసుకున్నానని చెప్పాడట. అప్పటినుంచి వాళ్ళ మధ్య
స్నేహం సీరియస్ గానే ఉందని తెలిసిసింది. రాజగోపాల్ ఎంసీఏ అయిన తరవాత టిసియెస్స్ లో చేరాడని చెప్పింది . మనిషి అందంగానే ఉండడం కాకుండా,
చాల సరదా అయినమనిషని . అతనితో కబుర్లు చెబుతోంటే సమయం తెలియదని చాలా మాట్లు చెప్పింది. రాజగోపాల్ ప్రభావం వర్ధని మీద ఎక్కువే ఉందని గ్రహించాను
బాబాయి కి తెలుస్తే ఏమవుతుందో నబ్బా అని అనుకుంటూ ఉండేవాడిని. అది తెలిసే ఇవాళ మాట్లాడతానన్నాడే మో అనుకంటూ బాబాయి ఇల్లు చేరుకున్నాను
*******
నేను వెళ్ళేటప్పటికి బాబయ్య ఎవరికో జ్యోతిష్యం సలహాలు ఇస్తున్నాడు. నేను వెళ్లి పిన్నిని కలిసి ఆవిడ ఇచ్చిన కాఫీని తాగి వచ్చేటప్పటికి బాబయ్య ఒక్కడే ఉన్నాడు. వర్ధని ఇంట్లో
ఉన్నట్టు లేదు
" ఏవిటి బాబాయి వర్ధని విషయం ఎదో మాట్లాడ తా నన్నావు ?" అన్నాను దగ్గరగా కూర్చుని
" నీ దగ్గర ఏదీ అది దాచదు కదా ? రాజగోపాల్ సంగతి నీకు తెలుసుగా ?. నాలుగు రోజుల క్రితం చెప్పింది. వాడినే చేసుకుంటానని అన్నాడు పెద్ద ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే
" అవును వాళ్ళు ఇద్దరూ ఒకళ్ళ నొకళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పింది. వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడతావా ? " అన్నాను
" అతని గురించి ఏమితెలుసునని ముందుకు వెళ్ళిపోతాము ?. ఈ రోజుల్లో పిల్లలు కలిసి తిరిగినంత మాత్రాన, జీవితాంతం కలిసి సఖ్యంగా జీవించగల అంశాలు కలిశాయో లేదో ఎలా
తెలుస్తుంది? తొందరపడి ముందుకువెడితే, మళ్ళీ సరిచేసుకోలేని వ్యవహారం కదా ?. " తనలో తాను అనుకుంటున్నట్టు అన్నాడు బాబాయి
" మరి ఎలాగ? కుటుంబం గురించి వాకబు చేయగలం కానీ, మనిషి తత్వం ఎలాంటిదో మన పిల్లే గ్రహించాలి కదా ?" అన్నాను
" కలిసి పార్కుల్లోనూ, హోటళ్లలోనూ తిరిగితే ఎంత తెలుస్తుందిరా. కొన్ని సంవత్సరాలు కలిసి గడిపినా మనం కొందరిని పూర్తిగా అర్థం చేసుకోలేము. " అన్నాడు బాబాయిఆలోచిస్తూ
" మరి ఏమిటి చేద్దాం?" నన్ను ఎందుకు పిలిచాడా అనుకుంటూ
" వర్ధని ద్వారా కొంత సేకరించి వాడి చక్రం వేశానురా. సప్తమ స్థానం లో రాహువు చంద్రునితో కలిశాడు, కారక గ్రాహం శుక్రుడు రాహువుతో కలిశాడు. ఆ జాతకుడు తో వర్ధని
సుఖపడదు రా . నువ్వు ఒక పని చేయాలి. నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వు అతని వ్యక్తిత్వం లో విశేషాలు ఏమన్నా సేకరించగలవేమో చూడు. అప్పటి వరకు వర్ధనికి ఏమీ
చెప్పకు. నీ ప్రయత్నం తరవాత మళ్ళీ మాట్లాడదాము. ఎక్కడ ఉంటాడో, అన్ని నీకు తెలుసుగా " అన్నాడు లేస్తూ
నా మనసులో కొన్ని ప్రశ్నలు లేచాయి . కానీ ఆయన ఉన్న మూడ్ లో ఇంక అప్పుడు ఆయనతో వాదించ దలుచుకోలేదు. సరే ప్రయత్నం చేస్తాను అని వచ్చేశాను.
బాబాయి మీద నాకున్న గౌరవం , వేరే విషయాలు ఆలో చించకుండా అయన చెప్పినది చేసి సహాయం చేయడం ముఖ్య మనిపించి , పిన్నిని కలిసి వచ్చేశాను.
వస్తోంటే " బాబాయి చెప్పినది మరిచిపోకు అయన కొంచం వర్రీడ్ గా ఉన్నారు " అన్న ఆవిడ మాటలు నా బాధ్యతని ఇంకా పెంచాయి.
****
ఆ తరవాత రెండు రోజులు , బాబాయి చెప్పిన పని గుర్తుకు వస్తూనే ఉన్నా మార్గం తోచలేదు. సినిమాలలోనూ, కథలలోను చెప్పినట్టుగా కాకుండా నిజ జీవితం లో ఒక వ్యక్తి గురించి
లోతయిన విషయాలు సేకరించడం అంత సులువు కాదని తెలుసుకున్నాను.
ఆ వేళ మంగళ వారం. ప్రతి బుధవారం క్రిమినల్ కేసుల ప్రత్యేక హియరింగ్ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాబట్టి, మా సీనియర్ ని సంప్రదించడానికి మంగళవారం
ఎసిపి కళ్యాణ్ వస్తాడు. అతను వచ్చినప్పుడల్లా , సీనియర్ ని కలిసి న తరువాత నా రూమ్ లో కాసేపు కూర్చుని టీ తాగి వెడుతూ ఉంటాడు. మాఇద్దరికి కామన్ ఇంటరెస్ట్ శాస్త్రీయ
సంగీతం. ఎప్పటి లాగే ఆ వేళ కూడా మా సీనియర్ దగ్గర పని ముగించుకుని నా దగ్గర కి వచ్చాడు.
అతనితో కలిసి టీ తాగుతుండగా నాకు ఫ్లాష్ అయింది. బాబాయి చెప్పిన పని కి కళ్యాణ్ సహాయం తీసుకుంటే ఎలావుంటుంది అని.
మా బాబాయి నాకు చెప్పిన పని వివరించి మీరేమన్నా సహాయం చేయగలరా ? కొంత కాన్ఫిడెన్షియల్ గా చేయాలేమో " అన్నాను చేయగలరా అన్నట్టు
" మీకు మా సామర్థ్యం మీద పూర్తి అవగాహన ఉన్నట్టు లేదు. 26/11 తరవాత ఇంకో ఘటన జరగలేదంటే ఇంటెలిజెన్స్ పని తీరు వల్లే సార్. అలాంటి వాటితో పోలిస్తే మీ సమస్య చాలా
చిన్నది సార్. మీరు నాకు చెప్పినవి నా మెయిల్ కి పంపండి. ఒక వారం టైం ఇవ్వండి " అన్నాడు నవ్వుతూ. అతను చెప్పిన విధానం నాకు చాల నమ్మకం కలిగించింది
మీరు అలా చేయగిలిగితే మా బాబాయి కి ఈ చిన్న విషయం లో నయినా సహాయ పడ్డ తృప్తి కలుగుతుంది నాకు ." అన్నాను అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి.
*****
ఆ రాత్రే, కళ్యాణ్ కి మెయిల్ పంపి , బాబాయికి ఫోన్ చేసి అయన చెప్పిన పని మీదే వున్నానని. ఒక వా రం లో విషయాలు తెలియవచ్చని చెప్పాను.
అతను వారం టైం ఇవ్వండి అన్నాడు కదా అని, వచ్చే మంగళవారం కోసం ఎదురు చూడడం తప్ప చేయడానికి ఏమీ లేదనుకుని, కోర్టు పనులలో మునిగిపోయాను. శనివారం
ప్రొద్దుటే వాకింగ్ చేస్తోంటే కళ్యాణ్ ఫోన్ చేశాడు. " మీరడిగిన సమాచారం వచ్చేసింది. మా ఆఫీసర్స్ క్లబ్ కు వచ్చేయండి లంచ్ టైం కి. లంచ్ చేస్తూ మాట్లాడుకుందాము " అన్నాడు పోలీసులు తలుచు కుంటే ఏదయినా సాధిస్తారు అనుకుంటూ ఎంతో ఉత్సాహంగా వాకింగ్ పూర్తి చేశాను.
మధ్యాహ్నం క్లబ్ లో కళ్యాణ్ ని కలిశాను. ఆకాశం మబ్బు గా ఉంది, క్లబ్ ఆవరణ లో చెట్ల కింద వేసిన టేబుల్ వద్ద ఆహ్లాదకర వాతావరణం లో లంచ్ చేస్తూ కళ్యాణ్ ఏమి
చెబుతాడా అని ఎదురు చూశాను. లంచ్ పూర్తి చేసి వచ్చి కూర్చున్నాము
" మీ చెల్లెలు రాజగోపాల్ తో చాల ఘాటు ప్రేమలో ఉందా ?" అడిగాడు కళ్యాణ్
" దానితో మాట్లాడటం బట్టి పరిస్థితి అలాగే ఉన్నట్టు ఉంది. ఇప్పుడు మా బాబాయి కాదంటే పెద్ద సమస్యే అవచ్చు "
" పెళ్లి అయిన తరవాత వచ్చే సమస్యలు తెలిస్తే, మీ బాబాయి నిరాకరించడం వల్ల నిరాశ చాలా చిన్నది అవుతుంది మీ చెల్లెలికి
" అయితే రిపోర్ట్ నెగటివ్ అన్నమాట " అన్నాను నిరుత్సాహం గా
" మొత్తం వింటే మీరు అంత నిరుత్సాహ పడరు . మొత్తం వినండి . మీరు చూశారుగా రాజగోపా చాలా స్ఫురద్రూపి . ఏ అమ్మాయి అయినా కోరుకునే ఫిజికల్
పర్సనాలిటీ అతనిది. మనిషి మంచి మాటకారి. అతను మాట్లాడుతోంటే ఎంత సేపయినా వినబుద్ధి వేస్తుంది . అతను పనిచేసే ఆఫీసు లో చాలా సమర్ధుడు అన్న పేరు ఉంది"
ఆగాడు కళ్యాణ్. . " అన్ని బాగానే ఉన్నాయి కదా ?" అన్నాను
" ఆ బాగోవడం అక్కడితోటె ఆగి పోతుంది. అసలు విషయాలు వినండి. ఏ అమ్మాయి అయినా అతనితో నరకం అనుభవిస్తుంది తప్ప. వివాహ జీవితంలో ఏమాత్రం సుఖం ఉండదు.
అతనికి భయంకరమయిన అనుమానం వ్యాధి. ఒకవిధంగా అది ఒక మానసిక రోగం. మా మూలుగా ఎవరూ గ్రహించలేరు. కొన్ని ఉదహారణలు చెబుతాను. అతనికి కో చెల్లెలు ఉంది
ఆమె. ఒక కొరియర్ కోసం గాని, ఒక స్విగ్గి డెలివెరి తీసుకోవడం కోసం కానీ, తలుపు తీయకూడదు. వీధి తలుపు, కిటికీలు అన్ని ఎప్పుడూ మూసి ఉండాలి. ఎవరయినా పరాయి మగాళ్లు
ఇంటికి వస్తే వాళ్ళ ముందుకు రాకూడదు. ఒక వేళ వచ్చినా ముఖంలోకి చూడ కూడదు. ఎప్పుడయినా అలా జరిగితే చాలా అసహ్య మయిన పదాలతో తిడతాడు. అతని తండ్రి అంతే.
అతని తల్లి, చెల్లెళ్లు సినిమాలకి వె ళ్ళ కూడదు. తండ్రి, కొడుకులు వా రం వా రం సినిమాలు చూసి వస్తారు . ఇది మొదటిది ముఖ్య మయినది. .
ఇంక రెండోది, అతను ఒక భయంకరమయిన లోభి.
డబ్బు దగ్గర కి వచ్చేటప్పటికి అతను ఇతురులు ఏమనుకుంటారో అన్న భావన ఉండదు. నలుగురితో కలిసి హోటలూకి వెళ్లి నప్పుడు, సర్వర్ బిల్లు తెచ్చే టయిముకు, వాష్ రూమ్
కి వెళ్లడం , అతని ఆఫీసు వాళ్ళు చెప్పుకుని చెప్పుకుని నవ్వుకుంటారు. ఆఫీసులో ఎవరు ఏది తెప్పించినా ఆనందంగా తీసుకుంటాడు కానీ, అతను వాళ్ళకోసం ఏదయినా
ఎప్పుడయినా ఇప్పించిన సందర్భం ఎప్పుడూ లేదు.
ఇక ఆఖరిది, మొదటి దానికి కనెక్ట్ ఆయె ఇంకో అవ లక్షణం. అతను పరిచయం లేని ఆడవాళ్ళతో కూడా, తన చార్మ్ ప్రయోగించి మాటలు కలపడం చేస్తూ ఉంటాడు . హోటళ్ల లోను,
పెళ్లిళ్ల లోను, ప్రయాణాలలోను కాస్త అందంగా ఉన్నవాళ్లు కనిపిస్తే తెలివి తేటలుగా మాటలు కలిపి పరిచయం పెంచుకోవడం. ఒకళ్ళిద్దరు వివాహితలతో సంబంధం ఉండేది అని
కూడా తెలిసింది. మీ చెల్లెలు సంప్రదాయ కుటుంబం నుంచి కాబట్టి అతను ఎక్కువ ముందుకు వెళ్లలేకపోయాడు
అతని ఇటువంటి ప్రవర్తనే, తన కి సంబంధించిన ఆడవాళ్ళ విషయంలో జాగ్రత పడాలనే ఆతృత కి కారణం కావచ్చు. అందరు మగవాళ్ళు తన లాగే ఉండవచ్చు అన్న భయం, తన
ఇంట్లో ఆడవాళ్ళ పట్ల నియంత్రణ కి కారణం అవచ్చని మనస్తత్వ శాస్త్ర వేత్తల విశ్లేషణ.
నాకువచ్చిన రిపోర్ట్ అత్యంత నమ్మకమయినది గా భావించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు" అని ముగించాడు కళ్యాణ్.
" పెద్ద ప్రమాదం తప్పించారు. మీరు చేసిన సహాయం విలువ అంతా ఇంతా కాదు " అని కళ్యాణ్ కి థాంక్స్ చెప్పుకుని వచ్చేశాను.
*****
ఆది వారం ప్రొద్దుటే బాబాయి ఇంటికి బయలు దేరాను. విషయం ముందు బాబాయికి చెప్పాలా, లేదా వర్ధని కి చెప్పాలా అన్న సందేహం కొట్టు మిట్టాడినా, బాబయితో మాట్లాడిన
తరువాతే వర్దనికి చెప్పవచ్చని అనుకున్నాను.
ఎప్పటి లా గే నేను వెళ్ళేటప్పటికి బాబాయి ఎవరో జాతకాలు సంప్రదింపడానికి వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్నాడు. వర్ధని ఎవరో స్నేహితురాలి ఇంటికి వెళ్లిందని పిన్ని చెప్పింది
పిన్ని ఇచ్చిన కాఫీ తాగి డ్రాయింగ్ రూమ్ కి వచ్చేటప్పటికి . అప్పుడే, వచ్చిన వాళ్ళని పంపి, బాబాయి నన్ను పలకరించాడు
" నువ్వు అప్పగించిన పని పోర్తి చేశాను. రిపోర్ట్ వచ్చింది " అన్నాను
" ఓహో వెరీ గుడ్. ఎలావుందీ. విశేషాలు చెప్పు " అన్నాడు ఆతృతగా
" కళ్యాణ్ కి అప్పచెప్పిన సంగతి. అతను ఇచ్చిన వివరా ల విశ్లేషణ అన్నీ వివరించి, మనం ఆ విషయాలని సరి అయినవే అని నిర్ణయం తీసుకోవచ్చు" అన్నాను
" సరిగ్గా నేను ఏవిషయాలు అనుకున్నానో అవే వచ్చాయి." పెద్ద బరువు దించావురా అన్నాడు తృప్తి గా బాబాయి
నాకు, మనసులో ఉన్న సందేహాలు కొన్ని అప్పుడు బాబాయి తో .చర్చించాలని పించింది.
" ఈ జాతకాలు అవి, కొంత మంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మిన వాళ్ళు కష్టాలు తప్పించుకుని, నమ్మని వాళ్ళు కష్టాలను ఎదుర్కొంటారా ? " సందేహాన్ని అడిగాను
" నమ్మినా, నమ్మక పోయినా జాతకాల ప్రకారమే జరుగుతాయి. నమ్మడం, నమ్మక పోవడం అన్నది కూడా జాతకం లోనే ఉంటుంది " అన్నాడు బాబాయి
" అయితే నాకు ఒక సందేహం ఉంది బాబాయి. రాజగోపాల్ జాతకం ప్రకారం, వర్ధని జాతకం ప్రకారం ఇద్దరికీ వివాహం జరగదని నీకు తెలుసుకదా అయినా అంత ఆందోళన చెంది
నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నావు ఎందుకు ? " అన్నాను
" మంచి ప్రశ్న వేశావురా. ఎవరికయినా ఒక ఆపరేషన్ చేయాలనుకో, అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తావా లేక నొప్పి పెట్టి ఏడిస్తే ఏడుస్తాడు అని మత్తు ఇవ్వకుండా కోసేస్తావా ?"
" అనస్తీషియా ఇచ్చే చేస్తాము కదా ? " అన్నాను ఈ ప్రశ్న ఎందుకు వేశాడబ్బా ? అనుకుంటూ
" ఇప్పుడ వర్ధనిని పిలిచి అమ్మా , రాజగోపాల్ జాతకం అసలు బాగో లేదు, అతనిని మరిచిపో ఇంకో మంచి సంబంధం చూద్దాము అన్నననుకో. నేను చెప్పే జాతకాల విషయాలలో మీ
ఇద్దరికీ పెద్ద గౌరవం లేక పోగా కొంత వేళా కోళం గా మాట్లాడుకోవడం నేను గమనించాను. అటువంటి నేపధ్యం లో, జాతకాలు పేరు చెప్పి నేను పెళ్లి వద్దంటే, వర్ధని చాల బాధ
పడటమే కాకుండా ఏదయినా విపరీత మయిన నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ. అలా కాకుండా ఇప్పుడు నువ్వు నీ అంతట నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్ వివరాలు వర్ధని కి చెప్పి
నువ్వు ఏ సలహా ఇస్తావో అది ఇస్తే నిర్ణయం ఎలా ఉంటుందో ఆలోచించు. ఇప్పుడు అనస్తీషియా ఏమిటో లేదా ఎవరో తెలిసిందా ? అన్నాడు బాబాయి నవ్వుతూ
" ఒక్క మాటు నాకు మాట రాలేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమి వస్తుందో బాబాయి కి తెలుసు. నా ద్వారా చేయించి వర్ధని కి చెబితే ఉండే ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఊహించి చేదాం
అన్నది ఆయన అద్భుతమయిన తెలివితేటలకు ఉదాహరణ అనుకున్నాను.
అమాంతం గా నాకు జాతకాలు మీద నమ్మకం పెరిగి పోక పోయినా, చులకన భావం మాత్రం తగ్గింది
నేను ఆ తరవాత వర్ధనికి అన్ని విషయాలు చెప్పడం, దాని పర్యవసానం ఎలా ఉంది అన్నది వేరే చెప్పనక్కర లేదు
సమాప్తం